ప్రియమైన శాఫో-16

ప్రియమైన శాఫో

ఈ రోజంతా ఆకాశానికీ భూమికీ మధ్య పెద్ద పెద్ద అద్దాలు నిలబెట్టినట్టుంది. ఎండ ఒక అద్దంలోంచి మరొక అద్దంలోకి, మళ్ళీ వెనక్కి, మళ్ళీ ముందుకి, అద్దం నుంచి అద్దానికి ప్రవహిస్తూనే ఉంది. అలా వేచి ఉన్నాను, నిర్వ్యాపారంగా, ఎప్పుడు సాయంకాలమవుతుందా అని. అప్పటికి ఒకసారి కోకిల ఎక్కణ్ణుంచో వచ్చి రెండుమూడు సార్లు పిలిచి పిలిచి వెళ్ళిపోయింది. దానికి బదులివ్వడానికి ఎవరికీ తీరికా  లేదు, ఓపికా  లేదు. అది ఏనాటి కాలం? కోకిల పిలుపు వింటూ పిల్లలు కూడా కోకిల్లాగా కూతపెట్టాలని చూసిన రోజులు. తనకి బదులిచ్చేకొద్దీ కోకిల మరింత రెచ్చిపోయి మరీ దిక్కులన్నీ ఊగిపొయ్యేలాగా కూతపెట్టిన రోజులు. ఇప్పుడు సాయంకాలం కాగానే పిల్లలు విఇతుల్ని క్రికెట్టు గ్రౌండుగా మార్చుకునే పనిలో పడిపోతారు.

అనిపిస్తూ ఉంటుంది. కాలం మారుతున్న మాట నిజమేగాని, ఆ అమాయికత్వం జీవితంలోంచీ, సాహిత్యంలోంచీ కూడా అదృశ్యమవుతున్న మాట నిజమేగాని, అన్నిటికన్నా ముందు, ఆ స్పందనశీలత అంతరించిపోతున్నదా అని అనుమానమొస్తోంది. అదేమిటి? అలా అంటున్నావు? ఇంత ఉద్రేకం, ఇంత ఉద్వేగం, వీథుల్లో, నలుగురు మనుషులు కలిసిన ప్రతి తావులో, క్రీడామైదానాల్లో, సినిమాహాళ్ళల్లో, సోషల్ మీడియాలో ఎగిసిపడుతున్న ఈ సంరంభమంతా స్పందన కాదా అని అడగొచ్చు. ఉన్న వ్యవస్థ పట్ల దాగకుండా బయట పడుతున్న ఈ అసహనం, యథాతథస్థితి పట్ల ఈ అసంతృప్తి, మనుషులిట్లా ఉండకూడదనీ, మానవసంబంధాలిట్లా శుష్కించకూడదనీ రగులుతున్న, పొగులుతున్న ఈ ఆవేశతరంగం స్పందన కాదా అని అనవచ్చు.

కాదనే అంటాను. బయటి పరిస్థితులపట్ల మనం respond కావటానికీ, react కావటానికీ తేడా ఉంది. ప్రతిస్పందన హృదయంలోంచి వస్తుంది. నువ్వు చూస్తున్నదీ, వింటున్నదీ, నీ అనుభవంలోకి వస్తున్నదీ నీ లోపలకీ ప్రవేశించి, నీ రక్తాస్థిగతమై తిరిగి బయటికి వచ్చినప్పుడు మాత్రమే అది నీ response అవుతుంది. అలా కాక React అవడమంటే, ఇంద్రియాల పైపైనే, ఏదీ నీ లోతుల్లోకి ప్రవేశించకుండానే, నీ బుద్ధీ, మనసూ ఒకచోట కూడుకోకుండానే హడావిడిగా బదులివ్వడం. అటువంటి ప్రతిచర్యల్లో, జీవితం వేసే ప్రశ్నలకి జవాబులే ఉంటాయి తప్ప సమాధానాలు ఉండవు. ప్రశ్నలకు ప్రశ్నలే మళ్ళా జవాబుగా వినిపిస్తాయి తప్ప, పరిష్కారాల దిశగా తలుపులు తెరుచుకోవు. ఇలా  నా చుట్టూ ఒక అద్దంలో ఎండ మరో అద్దంలో ఎండతో పాటు వేడిగా కూడా మారినట్టుగా, జీవితానుభవాలు ఒకరినుంచి ఒకరికి మరింత ఉద్రేకభరితంగా, మరింత రణగొణధ్వనిగా మారుతుంటాయి.

మానవ ప్రపంచంలో కవిత్వం అవసరం ఇక్కడే ఉంది. మన అనుభవాన్ని మన లోపలకీ తీసుకుని, హృదయగతం చేసుకుని, అప్పుడు తిరిగి మళ్ళా లోకంతో సంభాషించడమెలానో నేర్పుతుంది కవిత్వం. అది మన అనుభూతికి సాంద్రతనిస్తుంది. మనకి సంభవిస్తున్నదాన్ని మన ఒంటబట్టిస్తుంది. అప్పుడు మనం మాట్లాడే మాటలు కూడా వాటికవే అనుభవసమానమవుతాయి. కవిని మా వాళ్ళు బ్రహ్మ అన్నారు. అంటే కవి ఏదన్నా కొత్తగా సృష్టిస్తాడనా? కాదు. మనం రోజూ చూసే జీవితాన్నే అతడు కొత్త వెలుతురులో చూస్తాడు, మనకి చూపిస్తాడు.

నాకు కవిత్వమంటే చాలా ఇష్టం. అలాగని ఎవరు ఏది రాసినా అది నన్ను కదిలించదు. కారణమిదే. నేను ఏ కవిని చదివినా, అతడు మాట్లాడుతున్న మాటలు, surface level లోంచే మాట్లాడుతున్నాడా లేక ఆ అనుభవాన్ని జీర్ణం చేసుకుని, దాని వల్ల కలిగే సుఖదుఃఖాల్ని పూర్తిగా తనలో మరొకసారి అనుభవానికి తెచ్చుకుని, ఆ core element లోంచి, తాను చెప్పకుండా ఉండలేక చెప్తున్న మాటలా అని. అలా లోపలనుంచి వచ్చిన మాటలకి నశింపు ఉండదు. వాటిని నిప్పు కాల్చలేదు, నీళ్ళు ముంచలేవు, చెదలు తినెయ్యలేవు. ఎంత ప్రయత్నించీ విరోధులు ఆ మాటల్ని  భూస్థాపితం చెయ్యలేరు. ఒకవేళ ఏ కారణంవల్లనైనా అవి భూస్థాపితమైనా, ఇదుగో, నీ కవిత్వంలాగా ఎన్నో యుగాల తరువాత కూడా నేలని చీల్చుకు మరీ తమ గొంతు వినిపిస్తాయి.

నీ కవిత్వం, శకలాలుగానే దొరికి ఉండవచ్చుగాక, కానీ ఆ చిన్ని చిన్ని తునకలే నాకు ఎంతో హృద్యంగా వినిపిస్తున్నాయి. నీ కవిత్వానికి నువ్వే స్వరకల్పన చేసుకుని తంత్రీ వాద్యం మీద వినిపించేదానివని విన్నాను. నీ స్వరాలు ఎటువంటివో, నీ గానసునాదం ఎలా ఉండేదో నా  ఊహకి అందదు. కాని నాకనిపిస్తూంటుంది, ఇలా శకలాలుగా దొరికిన నీ కవిత్వ వాక్యాలు, నీ రాగాలాపనలో తునిగిపోయిన కొన్ని స్వరజతులేనని. ఎందుకంటే, ఆ వాక్యం చదవగానే, ముందు నా మదిలో ఏదో ఝుల్లుమంటుంది. ఎక్కణ్ణుంచో పురాతన గ్రామాలనుంచి నా స్వజనమెవరో నన్ను పిలుస్తున్నట్టుగా ఉంటుంది. ఆ వాక్యశకలాలు లేదా ఆ పదాలు, ఆ పదసముదాయం నేను కళ్ళతో చదువుతున్నట్టుగా ఉన్నా, నిజానికి వాటిని నా చెవుల్తో చదువుతాను. ఇంకా చెప్పాలంటే, కళ్ళూ, చెవులూ అని వేరువేరుగా కాదు, నా సమస్త అస్తిత్వంతోనూ చదువుతాను. ఉదాహరణకి, ఇదుగో, చూడు, ఈ పంక్తి, Fragment 47 గా చెప్పుకునేది:

ఈ వాక్యం చదవగానే ముందు ఇందులో ఒక అలంకారం ఉందని తెలుస్తుంది. మేము ఉపమాలంకారం అంటాం. లేదా స్థూలంగా చెప్పాలంటే, అర్థాలంకారం, ఇప్పటి సాహిత్యపరిభాషలో metaphor. కాని ఒక అర్థాలంకారం ఉన్నంత మాత్రాన నేను దాన్ని గొప్ప కవిత్వం అనలేను. ఆ అలంకారం ఎక్కణ్ణుంచి స్ఫురించింది, బుద్ధిలోంచో, మనసులోంచా, లేక వీటిని దాటిన ఒక అస్తిత్వమూలంలోంచా అని చూస్తాను. నువ్విక్కడ  ప్రేమదేవత నిన్ను నిలువెల్లా కుదిపెయ్యడం గురించి చెప్పాలనుకుంటున్నావు. దానికి నువ్వు తెచ్చిన పోలిక ఎటువంటిది! అది మామూలుగా స్ఫురించేది కాదు. నేను దాన్ని epic metaphor అంటాను. ఒక వాల్మీకికీ లేదా ఒక హోమర్ కీ మాత్రమే అలాంటి పోలికలు స్ఫురిస్తాయి. అయితే ఒక జాతిమొత్తానికి అనుభవంలోకి వచ్చినదాన్ని ఇతిహాస కవులు వర్ణిస్తే, ఒక మనిషి లోతుల్లోకీ సంభవించినదాన్ని నువ్వు వర్ణిస్తున్నావు. ఈ పోలికని బట్టే చెప్పవచ్చు, నీ అనుభూతి ఎంత ప్రగాఢమైందో, నీ అనుభవాన్ని నువ్వు ఎంత ఆత్మలోతుల్లోకీ తీసుకున్నావో.

కొండమీది ఓక్ చెట్టు. మామూలు చెట్టు కాదు. మాకైతే  మర్రిచెట్టు స్ఫురిస్తుంది. సుదృఢంగా, భూమిలోపలకీ వేళ్ళు చొచ్చుకుపోయిన మహావృక్షం. అందుకనే డ్రూయిడ్లు ఆ చెట్టుని ఆరాధిస్తారు. అసలు డ్రూయిడంటేనే అర్థం oak-knower అని. వాళ్ళు దాన్నొక పవిత్రవృక్షంగా భావిస్తారు, మేం రావిచెట్టుని కొలిచినట్టు. స్థిరత్వానికి, ఎటువంటి తుపానులు వచ్చినా చెక్కుచెదరని ధీరత్వానికీ ఓక్ చెట్టు ప్రతీక. అటువంటి చెట్టు కొండప్రాంతానికి చెందినట్టయితే ఇంకా బలంగా, దాదాపు పర్వతసదృశంగా నిలబడుతుంది. అటువంటి చెట్టుని గాలివాన ఊపేసిందంటే ఏమిటి? అంటే ప్రేమానుభవం సంభవించినప్పుడు, ఎంతటి స్థిరత్వం, ఎంతటి దృఢత్వం కూడా నిలవజాలవనే కదా. ఒక మనిషిలో దృఢత్వం బుద్ధికీ, విచక్షణకీ సంబంధించిన గుణాలు. ఇక్కడ వాటిని గాలివాన నిలువెల్లా కుదిపేసిందంటే ఏం జరుగుతున్నదో అర్థమవుతూనే ఉంది కదా.

పైగా ఆ గాలివాన ఊరికే వీచడం కాదు, కురవడం కాదు, నువ్వు వాడిన క్రియాపదాల ప్రకారం అది ఆ చెట్టుమీద విరుచుకుపడింది. పైనుంచి విరుచుకుపడింది, ఒక ఉరుములాగా, పిడుగులాగా. అది కూడా అనుగ్రహమే. కాని భీకరమైన అనుగ్రహం. ప్రచండమైన దయ. నాకు ఈ క్షణాన పాలగుమ్మి పద్మరాజుగారు రాసిన ‘గాలివాన’ కథ గుర్తొస్తోంది. అందులో రావుగారు ఒక మేధావి, సంస్కర్త. మనుషుల పట్లా, ప్రపంచం పట్లా ఆయనకి నిశ్చితమైన అభిప్రాయాలూ, ప్రమాణాలూ, మనుషులు ఎలా నడుచుకోవాలో ఆ తీర్మానాలూ స్పష్టంగా ఉంటాయి. కాని అవన్నీ ఆయన ఒక రాత్రి రైలుప్రయాణంలో గాలివానలో చిక్కుకునేదాకానే. ఆ గాలివానలో మనుషులు నిర్మించినవీ, దేవుడూ నిర్మించినవీ రెండూ కూలిపొయ్యేయంటాడు రచయిత. అటువంటి కాళరాత్రి, చీకట్లో, రైలుస్టేషనులోని వెయింటింగురూములో దాదాపుగా మృత్యువు అంచులదాకా ప్రయాణించిన రావుగారికి ఒక బిచ్చగత్తె తన కౌగిలితో, స్పర్శతో, సజీవురాలైన ఒక మనిషి వెచ్చదనంతో ప్రాణం పోస్తుంది. అంటే మనిషి నిర్మించినవీ, దేవుడు నిర్మించినవీ రెండూ కూలిపోయినప్పుడు ఒక మనిషికి తోడుగా నిలబడవలసింది మరొక మనిషి మాత్రమే అంటున్నాడు ఆ కథకుడు.

కవిత్వమంటే ఇది. సాహిత్యమంటే ఇది. మనం రాస్తున్నది మన జీవితమూలాల్లోంచి, మన రక్తంలోంచి, మన స్వేదంలాగా మన దేహంలోంచి స్రవించే జీవజలం కాగలగాలి. అలా మానవీయం కావడమే సాహిత్యమివ్వగల సందేశం. అదే దాని అత్యున్నత నైతికత. జీవితంలోంచి రానిదీ, మనిషికి రక్తాస్థిగతం కానిదీ, ఎంత గొప్ప అభిప్రాయమైనా మనం దాన్ని విన్నప్పుడు అభిప్రాయమనే తెలుస్తుంది తప్ప అనుభూతిగా మనల్ని ఒప్పించదు.

ఉదాహరణకి అన్నా అఖ్మతోవా రాసిన మొదటి కవిత, సుప్రసిద్ధమైన కవిత, ప్రేమనే తీసుకుందాం.

ఈ కవిత చదవగానే ఆమె చెప్తున్న ప్రేమ దాని మొత్తం వెలుగునీడల్తో  ఆమెకి అనుభవంలోకి వచ్చిందని మనకి విశ్వసనీయంగా తెలుస్తుంది. ఇదే నేను ఇంతకు ముందు ఉత్తరంలో రాసింది కూడా. ఏకకాలంలో ఈ bitter-sweet అనుభూతిని ఒక్క కవయిత్రులు మాత్రమే వ్యక్తం చేయగలుగుతారు. ఈ కవితలో ఆమె అనుభూతి పొరలు, పొరలుగా, ఆమె మాటల్లోనే చెప్పాలంటే,  ఉండచుట్టుకున్నట్టుగా ఉంది. ప్రేమ, ఏకకాలంలో ఆమె దృష్టిలో ఒక పాము, పావురం, వాయులీనం, పొగమంచు, గాటువాసనలీనే పువ్వు-

ఆమెని రష్యాలో నీతో పోలుస్తారట. Russian Sappho. ఒక్క కవిత్వంలోనే కాదు, జీవితంలో కూడా ఆమెకీ నీకూ చాలా పోలికలున్నాయి. నువ్వూ ప్రవాసివే, ఆమె కూడా ప్రవాసినే. కాని ఆమె తన స్వదేశంలోనే ప్రవాసి. ఆ మాటకొస్తే ప్రవాసి కాని కవి ఎవరు? తన జీవితానుభవాన్ని నిజాయితీగా ప్రకటించే ప్రతి ఒక్క కవీ తన భాషలోనే ప్రవాసిగా మారతాడు. ఎందుకంటే మనుషులకి వినోదం పంచడం అతడి ధ్యేయం కాదు కాబట్టి. కులాసా మాటలు చెప్పలేడు కాబట్టి. కానీ సరిగ్గా ఆ కారణం వల్లనే, అటువంటి ఆత్మసంవేదన తెలిసిన పాఠకులెవరో, ఎప్పుడో మరే కాలంలోనో నిశ్చయంగా వాళ్ళని తలుచుకుంటారు. నేను నిన్నూ, నీతో పాటు ఇప్పుడు అఖ్మతోవానీ తలుచుకుంటున్నట్టు.

12-5-2026

4 Replies to “ప్రియమైన శాఫో-16”

  1. ఉత్తమ రచన , ఉత్తమ కవిత్వం ఎలా ఉండాలో చక్కని నిర్వచనం తెలియపరిచారు.

  2. “ఎక్కణ్ణుంచో పురాతన గ్రామాలనుంచి నా స్వజనమెవరో నన్ను పిలుస్తున్నట్టుగా ఉంటుంది”
    “మనం రోజూ చూసే జీవితాన్నే అతడు కొత్త వెలుతురులో చూస్తాడు, మనకి చూపిస్తాడు“
    “ నేను దాన్ని epic metaphor అంటాను. ఒక వాల్మీకికీ లేదా ఒక హోమర్ కీ మాత్రమే అలాంటి పోలికలు స్ఫురిస్తాయి. అయితే ఒక జాతిమొత్తానికి అనుభవంలోకి వచ్చినదాన్ని ఇతిహాస కవులు వర్ణిస్తే, ఒక మనిషి లోతుల్లోకీ సంభవించినదాన్ని నువ్వు వర్ణిస్తున్నావు. ”

    అద్భుతంగా చెప్పారు, sir

    అన్నా అఖ్మతోవా కవిత్వానికి అనువాదం చాలా బాగుంది సర్.
    “ఇంకా పూర్తిగా పరిచయంకాని ఒక చిరునవ్వులో
    దాన్ని గుర్తుపట్టడం ఎంత భీతావహం.“
    Another beautiful letter!!

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading