
రెడ్డి రాఘవయ్య (1940-2022) తెలుగులో బాలసాహిత్యవేత్తల్లో అగ్రశ్రేణి రచయిత, సంపాదకుడు, పరిశోధకుడు. ఆయన చివరి పుస్తకం కూడా ప్రసిద్ధ బాలసాహిత్యకారుల గురించి రాసిందే. వారి అమ్మాయి ఆ పుస్తకం నాకు పంపి ముందుమాట రాయమని అడగడం నా భాగ్యం. ఇవాళే ఆ పుస్తకాలు అందుకున్నాను. అందులో నేను రాసిన ముందుమాట మీ కోసం.
అద్భుతమైన దారిదీపం
రెడ్డి రాఘవయ్యగారు అగ్రశ్రేణి ఆధునిక బాలసాహిత్య నిర్మాత. రాఘవయ్యగారు బాలలకోసం మాత్రమే కాదు, బాలసాహిత్యం రాసినవాళ్ళ గురించి కూడా పుస్తకాలు రాసారు. కాబట్టి ఆయన బాలలకి ఎంత కావలసినవారో, బాలసాహిత్యరచయితలకి కూడా అంతే కావలసినవారు. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న ఈ చిన్న పుస్తకం ‘కథలు చెప్పిన కథకులు’ నిడివిలో చిన్నదే కాని, చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే సముద్రమంత పెద్దది. ఇది ఎవరి చేతికందితే వారికో అద్భుతమైన దారిదీపం దొరికినట్టు.
ఇందులో ఉన్న ఇరవై వ్యాసాల్లోనూ ఆయన కేవలం ఇరవై మంది కథకుల గురించి మాత్రమే రాసి ఊరుకోలేదు. ఆ రచయితల సుప్రసిద్ధమైన ఒకటి రెండు కథలు మళ్లా మనకి గుర్తు చేస్తూ, ఆ కథలు తెలుగులోకి కూడా ఎప్పుడొచ్చాయి, ఎంతమంది వాటిని అనువాదం చేసారు,ఎవరు ప్రచురించారు లాంటి విశేషాలు కూడా చెప్పడంతో ఇదొక చిన్నపాటి విజ్ఞానసర్వస్వంగా రూపొందింది అంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచవ్యాప్తంగా బాలసాహిత్యం అనగానే వినబడే పేర్లన్నీ ఇందులో ఉన్నాయి. టాగోర్, రౌలింగు, టాల్‌స్టాయి, హాన్స్ క్రిస్టియన్ ఏండర్సను లాంటి కథకుల్తో పాటు, రావిపాటి గురుమూర్తిశాస్త్రి, నండూరి రామమోహనరావు, బెల్లంకొండ రామదాసు, గురజాడ శ్రీరామమమూర్తి లాంటి తెలుగు బాలసాహిత్య రచయితల్ని కూడా మనం మరోసారి తలుచుకుంటాం.
పిల్లలమీద ఎంతో ప్రేమ ఉంటే తప్ప ఇన్ని విశేషాలతో కూడిన ఇంత చిక్కనైన, నిక్కమైన పుస్తకం రాయలేరు. పిల్లలూ, పెద్దలూ కూడా ఈ పుస్తకంలో రాసిన రచయితల గురించి మరింత తెలుసుకోవాలి. వారి రచనలు కనీసం ఒక్కటేనా చదివితీరాలి. ఇందులో ప్రస్తావించిన తెలుగు రచయితలవి కూడా కనీసం ఒక్కటేనా రచన వెతుక్కుని మరీ చదివితీరాలి. అదే రాఘవయ్యగారికి మనమివ్వగల నివాళి.
కథలు చెప్పిన కథకులు, రెడ్డి రాఘవయ్య, సాహితి ప్రచురణలు, 81210 98500, వెల రు.75/-
16-4-2025


బాగుంది సర్
ధన్యవాదాలు మేడం!