అనువాదలహరి

Reading Time: 4 minutes

296

పెద్దలు నౌడూరి మూర్తి గారు తన అనువాదలహరి బ్లాగుద్వారా దేశదేశాల కవిత్వాన్ని తెలుగులోకి తెస్తూండటమే కాక, తెలుగు కవిత్వాన్ని కూడా ఇంగ్లీషులోకి అనువదిస్తూ ఉన్నారు. నిస్వార్థంగా ఒక తపసుగా చేస్తూ వచ్చిన ఆ కృషిలో ఆయన ఇంతదాకా అనువదించిన సుమారు 200 తెలుగు కవితల్ని Wakes on the Horizon పేరిట సంకలనంగా వెలువరించారు. ఆ పుస్తక పరిచయ సభ ఆదివారం సాయంకాలం ‘ఛాయ’ ఆధ్వర్యంలో హైదరాబాదు స్టడీ సర్కిల్లో జరిగింది. నా కవిత కూడా అందులో ఉండటంతో కృష్ణమోహన బాబు గారు రమ్మని పిలిస్తే నేను కూడా వెళ్ళాను.

కవితాపఠనాలతో పాటు సురేంద్ర రాజు, సిద్ధార్థ, అఫ్సర్, యాకూబ్ వంటి మిత్రులు తెలుగు కవిత్వం ఇంగ్లీషులోకి అనువాదం కావలసిన ఆవశ్యకత గురించి మాట్లాడటంతో, ఆ సాయంకాలం ఒక సెమినార్ లాగా మారిపోయింది.

మిత్రుల మాటలు విన్న తర్వాత నేను కూడా కొన్ని అభిప్రాయాలు పంచుకోకుండా ఉండలేకపోయాను. మిత్రులు మాట్లాడిన మాటల్లో, తెలుగు కవిత్వం ఇంగ్లీషులోకి అనువాదం కావడంలో వెనకబడి ఉందనీ, అందుకు సరైన అనువాదకులు లేకపోవడం, ప్రచురణకర్తలు కూడా ముందుకు రాకపోవడం ముఖ్యమైన కారణాలుగా చెప్పుకొచ్చారు.

కాని నా దృష్టిలో, కవిత్వం ఇంగ్లీషులోకి అనువాదం కావడంలో, కాకపోవడంలో, అనువాదమైన కవిత్వం కూడా ప్రపంచవ్యాప్తంగా పాఠకుల్ని ఆకట్టుకోలేకపోవడంలో ఒక్క తెలుగు మాత్రమే కాదు, ప్రపంచ ప్రసిద్ధ భాషలన్నీ కూడా ఒక్కలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నాయి.

తెలుగు సరే, జర్మన్ చూద్దాం. ఇంగ్లీషు, జర్మన్ రెండూ కూడా జర్మానిక్ భాషా కుటుంబానికి చెందినవి. అట్లాంటిది, జర్మన్ మహాకవుల్లో సుప్రసిద్ధుడైన హైన్రిఖ్ హైన్ కవిత్వానికి సరైన ఇంగ్లీషు అనువాదం ఇప్పటిదాకా రానేలేదు. హైన్ కవితలతాలూకు మరీ ఇటీవలి ఇంగ్లీషు అనువాదం Songs of Love and Grief (1995) కి ముందుమాట రాస్తూ జెఫ్రీ ఎల్ సమొన్స్ అనే విమర్శకుడిట్లా రాసాడు:

‘ఈ రెండు భాషలూ ఒకే కుటుంబానికి చెందినవి కావడం వల్ల అదనంగా సమకూరిన సౌకర్యమేమీ లేదు. ధాతుపరమైన వ్యుత్పత్తిమీద ఆధారపడ్డ జర్మన్ వ్యాకరణం (grammatically inflected), ఎక్కువగా ఊనిక అవసరంలేని శబ్దమాత్రలు,ఫెమినైన్ ఛందస్సులూ ఉన్న జర్మన్ ను ఏకమాత్రాపదాలతో కూడిన ఇంగ్లీషులోకి అనువదించడంలో తరతరాలుగా అనువాదకులు చింతాక్రాంతులవుతూనే వచ్చారు. పద్యపాదం చిన్నదిగా ఉండి, కవిత చిక్కగా ఉన్నట్లయితే, ఆ కవితని అనువదించడం మరింత దుర్భరమవుతుంది. హైన్ చాలా సాంద్రమైన కవి. తన అనువాదకులకి అతడు చాలా తక్కువ అవకాశం విడిచిపెడతాడు. మరొక సమస్య ఏమిటంటే, అతడు తన నాలుగు పాదాల గీతాల్ని ప్రధానంగా జానపద ఫణితులమీద నిర్మించుకున్నాడు, అతడి సుప్రసిద్ధ గీతాలన్నీ కూడా జానపదగీతాల వైవిధ్యాన్ని కొల్లగొట్టుకున్నవే. జర్మన్ రొమాంటిసిజం తన జానపద పోకడల్ని ఇట్లా అనుకరిస్తున్నప్పుడు దానికొక సాంప్రదాయిక, సాంస్కృతిక గౌరవాన్నిసంతరించి పెట్టుకుంది. మనకి (ఇంగ్లీషు సాహిత్యానికి) అటువంటి మర్యాద ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, ఆ కవితలు చదువుతుంటే గ్రీటింగ్ కార్డ్ కవిత్వం చదువుతున్నట్టనిపిస్తుంది.’

అసలు ఇంగ్లీషును అత్యంత గాఢంగా ప్రభావితం చేసిన ఫ్రెంచికి కూడా ఇదే సమస్య. మల్లార్మే, రేంబో వంటి కవుల చుట్టూ అల్లుకున్న మహామంత్రమయ గాథల్ని కొద్ది సేపు మర్చిపోయి, వారి కవిత్వాన్ని ఇంగ్లీషులో చదివితే, వారి గురించి అంత ఆరాధన ఏర్పడుతుందా అన్నది అనుమానమే. మల్లార్మే సుప్రసిద్ధ గీతం The Afternoon of a Faun (1865) ని గత పదేళ్ళుగా చదువుతూనే ఉన్నాను. కాని ఇప్పటికీ దాని నిజ స్వారస్యాన్ని గ్రహించానని చెప్పలేను. ఫ్రెంచి సింబలిస్టు కవిత్వం సరే, సర్రియలిస్టు కవిత్వానిదీ అదే పరిస్థితి. డెబ్బై నుంచి ఎనభై శాతం సర్రియలిస్టు కవిత్వం ఫ్రెంచి నుంచి ఇంగ్లీషుకి వచ్చేటప్పటికి తన జవసత్త్వాల్ని పూర్తిగా పోగొట్టుకుందనే చెప్పవచ్చు.

ఇక తమ కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించుకోవడంలో అందరికన్నా ఎక్కువ నరకయాతన అనుభవిస్తూ ఉన్నవాళ్ళు గ్రీకు కవులు. గ్రీకు కవిత్వానిది సంస్కృతంలాగా గణబద్ధ ఛందస్సు. ఇంగ్లీషు ఛందస్సు ఊనిక (accent) మీద ఆధారపడ్డది. దాంతో హోమరిక్ హెక్టామీటర్ ని (దీన్నీ హీరోయిక్ హెక్టామీటర్ లేదా ఎపిక్ హెక్టామీటర్ అని కూడా అంటారు) ఇంగ్లీషులోకి అనువదించవలసి వచ్చినప్పుడు, అది తన ఐతిహాసిక వైభవాన్ని ఊహించలేనంతగా నష్టపోతూ వచ్చింది. (హెక్టామీటర్ అంటే ఎనిమిదిగణాల పద్యపాదం. తెలుగులో, వృత్తాల్లో మహాస్రగ్ధర,కవిరాజ విరాజితం, దేశి ఛందస్సుల్లో సీసం,రగడ, తరువోజ ఇటువంటి హెక్టామీటర్లు.)

పాశ్చాత్యభాషల్లో అత్యంత సంగీతాత్మకమైన ఇటాలియన్ నుంచి ఇంగ్లీషు లోకి కవిత్వాన్ని అనువదించడం కృష్ణశాస్త్రిని ఇంగ్లీషులోకి అనువదించడమంత నిష్ఫలం. ఈ సమస్యను చర్చిస్తూ ఒక విమర్శకుడు ఏమన్నాడంటే డివైన్ కామెడిలో డాంటే వాడిన ఛందస్సులో ప్రతి పాదం 11 గురులఘువులతో కూడిఉంటుందనీ, ఇటాలియన్ లో పదజాలం దాదాపుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ గురులఘువులతో కూడిఉన్నందున ఆ అమరిక సరిపోతుందని చెప్తూ ఇంగ్లీషులో చాలా పదజాలం ఏకమాత్ర గురులఘువుల తోనే ఏర్పడుతుంది కాబట్టి పదకొండుమాత్రల ఇటాలియన్ పద్యపాదానికి ఎనిమిది గురులఘువుల ఇంగ్లీషు వాక్యం సరిపోతుందంటాడు. కాని మామూలుగా డాంటే ని ఇంగ్లీషు ఛందస్సులోకి అనువదించేవాళ్ళు అయాంబిక్ పెంటామీటర్ లోకి తీసుకురాకతప్పదు కాబట్టి ప్రతివాక్యంలోనూ అనవసరంగా మరికొన్ని అక్షరాల్ని చేర్చకతప్పని పరిస్థితి ఎదురవుతుందంటాడు. దాంతో మూలవాక్యంలోని mysterious and great effects అనువాదంలో అదృశ్యమైపోతున్నాయంటాడు.

ఈ ఉదాహరణలన్నీ ఏమి చెప్తున్నాయి? తమ కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించుకోవడంలో తెలుగు వాళ్ళే కాదు, తక్కిన దేశాల కవులు కూడా గొప్ప ఇబ్బంది పడుతూనే ఉన్నారని. కాని, ఆ కవిత్వాలు మనమెందుకు చదువుతున్నాం? మన కవిత్వం వాళ్ళెందుకు చదవడం లేదు?

ఎందుకంటే, ఆయా భాషల కవిత్వాల అనువాదాలతో పాటు ఆ కవిత్వాల గురించిన ఒక డిస్కోర్సు కూడా అంతే శక్తిమంతంగా ఇంగ్లీషులో సాగుతూ వస్తున్నది కాబట్టి. ఉదాహరణకి రష్యన్ సిల్వర్ యుగం కవుల కవిత్వం ఎంత అనువాదమయ్యిందో వాళ్ళ జీవితాలగురించీ, వాళ్ళ కష్టనష్టాల గురించీ కూడా అంతే విస్తారంగా ప్రపంచమంతా తెలుస్తూ వచ్చింది. మారియా సెత్సేవా తన పిల్లల ఆకలి తీర్చడం కోసం దొంగతనాలకి కూడా సిద్ధపడిందనీ, అన్నా అఖ్మతోవా జైల్లో ఉన్న తన పిల్లవాణ్ణి చూడటంకోసం రోజుల తరబడి క్యూలో నించునేదనీ కూడా మనకు తెలుసు. మనం దాశరథి కవిత్వం ఎవరూ ఇంగ్లీషులోకి అనువదించలేదని బాధపడతాం. కాని ఇరవయ్యవ శతాబ్ది భారతీయ కవుల్లో, కవిత్వం చెప్పినందుకు, సంకెళ్ళు బిగించి రోడ్డుమీద నడిపించుకుంటూపోయిన మొదటి కవి (బహుశా ఏకైక కూడానేమో) దాశరథి అని ఎవరికీ చెప్పం. కాని, ప్రపంచం ఆసక్తి చూపించేది ఇట్లాంటి విషయాల మీదనే. ఈ సంగతి వివరిస్తూ ఒక అంతర్జాతీయ పత్రికలో వ్యాసం రాయండి. వెంటనే ప్రపంచం నలుమూలలనుంచీ పరిశోధకులు మానుకోట వచ్చి వాలతారు.

సాహిత్యంలో తెలంగాణా స్పృహ బలపడ్డాక పాల్కురికి సోమన మీద కొత్త ఆసక్తి, కొత్త చర్చలు మొదలయ్యాయి. కాని, సోమన గురించి ఎంతసేపూ మనలో మనం మాట్లాడుకోడం వల్ల ప్రయోజనం లేదు. 13 వ శతాబ్ది లో డాంటే ఇటాలియన్ భాషని సంపద్వంతం చేసిన విషయం ప్రపంచానికి తెలుసు. కాని అతడికన్నా వందేళ్ళ ముందే సోమన తెలుగు భాషకి అటువంటి సేవ చేసాడని మనమొక తులనాత్మక చర్చ మొదలుపెట్టకపోతే సోమన గురించి ప్రపంచం ఎందుకు మాట్లాడుతుంది? పన్నెండవ శతాబ్దిలోనే ఆయన ‘కావ్యకళ’ అనే పదం వాడాడనీ అప్పటికింకా ఇంగ్లీషు శైశవావస్థలోనే ఉందనీ, అప్పటికింకా ఛాసర్ పుట్టనేలేదనీ మనం గుర్తుచెయ్యకపోతే మన కవిత్వాల అనువాదాలు చదవాలని ఏ జిజ్ఞాసువు ఉవ్విళ్ళూరతాడు?

ఇక, చివరగా మరొక మాట కూడా చెప్పాను. ఒక వాక్యాన్ని కవిత్వంగా మార్చడానికి మూడు గుణాలు అవసరమవుతాయి. మొదటిది, music. ఒక భాషకి తనదే అయిన పదజాలంలో, దేశి ఛందస్సుల్లో ఊటలూరే సంగీతం. అది ప్రధానంగా శబ్దాలంకారాలమీద ఆధారపడుతుంది.

‘కమ్మని లతాంతముల కుమ్మొనసివచ్చు మధుపమ్ములను సుగీతనినదమ్ములెసగెంచూతమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధిముకుళమ్ములనానుచును..’

‘నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబు పై జల్లెడువాడు, మౌళిపరిసర్పితపింఛమువాడు..’

‘సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో …’

ఈ సంగీతాన్ని ఇంగ్లీషులోకి కాదు సరికదా పక్కనున్న కన్నడంలోకి కూడా అనువదించలేం. కాబట్టి ఒక కవిత అనువాదమయ్యేటప్పుడు అందులో నూటికి నూరు శాతం నష్టపోయేది సంగీతం.

రెండవది, tone. ఇది భాషావ్యవహారంలో ఉండే కాకువు మీద ఆధారపడుతుంది.

‘వీరెవరయ్య ద్రుపదమహారాజులె యిట్లు కృపణులయి పట్టువడన్ వీరికి వలసెనె యహహ..’

‘ఎవరు దుఃఖించారులే నేస్తం ; నువు చనిపోతే
ఏదో నేనూ ఆరుగురు స్నేహితులూ తప్ప..’

ఇది శబ్దాలంకారాలమీద ఆధారపడ్డది కాదు కాబట్టి అనువాదానికి లొంగుతుంది. కాని సందర్భం తెలియకుండా దీన్ని నేరుగా అస్వాదించలేం కాబట్టి, యాభై శాతం మాత్రమే జయప్రదమవుతుందని చెప్పవచ్చు.

ఇక మూడవది, metaphor. అంటే, అన్నిరకాల అర్థాలంకారాలూను.

‘దేశమనియెడు దొడ్డవృక్షము..’

‘కత్తిగంటుమీద నెత్తుటిబొట్టులాగున్నది.’

‘బాండుమేళంలాగా విరబూసింది తురాయిచెట్టు.’

భాషల సరిహద్దుల్ని దాటి ప్రయాణించగలదీ, నూటికి నూరుశాతం చొచ్చుకుపోగలదీ మెటఫర్ ఒక్కటే. కాబట్టి, కవులు తమ కవిత్వం ప్రపంచమంతా వినాలనుకుంటున్నప్పుడు, శబ్దాలంకారాలమీదనుంచి అర్థాలంకారాలమీదకి దృష్టి మరల్చడం కూడా తప్పని సరి అని చెప్పాను.

12-12-2017

Leave a Reply

%d bloggers like this: