కావ్యాత్మక వాస్తవికత-1

ఆర్.ఎస్.సుదర్శనం గారు రాసిన కొన్ని సాహిత్యవిమర్శ వ్యాసాలు నా ఇరవయ్యేళ్ళప్పుడు చదివాను. అవి నన్ను చాలా గాఢంగా ప్రభావితం చేసాయి. ముఖ్యంగా, ఆయన తెలుగులో కావ్యం లాంటి నవల రావాలని చేసిన ప్రతిపాదనలు నన్ను ఆకట్టుకున్నాయి. చలంగారి ‘అమీనా’ గురించీ, విశ్వనాథ ‘ఏకవీర’ గురించీ రాస్తూ ఆయన కావ్యాత్మకమైన నవల ఎలా ఉంటుందో చూపిస్తూ, సాహిత్య రూపాల్లో అది అత్యున్నతమైన ప్రక్రియ అన్నట్లుగా రాసినట్టు గుర్తు.

ఆ స్ఫూర్తితో నేను అప్పుడే ‘అసంపూర్ణ మథనం’ అనే నవల రాసాను. ఆ తర్వాత ఆయన్ని మొదటిసారి రాజమండ్రిలో కలుసుకున్నప్పుడు ఆ నవల రాతప్రతి ఆయనకి చూపించాను. ఆయన ఆ రాతప్రతి నా దగ్గరనుంచి తీసుకుని శ్రద్ధగా చదివి, అది చాలా మంచి రచన అని చెప్తూ, ఏదేనా పత్రికకి పంపించమని కూడా అన్నారు. నేను ఆయన్ని కలిసేటప్పటికే ఆ నవలతో పాటు, ‘శిఖరారోహణ’, ‘వైఫల్య గీతం’ అనే మరో రెండు నవలలు కూడా రాసి ఉన్నాను. కాని నా మటుకు నాకు ఆ నవలలేవీ తృప్తి కలిగించలేదు. ఎందుకంటే అప్పటికి నాకు నవయవ్వనపు భావావేశమైతే పుష్కలంగా ఉందిగానీ, జీవితానుభవం లేదు. సుఖదుఃఖాలంటే ఏమిటో తెలియదు. సమాజం ఎలా ఉంటుందో అసలే తెలియదు. దాంతో ఆ నవలల్ని అలానే పక్కన పెట్టేసాను. కాని ఆయనతో మాట్లాడినప్పుడు కలిగిన కొంత ధైర్యం వల్ల, ‘అరణ్యం’ అని మరో నవల రాసాను. ఆ నవల ప్రచురణకి నోచుకుంది. దాన్ని నవోదయ రామమోహన రావుగారు పుస్తకంగా వేస్తానని ఉత్తరం రాసినప్పుడు సుదర్శనంగారి దగ్గరికి వెళ్ళి ఆ నవలకి ముందుమాట రాయమని అడిగాను. ఆయన ఎంతో ఆదరంగా ముందుమాట రాసేరుగానీ, ఆ చిన్న నవల్లో చాలామంది కవులు నా భుజాలమీద ఊరేగుతున్నారని రాసారు!

ఆ రోజు నాకు ఆ ముందుమాట అసంతృప్తి కలిగించినా ఆయన చెప్తున్న దాంట్లో సత్యముందని కూడా అర్థమయింది. అంటే జీవితవాస్తవాన్నీ, కవితాత్మక సౌకుమార్యాన్నీ మేళవించగల శక్తి నాకు ఇంకా సాధ్యం కాలేదని గ్రహించాను. ఆ తర్వాత అయిదేళ్ళ పాటు, అంటే, నేను రాజమండ్రి వదిలిపెట్టేదాకా కూడా అటువంటి రచనలేవై ఉండవచ్చునా అని అన్వేషిస్తూనే ఉన్నాను. నెమ్మదిగా టాగోర్ ‘నష్టనీడ్’ (తెలుగులో శిథిల కుటీరం), బిభూతిభూషణ్ ‘ఆరణ్యక’ (తెలుగులో వనవాసి), టాల్‌స్టాయ్ ‘ఫామిలీ హ్యాపీనెస్’ (తెలుగులో సంసార సుఖం), చింగిజ్ అయిత్‌మాతొవ్ ‘జమీల్యా’ లాంటి నవలలు నా చేతుల్లోకి వచ్చాక కావ్యాత్మకమైన నవల ఎలా ఉండాలో నాకొక ఆనవాలు దొరికింది. కాని సరిగ్గా అప్పుడే గోపీనాథ మొహంతి ‘అమృత సంతానం’ కూడా నా చేతుల్లోకి వచ్చింది. ఒక నవల వాస్తవాన్ని ప్రతిబింబించేదిగానూ, కవితాత్మకంగానూ ఉంటేనే చాలదు, అదొక ఇతిహాస స్థాయి రచన కాగలిగినప్పుడే అత్యుత్తమ నవల కాగలుగుతుందని అనిపించింది. ఆ నవల నాకొక కొండగుర్తుగా నిలబడిపోయింది. దాంతో ఇక నేను కావ్యాత్మకమైన నవలల గురించి వెతకడం మానేసాను.

కానీ కావ్యాత్మకమైన ఒక నవల రాయాలన్న ఆ నవయవ్వన ప్రలోభం మాత్రం అలానే ఉండిపోయింది. అందుకని 1987 లో ఒక చిన్న నవల రాయడం మొదలుపెట్టాను. అప్పట్లో నేను గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగంలో చేరి ట్రయినింగులో ఉన్నాను. కాని ట్రయినింగు పూర్తయ్యి ఉద్యోగంలో చేరాక ఆ నవల మరిక ముందుకు సాగలేదు. ఆ రాసుకున్న కొన్ని పేజీలూ కూడా ఎటో పోయాయి. జిల్లాల్లో నా ఉద్యోగ పర్వం పూర్తయి నేను హైదరాబాదులో హెడ్డాఫీసులో చేరాక, రోజువారీ పని ఒత్తిడినుంచి కొంత వెసులుబాటు దొరికాక, ఆ నవల మళ్ళా మొదలుపెట్టాను. ‘ఆ వెన్నెల రాత్రులు’ పేరిట రెండు అధ్యాయాలు రాసేనుగానీ, ఆ రచన కూడా అక్కడితో ఆగిపోయింది.

ఇలా ఉండగా, జర్మన్ రచయిత థియొడర్ స్టార్మ్ రాసిన ‘ఇమ్మెన్సీ’కి ఇంగ్లిషు అనువాదం The Lake of Bees (హెస్పెరస్, 2003) పదేళ్ళ కిందట నా చేతుల్లోకి వచ్చింది. అది చదవగానే అప్పటికి ముప్ఫై ఏళ్ళ కింద, ఎనభైల మొదట్లో, నన్ను నిలవనియ్యకుండా కుదిపేసిన కావ్యాత్మక నవల మళ్ళా నన్ను వెంటాడడం మొదలుపెట్టింది. అలాగే అప్పటికి ముప్ఫై ఏళ్ళుగా నా మనసులో అస్పష్టంగా కదలాడుతున్న ‘ఆ వెన్నెల రాత్రులు’ కూడా నన్ను ఊరించడం మొదలుపెట్టింది. చివరికి 2022 లో నేను ఉద్యోగ విరమణ చేసాక, నా రోజువారీ ఒత్తిడినుంచి దాదాపుగా బయటపడ్డాక చివరికి 2023 లో ఆ నవల పూర్తిగా రాయగలిగాను.

రెండేళ్ళ కిందట విజయవాడలో అశోక్ బుక్ సెంటర్ లో మళ్ళా The Lake of Bees కనిపించింది. ఈ సారి ఆ పుస్తకం అనువదించాలనిపించింది. అందుకని ఆయన్ని అనువాదం హక్కుల కోసం ప్రయత్నించమని అడిగాను. కానీ ఆ పుస్తకానికి C.W. Bell అనే ఆయన చేసిన ఇంగ్లిషు అనువాదం పబ్లిక్ డొమైన్ లో లభ్యంగా ఉందని తెలిసింది. వెంటనే ఆ పుస్తకం అనువదించకుండా ఉండలేకపోయాను. అలా అనువదించిన పుస్తకాన్నే ఇప్పుడు మీకు అందిస్తున్నాను.

చూడటానికి చాలా సరళంగానూ, ఒక విధంగా చెప్పాలంటే అమాయికమైన ప్రేమకథలానూ కనిపిస్తున్న ఈ నవలికని అనువదించడం మొదలుపెట్టాక నేను పందొమ్మిదో శతాబ్దపు జర్మన్ చరిత్ర మొత్తం తెలుసుకోవలసి వచ్చింది. తదనంతర జర్మన్ సాహిత్యంతో పాటు ప్రపంచ సాహిత్యాల పైన ఈ నవల చూపించిన ప్రభావాన్ని అర్థం చేసుకోడానికి కొన్ని నవలలు కొత్తగా చదివేను, కొన్ని అంతకుముందు చదివినవాటినే మళ్ళా కొత్తగా చదివేను. అంతేకాదు, German Poetic Realism గురించి లభ్యంగా ఉన్న సాహిత్యవిమర్శ గ్రంథాలు కూడా వెతుక్కున్నాను. వాటిల్లో Clifford Albrecht Bernd రాసిన German Poetic Realism (1981) చదివాక, నాకు ఈ నవల గురించీ, జర్మన్ సాహిత్య చరిత్రలో ఈ నవల నిర్వహించిన పాత్ర గురించీ చాలా స్పష్టత ఏర్పడింది.

ఈసారి ఈ నవలని చదివినప్పుడు, అనువదించినప్పుడు, నేనింతదాకా కావ్యాత్మక నవలలకి ఉదాహరణలుగా భావిస్తూ వచ్చినవాటికన్నా కూడా ఈ నవలలో మరింత విశిష్టత ఉందని నాకు అర్థమయింది. నిజానికి తెలుగులో కావ్యాల్లాంటి నవలలు రావాలని సుదర్శనంగారు రాస్తున్నప్పుడు ఆయనకి ఈ నవల గురించి తెలిసి ఉండదేమో అని కూడా అనిపించింది. అంతేకాదు, ఈ నవల ద్వారా స్టార్మ్ ‘కవితాత్మక వాస్తవికత’ అనే ఒక ధోరణిని ముందుకు తీసుకొచ్చాడని కూడా ఆయనకి తెలిసి ఉండదనిపించింది. తెలిసి ఉంటే ఆయన వాటి గురించి తప్పకుండా ప్రస్తావించి ఉండేవారు. అంతేకాదు, తాను ఆ రోజు చేస్తున్న ప్రతిపాదనల్ని ఆయన మరింత సూటిగా, మరింత స్పష్టంగా చెప్పగలిగి ఉండేవారని కూడా అనిపించింది. కాబట్టి ఆయన ఆ రోజు తన ఆలోచనల్ని ఎక్కడ ఆపారో, ఈ రోజు నేను ఈ నవలని అనువదించడం ద్వారా అక్కణ్ణుంచి ముందుకు తీసుకుపోవాలి అని అనుకుంటున్నాను. విపులంగా ఈ పరిచయ వ్యాసం రాస్తున్నది అందుకే.

2

ఇమ్మెన్సీ నవల అత్యంత జనాదరణ పొంది ఉన్నప్పటికీ, అది జర్మన్ సాహిత్యంలో ఒక కొత్త ధోరణిని వాడుకలోకి తెచ్చినప్పటికీ, 1981 లో క్లిఫోర్డ్ ఆల్బ్రెచ్ట్ బేంట్ (Bernd) ఆ పుస్తకం రాసినదాకా కూడా ఎవరూ ఆ నవల చారిత్రిక ప్రాసంగికతని సరిగా అంచనా వెయ్యలేదనే చెప్పాలి. స్టార్మ్ ఇమ్మెన్సీ నవల 1849 లో రాసాడు. అది 1850 లో అచ్చయ్యింది. బేంట్ విశ్లేషణ ప్రకారం ఆ నవల వెనక 1848-49 జర్మన్ విప్లవాల చరిత్రా, వాటి వైఫల్యమూ ఉన్నాయి. కాబట్టి మనం ఇమ్మెన్సీని దాని చారిత్రిక సందర్భంలో గుర్తుపట్టాలంటే 1806-1849 దాకా జర్మన్ ప్రాంతాల చరిత్ర గురించి స్థూలంగానైనా కొంత తెలుసుకోవాలి.

1848 నాటి జర్మనీ

నెపోలియన్ యుద్ధాల వల్ల ఎట్టకేలకు 1806 లో పవిత్ర రోమన్ సామ్రాజ్యం పూర్తిగా కుప్పకూలిపోయింది. పవిత్ర రోమన్ సామ్రాజ్యం నామమాత్రానికి దాదాపుగా యూరోపు అంతా విస్తరించి ఉన్నప్పటికీ దాని మధ్యభూభాగాల్లో ప్రధానంగా జర్మన్ రాజ్యాలు ఉన్నాయి. 1815 లో వియన్నా కాంగ్రెసు తర్వాత జర్మన్ మాట్లాడే ప్రాంతాల్లో 39 రాజ్యాలూ, కొన్ని సర్వసత్తాక నగర రాజ్యాలూ కలిసి ఒక జర్మన్ సమాఖ్యగా ఏర్పడ్డాయి. వీటన్నింటిలోనూ ఒకవైపు ప్రష్యా, మరొక వైపు ఆస్ట్రియా అత్యంత ప్రధానమైన, బలమైన భాగస్వాములుగా ఉండేవి. ఆ రోజు అవి పేరుకు సమాఖ్యగా ఏర్పడ్డాయేగాని ఒక రాజ్యాంగ బద్ధమైన ఆధునిక జాతీయ రాజ్యంగా ఏర్పడలేదు. అవి రాజకీయంగా ఇంకా ఫ్యూడల్ గతంలోనే ఉన్నాయి. కాని ఆధునిక విద్య, రవాణా సౌకర్యాలూ, భాష ఆ ప్రాంతాల్లో ఒక కొత్త మధ్యతరగతిని సృష్టించాయి. విద్యాధికులైన మధ్యతరగతీ, విద్యార్థులూ, సాహిత్యకారులూ 1815-48 దాకా మూడు దశాబ్దాల పాటు ఒక కొత్త జాతీయ రాజ్యాన్నీ, ఒక ఉదార, ప్రజాస్వామిక రాజ్యాంగాన్నీ కోరుకుంటూ ఉద్యమిస్తూ ఉన్నాయి. పౌరహక్కులూ, ప్రజల ప్రాతినిధ్యంతో ఏర్పడే చట్టసభలూ, విస్తృత ఓటు హక్కూ, పత్రికా స్వేచ్ఛా వారి ప్రధాన డిమాండ్లు. యూరప్ చరిత్రలో దీన్ని Biedermeier era అంటారు. కాని ఈ నవజీవన అకాంక్షల్ని అణచివెయ్యడానికి, కమ్యూనిస్టు మానిఫెస్టో తొలివాక్యాల్లోనే చెప్పినట్టుగా ‘ పాత యూరోపు తాలూకు శక్తులన్నీ, పోపూ,జారూ, మెటర్నిఖ్, గీజో, ఫ్రెంచి రాడికల్సూ, జర్మన్ పోలీసు గూఢచారులూ’ అందరూ ఏకమయ్యారు. ఆ క్రూరపాలక శక్తులు పత్రికాస్వేచ్ఛనీ , విద్యార్థి ఉద్యమాల్నీ, ఉదారవాద ఆకాంక్షల్నీ  దారుణమైన అణచివేతకు గురిచేశాయి. ఆ విప్లవాలన్నీ వీగిపొయ్యాయి.

1848 నాటికి స్టార్మ్ సొంతనేలలో పరిణామాలు

1806 నుంచి మరీ ముఖ్యంగా 1815 నుంచి 48 దాకా జర్మన్ ప్రాంతాలన్నీ అనుభవిస్తున్న సంక్షోభం థియొడర్ స్టార్మ్ పుట్టి పెరిగిన హుజూం లో తీవ్ర రూపం ధరించింది. అది ఉత్తర సముద్రపు అంచున ఉన్న ఒక రేవు పట్టణం. ఆ రేవుపట్టణం ఉన్న Schleswig-Holstein సంస్థానం (Duchy) జర్మన్ రాజ్యాలకీ, డెన్మార్క్ కీ మధ్యలో ఉంది. కావటానికి అది జర్మన్ భాషా, సంస్కృతీ ప్రధానంగా ఉండే ప్రాంతమైనప్పటికీ డెన్మార్క్ పాలనలో ఉండేది. ఆ చిన్నపట్టణాన్ని అల్లుకునే అతడి భావావేశ జీవితం వికసించింది. 1848 లో డేనిష్ జాతీయవాదులు ఆ సంస్థానాన్ని పూర్తిగా డెన్మార్కులో విలీనం చేసుకోవాలని చూసినప్పుడు, ఆ సంస్థాన పాలకులూ, పౌరులూ ఎదురుతిరిగారు. వారు రాజ్యాంగబద్ధ జర్మన్ జాతీయరాజ్యంలో భాగం కావాలని కోరుకున్నారు. దాంతో 1848-51 మధ్యకాలంలో మొదటి Schleswig యుద్ధం జరిగింది. ఆ రోజుల్లో స్టార్మ్ కూడా జర్మన్ జాతీయవాదాన్ని సమర్థిస్తూ వ్యాసాలు రాసేడు, ప్రచారం చేసాడు కానీ హుజూం నగరం ముట్టడికి గురికావడం, యుద్ధం, అణచివేతల్ని తట్టుకోలేక అతడు ప్రవాసానికి వెళ్ళిపోయేడు. ఆ తర్వాత దాదాపు పదేళ్ళ పాటు ప్రవాసిగానే గడిపాడు. అటువంటి రాజకీయ కల్లోలం మధ్య, యూరోపు మొత్తాన్ని ఆవహించిన ప్రజాస్వామిక ఆకాంక్షలకీ, పాతకాలపు రాచరిక ఫ్యూడల్ పాలకశక్తులకీ మధ్య అతడు ఇమ్మెన్సీ నవల రాయడానికి పూనుకున్నాడు.

1848 మార్చికి ముందూ, మార్చి తర్వాతా

జర్మన్ రాజకీయ చరిత్రలోలానే సాహిత్యచరిత్రలో కూడా 1848 మార్చి ఒక సరిహద్దు రేఖ. అంతకు పూర్వం సాహిత్యం Vormärz అంటే ‘మార్చికి ముందు సాహిత్యం’ ప్రధానంగా బయటి ప్రపంచం మీద దృష్టిపెట్టింది. సాహిత్యం ప్రజాజీవితాన్నీ, పౌరసంస్థల్నీ, రాజకీయ పరిణామాల్ని ప్రభావితం చెయ్యగలమనే నమ్మింది. కానీ 1848 మార్చిలో తలెత్తిన తిరుగుబాట్లని పాలకశక్తులు క్రూరంగా అణచివేసాక, జర్మన్ సాహిత్య సంవేదనలు తీవ్ర సంక్షోభానికి లోనయ్యాయి. బయటి ప్రపంచంలో సంభవిస్తున్న పరిణామాలు అస్తవ్యస్తంగా, క్రూరంగా, అణచివేసేవిగా కనిపించడం మొదలుపెట్టాక, రచయితలు తాము ఎటువంటి సాహిత్య సృజన చెయ్యాలో తేల్చుకోలేని స్థితి ఏర్పడింది. స్టార్మ్ కూడా తన సొంత పట్టణమైన హుజూం ని డేనిష్ పాలకులు ముట్టడించి లొంగదీసుకోడం చూసాక ఇదే సంక్షోభానికి లోనయ్యాడు.

బేంట్ తన పుస్తకంలో రాసిందేమంటే, ఈ రాజకీయ వైఫల్యం ప్రగతివాద శక్తుల్లో ఒక నైరాశ్యాన్ని నింపిందనీ, రచయితలు తాము బాహ్య ప్రపంచం మీద ఆరోపించడానికి ప్రయత్నించి విఫలమైన తమ దర్శనాన్ని తమ అంతరంగ ప్రపంచంలోకి మళ్ళించారనీ, కవితాత్మకవాస్తవికత ఆ విధంగా ప్రభవించిందనీ. ఇప్పుడు రచయితలు తమ పెరటితోటల్లోకో, లేదా తమ డ్రాయింగురూముల్లోకో లేదా తమ ప్రాంతీయ జీవితాలవైపో లేదా తమ జ్ఞాపకాల్లోకో తమ దృష్టిసారించారనీ. బేంట్ దృష్టిలో, ఆ చారిత్రిక సంధి దశలో రచయితల మనసుల్లో సంభవించిన నవ్యసంవేదనలకి ‘ఇమ్మెన్సీ’ నవల ఒక అభివ్యక్తిని సమకూర్చింది. (ఇంకా ఉంది)

23-11-2026

2 Replies to “కావ్యాత్మక వాస్తవికత-1”

  1. ‘తేనెటీగల కొలను’ చదువుతున్నంతసేపూ ఆ నవలలోని కవిత్వం, భావోద్వేగాల సున్నితత్వం, ప్రకృతి ప్రతీకలు, వర్ణనలు కట్టి పడేశాయి.

    మీ ఈ వ్యాసం ఆ experience ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్తూంది. “చూడటానికి చాలా సరళంగానూ, ఒక విధంగా చెప్పాలంటే అమాయకమైన ప్రేమకథలానూ కనిపిస్తున్న ఈ నవలిక” వెనుక ఉన్న historical context ను, అలాగే Poetic Realism అనే సాహిత్య ధోరణి ఎందుకు, ఎలా ఆవిర్భవించిందో వివరించి, ఆ నవల పట్ల నా understanding and appreciation ను మరింత broaden చేశారు.

    మీ ‘ఆ వెన్నెల రాత్రులు’ చదివినప్పుడు కూడా ఎంతో అందమైన కావ్యాత్మక అనుభూతిని కలిగించింది. ఇప్పుడు ఈ వ్యాసం చదువుతుంటే, కావ్యాత్మక నవల గురించి మీ అన్వేషణ, ఆలోచనలు, మీ study and research మరింత అర్థమవుతున్నాయి. 🙏🏽

Leave a Reply