
శీతాకాలం రాగానే పుస్తకాల పండగలు మొదలవుతాయి. కాని ఈ సారి పండగ అందరికన్నా ముందు నిన్న మా ఇంట్లోనే మొదలయ్యింది. జీవితాన్నీ, మనుషుల్నీ, ప్రపంచాన్నీ ప్రేమించే కొద్ది మంది మిత్రుల మధ్య నిన్న కొన్ని పుస్తకాలు ఈ లోకంలోకి దిగి వచ్చాయి.
వికసించిన విద్యుత్తేజం
ఎనిమిదేళ్ళ కింద రామారావు నన్నొకసారి అడిగాడు: లాంగ్ స్టన్ హ్యూస్ ని తెలుగు చేస్తావా?’ అని. ఆ ఒక్క ప్రశ్నతో అతడు నాకొక అద్వితీయ ప్రజానీకాన్ని పరిచయం చేసాడు. అతడిచ్చిన స్ఫూర్తితో ఆ ఏడాది ఫిబ్రవరిలో Black History Month ని పురస్కరించుకుని ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం పైన కొన్ని వ్యాసాలు రాసాను. ఫేస్ బుక్ లో వరసగా రాస్తూ వచ్చిన ఆ వ్యాసాలకు చాలా మంచి స్పందన లభించింది. ఆ తర్వాత వాటిని ‘వికసించిన విద్యుత్తేజం‘ పేరిట ఇ-బుక్ గా విడుదల చేసాను. కిందటేడాది శ్రీపాద లిటరరీ వర్క్స్ వారు ఆ పుస్తకం ప్రచురించారు. దాన్ని కన్నెగంటి రామారావుకి కానుక చేసాను. అయితే ఇన్నాల్టికి నిన్న సాయంకాలానికి ఆ పుస్తకం ఆయన చేతుల్లో పెట్టగలిగాము.

ఆ సందర్భంగా నిన్న ఆదిత్య ఆ పుస్తకం గురించి చాలా లోతైన ప్రసంగం చేసాడు. అందులో వ్యాసాలు అంతర్జాతీయ స్థాయి సాహిత్య సమీక్షల స్థాయిని అందుకున్నాయని చెప్పాడు. తమకి అడుగడుగునా అవమానాలూ, అత్యాచారాలూ, క్రూరత్వమే లభిస్తున్న సమాజం ఎదట ఆఫ్రికన్ -అమెరికన్లు ఎటువంటి ఉదాత్త, క్షమాశీల, నిర్భయ వ్యక్తిత్వాల్ని కనపరిచారో ఆ వ్యాసాలు ఆ గుణగణాల్ని ఎత్తిచూపుతున్నాయని చెప్పాడు.

పుస్తకం స్వీకరించాక, రామారావుకూడా తన అనుభవాల్నీ, దృక్కోణాన్నీ వివరించాడు. ఇతర భాషల సాహిత్యాల్ని ఇంగ్లిషులో చదివినప్పుడు వాటిలోని ఆలోచనా పార్శ్వం తనని కదిలిస్తుందని, అవే తెలుగులో చదివినప్పుడు, వాటిలోని సంగీతమయ, అనుభూతితీవ్ర పార్శ్వాలు తనని ముగ్ధుణ్ణి చేస్తాయనీ చెప్తూ, ఈ పుస్తకంలోని వ్యాసాలు మొదటి అనుభూతినీ, ఆ వ్యాసాలకు అనుబంధంగా ఉన్న అనువాదాలు రెండో అనుభూతినీ కలగచేసాయని చెప్పాడు. ఈరోజు భారతీయులతో సహా, అమెరికాలో సౌకర్యంవంతంగా జీవిస్తున్న immigrants తమకి తెలియకుండానే తాము తెల్లవాళ్ళతో సమానమైన పౌర జీవితం జీవించడానికి కారణం నల్లజాతి వాళ్ళు చేపట్టిన పౌరహక్కుల ఉద్యమాలనీ, అందుకు ప్రతిఫలంగా మనం వాళ్ళకేమిచ్చాం అని ప్రశ్నించుకుంటే, ఒక తెలుగువాడిగా ఈ పుస్తకం తనకెంతో ఊరటనిచ్చిందనీ, కించిత్ గర్వం కూడా కలిగించిందనీ చెప్పాడు.
గురుకులం
కొట్నాన సింహాచలం నాయుడు తాడికొండ గురుకుల పాఠశాలలో రామారావుకి సహాధ్యాయి. ఆయన ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకుని భారతీయ జల్ శక్తి అభియాన్ లో ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించి ఈ మధ్యనే పదవీవిరమణ చేసారు. ఆయన గురుకులంలో చేరకముందటి తన బాల్యాన్నీ, గురుకులంలో చేరి, చదువుకున్న మూడేళ్ళ అనుభవాల్నీ ‘గురుకులం‘ పేరిట ఒక బృహద్గ్రంథంగా వెలువరించారు. నిన్న ఆ పుస్తకాన్ని మిత్రులు కుమార్ కూనపరాజు ఆవిష్కరించారు.

నేటి తెలుగు సాహిత్యాన్ని ‘ఉదయిని’ పత్రికతో, ‘రావిశాస్త్రి రచనాపురస్కారాల’తో, రష్యన్ సాహిత్య అనువాదాలతో, రచయితల సమావేశాలతో సంపద్వంతం చేస్తున్న కుమార్ కూనపరాజు పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ కొట్నానకి అభినందనలు తెలియచేసారు.
ఆ పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం నాకు లభించింది కాబట్టి నేను ఆ పుస్తకాన్ని పరిచయం చేసాను. పాశ్చాత్య సాహిత్యంలో Bildungsroman అనే నవలా ప్రక్రియ ఉంది. మనిషి బాల్య, కౌమార, యవ్వనాల్లో ఏ విధంగా ఒక విస్పష్ట వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాడో వివరంగా చిత్రించే ప్రక్రియ అది. గొథే రాసిన Wilhelm Meister’s Apprenticeship, డికెన్స్ ‘డేవిడ్ కాపర్ ఫీల్డ్’, గోర్కీ ‘నా బాల్యం, నా బాల్యసేవ’అటువంటి రచనలు. తెలుగులో ‘బారిస్టర్ పార్వతీశం’, ‘చదువు’ లాంటి పుస్తకాల్లో కొంతవరకూ ఆ ఛాయలు కనిపిస్తాయిగాని, కొట్నాన రాసిన ఈ పుస్తకమే పూర్తి అర్థంలో ఒక వ్యక్తివికాస చిత్రణగా నిలబడుతుందని చెప్పాను.
సింహాచలం నాయుడు గత ఏడెనిమిదేళ్ళుగా తాను రచయితగా ఎలా సాధన చేస్తూ వచ్చాడో వివరిస్తూ తానిప్పటిదాకా ఇటువంటివి నాలుగు రచనలు పూర్తిచేసానని చెప్పాడు. వాటిల్లో తన తండ్రి జీవితం కేంద్రంగా రాసిన పుస్తకంతో పాటు, తన ఉద్యోగానుభవాల గురించిన రచన కూడా ఉన్నాయని చెప్పాడు.

ఆ తర్వాత సింహాచలం నాయుడు దంపతుల్ని శ్రీపాద ప్రచురణల శ్రీధర్, రాజశ్రీ దంపతులు సత్కరించారు.
తెల్లజింక
అనిల్ బత్తుల తెలుగు సాహిత్యంలో అద్వితీయుడైన వ్యక్తి. పుస్తకాల పట్ల ప్రేమలో, మరీ ముఖ్యంగా పాతపుస్తకాల్లోని అనర్ఘరత్నాల్ని తిరిగి తెచ్చి తెలుగువాళ్ళకి అందివ్వడంలో ఆయన చేస్తున్న నిర్విరామ కృషి సామాన్యమైంది కాదు. అనిల్ బత్తుల పబ్లికేషన్స్ పేరిట ఇటీవలికాలంలో ‘కొకొరొ’, ‘సైకిల్ దొంగ’, ’41’, ‘వైట్ నైట్స్’ తర్వాత, ఇప్పుడు, తెలుగు వాళ్ళకి ఎంతో ప్రీతిపాత్రుడైన కిర్గిజ్ రచయిత చింగిజ్ అయిత్ మాతోవ్ రాసిన నవలను ‘తెల్లజింక‘ పేరిట మొదటిసారిగా తెలుగుపాఠకులకి అందిస్తున్నారు. మొన్న ఆదివారం ఆ పుస్తక ఆవిష్కరణ గుంటూరులో జరిగింది. కానీ కొత్త పుస్తకం కొత్తగా పుట్టిన శిశువులాంటిది. ప్రతి ఒక్కరూ ఆ బిడ్డను ఎత్తుకుని లాలించాలనుకుంటారు. అందుకని నిన్న ఆ పుస్తకాన్ని మళ్ళా ఆవిష్కరించుకున్నాం.

అనిల్ బత్తుల లానే నిజామాబాద్ జిల్లాకి చెందిన మరొక సాహిత్యప్రేమికుడు, ఫిల్మ్ డైరక్టరు అల్లపుల్ల గంగారెడ్డి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గంగారెడ్డి తన చిన్నప్పుడు మోతెలో జిల్లా పరిషత్తు హైస్కూల్లో చదువుకున్నారు. ఆయన తన హైస్కూలు ఋణం తీర్చుకోడానికి ఈ మధ్య ఆ పాఠశాలలో పదకొండు లక్షల వ్యయంతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసారు. గ్రంథాలయానికి అవసరమైన ఫర్నిచరుతో పాటు, దాదాపు ఆరువేల పుస్తకాల్ని తరగతుల వారీగా విద్యార్థులు చదువుకోడానికి వీలుగా అందచేసారు. ఆయన చేపట్టిన ఈ పనికి పాఠశాల విద్యాశాఖలో మంచి స్పందన లభించింది. వారం దినాల కిందట పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు కోసం దాదాపు రెండుకోట్ల మేరకు నిధులు విడుదల చేసింది. ఆ విధంగా తెలంగాణాలో మరో గ్రంథాలయ ఉద్యమానికి గంగారెడ్డి శ్రీకారం చుట్టినవాడయ్యాడు.
ఆయన అనిల్ బత్తుల పుస్తకం ఆవిష్కరించి గ్రంథాలయం ఏర్పాటు గురించి తను చేపట్టిన ప్రయత్నాల్ని పంచుకున్నారు. తమని చూసి జిల్లాలో మరికొన్ని పాఠశాలలూ, మరికొందరు దాతలూ ముందుకొస్తున్నారని చెప్పారు. తన చిన్నతనంలో తనకి పుస్తకాల గురించి చెప్పేవారు ఎవరూ లేకపోయారనీ, ఇప్పటి పిల్లలకి ఆ పరిస్థితి రాకూడదనే తాను ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా చెప్పారు.
పాటలు పుట్టిన తావులు
2019 లో నేను తమిళనాడులో పర్యటించినప్పుడు అక్కడ నాయన్మార్లూ, ఆళ్వార్లూ, ఇతర మహాకవులూ పుట్టిపెరిగిన కొన్ని స్థలాల్ని చూసి వాటి గురించి ఫేస్ బుక్ లో వ్యాసాలు రాసాను. ఆ తర్వాత వాటిని ‘పాటలు పుట్టిన తావులు‘ పేరిట ఎమెస్కో సంస్థ ప్రచురించింది. ఇప్పుడు ఆ పుస్తకం కాపీలు అయిపోవడంతో శ్రీపాద వారు ఆ పుస్తకాన్ని పునర్ముద్రించారు. నిన్న ఆ కొత్త ఎడిషన్ ని జీడిగుంట విజయసారథి ఆవిష్కరించారు.

ఆ సందర్భంగా ఆయన యాత్రల పట్ల తన మక్కువని పంచుకుంటూ తాను ఇటీవల చేపట్టిన చైనా యాత్ర గురించి చెప్పారు.

మునిగి తేలాం
నా మొదటి యాత్రా రచన ‘నేను తిరిగిన దారులు’ తరువాత, రాస్తూ వచ్చిన వివిధ యాత్రా వ్యాసాల్ని ‘మునిగి తేలాం: బ్రహ్మపుత్రనుండి కావేరి దాకా‘ అని మూడేళ్ళ కిందట ఒక ఇ-బుక్ విడుదల చేసాను. ఇప్పుడు శ్రీపాద వారు దాన్ని ప్రరురించారు. నిన్న పింగళి చైతన్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆమె యాత్రా రచనలు పాఠకుల్లో కలిగించగల స్ఫూర్తి గురించి మాట్లాడేరు.

ఆ తర్వాత జీడిగుంట విజయసారథి గారికీ, పింగళిచైతన్య గారికీ శ్రీపాద ప్రచురణలు వారు చిరుసత్కారం చేశారు. శ్రీపాద ప్రచురణాలకి చెందిన సౌందర్య అతిథులు అందరికీ పుస్తకాలు అందచేశారు. ఆ తర్వాత కొట్నాన దంపతులతో పాటు అతిథులంతా శ్రీపాద ప్రచురణల అధినేతలు రాజశ్రీ దంపతులకు సత్కారం చేసారు.

విరబూసిన చామంతిపూల మధ్య,’పీస్ లిల్లీ’ సమక్షంలో, విజ్ఞానదాయకమైన ప్రసంగాల మధ్య, అత్యంత అత్మీయంగా నడిచిన పుస్తకావిష్కరణల తర్వాత ఒక చిన్న విందుతో నిన్నటి సాయంకాలం సుసంపన్నమైంది.
Featured image: Selfie by Jeedigunta Vijayasarathi. From left to right: Jeedigunta Vijayasarathi, Anil Battula, Ramarao Kanneganti, A.Gangareddi, Vadrevu, Smt. Vijayasree, Smt. Chaitanya, Aditya Korrapati, Smt.Rajashree, Soundarya and Sridhar.
13-11-2026


ఈ పుస్తకాల పండుగ లో పాల్గొనే అవకాశమివ్వడమే కాకుండా, నన్నెంతో ఆదరించి సత్కరించినందుకు మీకు, శ్రీపాద పబ్లికేషన్స్ వారికి కృతజ్ఞతలు భద్రుడు గారు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
నిజంగా పుస్తకాల పండుగ ముందుగానే వచ్చింది.
హృదయపూర్వక ధన్యవాదాలు సోమ శేఖర్!
మంచి సమాజం, మంచి మనుషుల కలయిక, అనురాగాల సంగమం. ఆనందాలవేదిక.
బంగారు రామాచారి
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
మంచి సమాజం, మంచి మనుషుల కలయిక, అనురాగాల సంగమం. ఆనందాలవేదిక.
బంగారు రామాచారి
What a wonderful event sir. All of you are doing amazing job for society.
Get to know many new books through this article sir. This single life is not enough to read all books 😄 but we get to know them at least through you sir.
Thank you so much Santosh!