
ముట్నూరు సీతారామమూర్తి మాష్టారు స్వర్గస్థులయ్యారని మిత్రులు కందాళ సాయిబాబా నుంచి పది రోజుల కిందట మెసేజి వచ్చింది. దాకోజు సత్యానందరావు మాష్టారు కూడా స్వర్గస్థులయ్యారని కూడా ఇంతకుముందే విన్నాను. ఆ ఇద్దరూ నాకు చాలా ఆత్మీయులనేది అలా ఉంచి, నేను నా జీవితంలో చూసిన మహోపాధ్యాయులనేది తప్పక చెప్పవలసిన మాట.
నా ఉద్యోగ జీవితం పొడుగునా నేనెంతోమందితో కలిసి పనిచేసినప్పటికీ, నా ఉద్యోగం చివరిదినాల్లో పాఠశాల విద్యాశాఖలో పనిచేసినందువల్ల, వేలాది మంది ఉపాధ్యాయుల్తో నా పనిజీవితం గడిచినప్పటికీ, పార్వతీపురం గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులే నా మనసుకి ఎక్కువగా సన్నిహితంగా వచ్చారనీ, వాళ్ళే నన్ను ఎక్కువ గుర్తుపెట్టుకున్నారనీ ఈ మధ్యే తెలుస్తున్నది. బహుశా అది నా మొదటి పోస్టింగు కావడం వల్ల, వారితో పనిచేసిన జీవితానుభవాల ముద్రలు నా మీద బలంగా పడి ఉండవచ్చు. కానీ వారు నన్నెందుకు అంత ఆప్యాయంగా గుర్తుపెట్టుకున్నారంటే చెప్పలేను.
ఏ కారణం వల్లనో గాని పార్వతీపురం ప్రాంతంలోని ఆశ్రమపాఠశాలల్లో కనీసం ఇరవై ముప్ఫై దాకా కొండలమీదనే పనిచేసేవి. తక్కిన ఏజెన్సీ జిల్లాల్లో కొండలు మరింత ఎక్కువగానూ, మరింత ఎత్తు గానూ, అడవులు మరింత దుర్గమంగానూ ఉన్నప్పటికీ, అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఆశ్రమపాఠశాలలు సంఖ్యలో చాలా తక్కువనే ఉండేవి. నేను అదిలాబాదులోనూ, పాడేరులోనూ కూడా పనిచేసినప్పటికీ, అక్కడ కొండకొమ్ముమీద నడిచే పాఠశాలలు చాలా తక్కువ గమనించాను. కాని పార్వతీపురంలో, శ్రీకాకుళం తిరుగుబాటు ప్రభావం వల్లనో ఏమో, కొండలమీంచి పాఠశాలల్ని కిందకి దింపలేదు. వాటిని అట్లానే నడవనిచ్చారు. అందుకని నలభయ్యేళ్ళ కింద నేను పార్వతీపురంలో ట్రయినింగుకి వెళ్ళినప్పుడూ, అక్కడే మొదటి పోస్టింగు అయినప్పుడూ, దాదాపుగా కొండలెక్కకుండా ఒక్క వారం కూడా గడిచేది కాదు.
ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూస్తే, ఆ కొండలమీద ఆశ్రమపాఠశాలలు నడిపిన ఆ ఉపాధ్యాయులకీ, ఎక్కడో కార్గిల్ లోనో, సియాచిన్ లోనో దేశభద్రతకోసం విధి నిర్వహించే సైనికులకీ మధ్య ఏమీ తేడా లేదనిపిస్తున్నది. ఆ రోజుల్లో, అప్పుడప్పుడే నేను కూడా లోకం చూస్తూ ఉన్నానుకాబట్టి, వారు అంత కఠినాతికఠినమైన పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ, నాకు వారి విధినిర్వహణపట్ల ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉండేది. కాని ఆ తర్వాత నా ఉద్యోగజీవితంలో నేను చూసిన అత్యంత అవినీతిపరులూ, దుర్మార్గులూ, సోమరిపోతులూ అయిన ప్రభుత్వోద్యోగుల్తో (చాలామంది ఆలిండియా సర్వీసు ఉద్యోగులతో సహా) పోలిస్తే ఆ గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులు నైతికంగానూ, తమ పనితీరులోనూ కూడా నా కళ్ళల్లో ఎంతో ఎత్తుకి చేరుకున్నట్టుగా కనబడుతున్నారు.
కాబట్టే ఈ రోజు ఒక సీతారామమూర్తి, ఒక సత్యానందరావు ఈ లోకం నుంచి సెలవుతీసుకున్నారంటే నాకు ఈ లోకం చాలా పేదదైపోయిందనీ, ఇన్నాళ్ళూ తామున్నచోటనే ఉంటూ జాజ్వల్యమానమైన కాంతిని ప్రసరింపచేస్తూ ఉండిన రెండు దీపస్తంభాలు కనుమరుగయ్యాయనీ అనిపిస్తున్నది. ఇది వారి వారి కుటుంబసభ్యులకో లేదా నాబోటి వారికో మాత్రమే సంభవించిన లోటు కాదు. మొత్తం సమాజానికే పెద్ద లోటు.
నేను చూసినంతవరకూ ప్రభుత్వోద్యోగుల్ని నాలుగు రకాలుగా విభజించవచ్చు. మొదటి వర్గం వారు అత్యంతనీతిపరులూ, అత్యంత సమర్థులూ కూడా. మొత్తం ప్రభుత్వంలో అన్ని శాఖల్లోనూ కలిపి, అన్ని స్థాయిల్లోనూ కలిపి వీరి సంఖ్య అయిదు శాతం కంటే ఎక్కువ ఉండదు. ఆ అయిదు శాతం కూడా ఇప్పుడు మరింత పడిపోతున్నది. రెండవ వర్గం వారు నీతిపరులు కాకపోవచ్చుగానీ, అత్యంత సమర్థవంతులు. ప్రభుత్వం నడిచేది దాదాపుగా వీరివల్లనే. వీరు దాదాపు పది పదిహేను శాతందాకా ఉంటారు. కాని వీరి భుజాలు చాలా పెద్దవి, బలమైనవి. మొత్తం ప్రభుత్వరథం వీరి భుజాలమీదనే నడుస్తూ ఉంటుంది. ఇక మూడో వర్గం వారు నీతిపరులు, అంటే లంచాలు, ఆశ్రితపక్షపాతం వగైరా వాటికి దూరంగా ఉంటారుగానీ, అత్యంత అసమర్థులు. వారి వల్ల ప్రభుత్వానికీ, ప్రజలకీ ఎటువంటి ఉపయోగం ఉండదు. పైగా చాలా సార్లు వాళ్ళు ప్రభుత్వం నడవడానికి అడ్డుగా నిలబడుతుంటారు కూడా. వారొక అయిదు శాతందాకా ఉంటారు.
ఇక చివరి వర్గం- అత్యంత అవినీతిపరులూ, అత్యంత అసమర్థులూనూ. ప్రభుత్వంలో వీరే అత్యధిక భాగం. సుమారు డెబ్భై నుంచి డెబ్భై అయిదు శాతందాకా వీళ్ళే కనబడతారు. వీళ్ళవల్లనే ప్రభుత్వాలు అత్యంత అమానుషంగా, సోమరిగా, బాధ్యతారహితంగా, నిర్లజ్జగా తయారవుతాయి. వీరిలోంచే రాజకీయ శక్తులు రూపొందుతాయి. మనం ప్రభుత్వం అనీ, స్టేట్ అనీ అంటున్నప్పుడు మనకి తెలియకుండానే వీళ్ళే మన మనసులోకి వస్తుంటారు. నిక్కచ్చిగానూ, నిజాయితీగానూ పనిచేస్తూ, ప్రభుత్వ కార్యకలాపం నడవాలని కోరుకునే ఏ ఉద్యోగి అయినా, ముందు వీళ్ళతోటే పోరాటం మొదలుపెట్టవలసి ఉంటుంది. సమర్థులూ, నిష్కళంకులూ, సమర్థులూ అయిన ఉద్యోగుల్నే కాదు, రాజకీయ శక్తుల్ని కూడా ఈ ఉద్యోగి వర్గం కొండచిలువలాగా తన హస్తాల్తో బంధించి ఊపిరాడనివ్వకుండా చేసేస్తుంది.
పై నాలుగు రకాల కేటగిరీల్లోనూ, మొదటి తరహా ఉద్యోగుల్ని మన రాజకీయ ప్రభుత్వాలు నిలకడగా పనిచేసుకోనివ్వవు. కానీ అవి రెండో తరహా ఉద్యోగుల్ని నెత్తిన పెట్టుకుంటాయి. మూడో తరహా ఉద్యోగుల్ని పట్టించుకోవు. వాళ్ళున్నా లేనట్టే ప్రవర్తిస్తాయి. కాని ఎటోచ్చీ ఈ నాలుగో కేటగిరీ ఉద్యోగులంటే రాజకీయ ప్రభుత్వాలకి హడల్. వాళ్ళ మీద ఈగ వాలినా కూడా అవి భరించలేవు. వారి సంతృప్తి కోసం అవి ఏమి చెయ్యడానికైనా సిద్ధంగా ఉంటాయి. చాలా సార్లు వారి సంతోషం కోసమే రాజకీయ ప్రభుత్వాలు నీతిపరులైన అధికారుల్ని, వారు ఎంతో సమర్థులైనా కూడా, పనిగట్టుకుని హింసిస్తుంటాయి.
ఈ ఉద్యోగ విభజన గురించి నేనింత విస్తారంగా ఎందుకు రాసానంటే, నా ఉద్యోగ జీవితం పొడవునా నేను చూసిన, కలిసిన, కలిసి పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగీ ఈ లెక్కల్లో దేనికిందకి వస్తాడో పోల్చుకోగలిగేను కాబట్టి. నా ఉద్యోగ జీవితం పొడుగునా నేను చేసిన పోరాటాలూ, ఎదుర్కొన్న సంక్షోభాలూ, దిగమింగుకున్న అవమానాలూ ప్రధానంగా పైన చెప్పినవాళ్ళల్లో నాలుగో తరహా ఉద్యోగివర్గం కారణంగానే సంభవించాయి కాబట్టి. కాని ఆ రోజులన్నిటా నన్ను కాపాడింది భగవత్కృప అని చెప్పగలను. అయితే పైన చెప్పిన వాళ్ళల్లో మొదటి తరహా ఉద్యోగులు కొందర్ని ఆ భగవతృపకి సాక్షులుగా గుర్తుపెట్టుకుంటాను. అందుకనే సీతారామమూర్తిగార్నీ, సత్యానందరావుగార్నీ, అటువంటి మరికొందరు మహనీయులైన సహచరుల్నీ తలుచుకుంటే నాకు భగవంతుడి అనుగ్రహమే గుర్తొస్తుంది.
సీతారామ్మూర్తి 1953 లో పూర్వపు విజయనగరం జిల్లాలో మక్కువ ప్రాంతంలో జన్మించారు. 1976 లో గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ప్రధానోపాధ్యాయుడు కాగలిగారు. కానీ మొదట్లో చాలా ఏళ్ళ పాటు గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకి సర్వీసు రూల్సు లేనందువల్లా, ఆ రూల్సు వచ్చిన తరువాత కూడా, వారికి ప్రధానోపాధ్యాయుడికన్నా పెద్ద పదవి ఏదీ పదోన్నతికి అందుబాటులో లేనందువల్లా ఆయన ప్రధానోపాధ్యాయుడిగానే పదవీ విరమణ చెయ్యవలసి వచ్చింది. కాని అటువంటి సమర్థుడైన, నీతిపరుడైన ఉద్యోగి సేవలు ఐటిడిఎ వాడుకోకుండా ఎలా ఉంటుంది? అందుకని ఆయన కొన్నేళ్ళు ఉపవిద్యాశాఖాధికారిగా, ఒక ఏడాది పాటు జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా, దాదాపు పదేళ్ళకు పైగా ఒ. ఎస్. డి గా పనిచేసారు. నాకు తెలిసి ఆయన ఉద్యోగ జీవితంలో చివరి పదిహేనేళ్ళూ, పార్వతీపురం విద్యావ్యవస్థకి ఒక చిహ్నంగా, ఆ వ్యవస్థని సంస్కరించాలనుకునే వారికి ఒక ఆలంబనగా, చుట్టూ అగమ్యంగా ఉందనుకునేవారికి దారి చూపించే వెలుతురుగానే గడిపారు.
నేను ఆయనతో కలిసి పనిచేసింది 1988-90 ప్రాంతంలో. అప్పట్లో గుమ్మలక్ష్మిపురంలో రేగిడి అనే ఒక చిన్న గిరిజన పల్లెలో ఒక ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉండేది. అప్పట్లో మా ప్రాజెక్టు అధికారి ఎల్.వి.సుబ్రహ్మణ్యం దాన్ని బాలికల పాఠశాలగా మార్చాలనుకున్నారు. కాని అది మారుమూల గ్రామం. బస్సు కూడా నడిచేది కాదు. చుట్టూ ఆడవీ, రేగిడి దాటాక మహాపర్వతాలూనూ. అటువంటి కఠిన పరిస్థితుల్లో మేము సీతారామ్మూర్తిగారిని ఆ ఆశ్రమపాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచెయ్యమని అడిగాం. ఆయన మా పిలుపుని మన్నించారు. ఏడాది కాలంలోనే ఆయన ఆ పాఠశాలను ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దారు. 1990 లో వావిలాల గోపాల కృష్ణయ్యగారిని తీసుకెళ్ళి ఆ పాఠశాల చూపించాను. ఆయన ఆ పిల్లల్తో మాట్లాడేరు. ‘మహాత్ముడు జీవించి ఉంటే ఈ పాఠశాలని చూసి పులకించి ఉండేవాడు ‘ అని అన్నారు. సీతారామమూర్తి నాయకత్వానికి అంతకన్నా మించిన యోగ్యతాపత్రం మరొకటి ఉంటుందనుకోను.
నేను పార్వతీపురం వదిలిపెట్టిన తరువాత, తిరిగి మళ్ళా హెడ్ క్వార్టర్సులో విద్యాకార్యక్రమాలు చూడటం మొదలుపెట్టాక, మళ్ళా సీతారామ్మూర్తితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. అలా దాదాపుగా మా ఉద్యోగ జీవితాలు చివరిదాకా కూడా మేము గిరిజన విద్యారంగంలో కలిసి పనిచేసామనే చెప్పాలి.
సత్యానందరావుగారి గురించి నా ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు ‘(2005) లో ఏకంగా ఒక అధ్యాయమే రాసుకున్నాను. నా ఉద్యోగ జీవితపు ఆ తొలిరోజుల్లో అటువంటి ఉపాధాయుణ్ణి నేను చూడకపోయి ఉంటే, నేనొక సినిక్ గా మారిపోయి ఉండేవాణ్ణి. ఎటుచూసినా చీకటి మాత్రమే కనిపించే ఆ రోజుల్లోనూ, ఆ తర్వాత రోజుల్లోనూ కూడా సత్యానందరావులాంటి ఉపాధ్యాయుల్ని తలుచుకున్నప్పుడు నాలోంచి నాకు అపారమైన స్ఫూర్తి దొరికేది. కొత్త జవసత్త్వాలు ఒనగూడేవి. ఎలాంటి కష్టాలు చవి చూసాడాయన! నేనక్కడ పనిచేసినప్పుడు నేనతణ్ణి ఎంతో గౌరవించానన్న ఒకే ఒక్క కారణం చేత, నేను బయటకి రాగానే, అతణ్ణొక మారుమూల ప్రాంతానికి బదిలీ చేసేసారు. వృద్ధులైన తన తల్లిదండ్రుల్తో, భార్యాబిడ్డల్తో అతడు నెత్తిన పెట్టెలు పెట్టుకుని నాగావళిలో గుండెలోతు నీళ్ళల్లో నడుచుకుంటూ తనని బదిలీ చేసిన పాఠశాలకి రిపోర్టు చెయ్యడానికి వెళ్ళిన దృశ్యం (అదంతా ఎవరో ఆ తర్వాత నాకు చెప్పారు) తలచుకున్నప్పుడల్లా, (ఇప్పుడు ఈ మాటలు రాస్తున్నప్పుడు కూడా) నాకు కన్నీళ్ళు ఆగవు.
కానీ ఎప్పుడు కనబడ్డా ముఖం నిండా గుమ్మడిపువ్వులాగా విస్తరించే చిరునవ్వుతో, మెరిసే కళ్ళతో నన్ను పలకరిస్తుండే అతని ముఖం కూడా నా కళ్ళముందు సజీవంగానే ఉంది. నేను జీవించి ఉన్నంతకాలం ఆ జ్ఞాపకం నాతోనే ఉంటుందని చెప్పగలను. ఆ మహోపాధ్యాయులిద్దరూ ధన్యజీవులు.
Featured image: పైన ఫీచర్ ఫొటోలో మధ్యలో కూర్చున్నది అప్పటి ప్రాజెక్టు అధికారి ఎల్.వి.సుబ్రహ్మణ్యం. ఆయనకి కుడిపక్కన కూర్చున్నది సీతారామ్మూర్తి. సరిగ్గా ఆయన వెనక నిలబడ్డది సత్యానందరావు. పైన ఫొటోలో ఆకుపచ్చ చొక్కాలో ఉన్నది కూడా సత్యానందరావుగారే.
25-9-2026


ఇరువురు ఆరిపోయిన మహోపాధ్యాయ దీపస్తంభాలకు శ్రద్ధాంజలి. ప్రభుత్వోద్యోగుల వర్గీకరణ, ప్రయోజన విశ్లేషణ గణనీయం.
మింటి తారలు కొందరే
మిణుగురులు మరి ఎందరో
జాతితిమిరపు కాంతి క్రాంతులు
కొందరికి అభివందనం
నమశ్శతాని.
🫡🙏🏻
A nice tribute those dedicated souls.
Dear Sir,
Thank you so much for such a wonderful tribute. Reading your kind words about my father (Sri Seetarama Murty garu) brought a huge smile to my face. He always speaks so highly of you and Sri L V Subramanyam garu. Knowing that he is held in such high regard by superiors like you means a lot to our family. We sincerely thank you for taking time to share your thoughts.
మీరు మీ నాన్నగారి గురించిన నా తలపుల్ని చదివారంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నిజంగా మహనీయులు. ధన్యజీవి. మీ కుటుంబానికి భగవంతుడి కటాక్షం ఎల్లవేళలా ఉండుగాక!