
అరుణగిరి దర్శనం
3
భూమ విద్య
మేము గుడినుంచి బయటికొచ్చినప్పటికీ తిరువణ్ణామలై అంతటా బంగారురంగు ఎండ పరుచుకుంది. టిఫిన్ తినడానికి గుడిదగ్గర్లో ఉన్న క్యాంటీన్‌కు వెళ్లాం. వేడివేడి పొంగలి ఎంతో శుభ్రంగా, దేవాలయప్రసాదంలాగా అనిపించింది. మేమక్కడినుంచి బయలుదేరి కారుమీదనే రమణాశ్రమానికి వెళ్లాం.
రమణాశ్రమం మరీ పెద్దదిగా లేదు. చూడటానికి చిన్న ఆశ్రమమే. కానీ నిజమైన ఆశ్రమవాతావరణం అక్కడ వెల్లివిరుస్తోంది. పెద్దపెద్ద చెట్ల నీడలమధ్య అపూర్వమైన ప్రశాంతతతో ఆశ్రమం స్వాగతమిచ్చింది. అక్కడొక మందిరంలో పిల్లలు తైత్తిరీయోపనిషత్ పారాయణం చేస్తున్నారు. సాంబ్రాణి ధూపం అంతటా పరుచుకుని ఏదో పవిత్రభావాన్ని రేకెత్తిస్తోంది. మేము ఆ మందిరం దగ్గర కొద్దిసేపు ఆగి రమణమహర్షి సంచరించిన తావులన్నీ చూస్తూ ముందుకు నడిచాం. ఆ ఆశ్రమంలో ఎటుచూసినా నెమళ్లు. ఆ ఆశ్రమ మందిరాల కప్పులపైన సూర్యకాంతి పడుతూ ఉంది. ఆ పిట్టగోడలమీద, పైకప్పుల మీదా తిరుగుతున్న నెమళ్లతో ఆ ప్రాంతానికి అపురూపమైన సౌందర్యం, శోభ చేకూరాయి. మేము మాతృభూతేశ్వర ఆలయం, గోవు లక్ష్మికి, మరికొందరు భక్తులకీ నిర్మించిన సమాధులు చూశాం. ఆ ఆశ్రమం అంచుల్ని ఆనుకుని అరుణాచలం కొండ అంచు. అక్కడనుంచే రమణమహర్షి తొలిరోజుల్లో తపస్సు చేసుకున్న తావులకు పోయే దారి. కానీ ఆ పైకి వెళ్లడానికి టైం లేకపోవడంతో, వెనక్కి వచ్చేశాం.
ఆశ్రమంలో పుస్తకవిక్రయశాలలో రమణమహర్షి పుస్తకాలు చూస్తూ ఒకాయనని ‘ఇక్కడ చలంగారి ఆశ్రమం ఎక్కడ?’ అని అడిగాను. ఆయనకి నా ప్రశ్న అర్థం కాలేదు. నేను అడుగుతున్న మనిషిపేరు ఆయన ఎప్పుడూ విన్నట్లు లేదు. నేను అక్కడ నిలబడ్డ మరొకరిని కూడా ఆ ప్రశ్న అడిగాను. కానీ ఆయన కూడా ఏమీ తెలియనట్లే ముఖం పెట్టాడు. కానీ వాళ్లకి దగ్గర్లో ఉన్న ఒక మనిషిమాత్రం ముఖం చిట్లిస్తూ తెలుగులో ‘వాళ్ళెవరూ ఇప్పుడు ఇక్కడ లేరు. ఉన్నవన్నీ అమ్మేసుకుని పోయారు’ అన్నాడు. తెలుగువాడు! ఆయన మాటల్ని బట్టి ఆయనకు చలమంటే బాగా తెలుసనీ, కానీ ఎందుకనో అకారణంగా ఆయనను ద్వేషిస్తున్నాడనీ అర్థమైంది. తను జీవించి ఉన్నప్పుడే కాక, ఇప్పుడు కూడా చలంగారి పేరు చెప్తేనే మనుషులెందుకు ఇంత ఉలిక్కిపడతారో నాకు అర్థం కాలేదు. నేను ఆయనను ఒకటి రెండు వివరాలు అడగాలనుకున్నాను కానీ, సాహసం చేయలేకపోయాను. మేము బయటకి వస్తుండగా అతనే మా వెనుకనుంచి ‘మీరు ముందుకుపోయి కుడివైపు కొద్దిగా ముందుకుపోతే అక్కడ కనిపిస్తుంది ఆశ్రమం’ అని అరిచాడు.
మేము అతను చెప్పినట్లే ముందుకు వెళ్లాం. కుడివైపు రెండు మూడు ఫర్లాంగులపాటు అంతా వెతికాం. ఇంకా చెప్పాలంటే గాలించాం కానీ ఎక్కడా ఏ ఆశ్రమమూ కనిపించలేదు. అతను మమ్మల్ని తప్పుదోవ పటించాడా అని అనుమానం వచ్చింది. మేము అక్కడ రోడ్డుమీద కనిపించిన వాళ్లందరినీ అడుగుతూ పోయాం. అప్పుడు ఎవరో ఆ ఆశ్రమం గురించి తమకు తెలియదు కానీ లోపల ఫలానా చోట తెలుగువాళ్ల సత్రాలున్నాయని అక్కడ వాకబు చేస్తే తెలుస్తుందని చెప్పారు. మేము వాళ్లు చెప్పినట్లే ఆ లోపలి వీథుల్లో తెలుగువాళ్ల సత్రం వెతుక్కుంటూ వెళ్లాం. మొత్తానికి చలంగారి ఆశ్రమం గురించి తెలిసినవాళ్ళెవరో ఒకరు కనబడ్డారు. ఆయన మాతోపాటు రోడ్డుమీదకి వచ్చి ఇందాకటి పెద్దమనిషి చెప్పిన ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడొక మేడ చూపించాడు. ‘ఇక్కడే చలంగారి ఆశ్రమం ఉండేది. అయితే వాళ్ల పిల్లలు ఈ స్థలం ఎవరికో అమ్మేసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు ఇక్కడెవరో మేడ కట్టుకున్నారు’ అని వెళ్లిపోయాడు. నేను ఆ మేడకేసి చూశాను. ఇక్కడ చలంగారి ఆశ్రమం ఎట్లా ఉండేదో, ఆయన ఎలా ఉండేవారో నా ఊహకందలేదు. అక్కడే రోడ్డుమీదనే స్నానం చేస్తున్న సాధువొకడు ‘ఇదిగో, ఇదే చలంగారి సమాధి, ఈ మధ్యే మున్సిపాలిటీవాళ్లు రోడ్డు వెడల్పు చేయడంకోసం దీన్ని కొట్టేశారు’ అన్నాడు. అదొక పాడుబడ్డ సిమెంటు కట్టడం. దానిమీద ఆరిపోయిన ప్రమిద ఒకటి ఉంది. ఆ సిమెంటుగోడలు నాచుపట్టి ఉన్నాయి. నాకు విపరీతమైన దుఃఖం ముంచుకొచ్చింది. ఇక్కడ ఈ సమాధి లేకపోతే బావుండేదనిపించింది.
కొన్నేళ్లకిందట చలం శతజయంతి ఉత్సవాలకోసం ఆంధ్రదేశమంతా విరుచుకుపడింది. ప్రతిఒక్కరూ తామే చలానికి వారసులమన్నంతగా గగ్గోలు పెట్టారు. కానీ వాళ్లలో ఏ ఒక్కరైనా ఈ సమాధి గురించి ఆలోచించారా? బహుశా చలాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన సాహిత్యం ద్వారా తప్ప, సమాధి ద్వారా కాదనవచ్చు వాళ్లు. కానీ చలం చివరిరోజుల్లో తన సాహిత్యాన్నికూడా ఒక అవశేషంలానే భావించాడు. చలం ఒక రచయిత అన్న సంగతి పక్కన పెడదాం. అంతకన్నా కూడా ఆయన ఒక సాధకుడు, ఒక సత్యాన్వేషి, ఒక మిస్టిక్. అటువంటి మనిషికి ఎటువంటి ఆరాధనాలయం ఉండాలి ఇక్కడ! బహుశా ఈ విషయం నేను రచయితలతో పంచుకునేది కాదనిపించింది. అందుకే ఆళ్ల గురుప్రసాదరావుగారికి ఫోన్ చేసి నేనేం చూస్తున్నానో అదంతా ఆయనకి చెప్పకుండా ఉండలేకపోయాను.
అరుణగిరిని చూసినవాళ్లు గిరిప్రదక్షిణం చేయడం తప్పనిసరి. ఆ గిరిప్రదక్షిణాన్ని రమణమహర్షి విరివిగా ప్రోత్సహించారు. 14 కిలోమీటర్ల పొడుగునా ఆ గిరిచుట్టూ ప్రదక్షిణం చేయడం మనస్సును నిశ్చలం చేస్తుందని ఆయన చెప్పేవారు. ముఖ్యంగా పున్నమి రాత్రుల్లో గిరిప్రదక్షిణం గొప్ప అనుభవమని చాలామంది అంటారు. కానీ ఆ రోజు మేము సాయంకాలానికే మదనపల్లె చేరుకోవాల్సి ఉన్నందువల్ల కాలినడకన గిరిప్రదక్షిణం చేసే అవకాశం లేకపోయింది. కనీసం కారులోనైనా కొండ చుట్టూ తిరుగుదామని బయలుదేరాం.
వసంతకాలపు అడవి. చుట్టూ లేతాకుపచ్చని రంగులో ముద్దలుముద్దలుగా కనిపిస్తున్న చెట్లు, తీగలూ, వెదురువనాలు. వాటిమీదుగా రాగిరంగులో, ముదురునీలంరంగులో, కపిలవర్ణంలో కనిపిస్తున్న కొండ అంచులూ, పెద్దపెద్ద గండశిలలూ, శిఖరమూ. అక్కడక్కడా సూర్యకాంతి పడుతున్నచోటంతా తెల్లని వెలుతురు. ఆ వెలుతురుని ఆనుకుని ఊదారంగు నీడలు. ఆ కొండకు నీలాకాశం గొడుగుపడుతున్నట్లుంది. ఆ కొండచుట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు మేము కొన్నిసార్లు దగ్గరగా, కొన్నిసార్లు దూరంగా ప్రయాణించాం. అట్లా ప్రయాణిస్తున్నప్పుడు ఆ కొండ మమ్మల్ని పదేపదే దగ్గరకు చేరదీసుకున్నట్లుగా అనిపించింది. ఆ కొండచుట్టూ తిరుగుతున్నప్పుడు నాకు నా చిన్నప్పటి మా ఊరు, మా ఊళ్లో కొండలు, మా జెండాకొండ, వణకరాయి, లొద్దు, వాటిచుట్టూ పచ్చగా వికసించే వైశాఖమాసపు అడవి, తెల్లని పాలపూలూ, ఎర్రని తురాయిపూలూ అన్నీ గుర్తొచ్చాయి. ఆ కొండలు ఎక్కీ దిగీ ఆడుకున్న నా బాల్యం, మా అమ్మా నాన్నా గుర్తుకొచ్చారు. నాకు ఆ ప్రాంతమంతా చాలా కాలంగా పరిచయమున్న ప్రాంతంలాగా, ఎంతో ఆత్మీయమైన ప్రాంతంలాగా అనిపించింది.
ఛాందోగ్యోపనిషత్తులో నారదుడికి సనత్కుమారుడికీ మధ్య జరిగిన ఒక సంభాషణ సుప్రసిద్ధం. అందులో సనత్కుమారుడు నారదుడికి భూమవిద్య ఉపదేశించాడు. ‘ఈ ప్రపంచమంతా ఏది వ్యాపించి ఉందో, ఆ భూమం అది ఒక్కటే సుఖప్రదమైంది. అల్పమైనవాటిలో సుఖం లేదు’ అన్నాడు సనత్కుమారుడు. ఆ అరుణాచలం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ భూమవిద్య నాకు కూడా కొద్దికొద్దిగా అర్థమైనట్టు అనిపించింది. ఆ ఇమ్మెన్సిటీ, ఆ మహత్త్వం నాలో నిద్రాణంగా ఉండే ఇమ్మెన్సిటీనీ, మహత్త్వాన్ని తట్టిలేపాయనుకుంటాను. అదంతా ఒక ఋభుగీతా పారాయణంలాగా అనిపించింది.
రమణమహర్షి ఋభుగీతను పదేపదే పారాయణం చేయించేవారట. ఋభుగీతలో చెప్పిన విషయానికీ, తన అనుభవాలకీ మధ్య చాలా సాదృశ్యముందని అనేవారట. ఋభుగీతలో ఋభువు నిదాఘుడితో ఇలా అంటున్నాడు:
ఎక్కడ ద్వైతభావముండదో, ఎక్కడ అద్వైతభావముండదో, ఎక్కడ శాంతి, అశాంతి కూడా ఉండవో అటువంటి తన్మయస్థితిలో జీవించు.
ఎక్కడ విజేత లేడో, ఎక్కడ విద్య లేదో, ఎక్కడ స్వపక్షం లేదో, ఎక్కడ విపక్షం లేదో, ఎక్కడ దోషం లేదో, ఎక్కడ నిర్దోషం లేదో అటువంటి తన్మయస్థితిలో జీవించు.
ఎక్కడ కాలమనే భావం లేదో, ఎక్కడ దుఃఖమనే భావం లేదో, ఎక్కడ దేహమనే భావం లేదో అటువంటి తన్మయస్థితిలో జీవించు.
ఎక్కడ నేనులేనో, ఎక్కడ నువ్వులేవో, ఎక్కడ శాశ్వతమైన శాంతిముందో అటువంటి తన్మయస్థితిలో జీవించు.
నాకు మళ్లీ మరొకసారి ఇక్కడికి రావాలనీ, ఒక వెన్నెలరాత్రి ఈ గిరి చుట్టూ ప్రదక్షిణం చేయాలనీ అనిపించింది. బహుశా ఈ అరుణాచలక్షేత్రంలో వెన్నెలరాత్రుల సంతోషాన్ని చూసే మాణిక్యవాచకర్ ‘తిరువాచకం’లో ‘తిరువెంబావై’, ‘తిరుఅమ్మానై’ పాటలు రాసి ఉంటారు. అటువంటి అమృతంకురిసిన రాత్రుల్లో తడిసిన అనుభవంతోటే చలం ‘సుధ’ వర్షించి ఉంటాడు. ఈ అగ్నిపర్వతం ఎదుట ఆ అమృతానుభవం కోసం మళ్లీమళ్లీ ఈ దారిన నడవాలని పదేపదే అనుకున్నాను.
(యాత్రాకాలం 2008, రచన, 2011)
Beholding Arunachala
3
Bhuma Vidya—The Knowledge of the Infinite
By the time we stepped out of the temple, golden sunlight had washed over all of Tiruvannamalai. We walked to an eatery near the temple for breakfast. The piping-hot pongal, served fresh and clean, tasted just like sacred temple prasadam. From there, we drove straight to Sri Ramanasramam.
The ashram was not sprawling; to look at, it was modest in scale. Yet a true ashram ethos blossomed in every corner. Shaded beneath the canopy of towering trees, an extraordinary peace greeted us. In one hall, young students were chanting the Taittiriya Upanishad. Incense smoke from burning benzoin (sambrani) drifted across the space, evoking a deep sense of sanctity. We lingered by the hall for a few moments, then walked onward, taking in every spot sanctified by the Maharshi’s footsteps. Everywhere in the ashram, peacocks roamed. Morning sunlight rested gently upon the rooftops of the ashram shrines. Peacocks strolling along the parapets and roofs lent the setting an exquisite grace and beauty. We visited the Matrubhuteswara shrine and the samadhis consecrated for the cow Lakshmi and several devoted seekers. Right along the perimeter of the ashram lay the base of Mount Arunachala, from where paths wound upward to the caves where Ramana Maharshi had meditated during his earliest days. But pressed for time, we could not climb up and had to turn back.
Browsing through books on the Maharshi at the ashram bookshop, I asked a person there, “Where is Chalam’s ashram located?”
He could not understand my question. It seemed he had never even heard the name of the man I was asking about. I put the same question to another person standing nearby, but he too wore a blank expression. However, a man standing close by scowled and muttered in Telugu, “None of them are here anymore. They sold off everything they had and left.” A Telugu man! From his tone, it was evident that he knew Chalam very well, yet harbored some inexplicable, instinctive animosity toward him. I could not comprehend why people recoiled in agitation at the mere mention of Chalam’s name—not only while he lived, but even now. I wanted to ask him a detail or two, but could not summon the nerve. As we were walking out, the same man called out from behind: “If you go straight ahead and take a slight right, you will see the ashram there.”
We followed his directions and drove forward. We searched every corner for two or three furlongs along the right—scoured the area, in fact—yet no ashram appeared in sight. We began to suspect he had deliberately misled us. We kept asking everyone we met on the road. Someone mentioned that while they knew nothing of the ashram, there were Telugu choultries down a side lane where we might find someone who knew. Walking into those inner lanes, we went looking for the Telugu rest house. At long last, we crossed paths with someone who knew of Chalam’s ashram. He walked back to the main road with us, took us to the very spot the earlier man had indicated, and pointed to a multi-story building. “This is where Chalam’s ashram once stood. But their children sold the land to someone and went away. Now, someone has built this house here,” he said, and walked off.
I stared at that building. How Chalam’s ashram once looked here, and how he lived within it, lay entirely beyond the reach of my imagination. Right there on the roadside, a sadhu bathing by a water post remarked, “Look, this was Chalam’s samadhi. Just recently, the municipality knocked it down to widen the road.” It was a derelict concrete structure. Atop it sat an unlit clay lamp. Moss clung to its weathered concrete walls. A wave of profound sorrow washed over me. It felt as though it would have been far better had this neglected memorial not been here at all.
A few years earlier, across the length and breadth of the Telugu land, a storm of activity had erupted for Chalam’s birth centenary. Everyone clamored loudly, claiming to be his true literary heir. But had a single one among them spared a thought for this samadhi? Perhaps they would argue that Chalam ought to be remembered through his literature, not through a physical memorial. Yet toward the end of his days, Chalam came to view even his own literature as mere transient residue. Set aside the fact that Chalam was a writer. Far above that, he was a seeker, a pursuer of truth, a mystic. What kind of sanctuary should have stood here in reverence to such a soul! I felt this was not a grievance I could share with ordinary writers. Unable to contain what I had witnessed, I immediately telephoned Alla Guruprasada Rao and unburdened my heart.
For anyone who beholds Arunagiri, circumambulating the sacred hill (Giri Pradakshina) is a calling not to be missed. Ramana Maharshi actively encouraged this practice. He often remarked that walking the fourteen-kilometer path around the mountain quieted the agitations of the mind. Many say that performing this pradakshina on full moon nights is an incomparable experience. But because we had to reach Madanapalle by evening, walking the full perimeter on foot was out of the question. We set out to circle the mountain by car instead.
It was a forest touched by spring. All around lay dense, vibrant clumps of pale green trees, creeping vines, and bamboo thickets. Rising above them, in hues of copper, deep azure, and tawny ochre, stood the jagged escarpments of the mountain, massive boulders, and the soaring peak. Wherever the sun broke through, bright white light pooled upon the earth; right beside that radiance lay deep violet shadows. The blue sky seemed to hold a vast umbrella over the holy mountain. Circling the hill, our road moved close to the slopes at times and swung far away at others. As we drove, it felt as though the mountain was drawing us near again and again in an embrace. Moving around that mountain, my mind wandered back to the village of my childhood, the hills of my hometown—our Jhendakonda, Vanakarayi, and the deep, wooded ravines of the Loddu—and the lush green forests that blossomed around them in the month of Vaisakha, dotted with wild white jasmine and fiery red gulmohar blossoms. I remembered my parents, and my boyhood spent clambering up and down those hills. The entire landscape felt intimately familiar, as though wrapped in the warmth of home.The entire landscape felt intimately familiar, as though wrapped in the warmth of home.
In the Chandogya Upanishad, there is a celebrated dialogue between Narada and Sanatkumara, wherein Sanatkumara imparts the sacred instruction on Bhuma Vidya—the Knowledge of the Infinite. Sanatkumara declared: “That which is the Infinite (Bhuma), all-pervading and boundless—that alone is true Joy. There is no joy in the finite and petty.” Circling Arunachala, that teaching of Bhuma Vidya began to dawn on me, step by step. That sheer immensity, that majestic presence, awakened the dormant immensity slumbering within me. The entire journey felt like a living recitation of the Ribhu Gita.
Ramana Maharshi frequently had the Ribhu Gita recited in his presence, often observing that its verses bore an exact resemblance to his own direct experience. In the Ribhu Gita, the sage Ribhu instructs Nidagha:
Dwell in that ecstatic stillness where neither the thought of duality nor the thought of non-duality arises; where neither peace nor restlessness exists.
Dwell in that ecstatic stillness where there is no conqueror and no learning, no partisanship and no adversary, no flaw and no flawlessness.
Dwell in that ecstatic stillness where the very notion of time is absent, where the thought of sorrow is gone, and the identification with the body has ceased.
Dwell in that ecstatic stillness where there is no ‘I’, where there is no ‘you’, and where boundless, eternal peace reigns supreme.
A deep longing arose within me to return here once more, and to walk the pradakshina around this mountain beneath the light of a full moon. It must have been the sublime joy of moonlit nights in Arunachala that inspired Manikkavacakar to compose the hymns of Tiruvempavai and Tiru-ammanai in the Tiruvacakam. It was through an experience drenched in such ambrosial nights that Chalam must have poured forth the nectar of Sudha. I felt an enduring pull to walk this path again and again, yearning for that experience of nectar in the presence of this mountain of fire.
(Journey: 2008; Written: 2011)
7-9-2026


“ఇదిగో, ఇదే చలంగారి సమాధి, ఈ మధ్యే మున్సిపాలిటీవాళ్లు రోడ్డు వెడల్పు చేయడంకోసం దీన్ని కొట్టేశారు’ అన్నాడు. అదొక పాడుబడ్డ సిమెంటు కట్టడం. దానిమీద ఆరిపోయిన ప్రమిద ఒకటి ఉంది. ఆ సిమెంటుగోడలు నాచుపట్టి ఉన్నాయి. నాకు విపరీతమైన దుఃఖం ముంచుకొచ్చింది. ఇక్కడ ఈ సమాధి లేకపోతే బావుండేదనిపించింది.”
అయ్యో!! 😢
తను జీవించి ఉన్నప్పుడే కాక, ఇప్పుడు కూడా చలంగారి పేరు చెప్తేనే మనుషులెందుకు ఇంత ఉలిక్కిపడతారో నాకు అర్థం కాలేదు.
…..
ఈ అగ్నిపర్వతం ఎదుట ఆ అమృతానుభవం కోసం మళ్లీమళ్లీ ఈ దారిన నడవాలని పదేపదే అనుకున్నాను.
తప్పకుండా చూడాలని అనుకున్న ప్రదేశాలలో అరుణాచలం, చలం గారి సమాధి ఉన్నాయి.
హృదయపూర్వక ధన్యవాదాలు సోమశేఖర్!
అసలు సమాధులు కట్టడం ఎందుకు ? అవి ఎవరు నిర్వహిస్తారు ? చలం గారు కూడా తనకు సమాధి కావాలి అని అడిగారా ?ఆయన రచనలు వల్ల సమాజానికి ఏమి ఉపయోగం లేదు అని గ్రహించి రచనలు వదిలివేసి రమణాశ్రమం లో శేష జీవితం గడిపాడు. ఎంతమేరకు ప్రశాంతత సాధించాడో తెలియదు.
అవును. ఇటువంటి ప్రశ్నలు తప్పకుండా ఉదయిస్తాయి. కానీ మనకు ఇష్టమైన వాళ్ళు చాలా ఏళ్లు ఒక చోట జీవించి వెళ్లారు అన్న తర్వాత అక్కడ వారికి సంబంధించిన స్మారకం ఏదో ఒకటి ఉండాలని కోరిక మనలో తప్పకుండా ఉంటుంది. అది సమాధినే కానక్కర్లేదు.