పోస్టు చేసిన ఉత్తరాలు -15

6-11-2023, తెల్లవారు జాము 3.30

ప్రియమైన

కృష్ణపక్షపు తెల్లవారుజామువేళల్లో చెట్టుమీద చిట్టచివరి తేనెపట్టులాగా చంద్రుడు తేనెకారుతూ ఉంటాడు. నా చిన్నప్పుడు మా స్కూల్లో నాలుగింటికి ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసు మొదలయ్యేది. పొద్దున్నే కాంపస్ చుట్టూ నాలుగైదు రౌండ్లు పరుగెత్తించేవారు. ఆ వేళప్పుడు ఏ చిలకలో సగం తినేసిన జామపండులాగా చంద్రుడు ఆకాశంలో వేలాడుతూ కనబడేవాడు. ఆ తీపిదనం రాత్రంతా నింగినుంచి నేలకి ప్రవహించేది కాబోలు, మా స్కూలు ఎదురుగా కొండలమీద చారికలు గట్టి మిలమిల్లాడుతూ ఉండేది. సరిగ్గా ఆ వేళల్లో మా ఊరూ, ఇల్లూ, మా అమ్మా, చెల్లెళ్ళూ గుర్తొచ్చి నాకు కడుపులో మెలితిప్పేసినట్టు ఉండేది. ఆ తేనె నా హృదయంలో పైకి మంటరాని పొగపెట్టేది.

ఏళ్ళమీదట నాకు అర్థమయిందేమంటే, గొప్ప సౌందర్యంతో పాటు గొప్ప వేదన కూడా కలిసే వస్తుందని. అదొక package. ఒకటి మటుకే తీసుకొంటాను, ఒకటి వద్దంటే కుదరదు. రెండూ కలిసే తీసుకోవాలి. అనాదినుంచీ ఇదే కథ. చివరికి పాలసముద్రం మథించినప్పుడు కూడా విషమూ, అమృతమూ కలిసే పుట్టాయన్నసంగతి మనం మర్చిపోలేం.

విషం లేక అమృతం లేదు. ప్రతి అనుభవంలోనూ ముందు పుట్టేది విషమే. లేదూ ముందు మధువు పుడుతుందని అనుకుంటావా, ఆ తర్వాతనైనా విషాన్ని అందుకోడానికి నీ చేతులు సిద్ధంగా ఉంచుకోక తప్పదు. ఒకటి లేకుండా మరొకటి లేదు. అందుకనే వివేకవంతులు ముందు విషాన్నే కోరుకుంటారు.

మనుషులూ, స్నేహాలూ, పరిచయాలూ, ప్రేమలూ కూడా అంతే. నేనొకప్పుడు ఒక కవిత రాసుకున్నాను.

ఈ మనుషులెందుకు నా జీవితంలోకి అడుగుపెడుతున్నారని
చాలాకాలమే చింతించాను, విస్మయం చెందాను,
ఒక్కొక్కప్పుడు వాళ్ళని మెడపట్టుకు
బయటకి తోసేద్దామని కూడా అనుకున్నాను.

మొత్తానికి ఆ కవితలో కలిగిన మెలకువ ఏమిటంటే-

నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా
అడుగుపెట్టే మనుషులు
బహుశా తాళంచెవులగుత్తి లాంటివారని.
ఒక్కొక్క తాళం చెవితో
ఒక్కొక్క గదితలుపు తెరుచుకుంటుందని.

చివరికి చేరుకున్న epiphany ఏమంటే-

ఏమైతేనేం ఎన్ని గదులు తెరుచుకుంటే
నీకు నువ్వంతగా ఎరుకపడతావు.

ప్రతి ప్రేమానుభవమూ ఎంత సంతోషాన్ని తెస్తుందో అంతకన్నా మించిన వేదననీ, దుఃఖాన్నీ మోసుకొస్తుంది. కానీ దానికి పరిష్కారం ప్రేమలు లేని ప్రపంచం కాదు. ప్రతి పరిచయం, స్నేహం ఒక తాళంచెవిలాంటిదే. అది మనలో నిద్రాణంగా ఉన్న దేవతల్నీ, దానవుల్నీ-ఇద్దర్నీ మేల్కొల్పుతుంది. ఆ ప్రేమ ఎంత బలంగా ఉంటే, ఆ దేవదానవులిద్దరూ కూడా అంత ప్రచండంగా ఉంటారు. కానీ, ప్రతి ఒక్క ప్రేమానుభవం ముగిసిపోతూనే నీలోని ఒక దానవుణ్ణి పూర్తిగా నిర్జించి, నీ హృదయంలో ఒక దేవతని ప్రతిష్ఠించి వెళ్ళిపోతుంది. ప్రతి ప్రేమా ఒక మెలకువ. యుగాలుగా నువ్వు మోసుకొస్తూ ఉన్న జన్మజన్మల అంధకారంలోంచి బయటకొచ్చే ఒక ప్రభాతం.

1840-41 లో ఎమర్సన్, మార్గరెట్ ల స్నేహం వాళ్ళిద్దరి జీవితాల్నీ పెద్ద కుదుపు కుదిపిందని రాసాను కదా. ఆ అనుభవాల్లోంచి మార్గరెట్ కి కలిగిన మెలకువ వల్లనే ఆమెకి బీతోవెన్ సంగీతం ఒక్కటే తన ఏకైక స్నేహమనే మెలకువ కలిగింది. అటువంటి సంగీతసన్నిధిలో ఉన్నప్పుడు తనకి ఎవరిపట్లా ఈర్ష్యపుట్టదని రాసుకుంది. ఆమె ఆ ఉత్తరం 1843 లో రాసుకుంది. ఆమె అప్పటికింకా బోస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్ళలేదు. కానీ ఆ మెలకువ లభించింది కాబట్టే, ఆమె తన తర్వాతి అనుభవాల్ని ధైర్యంగా స్వీకరించగలిగింది.

అటువంటి మెలకువ ఎమర్సన్ కి మరికొంత ముందే కలిగింది. ఆయన తీవ్రంగా ఆలోచించాడు, ఈ స్నేహమంటే ఏమిటి? ఈ ప్రేమంటే ఏమిటి? నిజమైన స్నేహితులు ఒకరినుంచి మరొకరు పొందేదేమిటి? ఇవ్వవలసినదేమిటి? అసలు మన రోజువారీ జీవితానికి స్నేహాలతో పనేమిటి? ఈ ఆలోచనల్లోంచి ఆయన Friendship అని ఒక వ్యాసం రాసాడు. వరదలు ప్రవహించిపోయిన తరువాత, శరత్కాలంలో నదుల్లో కనవచ్చే తేటదనం ఆ వ్యాసంలో ప్రతి ఒక్క వాక్యంలోనూ కనిపిస్తుంది.

ఆ వ్యాసం నెట్ లో ఉంది, చదువు అని ఇంతకు ముందు రాసాను. తప్పకుండా చదువు. కానీ ఎమర్సన్-మార్గరెట్ ల మధ్య వికసించిన స్నేహం గురించిన ఈ నా తలపుల్ని ఆ వ్యాసంలోని కొన్ని వాక్యాలతో ముగించాలని ఉంది.

ఆ వ్యాసంలో ఎమర్సన్ Platonist గా కాదు, Platoగానే కనిపిస్తాడు. ఆ వ్యాసాన్ని పందొమ్మిదో శతాబ్ది Symposium అనవచ్చు. కానీ ఈ గోష్ఠిలో సంభాషణ మొత్తం ఎమర్సన్ తన అంతరంగంతో చేసుకున్న సంభాషణ. దాదాపుగా సంగీతంగా మారిపోయిన వివేకస్రవంతి. ఆ మధ్యమధ్యలో ఆయన చేరుకున్న peaks of truth ని చేరుకోడానికి మనల్ని కూడా పైకి లేపుతాడు. అలాంటి కొన్ని వాక్యాలు చూద్దాం.

మామూలుగా మనలో కదిలే భావసంచలనం స్నేహాలవల్లనే వ్యక్తీకరణకు నోచుకుంటుంది అని చెప్తూ ఇలా అంటున్నాడు.

స్నేహం ఒక భరోసా. అందుకని ఇలా అంటున్నాడు:

ప్రేమకీ,స్నేహానికీ ఏమి కావాలి?

స్నేహాల్లోనూ, ప్రేమల్లోనూ ఉండే గొప్ప సంతోషమేమిటంటే, అక్కడ మాత్రమే మనం మనలా ఉండగలం. ఈ వాక్యాలు చూడు:

కానీ స్నేహాలు నిలబడాలంటే మనం వాటిలో కోల్పోడానికి అర్రులు చాచకూడదు. తన స్నేహితుణ్ణో, స్నేహితురాల్నో కబళించాలని చూసేది స్నేహం కాదు, అజగరం. ఆ మెలకువలోంచి ఇలా రాస్తున్నాడు:

ఇక్కడే గొప్ప వాక్యమొకటి రాసాడు.

‘The condition which high friendship demands is ability to do without it.’

గొప్ప స్నేహానికి ఉన్న షరతు ఏమిటంటే, అది లేకపోయినా కూడా మనం మనగలగడం.
చూడు, మన చిన్నప్పటి స్నేహితులు. అంటే మన ఊళ్ళోనో, హైస్కూల్లోనో మన మిత్రులయినవాళ్ళు. ఆ తర్వాత మనమెప్పుడూ కలుసుకోకపోయినా, మాట్లాడుకోకపోయినా, దశాబ్దాల తర్వాత కలుసుకున్నారనుకో, ఆ చిన్నప్పటి ఆ ఆత్మీయత, ఆ అనుబంధం లేశమాత్రం కూడా చెక్కుచెదరలేదని గుర్తుపడతాం. ఎందుకంటే, వాళ్ళు మన రోజువారీ జీవితంలోలేకపోయినా మనం బతగ్గలమనే భరోసా ఇచ్చిన స్నేహాలవి.

కవులు పెద్దయ్యాక పరిచయమైన బాల్యస్నేహితులని ఒక కవి అన్నాడు. నేనీ మాట స్నేహితులకి కూడా చెప్తాను. మనం పెద్దయ్యాక మన స్నేహితుల్లో వెతుక్కునేది ఆ బాల్యకాల స్నేహాల్నే. కాని వాటినుంచి సంతోషం పొందడానికి ముందు, వాటినెంతో విలువైనవిగా భావించాలని ఎమర్సన్ పదే పదే చెప్తున్నాడు. ఈ వాక్యాలు చూడు:

మరొక గొప్ప వాక్యం:

నువ్వొకరినుంచి స్నేహాన్ని కోరుకుంటున్నావంటే, అతడో ఆమెనో నీకు మొత్తం ప్రపంచం కావాలి. వాళ్ళని కావిలించుకున్నాక మళ్ళా వాళ్ళ భుజాలమీంచి ప్రపంచం కేసి చూడటం మానెయ్యాలి. ఈ మాటలు చూడు:

తక్కిన ప్రపంచాన్ని మర్చిపోగలిగేట్టు చేసే శక్తి ప్రతి ఒక్క స్నేహానికీ, ప్రేమకీ ఉండకపోవచ్చు. చాలా స్నేహాలూ, ప్రేమలూ చివరిదాకా కొనసాగకపోవచ్చు, మధ్యలోనే అదృశ్యమైపోవచ్చు. కానీ ఆ స్నేహం సంభవించిననాటికి-

స్నేహాలూ, ప్రేమలూ ధవళవస్త్రాల్లాంటివి. తొందరగా మాసిపోతాయి. కాబట్టి-

ఇంత తేటతెల్లంగా ఉన్న ఆలోచనల్లో ఒక mystic మాత్రమే చెప్పగల ఈ వాక్యం కూడా రాసాడు:

‘We talk of choosing our friends, but friends are self-elected.’

ఉపనిషద్వాక్యం లాంటి ఈ మాటల్లో ఉన్నదేమిటంటే, స్నేహితులు మనం వెతుక్కుంటే దొరికేవాళ్ళు కారు. వాళ్ళు మన జీవితంలోకి మన ప్రమేయం లేకుండానే వస్తారు. కాని అలా వచ్చిన తరువాత ఆ స్నేహాల్ని నిలుపుకోడం మాత్రం పూర్తిగా మనచేతుల్లోనే ఉంది. అలా నిలుపుకోగలగడమే ప్రేమవిద్య. ప్రతి స్నేహానికీ ముందొక probationary period ఉంటుంది. కానీ ప్రేమలో పడగానే ముందు మనం ఆ ట్రయినింగు ఎగ్గొట్టి నేరుగా విహారయాత్రలు మొదలుపెడతాం. కానీ నీకు లభించిన ఆ ప్రేమకి నువ్వు యోగ్యుడు కావడానికి సాధన చెయ్యాలి. ఒకరోజో, ఒక ఏడాదో కాదు, ప్రతి రోజూ చెయ్యాలి. ఒక రోజు సాధనతో మరొక రోజు స్నేహం నిలబడుతుంది. ఆ మరొకరోజు స్నేహం ఆ తర్వాతి రోజు సాధనకి శక్తినిస్తుంది. స్నేహమంటే, ఎప్పటికప్పుడు నివురులూదుకోవలసిన నిప్పు.

అలాంటి స్నేహం వల్ల నీకు ఒరిగేదేమిటి? ఏమీ ఉండదు, ఉండనక్కర్లేదు కూడా. చూడు, ఏమంటున్నాడో-

అటువంటి స్నేహం వల్ల జరిగేదేమంటే-

ఇదీ ఎమర్సన్ తన జీవితంలో, తన ప్రమేయం లేకుండా అడుగుపెట్టిన స్నేహితురాలి ద్వారా తెలుసుకున్నదీ, నేర్చుకున్నదీను. అందుకు బదులుగా అతడు ఆమెకి ఏమివ్వగలిగాడు? ఈ ప్రశ్న కూడా తనకి తనే వేసుకుని, ఇలా జవాబిచ్చుకున్నాడు:

ఇద్దరు మనుషుల మధ్య వికసించిన ప్రేమ వాళ్ళదగ్గరే ఆగిపోదు. అది ఎన్నో ఏళ్ళ తరువాత కూడా ఎన్నో సముద్రాల ఆవల కూడా, ఇదుగో, నీ ఇంటిదాకా, నా ఇంటిదాకా కూడా ప్రవహించగలదు.

ఇంకా చాలా రాయాలని ఉంది. కాని ఇక్కడ ఆగుతాను. మళ్ళా రాస్తాను, రేపు కాదు, కొన్నాళ్ళు గడిచాక.

6-11-2023

9 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు -15”

  1. మాట రాని మౌనమిది
    మౌన వీణ గానమిది
    ……………………..
    మీ వ్యాసం చదివాక
    నా పరిస్థితి ఇది!
    ధన్యవాదాలండీ

  2. “స్నేహం సదా జాగరూకంగా,నవనవోన్మేషంగా ఉండాలి!అది మన గానుగెద్దు జీవితంలో తర్కాన్ని లయని తేగలగాలి!”👌👌👌

  3. స్నేహమనే గొప్పస్థితికి రెండు గంభీరమైన,సమున్నతమైన పార్శ్వాలు అవసరం.అవి రెండూ ఒక్కటవటానికి ముందు రెండుగా వుండటం చాలా ముఖ్యం!

    మొత్తం సారాంశమంతా ఈ మాటలోనే ఉన్నట్టుగా వుంది సర్.

  4. ఉదయాన్నే మిమ్మల్ని చదవకపోతే రోజంతా ఏదో వెలితి వెంటాడుతుంది ఇక ఈ అమూల్యాన్ని తెలుగులో అందించినందుకు మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

Leave a Reply

%d