
5-11-2023 అర్థరాత్రి 12.30
ప్రియమైన
ఇప్పుడే ఒక మిత్రగోష్ఠినుంచి వచ్చాను. బాగా అలసటగా ఉంది. కళ్ళుమూతలు పడుతున్నాయి. కాని ఇప్పుడు నీకు ఉత్తరం రాయకపోతే పొద్దున్నే నీకు అందదు. నువ్వు ఈ ఉత్తరంకోసం ఎదురుచూస్తుంటావని గుర్తుకు రాగానే వేళ్ళల్లోకి ఓపిక వచ్చింది. సరిగ్గ ఇలాంటి వేళల్లో రాసే ఉత్తరాలే నిజమైన ఉత్తరాలు. ఎమర్సన్ ఒక ఉత్తరంలో yet nature rarely say her best words to us out of serene and splendid weather అని రాస్తే నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇది నా అనుభవం కూడా. పండువెన్నెల కాస్తున్నప్పుడో, బయట వానజల్లు పడుతున్నప్పుడో కవిత్వం వస్తుందనుకుంటాంగాని, ముందు నిద్రొస్తుంది. ఆయనే అన్నట్టుగా సంధ్యవేళ, అర్థరాత్రి, ఎముకలు కొరికే శీతాకాలం, తుపాను కమ్మినప్పుడు- అట్లాంటి వేళల్లో నిద్ర రాదు, కవిత్వం వస్తుంది. చాలాసార్లు చూసాను, తెల్లవారగానే, ముందు ఏ పనీ చెయ్యకుండా రాయడానికి కూచుంటేనే నాలుగు వాక్యాలు స్ఫురిస్తాయి. అలాకాక నెమ్మదిగా తయారయ్యాక, ప్రశాంతంగా రాద్దామనుకుంటే, తీరా కూచున్నాక ఏం రాయాలో తోచనేతోచదు.
సరే, ఫుల్లర్ జీవితకథలో ఇంకా కొంత కథమిగిలి ఉంది, అది చెప్పడానికే ఇప్పుడు కూచుని ఈ నాలుగు వాక్యాలూ రాస్తున్నాను. ఆమె 1842-44 మధ్యకాలంలో మిత్రుల్తో కలిసి అమెరికా పర్యటించింది. ఆ ప్రయాణంలో భాగంగా స్థానిక ఇండియన్ తెగల్ని కూడా దగ్గరగా చూసింది. ఆ అనుభవాల్ని Summer on the Lakes (1843) అని పుస్తకం వెలువరించింది. ఆ పుస్తకం చదివి న్యూయార్క్ ట్రిబ్యూన్ ఎడిటర్ ఆమెని వచ్చి తన పత్రికలో చేరమన్నాడు. అప్పటికి రెండేళ్ళుగా ఆమె Dial పత్రికలో పనిచేస్తున్నా జీతభత్యాలు లేవు. మొదట్లో ఎమర్సన్ తో పాటు తక్కిన మిత్రులు కూడా ఆమెని న్యూయార్క్ వెళ్లొద్దన్నారు. కాని ఆమె కి ఎక్కడో ఆ వాతావరణం నుంచి బయటపడాలనే కోరిక కూడా బలపడుతూ ఉంది. చివరికి ఆమె న్యూయార్క్ వెళ్ళిపోయింది. ఆ విధంగా 1836 లో మొదలైన ఎమర్సన్ సాన్నిహిత్యం 1844 లో ముగిసిపోయింది. ఆ తర్వాత కూడా వాళ్ళ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడిచేయిగానీ, అవి తననుంచి ఏదీ ఆశించని ఒక శ్రేయోభిలాషికీ, అతని మిత్రురాలికీ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు మాత్రమే.
న్యూయార్క్ వెళ్ళినతరువాత, పూర్తికాలపు పాత్రికేయురాలిగా మారాక ఆమెలోని సాహిత్యవేత్త నెమ్మదిగా పక్కకి తప్పుకుని సంఘసంస్కర్త బలపడటం మొదలయ్యింది. పత్రిక తరఫున ఆమె అమెరికాలోని చీకటికోణాల్ని, అంతదాకా ఎవరూ చూడటానికీ, మాట్లాడటానికీ ఇష్టపడని కోణాలు చూసింది. బానిసలు, వేశ్యలు, ఖైదీలు, కార్మికులు-అణగారిన సమూహాల్ని చూసింది, కలుసుకుంది, మాట్లాడింది, వాళ్ళ హక్కుల గురించి ప్రపంచాన్ని జాగృతం చెయ్యడం మొదలుపెట్టింది. కంకార్డ్ లో ఎమర్సన్ చుట్టూ ఉంటే ట్రాన్సండెంటల్ సమాజం వ్యక్తి సంస్కరణ గురించీ, వ్యక్తుల ఆత్మనిర్భరత గురించీ ఆలోచిస్తుంటే, ఆమె వ్యక్తుల్ని దాటిన విస్తృత సమాజాన్ని సంస్కరించడం గురించీ, బలహీనుల, నిర్భాగ్యుల జీవితాల్లో వెలుగు తేవడం గురించీ మాట్లాడటం మొదలుపెట్టింది. అనతికాలంలోనే ఆమె పేరు అమెరికా అంతా మార్మ్రోగిపోయింది.
ఆ రోజుల్లో ఆమె ఒక జర్మన్ తో ప్రేమలో పడింది. జొనాథన్ అనే ఆ జర్మన్ రచయిత ఆమె ద్వారా ట్రిబ్యూన్ లో తన రచనలు ప్రచురితమవుతాయన్న ఆశతోనే ఆమెతో స్నేహం చేసాడు. ఆమె అతణ్ణి చాలా నమ్మింది, ఆ స్నేహాన్ని నలుగురినుంచీ దాచింది. కానీ అతడు ఆమెని మోసం చేసి యూరోపు వెళ్ళిపోయాడు.
1846 లో ట్రిబ్యూన్ పత్రిక ఆమెని తన కరస్పాండెంట్ గా యూరోప్ పంపించింది. యూరోప్ ఆమె మనోప్రపంచం. ఆమె చిన్నప్పణ్ణుంచీ చదువుకున్న సాహిత్యప్రపంచం. పదేళ్ళ కింద చేతులదాకా వచ్చి జారిపోయిన ప్రయాణ అవకాశం ఈ సారి ఒక పత్రిక తరఫున లభించింది. ఆమె ఎంతో ఉత్సాహంతో యూరోప్ లో అడుగుపెట్టింది. ముందు ఇంగ్లాండ్ వెళ్ళింది. అక్కడ వర్డ్స్ వర్త్ నీ, కార్లైల్ నీ కలుసుకుంది. ఆ తర్వాత సుప్రసిద్ధ ఫ్రెంచి రచయిత్రి, పందొమ్మిదో శతాబ్దపు రచయిత్రులకి గొప్ప స్ఫూర్తి చిహ్నం అని చెప్పదగ్గ జార్జి శాండ్ ని కలుసుకుంది. ఇంగ్లాండ్ లోనే ఎలిజబెత్ బ్రౌనింగ్ ని కూడా కలవాలనుకుందిగాని, ఆమె అప్పటికే రాబర్ట్ బ్రౌనింగ్ తో ప్రేమలో పడి దేశం విడిచి వెళ్ళిపోయింది. అవి ఇటలీ జాతీయోద్యమం నడుస్తున్న రోజులు. ఇటాలియన్ స్వాతంత్య్రపోరాట వీరుడు మాజినీని కూడా ఆమె ఇంగ్లాండులో కలుసుకుంది.
అక్కణ్ణుంచి 1847 చివరలో ఇటలీ చేరుకుంది. రోమ్ లో అడుగుపెట్టింది. ఆ నగరం తన మానసిక స్వదేశం. తన బాల్యంలో కలలుగన్న దేశం. కాని ఆ కాలమంతా ఆస్ట్రియా సామ్రాజ్యానికి తొత్తుగా మారిపోయిన పోప్ కీ, రోమన్ రిపబ్లికన్ ఆర్మీ కీ మధ్య భీకరమైన పోరాటం జరుగుతున్న రోజులు. అటువంటి పోరాటం గురించిన వార్తల్ని ట్రిబ్యూన్ కి పంపడానికి అక్కడ వార్ కరెస్పాండెంట్ గా పనిమొదలుపెట్టింది. అటువంటి రోజుల్లో ఒకరోజు ఒక కెతడ్రల్లో దారితప్పినప్పుడు ఒక ఇటాలియన్ యువకుడు, ఆమె కన్నా వయసులో చిన్నవాడు ఆమెకి దారి చూపించాడు. తన ఇంటికి తీసుకువెళ్ళి ఆశ్రయమిచ్చాడు. మార్గరెట్ చదువుకున్న చదువుతో పోలిస్తే ఆ పిల్లవాడు unlettered. కానీ అతడు విప్లవోద్యమంలో ముందుండి పోరాడుతున్న వీరుడు. ఆమె అతనితో ప్రేమలో పడింది. మొదటిసారిగా ఆమె తన మనసుతో పాటు దేహాన్ని కూడా అతడికి అర్పించింది. వాళ్ళిద్దరి మధ్యా ఆధికారికంగా పెళ్ళి జరిగిందో లేదో తెలియదుగానీ, ఆమె గర్భం దాల్చింది.
కాని ఆమె భర్త నిరుపేద. అతడి తల్లిదండ్రులు పోప్ వైపు ఉన్నారు. అతడేమో రిపబ్లికన్ ఆర్మీ వైపు ఉన్నాడు. వాళ్ళకి కనీసావసరాలు తీరడం కూడా కష్టంగా ఉండేది. అసలు అటువంటి పరిస్థితిలో బిడ్డకి జన్మనివ్వగలదా, తాను బతికి బట్టకట్టగలదా అనుకుందామె. కాని పిల్లవాడు పుట్టాడు. వాడికి తాపడానికి తల్లికి పాలులేవు. మరోవైపు చుట్టూ తుపాకుల మోత, నిప్పుల వర్షం. ఆ పిల్లవాణ్ణి రోమ్ కి దూరంగా ఒక దాదికి అప్పగించారు. ఆ దాది ఆ పిల్లవాణ్ణి సరిగ్గా చూడలేదు. ఇంకోవైపు రిపబ్లికన్ ఆర్మీ ఓటమి వెనక ఓటమి చవిచూస్తూ ఉంది. మార్గరెట్ కి అమెరికా వెళ్ళిపోవడం తప్ప మరో గత్యంతరం లేదనిపించింది. మొదట్లో చాలారోజులు న్యూ ఇంగ్లాండ్ సమాజం తన గురించి ఏమనుకుంటుందో అని సంకోచించింది. కానీ పరిస్థితులు రోజురోజుకీ గడ్డుగా మారుతుండటంతో, ఇక సాహసించి, అమెరికా తిరిగివెళ్ళిపోడానికే నిశ్చయించుకుంది. కానీ స్టీమరుమీదనో, లేదా ప్రయాణనౌకమీదనో ముగ్గురికి టిక్కెట్టు కొనుక్కునే పరిస్థితి లేదు. అందుకని సరుకులు మోసుకుపోయే ఒక సాధారణ నౌకలో చౌకగా టిక్కెట్టు కొనుక్కుని ఎక్కింది. అంటే ఒక సరుకులు లారీ ఎక్కినట్టు లేదా ఒక గూడ్స్ రైలు ఎక్కినట్టు. ఆ ఓడ మార్గమధ్యంలో ఉండగానే కెప్టెన్ మరణించాడు. అతడి స్థానంలో బాధ్యతలు తీసుకున్నవాడికి అనుభవం లేదు. దాంతో ఓడ దాదాపుగా అమెరికా తీరాన్ని తాకుతుండగానే ముక్కలైపోయింది. మార్గరెట్, ఆమె భర్తా, ఆమె బిడ్డా ముగ్గురూ సముద్రంలో ములిగిపోయారు. ఎంత గాలించినా ఆమె దేహం దొరకనే లేదు.
ఆమె ఇటలీలో ఉండగా ఇటాలియన్ స్వాతంత్య్రపోరాటం మీద ఒక పుస్తకం రాయడం మొదలుపెట్టింది. ఆ పుస్తకంతో పాటు ఆమె రచనలూ, కాగితాలూ, ఇంకేమైనా దొరుకుతాయేమో చూడమని ఎమర్సన్ థోరోని పంపించాడు. కాని, లేదు, ఆమెవనే ఏ గుర్తులూ అమెరికాకి తిరిగి రానేలేదు.
‘నేనొక గొప్ప ఆత్మని, నేను వచ్చినచోటుకి తిరిగిపోయేలోపు మీ అందర్నీ చూడ్డానికి వచ్చాను’ అని ఎమర్సన్ కి ఉత్తరంలో రాసినట్టే, ఆమె తాను చిన్నప్పుడు తన ఇంట్లో గదిలో లాటిన్ సాహిత్యం చదువుకుంటూ ఏ రోమ్ గురించి కలలుగన్నదో చివరికి ఆ రోమ్ తీరానికే వెళ్ళిపోయింది.
నలభయ్యేళ్ళు నిండాకుండానే ముగిసిపోయిన మార్గరెట్ ఫుల్లర్ జీవితంలో సాహిత్యమూ, సంఘసంస్కరణా, ఉద్యమాలూ, యుద్ధమూ, స్నేహితులూ, సంభాషణలూ కిక్కిరిసిపోయినట్టు కనిపిస్తున్నా, నిజానికి ఆమె జీవితమంతా చెప్పలేని శూన్యం పరుచుకుని ఉందనే మనకి అర్థమవుతూ ఉంది. ఆమెకి దేవుడు అపారమైన జీవశక్తిని, అద్భుతమైన ప్రతిభని ఇచ్చాడు. కాని ఆమె జీవితంలో తారసపడ్డ ఏ ఒక్క మిత్రుడుగానీ, మిత్రురాలుగానీ ఆ ఉత్సాహాన్నీ, ఉద్వేగాన్నీ నిభాయించుకోలేకపోయారు. కాబట్టే, ఆరు సంపుటాల ఉత్తరాలు రాసినతర్వాత కూడా, ఆమె రాయకుండానే మరికొన్ని వందల ఉత్తరాల్ని తన మనసులోనే దిగమిగుకుందని అనిపిస్తుంది.
1838 లోనే, అంటే, ఎమర్సన్ తో పరిచయం ఇంకా స్నేహంగా కూడా మారకముందే, ఒక ఉత్తరంలో ఆమె ఏం రాస్తున్నదో చూడు:
‘నేను చదివిన పుస్తకాల గురించి అపరిమితమైన ఉత్సాహంతో ఎన్నో ఉత్తరాలు జెల్టర్ రాసినట్టుగా నేను నీకు మనసులోనే రాసుకుంటూ ఉన్నాను. నేను చూసిన దృశ్యాల గురించి, కలుసుకున్న స్త్రీపురుషుల గురించి, ప్రతి ఒక్కరిగురించీ ఏదేదో చెప్పాలని అనుకుంటూనే ఉన్నాను. కానీ ఏ ఒక్కటీ కాగితం మీద పెట్టనేలేదు. ఎందుకంటే, తీరా నేను ఆ ఉత్తరాలు రాసినా, నువ్వేమో చాలా పెద్దమనిషివి, నీ పనుల్లో కూరుకుపోయి ఉంటావు, నేనో నిరుపేదని, నీకు రాయడానికి కూడా అర్హతలేని దాన్ని.’
ఇక్కడ జెల్టర్ అంటే ఒక జర్మన్ సంగీతవేత్త. ఆయనకీ గొథే కీ మధ్య సంగీతం గురించి గొప్ప ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. ఎమర్సన్ పరిచయమైనప్పుడే మార్గరెట్ తనని జెల్టర్ గానూ, ఎమర్సన్ ని గొథే గానూ ఊహించుకుంటూ ఉన్నదన్నమాట.
కాని ఎంత చెప్పినా ఒక ప్రేమైక జీవికి తనతో సమానమైన ప్రేమైకజీవి మరొకరు దొరకడం అసాధ్యం. అందులోనూ ఆ ప్రేమికుడో, ప్రేమికురాలో ప్రతిభావంతులైతే మరింత దుస్సాధ్యం. ఎందుకంటే మనసు కలిసిన చోట, ప్రతిభ కలవదు. ప్రతిభ కలిసిన చోట మనసు దొరకదు. ఏ విధంగా చూసినా మార్గరెట్ మానసిక స్థాయికి తగినవాడు ఎమర్సన్ మాత్రమే. కాని అతడు ప్రతి అనుబంధమూ ఒక స్థాయిదాటితే కారాగారంగా మారుతుందనుకునేవాడు. ఆమెతో బతుకునీ, మరణాన్నీ కూడా పంచుకున్న ఇటాలియన్ యువకుడికి ప్రేమించడం తెలుసు, కానీ ఆమెతో లాటిన్ సాహిత్యం గురించీ, డాంటే గురించీ మాట్లాడలేడు. గుర్తుందా, ఇది సరిగ్గా ఎమిలీ డికిన్ సన్ చూసిన ఒంటరితనమే. అందుకని ఎమిలీ లాగే మార్గరెట్ కూడా ఒక master కి ఉత్తరం రాసుకుంది. కాని 1843 లో ఆమె ఆ ఉత్తరం రాసుకునేటప్పటికి ఆ master ఈ లోకంలో లేడు.
ఆయన బీతోవెన్.
బోస్టన్లో ఒక రాత్రి ఒక సంగీత కచేరీనుంచి తిరిగివచ్చాక ఆమె బీతోవెన్ కి ఈ ఉత్తరం రాసుకుంది.
నాకున్న ఒకే ఒక్క స్నేహితుడా,
వేదనతో కూడుకున్న నా తంద్రాలసత సంకెళ్ళు మరోసారి తెంపినందుకు నేను నీకెలా కృతజ్ఞతలు చెప్పగలను? నా గుండె కొట్టుకుంటూ ఉంది. నాకు మళ్ళా ప్రాణం లేచొచ్చింది. ఇప్పుడు నేను నీకు తగిన శ్రోతని కాగలననిపిస్తోంది. నా అస్తిత్వం నీకు తగ్గట్టుగా సిద్ధమవుతున్నది. బీతోవెన్, నేను నీలాంటిదాన్నే అయినప్పటికీ నీకులాగా సంగీతంలోకి నేను నా ఆత్మని ప్రవహింపచెయ్యలేను. నేనిలా అంటున్నానంటే హద్దుమీరుతున్నానని అని అనుకోవద్దు. కాని ఈ భూమ్మీద సృష్ట్యాదిగా ఇప్పటిదాకా నన్ను స్వాగతించగల మనిషివి నువ్వొక్కడివే అన్నది మాత్రం నాకు బాగా తెలుసు.
మాష్టర్! నాకు ఎంత ప్రాప్తమో నాకిప్పటికీ తెలిసిరాలేదు. అందుకు క్షమించు. ఎటువైపు చూసినా నా ప్రేమకి తిరస్కారాలూ, నిరాదరణలే మిగుల్తున్నాయి. తిరస్కృతప్రేమ దంష్ట్రల గాట్లు నన్ను ఛిద్రం చేస్తూనే ఉన్నాయి. నీ జీవితంలోనూ నీకు దక్కిందిదే. కానీ ఈ గాయాల్లోంచే నువ్వు గొప్ప ప్రతిభావంతుడిగా మారేవు. అది నాకెందుకు చాతకావడం లేదు? నేనొక ఆడదాన్నయినందువల్లనా, నా ఆత్మను వ్యక్తీకరించుకోడానికి నా దేహం సహకరించకపోవడం వల్లనా? అప్పుడప్పుడు జాబిల్లి కూడా క్రీగంట నన్ను చూస్తూ ఇదే వేళాకోళమాడుతున్నదా అనిపిస్తుంది: చూడు, సూర్యుడు లేకపోతే నేను కూడా వెన్నెల కాయలేను కదా అని అంటున్నదా అనిపిస్తుంది. శీతల, నిర్జల చంద్రిక కూడా ఏదో వేరే కథ చెప్తున్నది!
కాని ఓ ధన్యాత్మా! నువ్వు నా ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పావు. అది నా భాగ్యం. ఒక ఋషిపత్నిలాగా లేదా కవీశ్వరుడి భార్యలాగా నిన్ను అర్థం చేసుకోగలగడం నా విజయం. ఒక యజమానిలాగా నేను నిన్ను ఆదేశించగలను. ఒక కూతురులాగా నీ గాయాలకు మృదువుగా కట్టు కట్టగలను. నా దృష్టిలో నిన్ను వేరెవ్వరితోనూ పోల్చలేను. నేను కోరుకునే సమస్తం నువ్వే. ఒక సాధుహృదయంలోని దివ్యమాధుర్యంగానీ, ఒక అమరవీరుడిలోని వైభవంగానీ లేదా బహుముఖప్రజ్ఞాశాలి రాఫేల్ గాని, బంగారు ప్లేటోగాని, నా దృష్టిలో, నీముందు నిలబడలేరు. అపారప్రజ్ఞాశాలి షేక్ స్పియర్ గానీ, గంభీరుడైన మైకెలాంజిలోగాని, నీ తిక్తమాధుర్యాన్ని ఎంతో కొంత అందుకున్న డాంటేగాని, నీ ముందు, నాకంటికి ఆనడం లేదు. నీ పారదర్శక కాంతిమండలంలో వీళ్ళేకాదు, మరెవ్వరూ కూడా కనిపించడంలేదు. వాళ్ళందరూ నీలోనే ఉన్నారు. ఆ జీవనోధృతితో పాటు, వాళ్లు కేవలం స్వప్నంలో మాత్రమే దర్శించగల ఆ రెక్కలు కూడా నీవే.
నువ్వు నన్ను అమాంతం నీలోకి తీసేసుకోగలిగితే-! నేనీ ప్రపంచంలో ఎక్కడో తప్పిపోయాను. ఇక్కడ కొందరు దేవదూతల్ని నేను చూడకపోలేదు, కానీ వారివీ నావీ గ్రహాలు వేరే, నక్షత్రాలు వేరే. నాకు తెలుసు నీ పరిస్థితి కూడా ఇలాంటిదే, నీ ఆత్మకూడా ఎన్నో తలుపులు తట్టకపోలేదని నాకు తెలుసు, కానీ నువ్వు జయించావు, వారందరినీ నీ దారికి తెచ్చుకోగలిగావు.
మాష్టర్! ఈ వేసవిలో చిటారుకొమ్మన గూడుకట్టుకున్న భరద్వాజపక్షిని చూసి నేను చాలా ఈర్ష్యపడ్డాను. ఒక విత్తనంగా మారిపోయిన అతి చిన్న గడ్డిపువ్వుని చూసి కూడా అసూయచెందాను. ఆ విత్తనాలు గాలికి కొట్టుకుపోయాయని తెలిసి కూడా. కానీ, నేన్నీదగ్గర ఉన్నప్పుడు మాత్రం నాకెవరి పట్లా అసూయ పుట్టనే పుట్టదు.
నీ హృదయం ప్రేమతో పొంగిపోయేకొద్దీ నువ్వు నీ ఆర్తిని పంచుకోడానికి ఇలా మాస్టర్స్ కి ఉత్తరాలు రాసుకోడం తప్ప మరో దారిలేదు. ఈ సంగతి అందరికన్నా ఎక్కువగా మన భక్తికవులకు తెలుసనుకుంటాను, అందుకే, అంత ప్రేమ, అంత ఆర్తి, అంత సంపూర్ణ సమర్పణ వాళ్ళ గీతాల్లో.
5-11-2023
ఈ రోజు వేళకి ఉత్తరం రాకపోతే ఆమె గురించీ, మీ గురించీ కూడా బెంగ పడే దాన్ని. రాసినందుకు ❤️
భారంగా అయిపోయిన మనసు ఆ చివరి ఉత్తరానికి మందు రాసినట్టు కుదురుకుంది. Thank you very very much. ❤️
ధన్యవాదాలు మానసా !
అర్ధాంతరంగా ఆగిన మార్గరెట్ జీవితం చాలా బాధ కలిగించింది. ఆమె జీవించిన కాలంలో అంత గొప్ప చదువులు చదవడమే కాక ఎన్నో reforms కి కారణమవ్వడం truly inspiring.
బీతొవెన్ కి రాసుకున్న ఉత్తరంలో ఆయన నుండి ప్రేరణ పొంది she found her peace అనిపించినప్పుడు ఒక ఊరట కలిగింది.
What a woman! What a life!! 🙇♀️
Thank you for your letters, sir. 🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
నేను పరుగెడితే నిలిపి వేస్తూ
నేను నిలిచిపోతే పరుగెత్తిస్తు
ఇలా నన్ను వాత్సల్యం తో జాగృతం చేసే ప్రేమైక వాక్యం మీరు 💐♥️