పోస్టు చేసిన ఉత్తరాలు-12

3-11-2023, తెల్లవారు జాము 3.15

ప్రియమైన

నిన్న సాయంకాలం చిలుకూరు వెళ్ళి సిటీ బస్సులో వస్తూండగా ఎక్కణ్ణుంచో సప్తపర్ణిపూల తీపిగాలి నన్ను తాకుతూ ఉంది. శరత్కాలం ఈ గాలిలో కూడా నాకు ఉత్తరాలు రాసి పంపిస్తుందని గుర్తొచ్చింది. ఎప్పటివో ఎక్కడివో జ్ఞాపకాలు అలలు అలలుగా నా చుట్టూ ఎగిసి పడ్డాయి. మేమున్న చోటకి దగ్గరలో ఒక గార్డెన్ ఉంది. చాలా ఏళ్ళపాటు సాయంకాలం పూట అక్కడ నడుస్తూ ఉండేవాళ్ళం. ఇప్పణ్ణుంచి డిసెంబరుదాకా ఆ తోటలో సప్తపర్ణివృక్షాల నీడలో నడిచిన రోజులూ, అప్పటి ప్రేమలూ, వేదనలూ అన్నీ గుర్తొచ్చాయి. చెట్టు తన బెరడులో ఏళ్ళు గడిచిన గుర్తులు రాసుకున్నట్టే పూలతావి కూడా ఏళ్ళ తరబడి మనం నడిచి వచ్చిన దారుల్నీ, దాటివచ్చిన ప్రేమల్నీ రాసిపెడుతుందనుకుంటాను.

ఇద్దరు మనుషుల మధ్య ఆసక్తి ఎట్లానేనా మొదలవ్వొచ్చుగానీ, వాళ్ళు పంచుకునేవాటన్నిటిలోనూ, సుందరస్థలాలూ, సంగీతమూ, సాహిత్యమూ ఉంటే మాత్రం ఆ పరిచయాలో, స్నేహాలో, ప్రేమలో వాళ్ళలోపలకీ ఇంకిపోతాయి. అందుకనే ఒక రచయిత్రి, ప్రేమ అంటే ఇద్దరి మధ్య ఒక అయస్కాంతక్షేత్రం ఏర్పడటం అని రాస్తూ, తర్వాతిరోజుల్లో ఏ కారణం చేతనేనా వాళ్ళిద్దరూ విడిపోయినప్పుడు, ఇద్దరి మనసుల్లోనూ కూడా చిన్న అయస్కాంతం ముక్క లోతుగా దిగబడిపోయి ఉంటుంది అని రాసింది. ఇదిగో, ఇట్లాంటి పూలతావులు తాకినప్పుడు గుండెలో నాటుకుపోయిన ఆ అయస్కాంతశకలాలు కలుక్కుమంటూ ఉంటాయి.

మార్గరెట్ ఎమర్సన్ కి రాసిన ఉత్తరాల్లో మొదట్లో ఉన్నదంతా పుస్తకాలే. ఆ తర్వాత, వాళ్ళు నడిపే పత్రికకి ఎవరు ఏ వ్యాసాలు పంపారు, ఏ కవితలు పంపారు, ఏవి ఉంచాలి, ఏవి తీసెయ్యాలి, ఏవి సరిదిద్దాలి ఈ విషయాలే. ఇంకోటి కూడా నాకు ముచ్చటేసింది. వాళ్ళు ఒకరికొకరు రాసుకున్న ఉత్తరాల్ని వాళ్ళ మిత్రుల్తో పంచుకునేవారు. ఆ మిత్రులు రాసిన ఉత్తరాల్ని కూడా తాము కూడా పంచుకునేవారు. కొన్ని సంగతులు చెప్పొచ్చు అనుకునేవారు, కొన్ని దాచిపెట్టాలనుకునేవారు. తీగ ఎదుగుతూ నులితీగలు చాపుతున్నప్పుడు కొన్ని తీగలు ముందుకి సాగినట్టుగా, కొన్ని ముడుచుకుపోతున్నట్టుగా, కొన్ని బలహీనపడుతున్నట్టుగా, ఆ వెల్లడిలో, ఆ రహస్యంలో, ఆ పంచుకోడంలో, అలా పంచుకోడానికి ఎదురుచూడటంలో ఆ పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారి, ఆ స్నేహం ఒక సముద్రంగా మారడం ఆ ఉత్తరాల్లో కనబడుతూ ఉంది.

నాకైతే అన్నిటికన్నా ముందు చెప్పలేనంత ఉద్వేగాన్ని కలిగించింది, ఆ పుస్తకాలూ, ఆ సాహిత్యచర్చలూనూ. ఆమె అప్పట్లో ప్రావిడెన్స్ లో ఉండేది. ఆ ఉత్తరాలు చదువుతూ మధ్యలో నా మిత్రుడు వేణుకి ఫోన్ చేసాను. అతను చాలాకాలం బోస్టన్ లో పనిచేసాడు. ప్రావిడెన్స్ నుంచి కంకార్డ్ కి ఎంతసేపు ప్రయాణం అని అడిగాను. ముప్పావుగంట పడుతుందన్నాడు. తర్వాత గూగుల్ చేసి చూసాను. 96 కిలోమీటర్లు. అంటే హైదరాబాదునుంచి నల్గొండ కన్నా పదికిలోమీటర్లు తక్కువ. కాని పందొమ్మిదో శతాబ్ది పూర్వార్థంలో ఆ దూరం హైదరాబాదు నుంచి విశాఖపట్టణం అంత దూరం అనుకోవచ్చు. ‘మీరు ఇక్కడికి ప్రసంగాలకు వచ్చేట్టయితే, నేను లేనప్పుడు రాకండి’ లేదా ‘ఈ శనివారం నేను కంకార్డ్ వస్తున్నాను, రెండు రోజులుంటాను’ లేదా ‘ఈసారి కంకార్డ్ రాలేకపోయాను. కాని నా హృదయమంతా అక్కడే ఉంది’ లాంటి వాక్యాలు చదువుతుంటే ఆ ఉద్వేగం నేను కూడా అనుభూతి చెందుతున్నాను.

ఆమె ఆయనకు రాసిన నాలుగో ఉత్తరమే చూడు, అప్పటికి వాళ్లు ఒకరికొకరు పరిచయమై ఏడాది కూడా కాలేదు, కాని ఈ వాక్యాలు చూడు:

Everyday I have mentally addressed Concord, dear Concord, haven of repose where headache-vertigo-other sins that flesh is heir to can not long pursue. I willingly seize this excuse for writing to you, although it is too true that I have nothing to say which can be said in such a way-How I rejoice that you are to come on Saturday! I look forward to your presence as the weary traveller does to the Daimond of the Desert- Flowers will, I trust, spring up, but at present all is too new for my weak head..

తన మనసులోనే వెయ్యి సార్లు కంకార్డ్ కంకార్డ్ అంటో సంబోధించుకుంటూ ఉందట. అక్కడికి వెళ్తే, అన్ని రకాల తలనొప్పులూ, తలతిరగడాలూ, దేహాన్ని పీడించే సమస్తపాపాలూ తనని వదిలిపెట్టేస్తాయట. ‘నువ్వొస్తే ఇక్కడ పూలు తప్పకుండా వికసిస్తాయిగాని, ఈ అనుభవంతా నా చిన్ని గుండెకి చాలా కొత్తగా ఉంది’ అంటోందామె.

నేనుప్పుడూ అమెరికా వెళ్ళాలని అనుకోలేదుగానీ, ఎప్పటికేనా ఇదిగో ఈ అమ్హరెస్టూ, ఈ కంకార్డూ, ఈ వాల్డెనూ, ఈ ప్రావిడెన్సూ చూడ్డానికి మాత్రం తప్పకుండా వెళ్ళాలని ఉంది. మరీ ముఖ్యం ఈ ఉత్తరాలు చదువుతున్నప్పుడు నేను కూడా ప్రావిడెన్సు నుంచి కంకార్డ్ కీ, కంకార్డ్ నుంచి బోస్టన్ కీ, బోస్టన్ నుంచి న్యూయార్క్ కీ తిరుగుతూనే ఉన్నాను.

ఆలోచిస్తూ ఉన్నాను. అలాంటి మిత్రులెవరేనా నాకు ఎప్పుడేనా తారసపడ్డారా అని. అంటే వాళ్ళని చూడ్డంకోసం వారాంతాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసే మిత్రులని కాదు, ఆ వారాంతాలు రాగానే గొథే గురించీ, డాంటే గురించీ, కార్లైల్ గురించీ మాట్లాడుకుందాం అని ఎదురుచూసే మిత్రులు. నేను అనువాదం చేసిన జర్మన్ కవితలు నీకు చదివి వినిపించి, నువ్వు కొత్తగా రాస్తున్న వ్యాసాలు నాకు వినిపించి-అట్లాంటి మిత్రులు! అయ్యో! ఈ అరవయ్యేళ్ళ జీవితంలో అంత భావోద్వేగంతో ఎదురుచూసేలా చేసే చదువరి మిత్రులు, రచయితలు, కవులు ఇప్పటిదాకా నాకెవ్వరూ తారసపడలేదే! ఎంత నిరుపేద జీవితం నాది!

ఊహించు, ఒక్కో ఏడాది మొత్తానికి పది పన్నెండు మించి ఉత్తరాల్లేవు. బహుశా కలుసుకున్నదికూడా ఏడాదికి నాలుగైదు సార్ల కంటే మించి ఉండదు. కాని ఎంత సుసంపన్నమైన స్నేహాలు అవి. అట్లాంటి ఏ ఇద్దరు కలుసుకున్నా రెండు సముద్రాలు కలుసుకున్నట్టు ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? టెలిఫోన్లు, ఇంటర్నెట్, వాట్స్ అప్ లేని ఆ రోజుల్లో పుస్తకాలు చదవాలంటే, ఒకరికొకరు ఎరువిచ్చి మళ్లా రెండుమూడునెలలు కాగానే తిరిగి ఇచ్చి, మళ్లా కొత్త పుస్తకాలు తెచ్చుకుంటూ, చదువుకుంటూ, చదివినవాటి గురించి మాట్లాడుకుంటూ- ఏ రకంగా చూసినా రెండు వందల ఏళ్ళ కిందటి ఆ మనుషులు మనకన్నా ఎంతో చైతన్యవంతంగా జీవించారనిపిస్తోంది.

అలాంటి మనుషులు ఒకరికొకరు కనబడ్డాక ఏం చేసైనా వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలనీ, వాళ్ళతో గడపాలనీ అనిపించదా? ఆమె కంకార్డ్ వచ్చినప్పుడు ఒక్కోసారి వారం రోజులపాటో లేదా ఒక వసంతకాలమంతానో ఉండిపోయినప్పుడు వాళ్ళు ఏ మాత్రం వీలు చిక్కినా అడవికి పొయ్యేవారట. రోజూ సాయంకాలాలు డిన్నర్ పూర్తయ్యాక కలిసి నడుచుకుంటో పోయేవారట. మార్గరెట్ కి సంగీతమంటే ప్రాణం. ఆమె చక్కగా పాడగలదు కూడానట. వాళ్ళు పాటలు పాడుకునేవారట. తాము చదివిన పుస్తకాల గురించీ, తమ మిత్రుల గురించీ, తమ పత్రిక గురించీ, తమ పత్రికలో ప్రచురించాలనుకున్న కొత్త రచనల గురించీ మాట్లాడుకునేవారు. ప్లేటో, మాంటేన్, గొథే, నోవాలిస్, టాసో, వర్జిల్, హోమర్ ల గురించి మాట్లాడుకునేవారు. ఏమోనబ్బా, ఇప్పుడు అట్లాంటి ఒక మిత్రురాలు నాకు తారసపడితే ఎంత బాగుణ్ణు! నా నవయవ్వనంలో నాకోసం ఒక యువతి నడిచివస్తున్నదని కలలుగనేవాణ్ణి కాని, ఇప్పుడు నాకోసం రానక్కర్లేదు, కనీసం ఒక ఈ-మెయిలు రాసినా చాలు, ఆ మెయిల్లో జర్మన్, ఫ్రెంచి, పర్షియన్, తమిళ, చీనా కవిత్వాల గురించి రాస్తే అంతకన్నా భాగ్యం ఉంటుందా!

కాని అలాంటి మిత్రులు దొరకడం గగనం. ఎమర్సన్ ఒక ప్రసంగం మొదలుపెడుతూ ‘ఓ మిత్రులారా, నిజానికి మిత్రులంటూ ఎవరూ ఉండరు’ అని అన్నాడట. ఇదొక చిత్రమైన వాక్యం. తరతరాలుగా రచయితలు చెప్పుకుంటూ వస్తున్న ఒక వాక్యం. ఇది అరిస్టాటిల్ చెప్పిన వాక్యమని ఎమర్సన్ రాసుకున్నాడు. నిజానికి ఆయన దాన్ని మాంటేన్ వ్యాసాల్లో చదివాడట. మాంటేన్ దాన్ని డయోజినస్ లయర్టస్ అనే గ్రీకు రచయిత రచనల్లో చదివాడట. ఆ గ్రీకు రచయిత రాసుకున్నాడట: He who has friends can have no true friend అని.

ఈ మాట ఒక విధంగా నిజమే, మనకి పరిచయస్థులుంటారు, ఒక్కొక్కరికీ దాదాపు నాలుగైదువేలమంది సోషల్ మీడియా friends ఉంటారు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరినీ, ఆ మీటింగులో వాళ్ళని మొదటిసారి చూస్తున్నా కూడా, ఫ్రెండ్ అనే వ్యవహరించడానికి అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఎవరినేనా ఫ్రెండ్ అని సంబోధించడం ఒక మర్యాద. కాని ఆ friend, ఎవరు మన సమస్త జ్ఞానకాంక్షనీ, సృజనశక్తుల్నీ ప్రజ్వరిల్లచేయగలరో, ఎవరిని కలుసుకుంటే, మన తలనొప్పులూ, తలతిరగడాలూ అదృశ్యమైపోతాయో, ఎవరిని కలుసుకుంటే, భూమ్మీద ఇంతదాకా జీవించిన మానవులందరి వివేకమూ పంచుకోవాలనిపిస్తుందో, ఎవరిని కలుసుకుంటే, రాబోయే తరాల కోసం కలలు గనాలనిపిస్తుందో, అలాంటి friend ఒక్కరేనా ఉన్నారా? అందుకనే ఆ ప్రాచీన గ్రీకు రచయిత, నీకు నూటొక్క మంది స్నేహితులున్నా ఒక్క స్నేహితుడూ లేడన్నట్టే అన్నాడు.

అలాగని మనం స్నేహితుల కోసం వెతుక్కోకుండా ఉండలేం. అందుకనే మార్గరెట్ ఒక ఉత్తరంలో ఎమర్సన్ తో ఇలా అంటోంది:

I bear constantly in heart the text of of yours ‘O my friends, there are no friends’. Surely, we are very unlike the Gods in ‘their seats of eternal tranquility’ that we need illusions so much to keep us in action ‘

అలాంటి స్నేహితుడో, స్నేహితురాలో తారసపడ్డప్పుడు ఆ అనుబంధం అనురాగంగా మారడంలో ఆశ్చర్యమేముంటుంది? అది వట్టి intellectual sharing తో ఆగిపోదు. గొప్ప సంగీతం వింటున్నప్పటిలా, గొప్ప కావ్యం చదువుకుంటున్నప్పటిలా, గొప్ప రూపకాన్ని రంగస్థలమ్మీద ప్రదర్శిస్తుండగా చూస్తున్నప్పటిలా అది మనకు తెలీకుండానే మన మనసును మెత్తబరిచి, చెప్పలేని అవ్యక్తమధురిమతో మన క్షణాల్నీ, దినాల్నీ నింపెయ్యడం మొదలుపెడుతుంది.

అప్పుడు సమస్య మొదలవుతుంది. నీ అంతరంగమూ, సమాజమూ కూడా నిన్ను నిలదియ్యడం మొదలుపెడతాయి. ‘చెప్పు, అతను నీకేమవుతాడు? తండ్రినా, తమ్ముడా, బంధువా, గురువా? ఎవరు?’ ‘నా స్నేహితుడు’ అంటావు. ‘స్నేహితుడంటే? ఎలాంటి స్నేహితుడు?’ ఈ ప్రశ్నలకి అంతుండదు. కాని ఆ ప్రశ్నలు జవాబుల్తో తృప్తి చెందేవికావని లోకానికీ తెలుసు, నీకూ తెలుసు. ఎందుకంటే మీరిద్దరూ ఏ గొథే గురించో, బీతోవెన్ గురించో మాట్లాడుకున్నంతసేపు మాట్లాడుకుని బయటకి రాగానే, మీ కళ్ళల్లో ఒక అలౌకికానందం కనిపించకుండా ఉండదు. మీ హృదయంలో తలెత్తే ఆ palpitation ని మీరు దాచలేరు. అది చూడగానే ప్రపంచానికి కలిగే ఇన్ సెక్యూరిటీ అంతా ఇంతా కాదు.

నిజానికి సమాజం కన్నా కూడా ముందు మనలోనే ఆ ఆత్రుత అధికంగా ఉంటుంది. మనలో తలెత్తుతున్న ఆ కొత్త సంవేదనని మనకి బాగా పరిచయమైన ఏదో ఒక మూసలోకి కుదించేసుకుంటేగాని మన గుండెదడదడ తగ్గదనిపిస్తుంది. దాంతోపాటు మరో దెయ్యం కూడా మనమధ్యకొస్తుంది. ఆ దెయ్యం ఏమంటుందంటే, ‘చూడు, అతను నీతో మాత్రమే కాదు, అందరితోటీ ఇలానే మాటాడతాడు, అందరికీ తన హృదయం తలుపులు తెరిచిపెడుతూనే ఉంటాడు. తేల్చుకో, వాళ్లందరిలో నువ్వెక్కడ? అతడు అందరికన్నా నిన్నే most ప్రేమిస్తున్నాడో లేదో, ముందు అది తేల్చుకో’ అంటుంది. అలానే నా దగ్గరికొచ్చి ‘అడుగు, నిక్కచ్చిగా అడుగు, ఆమె maximum ఎవరిని ప్రేమిస్తోందో తేల్చుకో’ అని చెవిలో ఇల్లు కట్టుకుని పోరుపెట్టడం మొదలవుతుంది. అప్పుడు మనం మన ప్రేమ ఎంత యథార్థమైందో, ఎంత పతాకస్థాయికి చేరుకుందో తేల్చుకోడానికి ఒకరికొకరం పరీక్షలు పెట్టుకోడం మొదలుపెడతాం. చాలాసార్లు దేహాన్ని ఒక పరీక్షాకేంద్రంగా మారుస్తాం. త్యాగాల్ని కోరుకోడం మొదలుపెడతాం. ‘ఆ రోజు నీకోసం నేనేం చేసానంటే..’, ‘నేను కాబట్టి..’, ‘నువ్విలా అని అనుకోలేదు..’

సమాజం నుంచి కాదు, మన ప్రేమనీ, స్నేహాల్నీ ముందు ఈ దెయ్యాలనుంచి కాపాడుకోడం కష్టమైపోతుంది. అందుకు ఆత్మలో చాలా ధైర్యం కావాలి. నిన్ను నువ్వు అదుపు చేసుకోడం తెలుసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం ఎదటి మనిషిని నమ్మడం సాధన చెయ్యాలి. నూరు సార్లు నువ్వు నమ్మకద్రోహానికి గురయ్యావని అనిపిస్తున్నా సరే, నూటొకటో సారి కూడా నమ్మడానికి సిద్ధంగా ఉండాలి.

అమెరికన్ స్కాలర్ తనని తాను తీర్చిదిద్దుకోడానికి ఎమర్సన్ కొన్ని సాంగత్యాలు అవసరమన్నాడు. అందులో మొదటది ప్రకృతి, రెండోది పుస్తకాలు, మూడోది పని. కాని వీటన్నటికన్నా మిన్నగా self-reliance అవసరమని చెప్పాడు. అందుకనే ఆయన్ని sage of self-reliance అని అంటారు. మార్గరెట్ కూడా స్త్రీలతో conversations మొదలుపెట్టినప్పుడు self-dependence గురించే మాట్లాడింది. self-trust. కానీ అయిదవది, అన్నిటికన్నా ముఖ్యమైంది, నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావో వారితో నీకు ఉండవలసింది mutual -trust అని వాళ్ళిద్దరికీ ఈ స్నేహం మొదలయ్యాక గానీ అర్థం కాలేదు.

ఆ mutual-trust, ఆ పరస్పర విశ్వాసం ఎలా ఏర్పడుతుంది? ఎలా నిలబడుతుంది? ఈ ఉత్తరాలు చదువుతున్నప్పణ్ణుంచీ నేను వెనక్కి చూసుకుంటూనే ఉన్నాను. భగ్నమైపోయిన ఆ స్నేహాల్ని అలా భగ్నం కాకుండా ఎందుకు కాపాడుకోలేకపోయాం? లేదా ఈ ప్రశ్న మరోలా అడగాలంటే, ఇప్పటికీ, భగ్నం కాకుండా మిగిలి వున్న స్నేహాలు ఎలా మిగలగలిగాయి? బహుశా ఏ ఔషధం సేవించి ఉంటే, ఆ భగ్న స్నేహాలు భగ్నం కాకుండా ఆరోగ్యంగా మిగిలి ఉండేవి?

ఆలోచిస్తూ ఉంటే, అనిపిస్తున్నది, mutual-trust, self-trust వేరువేరు కావని. నీకు నీలో నమ్మకం ఉంటే, నువ్వు ఆ నమ్మకాన్ని నీ స్నేహాల్లోకి కూడా ప్రసరింపచేయగలుగుతావు. ఒక్కొక్కప్పుడు ప్రేమ కూడా జ్వరగ్రస్తమవుతుంది. నీ చుట్టు గాలిలో వైరస్ ఉంటే మళ్ళీ మళ్ళీ జ్వరమొస్తూనే ఉంటుంది. అప్పుడే, సరిగా అలాంటప్పుడే ధారాళంగా గాలి తగిలేట్టుగా కిటికీ తలుపులు తియ్యాలి, సాయంకాలం చెట్లకిందకి నడుచుకుంటూపోవాలి. ఒకరినొకరు స్వస్థపరుచుకోవాలి, ఓదార్చుకోవాలి. ఒకరి జ్వరానికి మరొకరు ఓపిగ్గా ఔషధం సేవిస్తుండాలి.

ఎమర్సన్ నాకెందుకు నచ్చాడంటే, ఆయన ఈ అనుబంధంలో ఎంత coldగా, unresponsiveగా insensitive గా ఉన్నాడనేనా అనిపించవచ్చుగాక, కాని ఆయన తమ స్నేహానికి దీర్ఘాయువు కోరుకున్నాడు. తమ అనుబంధం సంక్షోభాన్ని కాదు, సౌందర్యాన్ని సృష్టించేదిగా ఉండాలనుకున్నాడు. ఒకవేళ సౌందర్యాన్ని మేల్కొల్పలేకపోయారా, మంచిది, కాని ఒకరి తలపు మరొకరికి శాంతినివ్వగలిగేదిగా, ధైర్యాన్నిచ్చేదిగా ఉంటే చాలనుకున్నాడు.

ఆయన తన జర్నల్ లో ఇలా రాసుకున్నాడని పొపోవా రాస్తున్నది: Between narrow walls we walk: insanity on one side & fat dullness on the other.

ఇదే సమస్య, మనం భరించలేనిది, మన జీవితం మీద అనుక్షణం నివురు పేరుకుంటూ ఉండటం. రోజులు యాంత్రికంగా మారిపోతూ ఉండటం, సంబంధాలు, అనుబంధాలూ templates గా మారిపోవడం. ఒక్కమాటలో చెప్పాలంటే మనం రోబోలైపోతూండటం. అందుకనే మనం పాటలు వినాలనుకుంటాం, పుస్తకాలు చదవాలనుకుంటాం, మిత్రులు కావాలనుకుంటాం. కాని అవి ఒకసారి మన రసేంద్రియాల్ని మేల్కొల్పడం మొదలుపెట్టాక మనకు తెలియకుండానే ఉన్మత్తతలోకి జారిపోతుంటాం. యాంత్రికత-ఉన్మత్తత: ఈ రెండింటి మధ్యా ఈ రెండింటిలోనూ ఎటువైపూ ఒరిగిపోకుండా మన జీవితాన్ని సజీవంగానూ, ఆరోగ్యంగానూ నిలుపుకోవడమెట్లాగ?

3-11-2023

6 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు-12”

  1. Beautiful…. ఈ ఉత్తరాలు చదవడం ఎంతకీ పూర్తవడంలేదు, అంటే, టెక్స్ట్ కాదు. చదువుతున్నప్పుడు రొదగా కొన్ని వందల ఆలోచనలు, ఆ పాత స్నేహాలు..అదంతా ఒకటి.
    ఇప్పుడు మీరు పరిచిన ఆదర్శాలు, ప్రశ్నలు..ఇది రేకెత్తించే ఊహలు ఒకటి.

    Self assurance స్నేహంలో, ప్రేమలో ఆమాట కొస్తే జీవితంలో చాలా అవసరమనే నేనూ అనుకుంటాను. అభద్రతలో మొదలయ్యే అనుమానం, అనుమానం నుండి హింస, దుఃఖం ఇవన్నీ తెరిపి లేని లూప్ లో భాగాలే. ప్రేమ ఉందీ అంటే పోస్ట్ రాసి చెప్పు, లైక్ కొడితే లెక్కేస్తా అనే నిరుపేద ప్రపంచంలో, మీరన్నట్టు అనుమానం అన్ని దిక్కుల్లో నుండి కబళించే దయ్యం. ఎంత కాపాడుకోవాలి మనిషి తనని తాను! ఒక స్నేహానికో ప్రేమకో అర్పించుకోవాలంటే ఎన్ని అగాధాలు దాటాలి!

    నిజానికి కళలు చేయాల్సింది మనని మనం నిలబెట్టుకునే తావుల్లా ఉండటమే కదా. కళలో మగ్నమైన కాసేపూ నువ్వు నీదైన ప్రపంచంలో నిశ్చింతగా, ఒక ఫోకస్ తో బతికే వెసులుబాటు ఇస్తుంది అది. బహుశా అంత ఆంతరంగికమూ ప్రేమపూర్వకమూ అయినందుకే ఆ క్షణాలను, ఆ wavelength ను పంచుకోగలిగిన తోడు అపురూపం అవుతుంది.

    బంధానికి సంబంధించి ఎమెర్సన్ స్పష్టత ఎంత బాగుంది! పూలు వికసించడాన్ని కాలానికి వదిలేసినట్లు, స్నేహాన్ని కూడా ఇట్లా సంభాషణలకు వదిలేయాలి కామోసు.

    Beautiful! మళ్ళీ చెప్తునానని తెలుసు. చెప్పకుండా పోనీయనంత sweet letter ఈ రోజు! ❤️

  2. భావనలను తేటపరుస్తూ, మనసుని తేలికపరుస్తూ, మసకలను తొలగిస్తూ .. హృద్యంగా ఇంకుతున్నాయి సర్ మీ లేఖలు. థాంక్స్ చాలా చిన్నపదమవుతుంది మీకు.

  3. “ తమ అనుబంధం సంక్షోభాన్ని కాదు, సౌందర్యాన్ని సృష్టించేదిగా ఉండాలనుకున్నాడు. ” – వాళ్ళ అనుబంధం అపూర్వం!!

    ఈ ఉత్తరాలు అందుకుంటున్న రోజులు ఎంతో సంపన్నమైన రోజులు!! 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading