An aesthetic healer

సభాధ్యక్షులకు, వేదికని అలంకరించిన పెద్దలకు, డా. నారాయణరెడ్డిగారి కుటుంబసభ్యులకు నా నమస్సులు. ఈనాడు సుశీల నారాయణ రెడ్డి పురస్కారం అందుకుంటున్న పద్మకి శుభాకాంక్షలు.

మిత్రులారా!

డా.నారాయణరెడ్డి తెలుగువారి కీర్తిని ఇనుమడిరపచేసిన కవి, పండితుడు, విద్యావేత్త, అన్నిటికన్నా మించి మంచి మనిషి. నా చిన్నప్పుడు స్కూల్లో ఆయన పుస్తకాలు బహుమతిగా పొందిన రోజులనుంచి ఈ ఊళ్ళో ఆయనతో పాటు కలిసి సాహిత్యసమావేశాల్లో పాల్గొనే రోజులదాకా డా. నారాయణరెడ్డిగారితో నా ప్రయాణం కొనసాగింది. ఆయన నా పట్ల చూపించిన ప్రేమాదరాలు నేనెప్పటికీ మర్చిపోలేను. అటువంటి విద్వన్మణి నావంటివాణ్ణి కూడా తనతో పాటు సమానంగా ఆదరించిన ఎన్నో సమయాలు నాకు గుర్తొస్తూ ఉన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కారం గతంలో మా అక్క డా.వీరలక్ష్మిదేవికి లభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ ఉన్నాను.

ఈనాడు ఈ పురస్కారం అందుకోబోతున్న కుప్పిలి పద్మ తెలుగు సాహిత్యంలో అద్వితీయమైన భావుకురాలు, రచయిత్రి, కవయిత్రి. ఆమెకీ నాకూ మధ్య నలభయ్యేళ్ళ స్నేహం. మేము అప్పుడప్పుడే రచనలు మొదలుపెట్టిన తొలిరోజుల్లో రాజమండ్రిలో సాహితీవేదిక అనే సంస్థలో కలుసుకున్నాం. సాహిత్య అధ్యయనాన్నీ, సృజననీ ఎంతో ప్రజాస్వామికంగా ప్రోత్సహించిన ఆ సంస్థ రచయితలుగా మా భవిష్యత్తుని తీర్చిదిద్దింది. అందుకని పద్మకి ఈ పురస్కారం లభిస్తున్న వేళ, ఒక సహసాహిత్యవిద్యార్థిగా, గోదావరికి, సాహితీవేదికకి, మా సాహిత్యగురువులకి నమోవాకాలు సమర్పిస్తున్నాను.

తెలుగు సాహిత్యంలో పద్మ స్థానం గురించి, తెలుగు సమాజానికి ఆమె అందించిన ఉపాదానం గురించి ఆలోచిస్తూ ఉంటే, నాకు ఆమె జీవితానికి సంబంధించిన ఒక విషయం గుర్తొస్తున్నది. అది ఆమె కుటుంబానికి సంబంధించిన విషయమే అయినప్పటికీ, ఇక్కడ మీతో పంచుకోవడం సముచితమే అనుకుంటున్నాను.

పద్మ తల్లిగారి తల్లిగారు అంటే అమ్మమ్మ, ఆమెకి ఇంకా పెళ్ళికాకముందు ఒక పెళ్ళి చూడటానికి వెళ్ళారట. అక్కడ పెళ్ళికొడుకు అంధుడు. ఆయన తన ఎదట ఉన్న వధువు మెడలో తాళికట్టబోతూ తన పక్కనున్నవారితో ఆ నవవధువు కళ్ళు తడిగా ఉన్నాయేమో చూడమని అడిగాడట. ఆమె కళ్ళనిండా నీళ్ళున్నాయని చెప్పారు వాళ్ళు. అంతే, ఆయన ఆ తాళికట్టలేదట. ఒక అంధుణ్ణి పెళ్లిచేసుకుంటున్నందుకు ఆమె విలపించడం తనకి ఇష్టం లేదనీ, తాను ఆమెను జీవితాంతం బాధపెట్టలేననీ చెప్పాడుట ఆయన. పద్మ వాళ్ళ అమ్మమ్మగారు ఆ దృశ్యం చూసారు. ఇంటికొచ్చి తన తల్లిదండ్రుల్తో తనకి ఆయన్ని పెళ్ళి చేసుకోవాలని ఉందని చెప్పారు. అదేమిటి అనడిగారు తల్లిదండ్రులు. అవును, వాళ్ళంతా ఆయన నేత్రాలు చూసారు, నేను ఆయన హృదయం చూసాను అందట ఆమె.

పద్మకి ఆమె వారసత్వం లభించిందని అనుకుంటున్నాను. తన చుట్టూ ఉన్న ప్రపంచం అంధ ప్రపంచం అని తెలిసినా కూడా పద్మ ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రేమతో అక్కునచేర్చుకుంది. గత నాలుగు దశాబ్దాలుగా ఈ నిష్ఠురప్రపంచానికి సాహిత్యసేవ చేస్తూనే ఉన్నది.

ఆమెని స్త్రీవాద రచయిత్రి అని గాని లేదా మరికొంత ముందుకు వెళ్ళి మిలిటెంట్‌ ఫెమినిస్టు గానీ అనడం ఆమె సాహిత్యవ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా పట్టిచ్చే మాట కాదు. ఆమె అన్నిటికన్నా ముందు భావుకురాలు. కోమల హృదయ. ప్రకృతి ప్రేమికురాలు. ఋతుపరిభ్రమణం మన చుట్టూ వికసింపచేసే రంగుల్ని కళ్ళప్పగించి చూస్తూ విభ్రాంతంగా నిలబడిపోయే ఒక ముగ్ధ బాలిక. అకారణంగా మనుషుల్ని ఇష్టపడే ఒక అమాయిక. రెక్కలున్నది సంతోషంగా ఎగరడానికే అని నమ్మే ఒక సీతాకోక చిలుక.

కాని ఆమె అక్కడితోటే ఆగిపోయుంటే కవి మాత్రమే అయి ఉండేది. గొప్ప కవులు తమ జీవితకాలమంతా ఒక lost paradise కోసం తపిస్తూ ఉంటారని మనకు తెలుసు. పద్మ కూడా ఆ తొణికిన స్వప్నం గురించి రాస్తుంది. కానీ ఆమె అక్కడే ఆగిపోలేదు. తన బయట ప్రపంచంలో ఆర్థిక-సామాజిక పరిణామాల్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించగల దృష్టి కూడా ఆమె సొంతం. అదే ఆమెను కథకురాల్ని చేసింది. స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలనీ, కుటుంబ, ఉద్యోగ సంబంధాల్లో ఆధిపత్యధోరణుల్ని ధిక్కరించాలనీ స్త్రీవాదులు చెప్తారు. పద్మ కూడా ఆ మాటలు చెప్తుంది. కానీ ఆమె అవగాహన అక్కడికే పరిమితం కాదు. స్త్రీలు ప్రేమపేరిట చాలాసార్లు తమ మీద ఆధిపత్యాన్ని పురుషులచేతుల్లో తామే స్వయంగా పెడతారని కూడా ఆమె హెచ్చరిస్తుంది. ఆర్థిక స్వాతంత్య్రానికి మానసిక స్వాతంత్య్రం జతకూడకపోతే స్త్రీలు రెట్టింపు అణచివేతకి గురవుతారని పదే పదే చెప్తుంది. స్త్రీ శరీరం మీద స్త్రీకే పూర్తిహక్కులు ఉండాలనేది స్త్రీవాదం మనకి నేర్పిన పాఠం. తన శరీరం మీద తనకు పూర్తిహక్కులు సిద్ధించాలంటే స్త్రీ ముందు తన మనసు మీద తాను పూర్తిహక్కులు నిలుపుకోవాలనేది పద్మ చెప్పే పాఠం.

2000 తర్వాత ఆమె కథల్లో గ్లోబలైజేషన్‌ ప్రధాన నేపథ్యంగా మారింది. సమాచార ప్రసార సాధనాల్లో సంభవించిన అపూర్వమైన వేగం, దేశాల సరిహద్దుల్ని దాటిన ఉద్యోగిత, మన సామాజిక-రాజకీయ జీవితాన్ని శాసిస్తున్న కార్పొరేట్‌ ప్రయోజనాలు, జీవితపు అన్ని పార్శ్వాలనూ ఆవరిస్తున్న వస్తువినిమయ సంస్కృతి- వీటి మధ్య స్త్రీపురుషులు సహోద్యోగులుగా, స్నేహితులుగా, ప్రేమికులుగా మారడానికి చేసే ప్రయత్నాలు, అవి పదే పదే విఫలమవుతూ ఉండటం, అయినా మరొకసారి తమని తాము కూడదీసుకుని వారు తమని తాము మనుషులుగా తీర్చిదిద్దుకోడానికి చేసే ఉద్యమాలు-ఇవన్నీ పద్మ కథల్లో కనిపించినంత శక్తిమంతంగా నేటి తెలుగు సాహిత్యంలో మరెక్కడా కనిపించవు. అత్యంత ప్రాచీన మానవసమాజాల్లో కవి భిషక్కు కూడా. అంటే ఒక healer కూడా. మనం అనుభవిస్తున్న రుగ్మతలకి రోగనిదానం చేయగలగడమే ఒక రచయిత నెరవేర్చగల గొప్ప బాధ్యత. పైకి చెప్పకపోయినా మనం ఇప్పటికీ మన కవిరచయితల నుండి కోరుకుంటున్నది ఇదే. మన రహస్యవేదనలనుంచి మనకు ఎంతో కొంత స్వస్థత చేకూరుస్తారని వాళ్ల వైపు చూస్తూ ఉంటాం. గ్లోబలైజేషన్‌ యుగంలో మన సంబంధాల్లో పదే పదే బయటపడుతున్న రుగ్మతలకు కారణం బయటి జీవితంలో ఎంత ఉందో, మన ఆంతరంగిక ప్రపంచంలో కూడా అంతే ఉందని చెప్పడం పద్మ మనకి చేకూరుస్తున్న స్వస్థత. కాని ఆమె తాను చేస్తున్న రోగనిర్ధారణని కేవలం clinical గా కాక, ఎంతో రమణీయమైన పద్ధతిలో వివరిస్తుంది. అపురూపమైన ఆ శైలి వల్ల, ఆ కథనం వల్ల ఆమెని ఒక aesthetic healer అనవచ్చనుకుంటాను.

ఒక స్త్రీ చదువుకుంటే ఒక కుటుంబం చదువుకుంటుందని పూర్వం అనేవారు. కాని ఆ మాట ఇప్పుడు చిన్నమాట. ఒక స్త్రీ చదువుకుంటే ఒక తరం మొత్తానికి సాధికారికత సిద్ధిస్తుంది. ఈ సత్యం డా.నారాయణరెడ్డిగారికి తెలుసుకాబట్టే ఆయన ఈ పురస్కారం నెలకొల్పారు. సాధికారులూ, విదుషీమణులూ అయిన రచయిత్రులకి ప్రతి ఏటా ఈ పురస్కారం అందించడం మొదలుపెట్టారు. ఆ కోవలో ఇప్పుడు పద్మ కూడా చేరడంతో ఈ పురస్కారం పూర్తిగా స్త్రీ సాధికారికతా ఉద్యమంగా మారిందని చెప్పవచ్చు.

ఈ వేడుకలో భాగం పంచుకోడానికి నాకు అవకాశమిచ్చిన డా.నారాయణరెడ్డిగారి కుటుంబసభ్యులకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవుతీసుకుంటున్నాను.


31-1-2023

10 Replies to “An aesthetic healer”

  1. mee aesthetic drishtini, rachayitha antharanga lothulanu chudagala anthardrishtini, samajam edala meeku gala anukampanu —mee pariseelana aunnathyanni ee prasangamlo chudagaluguthunnamu.

  2. పద్మ గారి గురించి బాగా వివరించారు

  3. ఎంత పొందికగా,సుమాలను పేర్చినంతందంగా
    రాశారు. అంతటామృదుత్వం వెల్లివిరిస్తోంది

Leave a Reply

%d bloggers like this: