ఋషీశ్వరుడు

ఈ రోజు ఆ పార్థివ దేహానికి సమర్పించడానికి అక్కడెవరో నా చేతుల్లో ఒక చిన్న చితుకు పెట్టారు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం ఒక సమిధనేనా తీసుకుని వెళ్ళాలని పూర్వులు చెప్పారు. ఆయన జీవించిఉండగా నేను ఆయనకు ఏమీ చెయ్యలేకపోయాను. కాని మాకొక జన్మాంతర బంధం ఉండిదని మాత్రం ఈ రోజు నాకు అగ్నిసన్నిధిలో అర్థమయింది. నాకేకాదు, గంగారెడ్డి, ఆదిత్య, తుమ్మూరి రామ్మోహన రావు, కంటాల విశ్వనాథం లకి కూడా.

ఆయన పుట్టినప్పుడు నేను లేను. పెరిగినప్పుడు, చదువుకున్నప్పుడు నేను సహచరుణ్ణి కాను, ఉద్యోగజీవితంలో సహోద్యోగినీ కాను. ఆయన ఎనభై ఏళ్ళ జీవితం జీవించాక, ఆరేళ్ళ కిందట, ఒకరోజు ఆయన్నుంచి ఫేస్ బుక్ మెసెంజరు కాల్. ఆశ్చర్యపోయాన్నేను. అప్పటికి నేను ఆయన పేరు విన్నాను. ఆ మాటే చెప్తే, ఆ రోజే అంటే 12-7-2016 న ఇలా మెసేజి పంపించారు.

It is unlikely that you had heard of me before we became friends on the Facebook. I read a few of your writings, and know you have an ear for music, an eye for art, and a taste for quality literature. Your afterword to Narala Ramareddu’s translation of Gatha’s is quite impressive. I would like to send you two of my books if you would share your postal address. I assure you they are not great works. I am riding two horses. So, I’m neither here nor there. And that is exactly where I want to be.

ఆరేళ్ళు. కాని ఈ ఆరేళ్ళ కాలంలో సూరపరాజు రాధాకృష్ణమూర్తిగారు అంటే ఏమిటో తెలుగు విద్వత్ లోకం క్షుణ్ణంగా గ్రహించింది. ప్రాక్పశ్చిమాలని తన రెండు బాహువుల్లోనూ పొదువుకున్న ఆ మహనీయుడికి అమెరికానుంచి ఆస్ట్రేలియా దాకా పాఠకమిత్రులు ఏర్పడ్డారు. ఒకదాని వెనగ్గా ఒకటి, ఆయన, ఈ ఆరేళ్ళల్లో ఇరవై పుస్తకాలకు పైగా వెలువరించారు. ఆయన అంతకు పూర్వం రాసినవి అగ్నిమీళే కవితల సంపుటి, పి.రామకృష్ణారెడ్డి కథల పైన విమర్శ, భగవద్గీత భాష్యానికి అనువాదం, ఉపనిషత్తుల మీద రెండు పుస్తకాలు, Krishna Calling పేరిట రాసిన పుస్తకం.

ఈ ఆరేళ్ళలో ఆయన షేక్స్పియర్, డాంటే, బోదిలేర్, హాప్కిన్స్, కాఫ్కా, ఇలియట్ ల మీద సమగ్ర పరిశీలనలతో పాటు, డాస్టవిస్కీ, నీషే, హిడెగ్గర్, సార్త్ర్, కాఫ్కా,కామూ వంటి అస్తిత్వవాద రచయితలపైన ఒక సమగ్ర పరిశీలనతో పాటు మాండూక్య ఉపనిషత్తు పైన, అద్వైతవేదాంతం పైనా రెండు పుస్తకాలు కూడా వెలువరించారు. గంగారెడ్డి అడిగాడని సంత్ జ్ఞానేశ్వర్ అమృతానుభవాన్ని తెలుగు చేసారు. ఇవి కాక తెలుగు ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపైన రాసిన వ్యాసాల సాహితీసేతువు కూడా. ఇంకా మరికొన్ని పుస్తకాలు ఉండిఉండవచ్చు.

ఇవి కాక, ఇక్కడ ఫేస్ బుక్ లో మిత్రులు రాసినవాటిమీద ఆయన ఎంతోబాధ్యతగా ఎప్పటికప్పుడు పెడుతూ వచ్చిన కామెంట్లు వాటికవే గొప్ప సాహిత్యం. ఆయన నాకు ఇరవయ్యేళ్ళకిందట ఎందుకు పరిచయం కాలేదా అనుకుంటూ ఉంటాను. తెలుగు సాహిత్యం ఆయన నుంచి ఎంత పొందిందో, అంతకన్నా ఎక్కువ పొందకుండానే ఉండిపోయింది.

ఏడెనిమిదేళ్ళ కిందట ఆయనకి కంప్యూటర్ అంటే తెలియదు. ఇంజనీరింగ్ చదువుతున్న తన మనమడిని అడిగి తెలుసుకున్నారు. ఇంటర్నెట్ తో పరిచయం కాగానే ఆయనలో ఒక నవయువకుడు మేల్కొన్నాడు. ఫేస్ బుక్ ఆయన్ను విశ్వపౌరుణ్ణి చేసింది. ఆయన ఈ మధ్య కాలంలో రాసిన పుస్తకాలన్నీ చిన్న టేబుల్ మేట్ మీద ఐపాడ్ పెట్టుకుని తనే స్వయంగా రాసిన పుస్తకాలంటే నమ్మగలమా? ఆ పుస్తకాల ప్రచురణకు ప్రీ-ప్రెస్ కాపీలు ఆయనే స్వయంగా తయారు చేసుకుని పంపేవారంటే, ఆయన్ని ఎలా ప్రస్తుతించాలో తెలియకుండా ఉంది. వందలాది పేజీల ఆ టైప్డ్ మెటిరియల్లో ఒక్క టైపో కూడా కనిపించదంటే ఏమనిచెప్పాలి?

రాధాకృష్ణమూర్తిగారికీ నాకూ ఈ ఆరేళ్ళుగా నడిచింది స్నేహంకాదు. అంతకన్నా పెద్ద పదం ఏదో ఉంది, కాని నాకు తెలియడం లేదు. ఆయన నా మనసుకి సన్నిహితంగా, నేను ఆయన మనసుకు సన్నిహితంగా గడిపేం. ఆయనకీ నాకూ మధ్య మెసెంజరులో నడిచిన సంభాషణలు పదేపదే చూసుకుంటున్నాను. 25-7-2018 న ఇలా రాసారు:

Veerabhadrudu garu, I was not sure I would post my article on “King Lear” yesterday. My wife was very unwell, and we were all anxious about whether she would need to be hospitalized. By god’s grace, she is better today. I don’t think it needs to be stated that if I hadn’t met you on FB, I wouldn’t have written for the last couple of years what I have written, especially in English literature. I am happy to say that. When I write, I have you in my mind. And that may be the reason I do the best I can, and also why it usually goes above the normal FB level. I know my article today, like the others I have done till now, is not perfect. For eg. I should have referred to the Book of Job. And so many other things. But I am glad that it has been worth the effort. Once again, I express my happiness that someone with a taste like yours is there on FB. Thank you.

2016 లో ఆయన పరిచయమైనప్పుడే నా ఉద్యోగ జీవితం విజయవాడ తరలిపోతూ ఉంది. అందుకని మిత్రులం ఒక లంచ్ కోసం కలుద్దామనుకున్నప్పుడు రాధాకృష్ణమూర్తిగారిని కూడా ఆహ్వానించేం. ఆయన్ని రామంతపూర్ వెళ్ళి దగ్గరుండి సోమయ్యగారింటికి తీసుకువెళ్ళాను. అక్కణ్ణుంచి హోటల్ కి వెళ్ళాం. ఆ రోజు నాగరాజు రామస్వామి గారు కూడా వచ్చారు. అదొక మరవలేని కలయిక.

మరొకసారి అంటే 2017 అక్టోబరులో రాధాకృష్ణమూర్తిగారే మాకు నారాయణ గూడ తజ్ మహల్ హోటల్లో విందు ఏర్పాటు చేసారు. మరొక రోజు వాళ్ళింట్లోనే అనుభవామృతం ఆవిష్కరణ జరిగింది. ఆ రోజు కన్నెగంటి రామారావు, పద్మ కూడా ఉన్నారు. ఇక 2019 సెప్టెంబరులో ఆయన రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ పెద్ద ఎత్తున జరుపుకున్నాం. ఆ రోజు బెంగలూరునుంచి వాసు వచ్చాడు. మరికొందరు మిత్రులు పిన్నంసెట్టి కిషన్ వంటివారు కూడా కలిసారు. ఆ రోజు ఆయన షేక్స్పియర్ పైన రాసిన ‘షేక్స్పియర్ సాహిత్యలోకం’ పుస్తకాన్ని నాకు అంకితం ఇవ్వడం నేను ఊహించలేనిది. బహుశా ఈ జీవితానికి అంతకన్నా మించిన భాగ్యం నాకు మరొకటి ఉంటుందనుకోను.

పోయిన ఏడాది నేను నా ఉద్యోగంలోనూ, ఉద్యోగానికి సంబంధించిన గొడవల్లోనూ తలమునకలుగా ఉండటం ఆయన్ని కలతపెట్టినట్టుంది. 17-11-2021 న ఆయన నాకిలా మెసేజి పెట్టారు:

Veerabhadrudu garu, namaste. I very much want to see you. But I know you are away, and also busy with your official duties. But my association with you is a special phase in my life. I wouldn’t have written 16 books in two years without your appreciation. You shall remain a lasting part of my literary life. I thank you for all your appreciation and encouragement. If it is possible, we shall meet once. I would be very happy. Moorthy.

ఆయన వంటి ఒక పండితుడు, గురువు, రసజ్ఞుడు,అన్నిటికన్నా ముఖ్యం, అటువంటి సద్వివేకి, నా జీవితంలో నాకు పరిచయం కావడం, కనీసం కొన్నేళ్ళేనా మా మధ్య ఒక సాహిత్యసంతోషం పరిఢవిల్లడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కాని ఆయనలో వీటన్నిటినీ మించిన మరొక మహామానవుడు ఉన్నాడు. చాలా రోజులుగా ఆయన్ను అప్పుడప్పుడు వెళ్ళిచూస్తూ, కలుసుకుంటూ, ఆయన మీద రెండు గంటల వీడియో ఇంటర్వ్యూ రికార్డు చేసిపెట్టిన గంగారెడ్డి పొద్దున్న అంటున్నాడు: ‘అటువంటి సహృదయుణ్ణి నేను నా జీవితంలో చూడలేదు’ అని.

అవును, ఆయన సహృదయుడు. వేదాంతం ఆయన్ను మరింత రసప్లావితం చేసిందే తప్ప నిర్లిప్తుడిగా మార్చలేదు. ‘మా నాన్నలో బయటి వాళ్ళకి తెలియని కోణం మాకు మాత్రమే తెలుసు. ఆయన మూడేళ్ళ పసిపాప ‘ అంటున్నది పొద్దున్న వాళ్ళ పెద్దమ్మాయి పద్మజ.

అద్వైతం ఒక ఆలోచనాధోరణి మాత్రమే అనీ, దాన్ని అనుష్టించడం కష్టమనీ అనుకునే రోజుల్లో రమణ మహర్షి వంటి అద్వైతి ఈ లోకానికి సాక్షాత్కరించాడు. నాకు తెలిసి నా జీవితంలో నేను సన్నిహితంగా చూసిన నిజమైన అద్వైతి అంటూ ఉంటే అది రాధాకృష్ణమూర్తిగారే. చివరిదాకా ఆయన్ని వెన్నంటి ఉన్న ఆ పసిపాపల దరహాసమే దానికి సాక్షి. ఆయన ఎలా సాధించాడు దాన్ని? తెలియదు. కాని, మధ్యాహ్నం ఇంటికి వచ్చాక, ఆయన్ని తలుచుకుంటూ ఈశోపనిషత్తు చదువుకున్నాను. వైదిక ఋషి ఇలా అంటున్నాడు:

అన్యదేవాహు ర్విద్యయా అన్యదాహురవిద్యయా

ఇతి శుశ్రుమ ధీరాణాం యేన స్తద్విచచక్షిరే

(విద్యను అనుసరించినవారికి ఒక ఫలితమూ, అవిద్యను అనుసరించినవారికి మరో ఫలితమూ లభిస్తాయని మేము పెద్దలు చెప్పగా విన్నాము)

విద్యాం చావిద్యాం చ య స్తద్వేదో భయగ్‌ం సహ

అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే

( అయితే ఎవరైతే విద్యనూ, అవిద్యనూ రెండింటినీ కలిపి తెలుసుకుంటారో, వారు అవిద్యతో మృత్యువును తరిస్తారు, విద్యతో అమృతత్వం పొందుతారు)

ఈ ఉపనిషద్వాక్యాలకి రాధాకృష్ణమూర్తిగారికన్నా మించిన నిరూపణ నాకు మరొకటి తెలియదు.

15-9-2022

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading