గురజాడలాగా సర్వజ్ఞుడు కూడా పాడిపంటలు పొంగిపొర్లే దేశాన్ని కోరుకున్నాడు. ఆయన కలగన్న స్వర్గం సరళం, ఐహికం, స్వాభావికం. సకాలంలో కురిసే వాన, చక్కగా పండే పొలం, మనసు కలిసిన ఇల్లాలు, తనతో అమరిక కుదిరిన బిడ్డలు, ఆదరంతో చేరవచ్చే ఇరుగుపొరుగు-ఇంతే ఆయన కోరుకున్న లోకం. ఆకలి వేస్తే దొరికే అన్నం, నెమ్మదిగా సాగే వేసవి, నిండువెన్నెల రాత్రి, ఇవే ఆయన కోరుకున్న భోగం
మూర్తీభవించిన వర్ష ఋతువు
వర్షర్తు వర్ణన పద్యాలన్నీ వర్ణచిత్రాలు. ఆయన ఒక కవిగా కాక, ఒక చిత్రకారుడిగా ఆ పద్యాలు నిర్మించాడు. అందులో కొన్ని కుడ్యచిత్రాలు, కొన్ని తైలవర్ణ చిత్రాలు, కొన్ని నీటిరంగుల చిత్రాలు.కాని, ఆ రంగులు మామూలు రంగులు కావు. ఎంతకాలం గడిచినా వన్నె తగ్గని రంగులు. ఆ మాటలపొందికలో కనిపించే ఆ మెరుపు అటువంటిది.
తెలుగుని ప్రేమించేదారుల్లో
జోళదరాశి బళ్ళారి తాలూకాలో ఒక గ్రామం. గుంతకల్ నుంచి నలభై నిముషాల ప్రయాణం. ఆ ఊళ్ళో ఒకప్పుడు ఇద్దరు మహనీయులుండేవారు. ఒకరు, బళ్ళారి రాఘవ మిత్రులు, 'శూన్య సంపాదనము' రచయిత జోళదరాశి దొడ్డనగౌడ.