సద్గోష్ఠిసమానం

మధ్యాహ్నం మూడున్నర. దేవాలయాలముందు
పూలదుకాణాలు తెరిచే వేళ. ఇన్ని నీళ్ళు
చిలకరిస్తే చాలు మల్లెలు చందనమైపోతాయి.
ఇప్పుడు ప్రతి ఒక్క చెట్టూ ఒక మధ్యాహ్నహారతి.

ఎక్కణ్ణుంచి ప్రవేశిస్తుంది మామిడిచెట్టులోకి
అంత పచ్చదనం? ఇప్పుడు ప్రతి ఒక్క పక్షీ,
పడవా అక్కడ కొంతసేపు ఆగుతాయి. ఫాల్గుణ
మాసపు ఏ చెట్టునీడైనా ఒక సద్గోష్ఠిసమానం.

ఏ పెళ్ళికో, పండక్కో చుట్టాలొచ్చినప్పటి ఇల్లు
లాగా గలగల్లాడే నీడ. మళ్ళా ఆ అతిథుల్లో
ఏ ఒక్కర్ని చూసినా ఎంత తీరిక! బహుశా
ఇలాంటప్పుడే వారు తమకి తాము దగ్గరయ్యేది.

16-3-2026

12 Replies to “సద్గోష్ఠిసమానం”

  1. మీరు నాలుగక్షరాలు చిలకరిస్తే చాలు, మా జ్ఞాపకాల పెట్టెలోని అనంతమైన సుందర దృశ్యాలు కళ్ళ ముందు మళ్ళీ కదలాడాలంటే.
    మీ కుంచె కొద్ది నిమిషాలు కాగితంపై కదిలితే చాలు, ప్రకృతికి పునఃసృష్టి జరగాలంటే.

  2. “ఎఖ్ఖడనుండి ప్రవేశిస్తుంది మామిడి చెట్టు లోకి అంత పచ్చదనం?”
    “ఏ పెళ్ళికో, పండక్కో చట్టాలొచ్చినప్పటి ఇల్లు లాగా గలగల్లాడే నీడ .”
    ఎంత బాగున్నాయో ఈ పంక్తులు. ధన్యవాదాలు.

  3. ‘ఇప్పుడు ప్రతి ఒక్క చెట్టూ ఒక మధ్యాహ్నహారతి “❤️

    కాలాల మార్పులు గురించిన కవిత్వానికి మీకు మీరే సాటి..
    🙏

  4. ఇన్ని నీళ్ళు చిలకరిస్తే చాలు
    చందనమైపోయే మల్లెలు!
    ప్రతి ఒక్క చెట్టూ పట్టే మధ్యాహ్నహారతి!
    సద్గోష్ఠిసమానమైన ఫాల్గుణ
    మాసపు గలగల్లాడే చెట్టునీడ!!
    తమకి తాము దగ్గరయ్యే తీరిక వేళలు!!
    Beautiful thoughts!!
    Beautiful imagery !!
    Beautiful paintings!!
    🙏🏽

Leave a Reply