తేనెటీగల కొలను-4

ఐదవ అధ్యాయం

స్వగృహం

ఈస్టర్ సెలవులు రావడంతో రైన్‌హార్డ్ స్వగ్రామానికి బయల్దేరాడు. ఊరు చేరుకున్న మర్నాడు పొద్దున్నే ఎలిసబెత్‌ను చూడటానికి వెళ్లాడు.

‘ఎంత ఎత్తు ఎదిగిపోయావు!’ అన్నాడు ఆ నాజూకైన అందాల బాలిక చిరునవ్వుతో తనను ఆహ్వానించడానికి ముందుకు రాగానే. ఆమె సిగ్గుతో ఎరుపెక్కింది, కానీ ఏమీ బదులివ్వలేదు. అతడు పలకరింపుగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకోగా, ఆమె దాన్ని సున్నితంగా వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించింది. అతడు సందేహంగా ఆమె వైపు చూశాడు. ఆమె గతంలో ఎప్పుడూ అలా చెయ్యలేదు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్యా ఏదో తెలియని అడ్డుగోడ వచ్చి నిలిచినట్టు తోచింది.

అతడు ఊళ్ళో ఉన్నంత కాలం, ఆమెను చూడటానికి రోజూ వెళ్తున్నా అదే భావన కొనసాగింది. వాళ్ళిద్దరూ ఒంటరిగా కూర్చున్నప్పుడు వాళ్ళ సంభాషణల మధ్య కొన్ని నిశ్శబ్ద క్షణాలు ఏర్పడేవి; ఆ నిశ్శబ్దం అతణ్ణి ఎంతగానో కలవరపెట్టేది, ఎంతో ఆందోళనతో అతడు దాన్ని తప్పించాలని చూసేవాడు. సెలవుల్లో ఏదో ఒక వ్యాపకం ఉండాలనే ఉద్దేశంతో, అతడు ఎలిసబెత్‌కు వృక్షశాస్త్రం బోధించడం మొదలుపెట్టాడు. తను విశ్వవిద్యాలయంలో చేరిన తొలిరోజుల్లో అతడికి ఆ శాస్త్రం మీద చాలా ఆసక్తి ఉండేది.

అతడు ఏం చెప్పినా వింటూ ఉండటం ఎలిసబెత్‌కి ఎంతో ఇష్టం. అదీకాక ఆమె చురుకైన పిల్ల. ఏమి చెప్పినా ఇట్టే గ్రహించేది. తాను కూడా వృక్షశాస్త్రం నేర్చుకోడానికి మొగ్గు చూపించింది. దాంతో వారంలో చాలాసార్లు వాళ్ళు పొలాలమ్మటా, మైదానాల్లోనూ విజ్ఞానయాత్రకి బయల్దేరేవారు. ఒక ఆకుపచ్చ డబ్బా నిండుగా పూలూ, మొక్కలూ ఇంటికి తెచ్చుకునేవారు. ఆ తర్వాత సాయంకాలాల్లో రైన్‌హార్డ్ మళ్ళా వచ్చి తాము సేకరించిన మొక్కల గురించి ఆమెకి వివరించి చెప్తుండేవాడు.

ఒక మధ్యాహ్నం అతను అదే పనిమీద ఆమె గదిలో అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఎలిసబెత్ కిటికీ పక్క నిలబడి, బంగారు పూత పూసిన ఒక పంజరంలో తాజా గడ్డి పరకలు ఉంచుతోంది. ఆ పంజరాన్ని అతడు గతంలో ఎప్పుడూ చూసి ఉండలేదు. దానిలో ఒక పసుపచ్చ రంగు పిట్ట ఉంది. అది రెక్కలాడిస్తూ ఎలిసబెత్ చేతివేళ్ళు ముక్కుతో పొడుస్తూ కీచుమంటూ కూస్తోంది. ఇంతకు ముందు ఆ స్థానంలో రైన్‌హార్డ్ ఆమెకి కానుకగా ఇచ్చిన చిలుక ఉండేది.

‘నేనిచ్చిన ఆ చిలక పాపం చనిపోయాక ఇలా బంగారు పిట్టగా మారిపోయిందా ఏమిటి?’ అని కొంటెగా ప్రశ్నించాడు.

‘పిట్టలేమీ అలా మారిపోవులే’ అంది ఎలిసబెత్ వాళ్ళమ్మ. ఆమె ఆ పక్కనే కుర్చీలో కూర్చుని రాట్నం వడుకుతోంది. ‘ఈ మధ్యాహ్నమే మీ మిత్రుడు ఎరిక్ దాన్ని ఎలిసబెత్‌కి కానుకగా పంపించాడు. అది వాళ్ళ తోటలో పక్షి అయి ఉంటుంది.’

‘తోటనా? అదెక్కడ?’

‘అదేమిటి, నీకు తెలియదా?’

‘ఏమిటది? నాకు తెలియదే.’

‘ఎరిక్‌కి వాళ్ళ నాన్నగారి రెండో ఎస్టేటు కూడా సంక్రమించింది. ఇమ్మెన్సీ దగ్గరుందే ఆ ఎస్టేటు. ఇమ్మెన్సీ తెలుసు కదా, తేనెటీగల కొలను. అతను నెల్లాళ్ళ కిందే దాన్ని సొంతం చేసుకున్నాడు.’

‘కానీ మీరా మాట నాకిప్పటిదాకా చెప్పనేలేదే?’

‘పోనీలే’ అందామె, ‘నువ్వు కూడా నీ మిత్రుడి గురించి ఒక్కమాటైనా అడిగావా? అతను చాలా చక్కటి పిల్లాడు. బుద్ధిమంతుడు.’

ఆమె కాఫీ కలపడానికి బయటకి వెళ్ళింది. ఎలిసబెత్ పంజరంలో గడ్డిపరకలు ఉంచే పనిలోనే ఉంది. ఆమె రైన్‌హార్డ్ వైపు వీపు తిప్పి అటువైపు తిరిగి ఉంది.

‘ఒక్క నిమిషం. ఇదుగో ఈ పని పూర్తయిపోనీ’ అని అంటున్నది.

కానీ రైన్‌హార్డ్ నుంచి జవాబు లేదు. తన మాటకి బదులు పలకడం లేదేమని ఆమె వెనక్కి తిరిగి అతడి వైపు చూసింది. తాను ఇంతకుముందెన్నడూ చూసి ఉండని ఒక నూతన వేదన ఆమెకు అతడి కళ్లలో కనిపించింది.

‘ఏమైంది, రైన్‌హార్డ్? ఎందుకలా ఉన్నావు?’ అంటూ ఆమె అతడి దగ్గరకు వచ్చింది.

‘నాకా?’ అన్నాడతడు, కానీ అతడి ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఏదో కలలోలాగా అతడు ఆమె కళ్ళల్లోకి చూసాడు.

‘నువ్వెందుకో విచారంగా కనిపిస్తున్నావు.’

‘ఎలిసబెత్, నాకు ఆ పిట్టని అస్సలు చూడాలని లేదు’ అన్నాడతడు.

ఆమెకి అతడి ఆంతర్యం అర్థం కాలేదు. అతడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘నువ్వు వింతగా కనిపిస్తున్నావు’ అని అంది.

అతడు ఆమె రెండు చేతులూ తన చేతుల్లోకి తీసుకున్నాడు; ఆమె కూడా తన చేతుల్ని అలాగే ఉంచనిచ్చింది. ఇంతలో వాళ్ళమ్మ తిరిగి గదిలోకి వచ్చింది; వాళ్ళు కాఫీ తాగాక ఆమె మళ్ళీ రాట్నం దగ్గర కూర్చుంది. రైన్‌హార్డ్, ఎలిసబెత్ తాము తెచ్చుకున్న మొక్కలు సర్దిచూసుకోడానికి పక్క గదిలోకి వెళ్లారు.

అక్కడ వాళ్ళు పూల కేసరాలు లెక్కించారు. ఆకుల్నీ, పువ్వుల్నీ కొమ్మల్నీ ఎంతో జాగ్రత్తగా విడదీశారు. ఒక్కో రకానికీ రెండేసి నమూనాలు చొప్పున ఆరబెట్టడం కోసం ఒక పెద్ద పుస్తకం తీసుకుని దాని పేజీల్లో జాగ్రత్తగా అమర్చారు.

ఆ మధ్యాహ్నం సూర్యకాంతి ధారాళంగా ప్రసరిస్తున్నది. అంతా నిశ్శబ్దంగా ఉంది. పక్క గదిలో వాళ్ళమ్మ రాట్నం తిప్పుతున్న చప్పుడూ, మొక్కల శాస్త్రీయ నామాల్ని లాటిన్‌లో ఉచ్చరించడంలో ఎలిసబెత్ పొరపాట్లు సరిదిద్దుతున్న రైన్‌హార్డ్ లోగొంతూ తప్ప మరే చప్పుళ్ళూ వినిపించడం లేదు.

సేకరించిన మొత్తం పువ్వుల్నీ, ఆకుల్నీ క్రమపద్ధతిలో అమర్చడం పూర్తయ్యాక, ‘ఆ లోయగులాబీ ఒక్కటీ మాత్రం ఇంకా దొరకలేదు’ అంది ఎలిసబెత్.

తోలుతో బైండు చేసిన ఒక చిన్న పుస్తకం రైన్‌హార్డ్ తన జేబులోంచి బయటికి తీసాడు. ‘ఇదిగో, ఆ గులాబి పువ్వు, ఇది నీ కోసమే’ అంటూ ఆ పుస్తకం పేజీల మడతల్లో దాచిపెట్టిన ఒక ఎండిన పువ్వు తీసి ఆమెకిచ్చాడు.

ఆ పుస్తకంలో పేజీలన్నీ రాతల్తో నిండి ఉండటం చూసి ‘నువ్వు మళ్ళీ కథలు రాస్తున్నావా?’ అనడిగింది ఎలిసబెత్.

‘ఇవి కథలు కావు, చూడు’ అంటూ అతడు ఆ పుస్తకం ఆమెకి అందించాడు.

ఆ పుస్తకంలో మొత్తం కవితలున్నాయి. ఒక్కో కవితా ఒక్కో పేజీ మొత్తం నిండిపోయి చాలా కవితలున్నాయి. ఎలిసబెత్ ఆ పేజీలు ఒక్కొక్కటే తిప్పి చూసింది. ఆమె ఆ కవితల శీర్షికలు మాత్రమే చదువుకుంటూ పోయింది: ‘ఆమెని మాష్టారు మందలించినప్పుడు’, ‘వాళ్ళు అడవిలో దారి తప్పినప్పుడు’, ‘ఈస్టర్ నాటి కథ ఒకటి’, ‘ఆమె నాకు మొదటిసారి ఉత్తరం రాసినప్పుడు’—ఇలానే ఉన్నాయి చాలా శీర్షికలు.

రైన్‌హార్డ్ ఆమె ముఖంలోకి నిశితంగా చూశాడు; ఆమె పేజీలు తిరగేస్తున్న కొద్దీ, ఆమె ముఖంలో ఒక లేత సిగ్గు మొగ్గ తొడిగి, నెమ్మదిగా ఆ అందమైన ముఖమంతా వ్యాపించడం అతడు గమనించాడు. అతడు ఆమె కళ్లలోకి చూడాలని ఆశపడ్డాడు, కానీ ఎలిసబెత్ తల పైకెత్తలేదు; చివరకు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ పుస్తకం తిరిగి అతడి ముందుంచింది.

‘అలా వట్టి చేతులతో తిరిగిచ్చెయ్యకు’ అన్నాడతడు.

డబ్బాలోంచి ఆమె ఒక ఎండిన కొమ్మ బయటికి తీసింది. ఆ పుస్తకం అతడి చేతుల్లో పెడుతూ ‘ఇదిగో, నీకిష్టమైన పువ్వు ఇందులో పెడుతున్నాను. చూడు’ అంది.

ఎట్టకేలకి, అతడి సెలవుల చివరి రోజు వచ్చింది. ఆ మర్నాడు పొద్దున్నే అతడు వెనక్కి బయల్దేరబోతున్నాడు. తన మిత్రుణ్ణి సాగనంపేందుకు గుర్రపుబగ్గీదాకా తాను వెళ్ళి రావడానికి ఎలిసబెత్ వాళ్ళమ్మని ఒప్పించింది. గుర్రపుబగ్గీలు బయల్దేరే చోటు వాళ్ళింటికి కొన్ని వీథుల అవతల ఉంది.

ఆమె ఇంటి ముఖద్వారం దాటి బయటకి రాగానే రైన్‌హార్డ్ ఆమెకి తన చేయి అందించాడు. సన్నజాజి తీగలాంటి ఆ బాలిక చేతుల్లో చేయి వేసి ఆమె పక్కనే మౌనంగా నడిచాడు. తాను ఆమెనుంచి తీసుకోబోతున్న ఈ వీడ్కోలు చాలా సుదీర్ఘ కాలానికే అని అతనికి తెలుసు. ఆ సమయంలో, తన గమ్యం దగ్గర పడుతున్న కొద్దీ, ఆమెతో ఏదో చెప్పాలని అతడికి మరీ మరీ అనిపించింది. తన భవిష్య జీవితానికి సంబంధించింది అత్యంత ముఖ్యమైందేదో, మధురమైందేదో తాను చెప్పబోయే ఆ మాటమీదనే ఆధారపడి ఉన్నాయనిపించింది అతడికి. కానీ తన జీవితాన్ని భద్రంగా కాపాడగల ఆ మాటలేవో అవేలా చెప్పాలో అతనికి తెలియలేదు. ఆ వ్యాకులతలో అతడు మరింత మరింత నెమ్మదిగా నడక సాగించాడు.

‘నీకు ఆలస్యమయ్యేట్టుంది, చూడు. సెయింట్ మేరీస్ చర్చి గడియారం అప్పుడే పది గంటలు కొట్టింది’ అందామె.

కానీ అతడు నడక వేగం పెంచలేదు. నెమ్మదిగా గొంతు పెగుల్చుకున్నాడు. ‘ఎలిసబెత్, మళ్ళీ రెండేళ్ళదాకా నేన్నీకు కనబడను. రెండేళ్ళ తరువాత కూడా నేన్నీకు ఇంత ఇష్టంగానూ కనిపిస్తానా?’ అనడిగాడు.

ఆమె తలూపి ఎంతో అనురాగభరితంగా అతడి ముఖంలోకి చూసింది.

కాసేపాగి ‘నేను నీ కోసం గట్టిగా నిలబడ్డాను కూడా’ అని అంది.

‘నా కోసమా? ఎందుకని? ఎవరి ముందు?’

‘మా అమ్మ దగ్గర. నిన్న సాయంత్రం నువ్వు వెళ్ళిపోయాక నేనూ, మా అమ్మా నీ గురించి చాలాసేపే మాట్లాడుకున్నాం. నువ్వు మునుపటి లాగా మంచిగా కనిపించడం లేదనుకుంటోంది మా అమ్మ.’

రైన్‌హార్డ్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు ఆమె చెయ్యి తన చేతుల్లోకి తీసుకుని ఆమె నిర్మల నేత్రాల్లోకి గంభీరంగా చూస్తూ ‘నేను ఎప్పుడూ ఉన్నట్టే ఇప్పుడూ ఉన్నాను. ఆ విషయం నువ్వు నమ్మితే చాలనుకుంటున్నాను. నా మాట నమ్ముతావా, ఎలిసబెత్?’ అనడిగాడు.

‘తప్పకుండా’ అందామె.

అతడు ఆమె చెయ్యి విడిచిపెట్టి, ఆ చిట్టచివరి వీథమ్మట త్వర త్వరగా నడిచాడు. వీడ్కోలు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అతడి ముఖంలో ఒక సంతోషరేఖ తొణికిసలాడింది. అతడు ఆమె అందుకోలేనంత వేగంగా అడుగులేసాడు.

‘నీకేమైంది, రైన్‌హార్డ్?’ అనడిగిందామె.

‘నా దగ్గరో రహస్యం ఉంది, చాలా అపురూపమైన రహస్యం’ అన్నాడతను. వెలుగులు చిమ్ముతున్న కళ్ళతో ఆమెని చూస్తూ ‘రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చాక ఆ రహస్యం చెప్తాన్నీకు’ అన్నాడు.

ఈలోగా వాళ్లు గుర్రపు బగ్గీలు బయల్దేరే చోటుకి చేరుకున్నారు. వాళ్ళు అక్కడికి సరిగ్గా సమయానికే చేరుకున్నారు. రైన్‌హార్డ్ మరోసారి ఆమె చేతిని అందుకున్నాడు. ‘వెళ్లొస్తాను!’ అన్నాడు. ‘వెళ్లొస్తాను ఎలిసబెత్! నన్ను మర్చిపోకు!’

ఆమె ‘మర్చిపోను’ అన్నట్లు తల అడ్డంగా ఊపింది. ‘వెళ్ళిరా’ అంది. రైన్‌హార్డ్ బగ్గీ ఎక్కాడు, గుర్రాలు ముందుకు సాగాయి. బగ్గీ వీథి మలుపు తిరుగుతుండగా, నెమ్మదిగా ఇంటి దారి పడుతున్న ఆమె ఆత్మీయ రూపాన్ని అతడు మరోసారి మురిపెంగా తిలకించాడు.

ఆరవ అధ్యాయం

ఒక ఉత్తరం

దాదాపు రెండేళ్ల తర్వాత, ఒక రాత్రి వేళ రైన్‌హార్డ్ దీపం వెలుగులో తన చుట్టూ పుస్తకాలూ, కాగితాలూ పరుచుకు కూర్చుని, తనతో కలిసి చదువుకోడానికి వచ్చే ఒక మిత్రుడి కోసం ఎదురుచూస్తున్నాడు. ఎవరో మెట్లెక్కి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది.

‘లోపలికి రండి.’

తీరా వచ్చింది ఇంటి యజమానురాలు. ‘వెర్నరు గారూ, మీకో ఉత్తరం వచ్చింది’ అంటూ ఒక ఉత్తరం ఇచ్చి వెళ్లిపోయింది.

తను అప్పట్లో ఇంటికి వెళ్ళి వచ్చిన తరువాత రైన్‌హార్డ్ ఎలిసబెత్‌కు ఉత్తరాలేమీ రాయలేదు. ఆమె నుంచి కూడా అతడికెలాంటి ఉత్తరాలూ రాలేదు. ఇప్పుడు వచ్చింది కూడా ఆమె రాసిన ఉత్తరంలాగా లేదు. దాని మీద తన తల్లి చేతిరాత కనిపిస్తోంది.

రైన్‌హార్డ్ ఉత్తరం మీద సీలు తొలగించి తెరిచి చదవడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ఈ పేరాదాకా వచ్చాడు:

‘నా బంగారు తండ్రీ, నీ జీవితంలో ఈ వయసులో ప్రతి ఒక్క ఏడాదీ కూడా దానికదే తనదంటూ ఒక ప్రత్యేక అనుభూతిని వెంటబెట్టుకుని మరీ వస్తుంది. యవ్వన మహిమ అలాంటిది. ఆ వయసులో మనుషులు తమకి సంభవించే ప్రతి అనుభవాన్నీ తమ ఉన్నతికి అనుగుణంగానే మలుచుకోగలుగుతారు. ఇక్కడ ఇంటి దగ్గర కూడా పరిస్థితులు చాలా మారిపోయేయి. నీ గురించి నాకున్న అంచనా సరైందే అయితే, ఈ సంగతులు వినగానే నీకు మొదట్లో మనసుకి చాలా కష్టంగా అనిపించవచ్చు.’

‘ఎరిక్ తనని పెళ్ళాడతానంటే ఎట్టకేలకు నిన్నటికి ఎలిసబెత్ ఒప్పుకుంది. అది కూడా గత మూడు నెలల్లో రెండుసార్లు నిరాకరించాకనే. నిజానికి ఆమె ఇప్పటిదాకా నిర్ణయించుకోలేకపోయింది. ఇప్పటికి ఒప్పుకుంది. పెళ్ళి తొందరలోనే జరుగుతుందనుకుంటున్నాను. ఆమె పెళ్ళయ్యాక వాళ్ళమ్మగారు కూడా ఆమెతో పాటే వెళ్ళిపోతారనుకుంటాను.’

(ఇంకా ఉంది)

2-11-2026

Leave a Reply