
16
గాంధీజీ పాదయాత్ర
మన్మోహన్ చౌధురి
1934 మే నెలలో గాంధీజీ తాను చేపట్టిన హరిజనోద్ధరణ కార్యక్రమం కోసం ఒరిస్సాలో పర్యటించవలసి ఉంది. సురేంద్రనాథ్ పట్నాయకూ, నేనూ సత్యభామపూర్‌లోని మా మేనమామ ఇంట్లో ఉంటున్నాం. గాంధీజీకి సమర్పించడానికి విరాళాలు సేకరించాలన్న ఉద్దేశంతో మేమిద్దరం కలిసి చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగాం. మావయ్యగారి ఇంట్లో మాకు భోజనాలు చాలా ఘనంగా పెట్టేవారు. కొద్దిమంది నుండి విరాళాలు అందాయి. కాని మాకు రకరకాల అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఘంటిముండ గ్రామంలో ఒక సంపన్న వడ్డీ వ్యాపారి ఉన్నాడని తెలిసి ఒకసారి అక్కడికి వెళ్లాం. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి, ఒక ముసలాయన వరండామీద మోకాళ్లమీద కూర్చుని డబ్బు లెక్కపెట్టుకుంటున్నాడు. ఒంటిమీద మాసిపోయిన చిరుగుల గుడ్డా, తలమీద పిలకా ఉన్నాయి. ఆయన ముందు ఎన్నో కరెన్సీ నోట్ల కట్టలు పడి ఉన్నాయి. గాంధీ ఆశయాల ఔన్నత్యాన్ని ఆయనకు నచ్చజెప్పడానికి మేం చాలా ప్రయాసపడ్డాం. ఆ వృద్ధుడు నాణాలు లెక్కించడం ఆపకుండానే మా మాటలన్నీ విన్నాడు. చివరకు, ‘సరే! చాలా మంచిది’ అన్నాడు. ఆయన ముందు పడి ఉన్న నాణాల కుప్పలోంచి కనీసం ఒక్క నాణమైనా తీసి ఇస్తాడని మేమిద్దరం ఆశపడ్డాం. కానీ ఆ ముసలాయన నడుముకు కట్టుకున్న చిన్న సంచీలోంచి రెండు పైసలు తీసి, ‘సరే, తీసుకోండి’ అని మా ముందు పెట్టడంతో మా ఆశలన్నీ అడుగంటిపోయాయి. ఆ నాణాలు తీసుకోవడానికి నిరాకరించి మేమక్కడినుంచి వచ్చేశాం.
అయితే మిగతా చోట్ల మాకు మంచి స్పందననే లభించింది. ఎన్నో ప్రాంతాల్లో ప్రజలు మాకు ఎంతో ఆప్యాయంగా భోజనాలు పెట్టారు. సత్యభామపూర్‌లో ఉన్నప్పుడే మాకు ఒరిస్సా ముద్దుబిడ్డ మధుసూదన్ దాస్ పరమపదించారన్న వార్త అందింది.
జమీందారులు ప్రజల్ని ఎంత క్రూరంగా దోపిడీ చేసేవారో కూడా మాకు అక్కడే మొదటిసారి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. లేఖన్‌పూర్ గ్రామంలో ఒక జమీందారు ఇంట్లో మేం అతిథులుగా బస చేశాం. ఆయన స్వాతంత్ర్యోద్యమ సమర్థకుడు. మా గది ఎదురుగానే ఆయన కచేరీ ఉంది. అక్కడ చాలామంది గుమిగూడారు. హఠాత్తుగా పెద్ద చప్పుడు వినిపించి తలెత్తి చూశాను; ఆ జమీందారు బంట్రోతునో లేక మరెవరో ఒక వ్యక్తిని చెప్పుతో కొడుతున్నారు. నేను దిగ్భ్రాంతి చెంది అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆ అమానుష చర్యను ఎదిరించి నిరసించలేకపోయినందుకు ఆ తర్వాత ఎంతో పశ్చాత్తాపపడ్డాను.
ఆ రోజుల్లోనే విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనలు నన్ను ప్రభావితం చేయడం మొదలుపెట్టాయి. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలంతా ఒకే మానవ జాతికి చెందినవారనీ, అందువల్ల దేశాల సంకుచిత సరిహద్దుల్ని తిరస్కరించి అందరూ ఏకం కావాలనీ ఏవేవో ఆలోచనలు నా అంతరంగంలో అల్లుకునేవి. పారిశ్రామిక కార్మిక వర్గంమీద కూడా నాకొక భావుకతతో కూడిన భావన ఉండేది. పల్లెటూళ్లలో తిరుగుతున్నప్పుడు కలకత్తా జనపనార మిల్లుల్లోనో లేక మరెక్కడైనా పనిచేసే కార్మికులెవరైనా ఎదురుపడితే, వాళ్ళతో మాట్లాడాలని ఆరాటపడేవాణ్ణి. పద్మపూర్‌లో ఉన్నప్పుడు, ఆ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు దక్షిణ అమెరికాలో బ్రెజిల్‌లో స్థిరపడ్డాయని తెలిసింది. ఒరిస్సాలోని మారుమూల పల్లెలకి సుదూర దక్షిణ అమెరికాతో ఉన్న ఆ సంబంధం నన్ను ఎంతగానో పులకింపజేసింది. ఈ విధంగా నెమ్మదిగా ప్రపంచమంతా ఒక్కటవుతుందని నేననుకున్నాను.
గాంధీజీ వచ్చే రోజు దగ్గరపడటంతో మేం కటక్ తిరిగి వచ్చాం. దాదాపు మూడు వందల రూపాయల దాకా విరాళాలు సేకరించగలిగాం. సంబల్‌పూర్ మీదుగా గాంధీజీ అనుగుల్ చేరుకున్నారు. గాంధీకి స్వాగతం పలికే విషయంలో ఎలాంటి సహాయమూ చేయవద్దని అక్కడి డిప్యూటీ కమిషనర్ ప్రజలను బెదిరించారు. అయినప్పటికీ గిరిజాభూషణ్ దత్తా ఒక్కరే డేరాలు వేయించి గాంధీ బసకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది ప్రజలు గాంధీని చూడటానికి తరలివచ్చారు. గిరిజాబాబు అనుగుల్‌లో ఒక కాంట్రాక్టరు. స్వేచ్ఛాభిలాషీ, ధైర్యవంతుడూనూ. ఆ తర్వాతి కాలంలో సంస్థానాధీశులకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఉద్యమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత అనుగుల్‌లోని ఆయన స్థలంలోనే మా పిన్ని ఒక ఆశ్రమం నిర్మించారు.
సాయంత్రం వేళ గాంధీజీ తాల్చేర్ రైల్లో కటక్ మీదుగా పూరీకి ప్రయాణమయ్యారు. సంస్థాన ప్రాంతాల వైపు రావాలన్నది ఆయన ఆలోచన. మెరుపువేగంతో ఏడు రోజుల పాటు సాగే అది. రోజూ వాహనంలో ప్రయాణిస్తూ రెండు మూడు చోట్ల సభలు నిర్వహించవలసి ఉంది. కానీ మరుసటి రోజే మాకో వర్తమానం అందింది: గాంధీజీ పూరీ నుంచి కాలినడకనే పాదయాత్ర ప్రారంభిస్తారనీ, మోటారు కారు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారనీ తెలిసింది. గాంధీ మీద డాడిచేసి ఆయన్ను కొట్టడానికి పూరీ ఆలయ పూజారులు కుట్ర పన్నారన్న సమాచారం అందడంతో, పూరీ స్థానిక నాయకులు ఆయనకు పోలీసు రక్షణ ఏర్పాటు చేయించారు. అది గాంధీజీకి ఏమాత్రం నచ్చలేదు. తనమీద దాడిచేసి తనని కొట్టాలనుకునే వారికి మరింత వెసులుబాటు కల్పించడానికే ఆయన పాదయాత్ర చెయ్యడానికి నిశ్చయించుకున్నారని విన్నాం.
మరోవైపు ఆయన వెళ్లవలసిన ప్రాంతాల ప్రజలూ, నిర్వాహకులూ తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఎంతోమంది వెళ్లి ఆయనతో వాదించారు. కానీ గాంధీజీ తన పట్టు వీడలేదు. పూరీ నుండి కటక్ దాకా ఏడు రోజుల పాదయాత్ర ఖరారైంది. రెండో రోజు సాక్షీగోపాల్ దగ్గర నేను ఆఅయన్ని ఆ పాదయాత్రలో కలిశాను. గాంధీజీ ప్రసంగాల వివరాలు రాసుకోవడమూ, ఫోటోలు తీయడమూ నా పని.
మహాకవి రవీంద్రనాథ్ టాగోర్ సోదరుడు ద్విజేంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో ఒక కొత్త షార్ట్‌హ్యాండ్ పద్ధతి కనిపెట్టి, దానిమీద ఒక పుస్తకం కూడా ప్రచురించారు. మా పిన్ని దగ్గర ఆ పుస్తకం ప్రతి ఒకటి ఉండేది. అది నా నా కంటపడింది. నేనా పద్ధతి సాధన చేశాను. నిజానికి నాకు అందులో పూర్తి ప్రావీణ్యం రాలేదు, నా వేగం కూడా అంతంత మాత్రమే. కానీ గాంధీజీ ప్రసంగిస్తున్నప్పుడు ఆ హిందీ వాక్యాలకీ వాక్యాలు ఒడియాలోకి అనువాదమవుతుండటంతో, వాటిని రాసుకోవడానికి నాకు బోలెడంత సమయం దొరికేది. నేను వాటిని రాసుకున్నాక మొదటి కొన్ని రోజులు గాంధీజీనే స్వయంగా వాటిని సరిదిద్దేవారు. ఆ తర్వాత ఇక సరిదిద్దాల్సిన అవసరం లేదని భావించారు. నేను వాటిని బాల్ కాలేల్కర్‌కో మరెవరికో ఇచ్చి సరిచూపించుకునేవాణ్ణి.
ఈ పాదయాత్రలో ఉదయం రెండున్నర నుండి మూడు మైళ్లూ, మధ్యాహ్నం అంతే దూరమూ నడిచేవారు. అలాగే సాయంత్రం ఐదు లేదా ఐదున్నర గంటల ప్రాంతంలో రాత్రి భోజనం ముగించుకుని మళ్లీ నడక మొదలుపెట్టేవాళ్లం. అందువల్ల రాత్రి బస చేసే చోట ఇక భోజనాల గురించిన బెంగ ఉండేది కాదు. అది వేసవి కాలం. అందరూ ఆరుబయటే నిద్రపోయేవారు. పగటిపూట ఆగే మజిలీల్లో కొబ్బరి లేదా తాటాకు మట్టలతో నీడల కోసం తాత్కాలిక పందిళ్లు అవసరమయ్యేవి. బయలుదేరడానికి ముందు తాత్కాలిక మరుగుదొడ్లూ, చెత్తకుండీలూ, మిగిలిపోయిన ఆహారపదార్థాల్నీ సరిగ్గా తొలగించారా లేదా, పరిసరాలన్నీ శుభ్రంగా ఉన్నాయా లేదా అని గాంధీజీ స్వయంగా చూసుకునేవారు. తనతో నడుస్తున్న తోటి బాటసారుల యోగక్షేమాలు వాకబు చేసేవారు. వంట ఏర్పాట్లు సైతం స్వయంగా పర్యవేక్షించేవారు.
ఒకసారి మా చెల్లెలు చునీ కాలికి మేకు గుచ్చుకుందని తెలిసి, స్వయంగా ఆయనే దాన్ని తీశారు. మరో సందర్భంలో, మిగిలిపోయిన అన్నం చద్దన్నం చేసుకుని తింటారని తెలిశాకనే ఆయన శాంతించారు. మజిలీల్లో ఆగినప్పుడు పాదయాత్రికులు హరిజనవాడలకు వెళ్లి, అక్కడి పరిస్థితుల గురించి గాంధీజీకి నివేదించేవారు. కొన్ని సార్లు చుట్టుపక్కల గ్రామాల నుంచి హరిజనుల్ని మధ్యాహ్న భోజనాలకు పిలిచేవారు.
గాంధీజీని కలవడానికి ఎందరో ప్రముఖులు వచ్చేవారు. విదేశాల నుంచి కూడా ముఖ్యమైన వ్యక్తులు వచ్చారు. ఆగ్నేయ ఆఫ్రికా నుండి వచ్చిన కుట్ బుటో అనే జర్మన్ యువకుడు మొదటి నుండి చివరి దాకా పాదయాత్రికులతోనే ఉన్నాడు. తనను తాను నాజీగా చెప్పుకునేవాడు. అతడు ఆ యాత్రలోని ప్రత్యేక ఆకర్షణల్లో ఒకడు. ఏకబిగిన పది పన్నెండు కొబ్బరిబొండాల నీళ్లు తాగేసేవాడు. పూరీలోని సియులాచౌక్ వద్ద ఇద్దరు చెకోస్లోవేకియా యువకులు యాత్రలో కలిశారు. పూరీ నుండి కటక్ దాకా ఠక్కర్ బాపా పాదయాత్రలో పాల్గొన్నారు. హరిజన్ సేవక్ సంఘ్ డిప్యూటీ సెక్రటరీ ఎన్.ఆర్. మల్కానీ బైరీ నుండి భద్రక్ దాకా నడిచారు. సతీష్ చంద్ర దాస్‌గుప్తా మొదట సియులాచౌక్ చేరుకున్నారు.
ఒరిస్సా పర్యటన తర్వాత బెంగాల్లో రెండు వారాలు గడపాలని గాంధీజీ అనుకున్నారు. దాంతో బెంగాలు తరఫున సతీష్ బాబు ఆ రెండు వారాలూ ఒరిస్సాలోనే గడిపారు. కటక్ నుండి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి హాజరు కావడానికి గాంధీజీ పాట్నా వెళ్లారు. తన పాదయాత్ర రెండో విడత ప్రారంభించడానికి తిరిగి ఆయన బైరీ స్టేషన్‌కు వచ్చారు. పాదయాత్ర అసలు గమ్యస్థానం బాలేశ్వర్. కానీ యాత్రికులు జాజ్‌పూర్ చేరుకున్నాక వర్షాలు మొదలుకావడంతో యాత్రని భద్రక్ వద్దనే ముగించవలసి వచ్చింది.
భారతదేశమంటే ఎంతో అభిమానం ఉన్న అగాథా హారిసన్ అనే ఆంగ్ల మహిళ రెండో విడత పాదయాత్రలో పాల్గొన్నారు. శాంతి పరిరక్షణ సంస్థ అయిన ‘సర్వీస్ సివిల్ ఇంటర్నేషనల్’ సభ్యుడు పియరీ సెరిసోల్, భూకంప బాధితులకి సహాయం చేయడానికి బీహార్ వచ్చారు. ఆయన కూడా గాంధీజీతో కొన్ని రోజులు గడిపారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో అప్పట్లో మీనూ మసానీ ముఖ్య నాయకుడు. ఆయన కూడా వచ్చి రెండు మూడు రోజుల పాటు యాత్రలో పాల్గొని, గాంధీజీతో చర్చలు జరిపారు. ఘనశ్యామ్‌దాస్ బిర్లా కూడా వచ్చారు. యాత్ర మొత్తంలోనూ అన్నింటికంటే తీవ్రంగా అసౌకర్యంగా ఉండే ఇంటారిపొఖరికి ఆయన చేరుకున్నారు. అక్కడ గాంధీజీ ఒక చిన్న గుడిసెలో బస చేశారు. మిగతావారంతా అరటి తోటల్లోనే ఉన్నారు. అక్కడ బిర్లాజీకి చుక్క పాలు కూడా సంపాదించడం కష్టమైపోయింది.
ప్రతి మజిలీలోనూ గాంధీజీ అస్పృశ్యతకు వ్యతిరేకంగా ప్రజలతో మాట్లాడేవారు. రాజుదా ఆయన ప్రసంగాలు అనువదించేవారు. గాంధీజీ ఒక వాక్యం మాట్లాడటం, వెంటనే అది అనువాదం కావడం జరిగేది. ప్రసంగాలు మరీ సుదీర్ఘంగా ఉండేవి కావు. కొన్ని కీలకమైన అంశాల్నే ప్రతిఒక్కసారీ మళ్లీ మళ్లీ ప్రస్తావించేవారు. గాంధీజీని కలవడానికి సుదూర ప్రాంతాల నుండి జనం వచ్చేవారు; కొందరైతే వేళకాని వేళల్లో కూడా వచ్చేవారు. పగటిపూట ఆయన ఆరుబయటే కూర్చునేవారు కాబట్టి సమస్య ఉండేది కాదు. కానీ రాత్రివేళల్లో జనం తరచూ ఆయన పడక దగ్గరకి వెళ్లి మరీ లాంతర్ల వెలుతురూ టార్చిలైట్లూ ఆయన ముఖంమీద వేసి ఇబ్బంది పెట్టేవారు.
కొన్ని సంఘటనలు నా మనసులో మెదులుతున్నాయి. ఒక్కోసారి మేం మఠాల్లోనో గుళ్లల్లోనో బస చేసేవాళ్లం. ఒకచోట ఒక చెక్క కంచెకు ఐదారు మూరల దూరంలో గాంధీజీకి పడక ఏర్పాటు చేసారు. గాంధీజీ మంచంమీద కూర్చుని ఉన్నారు. మా నాన్నగారు అది చూసి, ‘ఈ స్థలం అపరిశుభ్రంగా ఉంది, పామూపుట్రా తిరుగుతూండచ్చు. మంచం కాస్త ముందుకు జరుపుదాం’ అన్నారు. గాంధీజీ నవ్వుతూ, ‘గోపబాబూ, పాములే గనుక వస్తే, అవి ఇంకొంచెం ముందుకు రాలేవా?’ అని బదులిచ్చారు. ఆ పడక అక్కడే ఉండిపోయింది.
మరో మధ్యాహ్నం వేళ, ఉక్కపోత భరించలేక గాంధీజీ మామిడి తోపులోకి వెళ్లి కూర్చున్నారు. అక్కడ చెట్లనిండా పురుగులున్నాయి. అవి జనాన్ని నిరంతరం వేధిస్తూనే ఉన్నాయి. ఎవరో ఆ విషయమై విసుక్కోగా, గాంధీజీ స్పందిస్తూ: ‘వాటి తప్పేముంది? మనమే గనుక పురుగులమైతే, మనమూ అదే పనే చేస్తాం కదా’ అన్నారు. లేఖన్‌పూర్ నుండి సత్యభామపూర్ చాలా దూరంలో ఉంది. సమయం మించిపోయింది. గోపీనాథ్‌పూర్ వంతెన దగ్గర్నుండి గాంధీజీ పరుగు మొదలుపెట్టారు. దాదాపు అరమైలు దూరం ఆయన పరుగెత్తారు. అందరూ రొప్పుతూ ఆయన వెనుకే పరుగుతీశారు.
జాజ్‌పూర్ చేరుకోవడానికి ముందు, మేం బుధా నదీ తీరాన రాత్రి బస చేయాల్సి వచ్చింది. అక్కడ సాయంసంధ్యా ప్రార్థన ముగియగానే దట్టమైన నల్లటి మబ్బులు కమ్ముకుని చిరుజల్లులు మొదలయ్యాయి. అక్కడొక చిన్న కొట్టు ఉంది. గాంధీజీ, ఏడెనిమిది మంది స్త్రీలూ అక్కడి ఒక చిన్న గదిలో తలదాచుకున్నారు. ఏడెనిమిది మూరల పొడవున్న రెండు కొబ్బరి మట్టల తడకలు కనిపించాయి. సుమారు ఇరవై రెండు మందిమి ఉన్న మేం వాటిమీద ఒక టార్పాలిన్ కప్పి, దాని కింద ఆశ్రయం పొందాం. ఇవన్నీ సర్దుకునే లోపే కుండపోత వర్షం మొదలైంది. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది. మేమంతా రాత్రంతా అక్కడే ముడుచుకుని కూర్చుని కునుకుపాట్లు పడుతూ గడిపేశాం.
బాలేశ్వర్ జిల్లా తోడంగలో భారీగా వర్షం కురిసింది. భద్రక్ పదకొండు మైళ్ల దూరంలో ఉంది. తోడంగ నుండి భద్రక్‌లోని జీవరామ్‌జీ ఆశ్రమానికి ఎక్కడా ఆగకుండా నడిచి, అక్కడ రెండు రోజులు బస చేసి ఒరిస్సా పర్యటనను ముగించాలని నిశ్చయించుకున్నాం. ఉదయమే నడక మొదలుపెట్టి, దారిలో కాస్త విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నానికి భద్రక్ చేరుకున్నాం.
ఒకరోజు ఉదయం పాదయాత్రలో నడుస్తున్నప్పుడు, పట్టు కోసం గాంధీజీ నా భుజంమీద చేయి వేసి నడవడం మొదలుపెట్టారు. నేనేం చేస్తున్నాననీ, జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నాననీ అడిగారు. ఖగోళ శాస్త్రం చదవాలనుకుంటున్నానని చెప్పాను. నూలు వడకడం లాంటి పనులు చేస్తూనే చదువును కొనసాగించవచ్చని ఆయన చెప్పారు. నేను అవునన్నట్టు తలూపాను. ఆ సంభాషణ అంతటితో ముగిసింది. నిజానికి ఆ సమయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు స్పష్టమైన అవగాహన లేదు. ఒకవైపు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటున్నాను, ఆ పోరాటంలో భాగస్వామిగానే ఉండాలని నాకు తెలుసు. సోషలిజం ఆదర్శాల ప్రభావంతో నా మనస్సులో ఒక నూతన సమాజపు ఆశ రూపుదిద్దుకుంటోంది. మరోవైపు సైన్స్ ఛేదిస్తున్న రకరకాల రహస్యాలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా నాలో ఉంది. కానీ నాది స్వతహాగా బిడియపడే స్వభావం కావడంతో ఈ విషయాలు ఎవరితోనూ బాహాటంగా చర్చించేవాణ్ణి కాదు. అలాంటప్పుడు చివరకు గాంధీజీతోనైనా వాటి గురించి మాట్లాడగలగడం ఎలాగు?
(మన్మోహన్ చౌధురి (1905-2003) ప్రముఖ భూదానోద్యమ కార్యకర్త, విశిష్ట చింతనశీలి, లబ్ధప్రతిష్ఠుడైన రచయిత. ఈయన ఆత్మకథ ‘కస్తూరి మృగ సమ’ మొదట్లో ఏకవింశ శతాబ్దిలో ధారావాహికంగా ప్రచురితమైంది. ఆ తర్వాత 1995లో కహాణీ ప్రకాశని వారు దాన్ని పుస్తకంగా ప్రచురించారు. అందులోని ఈ భాగాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన భారతీ మహాపాత్ర పరిశోధక విద్యార్థిని.)
5-10-2026


ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన్మోహన్ చౌధురి గారి జ్ఞాపకాల్లో!!
గాంధీజీ మీద దాడి చేసి ఆయన్ని కొట్టడానికి పూరీ ఆలయ పూజారులు కుట్ర పన్నారన్న విషయం నిజంగా shocking గా ఉంది. టాగోర్ గారి సోదరుడు ద్విజేంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో షార్ట్‌హ్యాండ్ పద్ధతిని రూపొందించడం కూడా భలే interesting విషయం.
పాదయాత్రలో ఎన్ని weather conditions, అసౌకర్యాలు ఎదురైనా గాంధీజీ తన లక్ష్యాన్ని వదలకుండా ముందుకు సాగడం, తాము వాడుకున్న స్థలాన్ని శుభ్రం చేసి మరీ వెళ్లడం, తోటి బాటసారుల బాగోగులు స్వయంగా చూసుకోవడం, పురుగుల గురించి ఆలోచించడం చూస్తే, ఆయన చెప్పిన విలువలను తన రోజువారీ జీవితంలో ఏ విధంగా uncompromised గా పాటించేవారో తెలుస్తోంది.
ఇలాంటి చిన్న చిన్న సంఘటనల ద్వారా ఆ కాలంలోని political, social పరిస్థితులు, గాంధీజీ వ్యక్తిత్వం, ఆ రోజుల్లో ప్రజల ఆలోచనా విధానం కూడా తెలుస్తున్నాయి.
అవును. చరిత్రను ఎప్పుడూ మనం అటువంటి వ్యక్తిగత క్షణాల్లోనూ, నిశ్శబ్ద వేళల్లోనూ, తక్కిన వాళ్ళు అప్రధానం అనుకునే అతి చిన్న వివరాల్లోనూ పట్టుకోవాలి.
It’s such a great lesson to read, understand and feel how it used to be with Gandhiji and his followers. Despite having so many facilities I am scared and afraid of current times and future too. Daily reading of Gandhiji life is helping me to reflect myself and my life and hope to be a kind and good human being not just towards fellow human beings but also towards animals and insect without showing any difference towards any living beings. Thank you sir for all the amazing writing and work you are doing.
హృదయపూర్వక ధన్యవాదాలు సంతోష్!