రావిశాస్త్రి వారసులు

జూలై 31 న ఉదయిని సంస్థ తరఫున కూనపరాజు కుమార్ గారు రావిశాస్త్రి జయంతి సభ నిర్వహించారు. ఆ సభలో నలుగురు యువకథకులకు రావిశాస్త్రి పురస్కారం అందచేసారు. ఆ సభకు నేను అధ్యక్షత వహించాను. ఆ సందర్భంగా నేను చేసిన ప్రసంగం.


ఇది ఎంతో బరువైన వేదిక. ఇటువైపు భాగం బరువైనదా, అటువైపు భాగం బరువైనదా అని తేల్చడం కష్టం! ఒకవైపు పురస్కారాలు పొందుతున్న విశిష్ట కథకులు ఉంటే, మరోవైపు ఆ పురస్కార స్వీకర్తల గురించి మాట్లాడటానికి వచ్చిన ప్రముఖ సాహిత్యవేత్తలు ఉన్నారు. ఎంతో సంతోషకరమైన సాయంకాలం ఇది.

సాధారణంగా ప్రతి ఏటా డిసెంబర్, జనవరి నెలల్లో ఫ్లవర్ షోలు, హార్టికల్చర్ ప్రదర్శనలు జరుగుతుంటాయి. సరికొత్త పుష్ప జాతుల్నీ, వినూత్న ఫల జాతుల్నీ  తీసుకొచ్చి పరిచయం చేస్తారు; ఇప్పుడు కొత్త పుష్పజాతి ఏదైనా  ప్రవేశించిందా అని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తుంటారు. అలాగే, గత ఐదేళ్లుగా రావిశాస్త్రి గారి శతజయంతి (2022)తో మొదలుపెట్టి, ప్రతి ఏటా జూన్ నెలలో కూనపరాజు  కుమార్ గారు రావిశాస్త్రి కథా పురస్కార ప్రదానోత్సవాన్ని, ఆయన స్మరణ సభనూ కలిపి  నిర్వహిస్తున్నారు. ఇది కూడా ఒక రకంగా ప్లవర్ షో లాంటిదే.

ఇది రావిశాస్త్రి గారి 104వ జయంతి. ఈ సందర్భంగా రావిశాస్త్రి కథా పురస్కారాన్ని ఈరోజు నలుగురు ప్రతిభావంతులైన కథకులకు అందించబోతున్నారు.

2022లో ప్రారంభమైన ఈ ప్రస్థానంలో మొదట ఇద్దరు రచయితలకు—ఇండ్ల చంద్రశేఖర్, ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి గార్లకు ఈ పురస్కారాన్ని అందజేశారు. 2023 నాటికి ఆ సంఖ్య ముగ్గురైంది—ఝాన్సీ పాపుదేశి,  నాగేంద్ర కాశీ, రమేష్ కార్తీక్ నాయక్ గార్లకు లభించింది. 2024లో రావిశాస్త్రి గారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు విశాఖపట్నంలో జరిగిన సభలో శ్రీఊహ, మల్లిపురం జగదీశ్, సురేంద్ర శీలం గార్లకు ప్రదానం చేశారు. గతేడాది (2025) బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో రుబీనా పర్వీన్, మహి బెజవాడ, కరుణాకుమార్ గార్లకు అవార్డులు ఇచ్చారు.

ఈరోజు రావిశాస్త్రి గారి 104వ జయంతి సందర్భంగా—స్వర్ణ కిలారి, నరేష్ కుమార్ సూఫీ, మహమ్మద్ గౌస్, చరణ్ పరిమి గార్లకు ఈ పురస్కారాలను అందజేస్తున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు మొత్తం 15 మంది రచయితలకు ఈ పురస్కార గౌరవం దక్కింది.

సాధారణంగా అందరూ ‘పురస్కార గ్రహీత’ అనే పదం వాడుతుంటారు. కానీ నారాయణరెడ్డి గారు ఆ పదం వాడకూడదన్నారు. గ్రహీత అంటే లాక్కునేవాడు అని అర్థం; చాలా పురస్కారాలకు లాక్కునే గ్రహీతలే ఉంటారు. కానీ ‘స్వీకర్త’ అంటే సగౌరవంగా స్వీకరించేవాడు. అందుకే నేను పురస్కార స్వీకర్తలు అనే అంటాను. ఈ నలుగురూ ఎటువంటి ఒత్తిడీ తెచ్చి అవార్డులు తీసుకునేవారు కారు; ఎంతో సున్నితమైన మనుషులు. ఆ పురస్కార వరమాలలే స్వయంగా వీరిని వరిస్తున్నాయి.

ఈ నలుగురు రచయితల కథల గురించి మాట్లాడటానికి నలుగురు వక్తలు వచ్చారు. మీకూ, వారికీ  మధ్య నేను అడ్డుగా నిలబడదలచుకోలేదు. వీరంతా మాట్లాడి, పురస్కార స్వీకర్తలు తమ స్పందనను తెలియజేశాక, సమయం ఇంకా మిగిలి ఉండి,  మీక్కూడా వినడానికి  ఓపిక  ఉంటే అప్పుడు నేను రెండు మాటలు మాట్లాడతాను. ఎందుకంటే ఈ నాలుగు పుస్తకాలూ చదివిన ఆనందంలో, terribly excited గా  ఉన్నాను. నిజానికి ఈ వేదిక మొత్తం నాకే ఇచ్చి ఉంటే నాలుగు గంటలైనా నిరభ్యంతరంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను! అంతటి అసామాన్యమైన కథకులు ఈరోజు మన ముందున్నారు.

ఈ కథలు చదువుతుంటే—నా ఇరవై ఏళ్ల వయసులో రావిశాస్త్రి గారిని, కాళీపట్నం రామారావు గారిని చదివిన నాటి రోజులు, హైస్కూల్ రోజుల్లో ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా వచ్చే ‘అమరావతి కథలు’ చదివిన నాటి అనుభవాలు గుర్తొచ్చాయి. చిన్నతనంలో, యవ్వనంలో ఆ మహనీయుల కథలు చదువుతున్నప్పుడు వారిని ఏదో ఆకాశంలో విహరించే ఐంద్రజాలిక శక్తులుగా భావించేవాడిని. పాతికేళ్ల కిందట ‘వందేళ్ల తెలుగు కథ’ సంకలనం చేసే సమయంలో ఖదీర్ బాబు, గోపిని కరుణాకర్ లాంటి నాటి యువ కథకుల కథలు చదివినప్పుడు కలిగిన పారవశ్యం నాకు గుర్తుంది. గత ఐదేళ్లుగా జరుగుతున్న ఈ సభల్లో, కిందటేడాది ఒక్క సభ మినహా, కుమార్ గారి అభిమానం వల్ల నేను ప్రతి ఒక్కసారీ వేదికమీద  భాగస్వామినవుతున్నాను. ప్రతిసారీ కొత్త కథకులు నన్ను ఆశ్చర్యానందాలలో ముంచెత్తుతున్నారు. నా చిన్నతనంలో ఆ మహారచయితలను చదివినప్పుడు ఎంతటి దిగ్భ్రమ, పారవశ్యం కలిగేవో—ఈ నలుగురి పుస్తకాలు చదువుతున్నప్పుడూ నాకు సరిగ్గా అంతే సంతోషం కలిగింది.

ఈ సందర్భంగా రావిశాస్త్రి గారి గురించీ, కుమార్ కూనపరాజు గారి గురించీ ఒకట్రెండు మాటలు ప్రస్తావించాలి. కొంతమంది మనతో నిత్యం ఎంతో సన్నిహితంగా ఉంటూ సాధారణంగా కనిపిస్తారు; మనం వారిని ‘టేకెన్ ఫర్ గ్రాంటెడ్’గా తీసుకుంటాం. కుమార్ గారి మామగారి ఇల్లు నేనుండే ఇంటికి పక్కనే కావడం వల్ల కుమార్ గారూ నాకు అలాగే పరిచయం. అయితే మొన్న గోర్కీ కథల పుస్తకావిష్కరణ రోజున, జిల్లా జడ్జిగా పనిచేస్తున్న వారి కాలేజీరోజుల  మిత్రురాలు ఒకరు కుమార్ గారు, ఆయన శ్రీమతి గారి జీవితం గురించి మాట్లాడినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. వీళ్లు ఎప్పుడూ తమ గురించి గొప్పగా చెప్పుకోరు. అందుకని ఆ తర్వాత నేను కుమార్ గారిని కలిసి వారి జీవిత ప్రస్థానం గురించి అడిగి తెలుసుకున్నప్పుడు అది ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది.

జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా సాహిత్యాన్ని నమ్ముకుని నడిచిన అద్భుతమైన ప్రయాణం వారిది. ఒక నిజమైన మార్క్సిస్ట్ ఎలా ఉండాలో కుమార్ గారిని చూసి తెలుసుకోవచ్చు. మార్క్సిజం అంటే పాతకాలపు మూసల్లో గిరి గీసుకుని కూర్చోవడం కాదు; కేవలం సిద్ధాంత గ్రంథాల పాండిత్యంతో ఎదుటివారిని భయపెట్టడం కాదు. మార్క్సిజం అనేది ఒక ‘థియరీ ఆఫ్ ప్రాక్సిస్’—అది ఆచరణలో కనిపించాలి. మార్పును నిరంతరం ఆహ్వానించాలి. కుమార్ గారిలో అదే కనిపిస్తుంది. శ్రీశ్రీ తనకు మోపాసా, ఓహెన్రీ, చెకోవ్ గురువులని చెప్పుకున్నట్టు—కుమార్ గారికి ప్రేమచంద్, చెకోవ్, రావిశాస్త్రి  గురువులు.

రావిశాస్త్రి గారి స్మృతిని ఆయన కాపాడుతున్న తీరు అసాధారణమైనది. రావిశాస్త్రి గారు ఎప్పటికప్పుడు పాఠకుడిని నిశ్చేష్టుడిని చేసే రచయిత; ఆయన రచనలు మనల్ని disturb చేస్తాయి. అటువంటి రచయితను ఏదో ఒక చిత్రపటానికి పరిమితం చేసి, మొక్కుబడిగా సభలు నిర్వహించడం నిజమైన నివాళి కాదు. రావిశాస్త్రి గారూ, కారా మాస్టారూ  వెలిగించిన ఆ కథా దీపాలను చేతబూని నడిచే నేటి తరం కతా రచయితలు ఎవరు, వారి నిజమైన వారసులు ఎవరు అని వెతికి పట్టుకుని, వారికి పురస్కారాలు అందించి ప్రోత్సహించడమే రావిశాస్త్రి గారికిచ్చే అసలైన నివాళి!

ఈ రోజుల్లో రావిశాస్త్రి పుస్తకాలు దొరకలేదనో, చదవలేకపోయామనో ఎవరైనా అనుకుంటే—ఈ నలుగురు యువ రచయితల పుస్తకాలు చదివితే మీరు రావిశాస్త్రి గారిని చదివినట్లే భావించవచ్చు!

ఇప్పుడు వేదికను వక్తలకు అప్పగిస్తున్నాను. ..

మలిమాటలు

పురస్కార ప్రదానాలూ, పుస్తకాల పరిచయాలూ, కథకుల స్పందనలూ కూడా పూర్తయ్యాయి. అయినా కూడా ఇంకా కొంత సమయం మిగిలింది. అలాగని నేనేమీ నాలుగు గంటలు మాట్లాడబోను గానీ, వక్తలు చెప్పని కొన్ని అంశాలను ప్రస్తావిద్దామనుకుంటున్నాను.

మొదటిది—చరణ్ చెప్పినట్టు పురస్కారాలు. పురస్కారాల్లో ఎంత డబ్బిచ్చారు, ఎవరిచ్చారు అన్నది ముఖ్యం కాదు; పురస్కారాలు రెండు పనులు చేస్తాయి. ఒకటి, ఆ పుస్తకాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడం. నోబెల్ బహుమతికి ఎందుకు అంత విలువ ఉందంటే—మారుమూల దేశంలో ఉన్న రచయితకు నోబెల్ రాగానే ఆయన అంతర్జాతీయ రచయితగా మారిపోతాడు, ఆయన రచనలను ప్రపంచమంతా చదువుతుంది. అలాగే ఈ పుస్తకాలకు రావిశాస్త్రి పురస్కారం లభించి ఉండకపోతే, నేను ఆ రచయితల వెంటపడి పుస్తకాలు తెప్పించుకుని చదివి ఉండేవాడిని కానేమో. పురస్కారం ఒక పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చి, దానిపై అందరి దృష్టీ కేంద్రీకృతమయ్యేలా చేస్తుంది.

రెండోది—ఆ రచన ఏ జీవితాన్ని చిత్రించిందో, ఆ మూగ బాధలకు గొంతునిస్తుంది. సాధారణంగా చాలామంది సమస్యలను కవి లేదా రచయిత రాస్తాడు; సమాజానికి లేని గొంతును అతడు ఇస్తాడు. ఇప్పుడు ఈ నలుగురు రచయితలను చూస్తే—కుమార్ కూనపరాజు గత ఐదేళ్లుగా చేస్తున్న కృషి ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఒక స్త్రీ, ఒక మైనారిటీ రచయిత, ఒక దళిత రచయిత, ఒక వెనుకబడిన తరగతికి చెందిన రచయిత- అంటే సమాజంలో అణగారిన, అట్టడుగున ఉన్న, లేదా ప్రధాన స్రవంతి నిర్లక్ష్యానికి, అవమానాలకు గురవుతున్న సమూహాల నుంచి వచ్చిన రచనలివి. ఈ నాలుగు పుస్తకాలు నా దృష్టిలో సరికొత్త కుల పురాణాలు, సరికొత్త జాతి పురాణాలు. ఈ రచయితలు ఆయా సమూహాల అనుభవాలకు వాహకాలు మాత్రమే. ఎవరికైతే గొంతు లేదో, ఎవరైతే తమ గోడు చెప్పుకోలేరో, చెప్పుకోవచ్చన్న స్పృహ కూడా ఎవరికైతే ఉండదో—వాళ్ల తరఫున వీళ్లు నిలబడి మాట్లాడుతున్నారు.

ఈ నలుగురినీ కలిపి ఉంచిన ప్రధాన అంశం ఇదే. రావిశాస్త్రి పురస్కారం అంటే కేవలం ఆయన కథాశిల్పాన్నో, వ్యక్తినో గౌరవించడం మాత్రమే కాదు; అట్టడుగు వర్గాల జీవన సత్యాలను ఆవిష్కరించడం. “దాచేస్తే దాగని సత్యాలు” అంటారు కదా—ఇవి వాటంతట అవే బయటకు వచ్చిన కథలు.

ఇందులో మరో ముఖ్యమైన అంశం ఉంది. వీళ్లు కేవలం ఆయా ప్రాంతాల్లోనే ఉండిపోయి ఉంటే—స్వర్ణ కొత్తగూడెంలో, గౌస్ తాడిపత్రిలో, చరణ్ మార్కాపురంలో లేదా సూఫీ గోదావరిఖని మంగలి పల్లిలోనే ఉండి ఉంటే—ఈ కథలు రాయగలిగేవారా? రాయలేరు. రాయగలిగి ఉంటే అక్కడ ఉన్న మిగతావారూ రాసేవారు కదా. ఈ కథలు రాయడానికి వాళ్లు చూసిన వాస్తవ జీవితాలే పునాది; ఇవన్నీ దాదాపుగా స్వీయ అనుభవాల నేపథ్యం ఉన్న కథలే. కానీ, వాళ్లు అనుభవించిన జీవితానికీ , ఇప్పుడు రాస్తున్న జీవితానికీ  మధ్య ఒక గొప్ప పరివర్తన జరిగింది.

ఒక రకంగా చెప్పాలంటే—వేంపల్లె షరీఫ్ చరణ్ పరిమి కథలతోనో, సూఫీ కథలతోనో, పద్మ లేదా స్వర్ణ కథలతోనో ఐడెంటిఫై అయి ఉండవచ్చు. కానీ నేను ఈ ఏ ఒక్క సామాజిక వర్గానికీ చెందినవాడిని కాకపోయినా, వీరి నలుగురి కథలతోనూ పూర్తిగా మమేకమయ్యాను. నేను ఆ వివక్షను, ఆ అవమానాలను నేరుగా అనుభవించకపోయినా, కళ్లారా చూశాను. అంతేకాదు, నన్ను వీళ్లతో కలిపే ఒక ఉమ్మడి సూత్రం ఉంది—వాళ్లలాగే నేను కూడా ఒక ‘ఇంటర్నల్లీ డిస్‌ప్లేస్డ్’ కుటుంబానికి చెందిన మనిషిని.

ఎవరు గొప్ప రచయిత కాగలరంటే—ఏ మొక్క లేదా చెట్టు అయితే తన మూలాల నుంచి పెళ్లగించబడి, మరొక చోట, తనది కాని పరాయి నేలపై బతకాల్సి వస్తుందో, ఆ అంతర్గత స్థానభ్రంశంలో కోల్పోయిన ప్రపంచాన్ని, ఆ Paradise Lost ని  తలుచుకున్నప్పుడు పుట్టే శక్తి అసాధారణమైనది. డాంటే ‘డివైన్ కామెడీ’ రాసినట్టుగా—నువ్వు ‘ఇన్‌ఫెర్నో’ (నరకం) లో తిరిగి ఉండాలి, ‘పర్గేటరీ’ (శుద్ధి స్థలం)లో ప్రక్షాళన అయి ఉండాలి, ఆ తర్వాతే ‘పారడైజ్’ అర్థమవుతుంది. ఇక్కడ పారడైజ్ అంటే విలాసవంతమైన జీవితం కాదు; ‘ఓహో, నా అనుభవం వెనుక ఇంత ప్రయాణం ఉందా? ఇదా నా జీవితం?’ అనే ఆత్మసాక్షాత్కారం పునఃపరిశీలన. ఆ ఎరుక వల్ల వారి అనుభవాలు సార్వజనీనమైన కళా రూపాలుగా మారతాయి.

ఉదాహరణకు, నరేష్ కుమార్ సూఫీ రాసిన ‘మెమరీస్ ఆఫ్ మంగలిపల్లె’ పుస్తకం. రెండేళ్లుగా ఫేస్‌బుక్‌లో ఈ కవర్ పేజీ చూస్తున్నా కానీ, ఇప్పుడు చదివినప్పుడు కలిగిన పులకింత మాటల్లో చెప్పలేనిది. ‘ఇవన్నీ విషాదభరితమైన కథలు కదా, చదివితే ఏడుపు రావాలి కానీ పులకింత కలగడం ఏమిటి?’ అని ఎవరైనా అడగవచ్చు. అక్కడే కళాత్మక సత్యానికీ, ప్రచారాత్మక సత్యానికీ  ఉన్న తేడా తెలుస్తుంది. కళాత్మక సత్యం విషాదాన్నే ఆవిష్కరిస్తుంది, కానీ ఆ విషాదం వెనుక ఒక అంతర్దృష్టిని కలిగిస్తుంది.  ఒక epiphany ని మేల్కొల్పుతుంది. రగిలిస్తుంది. ఆ ఎపిఫనీ వల్లనే సమాజం ముందుకు సాగుతుంది.

ఈ కథలు చదువుతుంటే నాకు ‘అమరావతి కథలు’ గుర్తొచ్చాయి. శంకరమంచి సత్యం గారు రాసిన అమరావతి కథల్లో కోల్పోయిన వైభవం తాలూకు ఒక కాల్పనిక, మనోజ్ఞ ప్రపంచం కనిపిస్తుంది. కానీ 50 ఏళ్ల తర్వాత వచ్చిన ‘మెమరీస్ ఆఫ్ మంగలి పల్లె’ నాస్టాల్జియా కాదు; ఇది కళ్లారా చూసిన నెత్తురూ మాంసాల వాస్తవికత. ఇందులో ప్రతి కథ చివర ఒక హత్యో, ఆత్మహత్యో, మరణమో కనిపిస్తుంది. ఆ మరణం ఒక మనిషిది మాత్రమే కాదు—ఒక గ్రామం, ఒక ప్రాంతం, ఒక సంస్కృతి తాలూకు విధ్వంసం. గోపీనాథ్ మొహంతి ‘అమృత సంతానం’ నవలలో కొండజాతుల అడవుల్లోకి ఎర్రటి మట్టి రోడ్డు చొచ్చుకురావడం వల్ల జరిగే విధ్వంసాన్ని చిత్రించారు. ఇక్కడ కూడా ఓపెన్‌కాస్ట్ మైనింగ్ అనే భూతం పల్లెలను మింగేస్తున్న తీరు కనిపిస్తుంది. ప్రొక్లెయిన్ డ్రైవర్‌మొదలుకుని  ఎన్నో పనులు చేసి, జీవితాన్ని అట్టడుగు స్థాయి నుంచి చూసిన సూఫీ అనుభవాల పరిణితి ఈ కథల్లో కనిపిస్తుంది. గోర్కీ రాసిన ‘నా బాల్యం’, ‘నా బాల్యసేవ’ , ‘నా విశ్వవిద్యాలయాలు’ గుర్తుకొస్తాయి. ‘చెట్ల భోజనం’ కథ చివర అతను “ఇది ఒక బహుజన సామూహిక సంతర్పణ” అని రాసిన ఒక్క వాక్యంలో ఎంత జీవితానుభవపు సారం ఉందో స్పష్టమవుతుంది.

అలాగే స్వర్ణ కిలారి కథల సంపుటి. స్త్రీల అస్తిత్వం, హక్కుల పట్ల అపారమైన ఆవేదన, ఆగ్రహం ఉన్నప్పటికీ—ఆమె శైలిలో అద్భుతమైన సౌందర్య దృష్టి ఉంది. తిలక్ అన్నట్టు, ఏకకాలంలో ఆమె  అమృతాన్నీ కురిపిస్తుంది, అగ్నినీ కురిపిస్తుంది. ఆమె రాసిన ఒక పేరా చూడండి:

ఒక వాటర్‌కలర్ పెయింటింగ్ లాంటి అద్భుత చిత్రణ ఇది. ఇంత సున్నితత్వం ఉన్న రచయిత్రే—

అంటూ సమాజపు కట్టుబాట్లపై అగ్నిని కురిపిస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి ‘ఇంటర్నల్లీ డిస్‌ప్లేస్డ్’ వ్యక్తులు స్త్రీలే. పుట్టిల్లు వదిలి పరాయి ఇంటికి వెళ్లాల్సిన స్థితి వారిది. అలాంటి స్త్రీలకు ఒక భరోసానిచ్చే మాటను ఎంత గొప్పగా రాసింది! అలాగే ఆ క్షణం అతను సాధారణత్వం సాధించాడు” అనే వాక్యం జెన్ తత్వచింతనను స్ఫురింపజేస్తుంది. జ్ఞానోదయానికి ముందు కొండలు కొండలుగానే ఉంటాయి; సాధనలో కొండలు వేరేగా కనిపిస్తాయి; జ్ఞానోదయం పొందాక మళ్లీ కొండలు కొండలుగానే కనిపిస్తాయి—అదే ఈ సాధారణత్వం!

ఇక మహమ్మద్ గౌస్ రాసిన ‘అమ్మ పనికి పోయింది’ కథ నన్ను ఎంతగానో కదిలించింది, కంటతడి పెట్టించింది. మన దృష్టిలో ‘వర్కింగ్ ఉమెన్’ అంటే ఆఫీస్ బ్యాగ్ తగిలించుకుని తొమ్మిదింటికి వెళ్లి సాయంత్రం బస్సెక్కి వచ్చే మహిళ మాత్రమే. కానీ వేకువజామునే ముఖం కూడా కడుక్కోకుండా ఇళ్లల్లో పనులకు పరిగెత్తే శ్రామిక మహిళలను, ఆ తల్లుల సమయం కోసం పరితపించే పిల్లల ఆర్తిని ఆయన అత్యంత ఆర్ద్రంగా చిత్రించారు. ఇది చదువుతున్నప్పుడు హంగేరియన్ మహాకవి అట్టిలా జోసెఫ్ తన తల్లిపై రాసిన కవితలు, అలాగే శ్రీకాంత్ కవిత్వం గుర్తొచ్చాయి. డాస్టొయెవ్‌స్కీ, కాఫ్కా, వాంగ్ కార్-వైల ప్రపంచ స్థాయి దృక్పథాన్ని తన కథల్లో ఒంటబట్టించుకున్న పరిణతి గౌస్ రచనల్లో కనిపిస్తుంది.

చరణ్ పరిమి కథల్లో మార్క్సిస్ట్, అంబేద్కరిస్ట్, బౌద్ధ తాత్విక స్పష్టత చాలా బలంగా ఉంది. అయితే ఆయన ఒక ప్రచారకుడిగా  కాకుండా, కథాశిల్పానికి పూర్తి న్యాయం చేశారు. ప్రకాశం జిల్లాతో నాకున్న అనుబంధం, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంత చారిత్రక నేపథ్యం ఆయన కథల్లో అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. చారిత్రక సత్యానికి, కళాత్మక సత్యానికి మధ్య ఉండాల్సిన

సమతుల్యతను ఆయన ఏమాత్రం తప్పలేదు. బౌద్ధ, సనాతన ధర్మాల సంఘర్షణల నేపథ్యంలో సాగే కథలో ‘పట్టుచీర’ అనే అంశాన్ని ఫోకల్ పాయింట్‌గా నిలబెట్టి, శిల్పరీత్యా అత్యున్నత స్థాయి కథను అందించారు. ఒక మనిషి తన జీవితంలో అవమానాన్ని స్వయంగా అనుభవించడం ఒక ఎత్తయితే, దానిని కళగా మలచడానికి అపారమైన సంయమనం అసిధారావ్రతం లాంటి సాధన అవసరం. ఆ పరీక్షలో ఈ రచయితలు నెగ్గారు.

చివరగా, నాదొక చిన్న విజ్ఞప్తి. మొదటి, రెండో కథా సంపుటాలు తీసుకురావడం సులభమే; అనుభవాలు కొత్తగా ఉంటాయి కాబట్టి పాఠకులనూ ఆకట్టుకుంటాయి. కానీ ఆ తర్వాత అదే విషయాలు పునరావృతం కాకుండా ఉండాలంటే, మీరు చిన్న నవలల వైపు దృష్టి సారించాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వంద, నూట ఇరవై పేజీల చిన్న నవలలకే ఆదరణ పెరుగుతోంది. కథ కంటే పెద్దది, నవల కంటే చిన్నదైన ఈ ప్రక్రియలో ఒకే అంశాన్ని మరింత శక్తిమంతంగా చెప్పవచ్చు.

విభిన్న గొంతుకలైన ఈ నలుగురు రచయితలను, వారి నూతన జీవన పురాణాలను సమాజం ముందుకు తీసుకొస్తున్న కుమార్ కూనపరాజు దంపతులకు, వారి కుటుంబానికి, ఉదయిని సంస్థకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.

( ఉదయిని వెబ్ పత్రిక సౌజన్యంతో)

31-8-2026

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading