I’M A POET, BUT I CAN’T COMPOSE ONE

Reading Time: 3 minutes
తాడికొండలో మా ప్రిన్సిపాలు గారు మా డైనింగుహాల్లో కొత్తగా డైనింగు టేబుళ్ళు ఏర్పాటు చేయించినప్పుడు కొన్ని చిత్రలేఖనాల ప్రింట్లు కూడా తెప్పించి పటాలూ కట్టించి ఆ గోడలకి పెట్టించారు.
 
అవి ఆధునిక భారతీయ చిత్రకారులు గీసిన చిత్రాలు. నాలుగు వైపులా నాలుగు చిత్రలేఖనాలు ఉండేవి. ఒకటి అమృత షెర్ గిల్ గీసిన Three Sisters, మరొక రెండు ఎవరివో గుర్తు లేవు, కాని నాలుగవది మాత్రం, నా మనసులో ముద్రపడిపోయింది, కె.కె.హెబ్బర్ చిత్రించిన The Birth of Poetry. తక్కిన రెండు చిత్రాల్లో కూడా ఇకదాంట్లో ఒక తల్లీ, పిల్లా తుపానుకి ఎదురేగుతూ ఉంటారు. మరొకదాంట్లో ఒక పిల్లవాడు గేదెనెక్కి చెరువులో సవారీ చేస్తుంటాడు.
 
అసలు అలా డైనింగ్ హాల్లో ఆ చిత్రలేఖనాలు పెట్టవచ్చుననే ఆ అభిరుచికి మా ప్రిన్సిపాలు సుగుణమ్మగారికి మరీ మరీ ప్రణామాలు చేస్తున్నాను. ( ఇప్పుడు విజయవాడలో, గుంటూరులో, మంగళగిరిలో ఎన్నో ప్రభుత్వకార్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మరెన్నో భవనాలు ఉన్నాయి. ఒక్కదాంట్లో, ఒక్కటంటే ఒక్కదాంట్లో కూడా ఒక్క చిత్రలేఖనం కూడా నేను చూడలేదు.)
నా పసితనంలో ప్రతిరోజూ రోజూ ఆ డైనింగ్ హాల్లో అడుగుపెట్టినప్పుడల్లా ఆ బొమ్మలు నా హృదయాన్ని ఏదో లోకంలోకి తీసుకుపోతూ ఉండేవి. నేను కూడా అలాంటి చిత్రలేఖనాలు గియ్యాలని అనుకోవడం ఒకటి, మరొకటి, ఆ అమృత షెర్ గిల్ బొమ్మలోలాంటి ఆ అక్కచెళ్లెళ్లతో స్నేహంచేయాలనీ, మరో బొమ్మలోలాగా మా ఊళ్ళో ఒక గేదెనెక్కి చెరువులో అంచుల్లో తిరుగుతూ తామరతూళ్ళు తియ్యాలనీ కోరిగ్గా ఉండేది.
 
ఆ బొమ్మల్లోకి నాకు ఒక పట్టాన ప్రవేశం దొరకనిది హెబ్బర్ గీసిన చిత్రమే. ఆ బొమ్మ వాల్మీకి మీద గీసిన చిత్రమని తెలుస్తూనే ఉండేదిగాని, అందులో చిత్రకారుడు ఏమి చెప్తున్నాడో ఒకపట్టాన బోధపడేదికాదు.
 
మరొక అయిదారేళ్ళ దాకా.
 
నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు చెక్కుచెదరని ప్రపంచాన్నొకటి వెంటబెట్టుకు వెళ్ళాననీ, అక్కడి మిత్రులు ఆధునికత గురించి నాతో మాట్లాడుతున్నప్పుడు, ఆ ప్రపంచం స్థానంలో ముక్కలవుతున్న ప్రపంచమొకటి కనిపించడం మొదలయ్యిందనీ చెప్పాను కదా. నా పసితనపు మహామధుర ప్రపంచం ఎప్పుడు బీటలు వారడం మొదలుపెట్టిందో తెలియదుగానీ, పూర్తిగా పగిలిపోయిన రోజు మాత్రం నాకు గుర్తుంది.
 
21-5-1984.
 
ఆ రోజు ఏమి జరిగిందో నాకు తెలీదు గానీ, ఇదిగో, ఈ కవిత రాసాను.
 
ఆధునిక తెలుగు కవిత్వంలో alienation అనే భావనని మొదటిసారిగా విస్తృతంగా పరిచయం చేసిన వాణ్ణి నేనే. Fragmentation అనే పదాన్ని తెచ్చినవాణ్ణీ నేనే. ఆ పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో (1986) ఇలా రాసాను:
 
‘కవి సమాజం నుంచి వేరుపడటానికి ముందే మనిషే వేరుపడిపోయాడు. శ్రమకి దూరంగా ఉండటమంటే ఋతువులకి దూరంగా ఉండటమే అని రాస్తాడు ఖలీల్ జిబ్రాన్. తన శ్రమకీ, శ్రామిక విధానానికీ, ఫలితాలకీ -పరాయి కావడం మొదలుపెట్టగానే మనిషి తన చైతన్యంలోని ఒక సాంఘికమైన భాగానికి కూడా అపరిచితుడు కావడం మొదలుపెట్టాడు. అంతదాకా ఈడెన్ ఉద్యానంలో ఆది స్త్రీ పురుషులు స్వేచ్ఛగా, నిర్భయంగానే తిరిగారు. కాని నిషిద్ధఫలం వాళ్లని సర్వేశ్వరుడినుంచే దూరం చేసింది. ఆయన్ను చూస్తే సిగ్గుపడాల్సి వచ్చింది. తన essential nature కి పరాయి కావడంతో మనిషి తన పక్కమనిషికి కూడా పరాయి వాడయిపోయాడు. ఈ పరాయీకరణమే కవిని సృష్టించింది..’
 
నా మిత్రులు ప్రపంచం బీటలు పడిందని మాత్రమే చెప్పారు. నేను దుఃఖంతో, ఆగ్రహంతో, బెంగతో దాన్ని బద్దలు గొట్టేసాను. ఈ కవిత రాసిందాకా నేను కూడా ఏదోను ఉద్యానవనంలో విహరించినవాణ్ణే. కాని మొదటిసారి స్వర్గచ్యుతి సంభవించింది. పోగొట్టుకున్న ఆ స్వర్గం కోసం ఆ తర్వాత నలభయ్యేళ్ళుగా కవితలు పట్టుకుని గాలిస్తూనే ఉన్నాను.
 
 

నేను కవిత్వం రాయలేని కవిని

 
అన్ని శిఖరాల్ని ఒదిలి
దుర్భేద్య దుర్గంలాంటి వల్మీకం లోపలకి చొచ్చుకుపోవటమొక్కటే
గత్యంతరం అయినవాణ్ణి.
 
సగం సగం చొరబడ్డ వెనుక
ఎందుకిలా మహతిని మోగిస్తో వూగిస్తారు?
 
ఏది ఋజువో, ఏది నిజమో
నన్నెందుకు ప్రశ్నిస్తారు?
 
కావచ్చు, స్వతహా వేటగాణ్ణి
కనుకనే దెబ్బతిన్న కపోతం బాధ నాకెరుక.
 
కాని ఇపుడెవర్నీ శపించలేను
నా విషాదం నుండి ఏ ఇతిహాసమూ జనించదు.
 
నా నుంచి నేను తొలగించబడ్డాను,
కావటానికి జీవితాన్ని ఎంతో ప్రేమించినవాణ్ణే
అయితేనేం, దుర్నిరోధ పలాయనం.
 
ఈ వల్మీకం నాకు కవచం,
కావ్యారంభ సమాధి కాదు.
నేను అభిశప్త మానవుణ్ణి,
కవిని కాను.
 
(కె.కె.హెబ్బర్ చిత్రం The Birth of Poetry ని గుర్తు చేసుకుంటూ)
 
21-5-1984
 
I’M A POET, BUT I CAN’T COMPOSE ONE
 
Leaving all the mountain peaks behind,
I chose an anthill to burrow into.
 
While I was halfway sloughed in the anthill,
Why do you call upon the muses?
Why do you ask me alone?
What’s straight as an arrow and right as a line?
 
Being a hunter,
I understand the pain of an injured bird.
But I can no longer curse anyone,
Nor will my sorrow become epic.
I’m rooted out of myself.
 
I too loved this life to the brim.
Then what?
I have moved far throughout.
 
It is my armour, this anthill,
Not a place to meditate.
I am a cursed man,
Not a poet.
 
(After K.K. Hebbar’s painting The Birth of Poetry)
 
7-7-2022

Leave a Reply

%d bloggers like this: