A LANGUID DREAM

Reading Time: 3 minutes
నా కవితలు పుస్తక రూపంలో తేవాలని నేనెన్నడూ అనుకోలేదు. కాని ఒకరోజు మా అన్నయ్య నా కవితలు, అప్పటికి ఇరవయ్యో, ముప్పయ్యో నా దగ్గరుంటే, వాటిని పట్టుకెళ్ళి సాంస్కృతిక శాఖ కార్యాలయంలో ఇచ్చాడు. అప్పుడు పి.వి.ఆర్.కె ప్రసాద్ గారు సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా ఉండేవారు. రచయితలు తమ పుస్తకాలు వేసుకోడానికి ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించే పథకం ఒకటి ఆయన ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఆ పథకం తెలుగు విశ్వవిద్యాలయం కొనసాగించింది. అందులో భాగంగా మా అన్నయ్య నా కవిత్వం పుస్తకంగా తేవడానికి అప్లికేషను పెట్టాడు. డిపార్ట్ మెంటు 1800 రూపాయలు సహాయం మంజూరు చేసింది. కాని మొదటి విడత 900 మాత్రమే నాకు అందింది. మిగిలిన సగం ఇప్పటికీ నాకు అందనే లేదు. మంజూరు అయ్యిందో లేదో కూడా తెలియదు.
 
రాజమండ్రిలో ప్రింటోఫైన్ అని ఒక ప్రెస్ ఉండేది. కోటగుమ్మం సెంటర్ లో ఉండేది. ఆ ప్రెస్సు అధినేత ప్రతాప్ సుబ్రహ్మణ్యం కి చాలా మంచి మిత్రుడు. అందుకని సుబ్బూ మాట మీద ఆ పుస్తకం వేసాడు. తీరా ప్రభుత్వం సగం డబ్బు మాత్రమే మంజూరు చెయ్యడంతో నాకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. సుబ్రహ్మణ్యం కి చెప్తే ఏదో ఒకవిధంగా సర్దుతాడు కాని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే ప్రింటోఫైన్ ప్రతాప్ ఆ పుస్తకాన్ని కొంత నష్టం భరించే వేస్తున్నాడని నాకు అనుమానం. నేను ఒకరోజు ఈ సంగతి నా మిత్రుడు సోమయాజులుకి చెప్తే వాడు వెయ్యి రూపాయలిచ్చాడు.
దాంతో పుస్తకం ప్రెస్సు నుంచి బయటకు వచ్చింది.
 
ఆ పుస్తకానికి కవర్ పేజీ ఏమి వెయ్యాలన్నది చాలా పెద్ద చర్చ. ఏదైనా శిల్పం ఉంటే బాగుంటుందని గోపీచంద్ అనడంతో రాజమండ్రిలో రాళ్ళబండి సుబ్బారావు మూజియంకి వెళ్ళాం. అక్కడ 17 వ శతాబ్దానికి చెందిన మాతృదేవత శిల్పం ఒకటి కనబడింది. ఆ శిల్పం మాకోసమే ఎదురుచూస్తున్నట్టుంది. ఆ శిల్పం ఫొటో తీసాక దాన్ని సెపియా టోన్ లో ప్రింట్ చేయిస్తే బాగుంటుంది అన్నాడు సుబ్బూ. ఆ శిల్పం కింద పుస్తకం పేరు మరో మిత్రుడు చట్టి హనుమంతరావు రాసాడు. కింద నా పేరు నా సంతకాన్నే బ్లాకు చెక్కించాం.
 
ఆ పుస్తకావిష్కరణ చాలా ఘనంగా జరిపారు మిత్రులు. గౌతమీ లైబ్రరీలో బాబాయమ్మ మెమోరియల్ హాల్లో. ఆ సభ జరపడానికి అయిన ఖర్చంతా గోపీచంద్ పెట్టుకున్నాడు. నాకు చిన్నప్పుడు బమ్మెర పోతన కవిత్వాన్ని పరిచయం చేసిన మా బామ్మగారి తోటే ఆ పుస్తకం ఆవిష్కరింపచేసాం. మల్లంపల్లి శరభయ్యగారు, ఆర్.ఎస్.సుదర్శనంగారు మాట్లాడేరు. నాకు తెలిసి మా కుటుంబాల్లో ఒక రచయిత పుస్తకం ప్రింటయి ఆవిష్కరణకు నోచుకోవడం అదే మొదటిసారి. అప్పటికి నాకు 23 ఏళ్లు.
 
నిర్వికల్ప సంగీతంలో మొత్తం 69 కవితలు ఉన్నాయి. అందులో మొదటి కవిత 1976 లో నేను తాడికొండలో ఉన్నప్పుడు గీతాంజలి చదివిన సమ్మోహంలో రాసిన కవిత. అది రాసి వినిపించినప్పుడు మా హీరాలాల్ మాష్టారు నీకు కవిత్వం పలుకుతోందయ్యా అన్నారు. ఆ మాట నాకు ఊపిరిపోసింది. చివరి కవిత 1986 లో రాసింది. చాలా పెద్ద కవిత. అప్పటికి బైరాగి నన్ను పూర్తిగా ఆవహించి ఉన్నాడు. ఆ మధ్య పదేళ్ళ కాలంలో, ఎన్నో అనుభవాలు, ఎందరో కవులు, ఎన్నో ప్రభావాలు. వాటన్నిటిమధ్యా నా సొంత గొంతు కోసం వెతుక్కుంటూ ఉన్నాను.
 
సొంత గొంతు అంటే ఏమిటి? నువ్వు పూర్తిగా నీదే అయిన అభివ్యక్తిని వెతుక్కున్నావనుకో, నువ్వు నీ చుట్టూ ఉన్న సమాజం నుంచి పూర్తిగా ఎడమయి పోతావు. అలాకాక, నువ్వు జీవిస్తున్న కాలం, దేశం ఏ అనుభవాలకు లోనవుతున్నాయో, నీ సమకాలికులు ఏమి చెప్తున్నారో విని నువ్వూ అలాగే రాయడం మొదలుపెడితే ప్రతిధ్వనిగా మారిపోతావు. మరి నీదంటూ ఒక గొంతు నీకు చిక్కిందని తెలియడం ఎలాగ?
 
ఇది చాలా పెద్ద ప్రశ్న. చాలా పాత ప్రశ్న కూడా. ఇలియట్ Tradition and Individual Talent వ్యాసం దీని గురించే. శ్రీ శ్రీ ఏమన్నాడంటే, వస్తువు సమకాలికం అయి ఉండాలి కాని నీ ప్రతిభ నీ సంవిధానంలో కనబడాలి అని.
 
ఆ కాలమంతటా ఎన్నో ప్రయోగాలు చేసాను. టాగోర్ లాగా, శ్రీ శ్రీలాగా, అజంతాలాగా, శేషేంద్రలాగా, ఇస్మాయిల్ లాగా కాకుండా నాకుగా నేను నా అనుభవాల్ని నాదైన పద్ధతిలో చెప్పాడం ఎలా? మరీ ముఖ్యంగా నా రాజమండ్రి మిత్రుల్లాగా రాయకుండా ఉండటం ఎలా?
 
ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ కవితల్లో నేను నా గొంతుకోసం ప్రయత్నించిన కవితలకన్నా, అప్రయత్నంగా నాకు స్ఫురించిన స్ఫురణల్ని కవితలుగా మార్చిన తావుల్లోనే నా సొంత గొంతు వినిపించిందని అనిపిస్తున్నది.
 
పుస్తకంలో కవితలన్నీ ఒక్కచోట చేర్చాక ఆ కవిత్వ నేపథ్యాన్నీ, ఆ కవిత్వం రాయడం వెనక నా సంఘర్షణనీ వివరిస్తో పెద్ద ముందుమాట ఒకటి రాసుకున్నాను. ఆ ముందుమాట రాస్తూండగా, ఆ కవిత్వంలో నా సొంతగొంతు ఎక్కడ ఉందో నాకు లీలగా గోచరించింది. అది ఇదుగో, ఇటువంటి కవితల్లో, ఉందనిపించింది.
 
 

స్వప్నావిష్ట తంద్రాలసత

 
ఆద్యంతమూ తిమిరావృతం,అయినా నడక తప్పదు.
కాని హఠాత్తుగా ఒక్కసారి వెల్తురు
ఏమిటి ప్రయోజనం? అవును, ఏమిటి?
 
కార్మొయిళ్ళ మధ్య ఒక మెరుపు
తుపాను అంచున ప్రణయయాత్ర
ఏమిటి హామీ? అనంతర ప్రయాణం ఎలా?
 
పోలికలు లేవు, కొలతలు లేవు
అనుభవం బోధపడేలోగా కాలం విసురుకుపోతుంది
చెదిరిన కలకు గుర్తుపు మిగలవు.
 
ఒక ప్రవక్త నిశ్శబ్దంగా ఇంటివాకిట నిల్చి
మౌనంగా భిక్ష యాచిస్తాడు.
అతని నేత్రాల్లో వర్షిస్తోన్న శాంతిని
శూన్యమని భ్రమిసి అవిశ్వాసంతో తప్పుకుపోతాం.
 
బాల్యకాలాన ఒక నడివేసవి మధ్యాహ్నాన
సేదదీర్చిన ప్రశాంత తరుచ్ఛాయ.
ఏళ్ళు గడిచినా ఆ స్మృతి కొరతబోదు.
 
ఇక నా గేదెనెక్కి తామరతూళ్ళు తీస్తో
చెరువుల అంచుల్లో సవారీలు చేస్తాను.
 
అల్లుకుంటున్న తెరలమీద అద్దకపు లతలు.
ఒక పలచని కునికిపాటులో తొణికిన ఒక కల.
అంతే, ఇంక ఏమీ లేదు.
జీవించినంతమటుకు చాలు.
 
15-6-1984
 
A LANGUID DREAM
 
Despite the darkness, you need to move on.
A bright burst of light appears suddenly.
For what purpose? Yes, what does it mean?
 
A flash of lightning amid dark clouds.
When love is up against a cyclone,
What’s next? What’s the promise?
 
Compare and contrast no more.
Before you savour the experience,
Time sweeps it away.
Dreams vanish without a trace.
 
A prophet arrives in your courtyard and asks for alms.
We misread his peaceful eyes as empty, and
Step back, disillusioned.
 
The cool shade of a midsummer afternoon.
A childhood memory that never fades.
 
Now, I ride my buffalo by the lake
Picking up water lilies.
 
Floral designs decorate the curtain spreads.
A faint quiver in the dream during a quiet nap.
I think that’s all.
It’s enough to last a lifetime.
 
9-7-2022

Leave a Reply

%d bloggers like this: