ఆ రెండూ కలిసి ఒక జ్ఞాపిక

131

నెచ్చెలులారా, నరుని జీవనస్రోతమేది?
దేనివలన జీవిస్తున్నాడతడు?

నరుడు జీవిస్తున్నాడిచట
త్యాగం వల్ల, జీవితానురాగం వల్ల
స్వేచ్ఛిత కష్టభోగం వల్ల.

ఒకప్పుడు నా తొలియవ్వన ప్రాయంలో నేనెవరికి ఉత్తరం రాసినా, ఈ వాక్యాలతోటే మొదలుపెట్టేవాణ్ణి.

ఒక్కొక్కప్పుడు ఈ వాక్యాలు కూడా:

జ్ఞానం ఒక రంపం వలె చీల్చి కోసి
మానవుణ్ణి తుత్తునియలు చేస్తుంది
జ్ఞానమెరుక పరుస్తుంది.

బైరాగి వాక్యాలు నా రక్తంలో ఇంకిపోయాయి. రోజువారీ జీవితంలో మామూలుగా గడిచే జీవితంలో హఠాత్తుగా ఏదైనా తెగిపోయినప్పుడో, లేదా ఏ అగోచర సంగీతమో వినబడ్డప్పుడో అప్రయత్నంగా లోపలొక వాక్యం పైకి తేలుతుంది. చాలాసార్లు అది బైరాగి కవితా వాక్యమే అయిఉంటుంది.

కొన్నేళ్ళ కిందట కన్నెగంటి రామారావు మా ఇంటికొచ్చినప్పుడు, బైరాగి గురించి మాట్లాడుకుంటూండగా చెప్పాను.’చాలామందికి జీవితంలో తమకంటూ కొన్ని primers లాంటి texts ఉంటాయి. కొందరికి భగవద్గీత, కొందరికి సువార్తలు, కొందరికి కమ్యూనిస్టు మానిఫెస్టో, నా వరకూ నాకు బైరాగి కవిత్వం నా ప్రాథమిక వాచకం’ అని.

పదేళ్ళ కిందట కాక్ స్టన్ ప్రెస్ అధినేత ఆలూరి అజయకుమార్ ఒక రాత్రి మా ఇంటికి ఫోన్ చేసారు. ఆయనెవరో నాకు తెలీదు, నా ఫోన్ నంబర్ ఆయనకెట్లా తెలిసిందో కూడా తెలీదు.

‘నేను ఆలూరి ఆజయకుమార్ ని, బైరాగి గారి తమ్ముడు సత్యంగారి అబ్బాయిని. మేం పెదనాన్నగారి కవిత్వం మొత్తం మళ్ళా పునర్ముద్రించాం. నాన్నగారు ఒక సెట్టు మీకు పంపించమన్నారు’ అన్నాడు.

నా ఒళ్ళంతా రోమాంచితమైంది. గొంతు కాదు, గుండె గద్గదికమైంది.

‘మీకు తెలుసా, బైరాగి అంటే నాకు…’

నా మాట పూర్తిచేసే లోపే ‘అవును సార్, నాన్నగారు చెప్పారు’ అన్నాడు ఆ పిల్లవాడు.

‘అవునుసార్, పెదనాన్నగారు చెప్పారు’ అనే కదా విన్నాను ఆ మాటని.

ఎక్కణ్ణుంచో ఆయన వాళ్ళకి చెప్పిఉండకపోతే ఆ కుటుంబం నా నంబరు వెతికి పట్టుకు మరీ నాకెందుకు ఆ పుస్తకాలు పంపాలనుకుంటారు!

ఇదిగో, ఇప్పుడు కృష్ణా జిల్లా రచయితల సంఘంవారు 2015 సంవత్సరానికి ఆలూరి బైరాగి పురస్కారం నాకు అందించినప్పుడు మళ్ళా అట్లానే అనిపించింది. ఆ సంకల్పం లక్ష్మీప్రసాద్ గారిదో, పూర్ణచంద్, గుత్తికొండ సుబ్బారావుగార్లదో అనుకోవడం లేదు నేను.

గొప్ప కవులకీ వాళ్ళ వాక్కుని ఆరాధించేవాళ్ళకీ మధ్య ఒక మార్మికానుబంధం అభౌతికానుబంధం తలెత్తడం మానవాళికి అనుభవంలో ఉన్నదే.అసంఖ్యాకులైన సూఫీ ఆరాధకులకు హాఫిజ్ కేవలం కవి మాత్రమే కాడు. జీవితంలో కఠినసమస్యలు తలెత్తినప్పుడల్లా దివానె-ఇ-హాఫిజ్ తెరిస్తే, ఏ వాక్యం కనబడితే ఆ వాక్యాన్ని వేదవాక్యంగా భావించే సంప్రదాయం ఉందికదా.

ఒకప్పుడు మా మిత్రురాలు రాజమండ్రి సావిత్రిగారు,మనసు బాగులేనప్పుడల్లా మాక్సిం గోర్కీ ‘అమ్మ’ ని అట్లా తెరిచి చూసుకునేవారు.

సంస్కృత, తెలుగు కావ్యాలు వాల్మీకి,కాళిదాసులనుండి విశ్వనాథదాకా కంఠోపాఠంగా ఉండే మా మాష్టారు జీవితచరమసంధ్యలో బసవేశ్వరవచనాలతో అట్లాంటి పారవశ్యానికి లోనుకావడం నేను కళ్ళారా చూసాను.

శనివారం సాయంకాలం విజయవాడలో ఐలాపురం కాన్ఫరెన్సు హాల్లో బైరాగి అవార్డు అందుకుంటున్నప్పుడు ఆ జ్ఞాపిక చూడగానే నాకూ అట్లాంటి పారవశ్యమే కలిగింది.

ఒక పక్క నా ఫొటో, మరొక పక్క బైరాగి బొమ్మ. ఆ రెండూ కలిసి ఒక జ్ఞాపికగా రూపుదిద్దుకుంటాయని నేనెన్నడూ ఊహించనేలేదే.

ఆ జ్ఞాపికలో వాక్యాలు ఎవరు రాసారని పూర్ణచంద్ గారిని అడిగాను.

‘అందరం కలిసే’ అన్నాడాయన.

ఎంత అందమైన వాక్యాలు, ముద్దొచ్చే వాక్యాలు, మురిపించే వాక్యాలు.

ఆచార్య రవ్వా శ్రీహరి, సి.రాఘవాచారి, వీరాజీ, గొల్లపూడి మారుతీరావు, డి.కామేశ్వరి వంటి పెద్దలతో పాటు అట్టాడ అప్పల్నాయుడు, రాధేయ, తురగా రాజేశ్వరి వంటి మిత్రుల్తో కలిసి ఆ పురస్కారం అందుకోవడం కూడా ఒక చక్కటి జ్ఞాపకంగా నిల్చిపోతుంది.

11-10-2015

Leave a Reply

%d bloggers like this: