
4
బహుశా కావ్యతత్త్వ విచారణని సంస్కృత ఆలంకారికులు చేసినంత విస్తారంగా, అంత లోతుగా మరే భాషలోనూ సాహిత్యవేత్తలు చెయ్యలేదని చెప్పాలి. కానీ సంస్కృత అలంకార శాస్త్రాలు వికసించకముందే సంస్కృత కావ్య, నాటకాలు ప్రభవించి ఉన్నాయి. వాటినీ, ప్రాకృత ముక్తకాల్నీ అర్థం చేసుకునే క్రమంలో సంస్కృత అలంకారికులు కావ్యశాస్త్రాన్ని నిర్మించారు. ఆ కావ్యశాస్త్రం పదో శతాబ్దం తర్వాత దేశమంతా వికసించిన దేశభాషా సాహిత్యాలకు ఒక తోవ చూపింది. సంస్కృత కావ్యమే తెలుగులో ప్రబంధంగా మరింత ప్రౌఢ రూపం తీసుకుంది.
‘కావ్యేషు నాటకం రమ్యం’ అనే మాట ఎలానూ ఉంది. ఆ నాటకాల్లో శాకుంతలం అత్యున్నతమైంది అని కూడా భారతీయ సహృదయ పరంపర తీర్మానించి ఉన్నారు. కానీ ఇమ్మెన్సీ తరహా నవలికలాగా, మరీ దీర్ఘంగా ఉండకుండా, మరీ సంక్లిష్టమైన కథానిర్మాణంతో పనిలేకుండా, కానీ శాకుంతలంతో సమానమైన నాటకమేదన్నా ఉందా అని చూసినప్పుడు భాసమహాకవి రాసిన స్వప్నవాసవదత్త కనిపిస్తుంది.
భాసుడు ఏ కాలం వాడో చెప్పలేం. కొందరి దృష్టిలో నాట్యశాస్త్రం కన్నా ముందువాడు, కొందరి దృష్టిలో అశ్వఘోషుడికీ, కాళిదాసుకీ మధ్యవాడు. కాదు, పల్లవరాజు మహేంద్రవర్మనే భాసుడి పేరుమీద పది రూపకాలకీ ఉదాహరణలుగా రచనలు చేసి భాసనాటక చక్రమని పేరుపెట్టాడనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ, కనీసం పదో శతాబ్దికన్నా ముందటి భాసుడి సంస్కృత రూపకాలు చాలా పాఠకసన్నిహితాలుగా ఉంటాయి. ఆయన రాసాడని చెప్పే పది రూపకాల్లోనూ కూడా స్వప్నవాసవదత్త ఆయన కథనకౌశల్యానికీ, సన్నివేశకల్పనకీ, ధ్వనికీ, వక్రోక్తికీ, అన్ని రకాల కావ్యశిల్ప రహస్యాలకీ మేలిమి ఉదాహరణగా నిలబడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భాసుడు ఆ నాటకాన్ని ఒక హంసతూలికతో రాసాడనిపిస్తుంది. అందులో నాయకుడు ఎంత ధీరలలితుడో ఆరు అంకాల ఆ నాటకం కూడా అంతే లలితమైన వాక్యాలతో, వాక్యాల మధ్య కళ్ళ నీళ్ళు కుక్కుకునే విరామాలతో, హృదయాలు తమలో తాము ఘూర్ణిల్లుతూ ఉండే లోతైన నిశ్శబ్దాలతో ప్రకంపిస్తూ ఉంటుంది.
స్వప్నవాసవదత్త నాటకంలోని కథ గురించిగానీ, ఆ కథాశిల్పం గురించి గానీ నేను ఇక్కడ కొత్తగా ఏమీ రాయబోవడం లేదు. ఆ నాటకానికి తెలుగులో కనీసం రెండు గొప్ప అనువాదాలు ఉన్నాయి. ఒకటి చిలకమర్తి లక్ష్మీనరసింహం గారిది (1916) గ్రాంథిక శైలి అనువాదం, మరొకటి కాటూరి వెంకటేశ్వరరావుగారిది (1946) వ్యావహారిక శైలి అనువాదం. కానీ నేను చెప్పాలనుకుంటున్నది, ఈ నాటకాన్ని స్టార్మ్ చదివి ఉంటే, తాను ‘నవలిక నాటకానికి సోదరి’ అని అంటున్నప్పుడు ఆ నాటకం ఇదే అని అనుకుని ఉండేవాడు.
ఇరవయ్యవ శతాబ్దంలో భారతీయ నవలా రచయితలు నవలలూ రాసారు, నవలికలూ రాసారు. అటువంటి నవలికల్లో కనీసం మూడు రచనలు నాకు కావ్యత్వాన్ని అందుకున్నవిగా కనిపిస్తున్నాయి. ఒకటి, రవీంద్రుడు రాసిన ‘నష్టనీడ్’ (1901), రెండోది, శరత్ బాబు సుప్రసిద్ధ రచన ‘దేవదాసు’ (1901, ప్రచురణ 1917), మూడోది, వైకం మహమ్మద్ బషీర్ రాసిన ‘బాల్యకాల సఖి’ (1944). మూడూ ప్రజాదరణ పొందాయి. మూడూ సినిమాలుగా కూడా వచ్చాయి. మూడూ కూడా విషాదాంతాలే. కానీ నిర్మాణ పరంగా చూసినప్పుడు, మూడింటిలోనూ దేవదాసు రచయిత అత్యున్నతమైన కౌశల్యాన్ని చూపించగలిగాడనిపిస్తుంది.
నా యవ్వన దినాల నుంచీ నేను శరత్ వీరాభిమానిగా ఉన్నప్పటికీ, అతడి రచనల్లో ఒక శ్రీకాంత్, ఒక చరిత్రహీనులు, ఒక గృహదహనం, ఒక శేషప్రశ్న నన్ను విభ్రాంతపరిచినట్టుగా దేవదాసు ఆకట్టుకోలేదు. కాని ముప్ఫై ఏళ్ళ కిందట మిత్రుడు పరేశ్ దోశి నన్ను ఆ పుస్తకం మరోసారి చదవమని చెప్పినప్పుడు నాకు ఆ రచనలో నేను అంతదాకా చూడలేకపోయిన కొత్త వెలుగు కనిపించింది. ఇప్పుడు ఇమ్మెన్సీని అనువదించాక మళ్ళా మరొకసారి దేవదాసు చదివాను. అందులో ఉన్న కావ్యశిల్పం నిస్సందేహంగా అత్యున్నత శ్రేణికి చెందింది. కాబట్టే అది ప్రజాహృదయాల్ని అలా కైవసం చేసుకోగలిగింది అనిపించింది.
నిజానికి అందులో దేవదాసూ, పార్వతీ కూడా మరణించినప్పటికీ, దాన్ని విషాదాంత కథగా చూడలేమనిపించింది. అది ఒక విధంగా మానవ సంస్కార విజయగాథ. దేవదాసు, పార్వతి, చంద్రముఖి—ముగ్గురూ కూడా సమాజం గీసిన గీతల్ని ధిక్కరించగలిగే శక్తి తమకి ఉన్నప్పటికీ, ఆ గీతల్ని భౌతికంగా దాటడంలోకన్నా, ప్రేమని తమ హృదయాల్లో నిలుపుకోవడమే తమ ప్రేమకి నిజమైన సార్థకతగా భావించారు. అందుకే చంద్రముఖి ఒకచోట ‘అంతరంగంలో ప్రేమించినంత మాత్రం చేతనే ఎంత సుఖం, తృప్తి కలుగుతుందో గ్రహించినవాళ్ళు అనవసరంగా కుటుంబాల్లో కలవరం తీసుకురారు’ అని దేవదాసుతో అంటుంది. బాహ్యవాస్తవాల పైన మనిషి అంతరంగం సాధించిన విజయాన్ని గుర్తుపట్టిన రచయిత మాత్రమే ఇటువంటి వాక్యం రాయగలుగుతాడు. బాహ్య జీవితపు సున్నితమైన హద్దుల్నీ, మర్యాదల్నీ అతిక్రమించకుండానే, ఆ ముగ్గురూ ఒకరినొకరు అంతే గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమని రచయిత ఎన్నోసార్లు పొడిపొడి మాటల్లో ఎంతో సూక్ష్మధ్వనితో మనకు తెలియచేస్తాడు.
రైన్హార్డ్ లాగా దేవదాసు కూడా ఏదో ఒక వ్యాపకం, పరిశోధననో లేదా ఏదో ఒక సామాజికంగా ఉపయోగించే కార్యక్రమమో చేపట్టి ఉండవచ్చు కదా అనిపించడం సహజం. విధి తనకి అప్పగించిన కుటుంబాన్ని చక్కదిద్దడంలో పార్వతి, అశ్వత్థపురం గొల్లపల్లెలో బీదప్రజలకి తోడుగా నిలబడి చంద్రముఖి చేసిందీ అదే కదా! దేవదాసు జీవించి ఉన్నాడన్న ఊరట చాలు, పార్వతీ, చంద్రముఖీ తాము ఎంచుకున్న బాధ్యతల్లో తాము మనుగడ సాగించడానికి. కానీ వాళ్ళ ముగ్గురి మనసులలోనీ దుఃఖాన్నీ దేవదాసు ఒక్కడే తనమీదకు తీసుకున్నాడా అనిపిస్తుంది. ఎలా చూసినా కూడా ఒక తీవ్ర విషాదపు ఆచ్ఛాదనలో రాసిన ఒక మానవమనోవిజయగాథ దేవదాసు నవల అనిపిస్తుంది.
5
ఇరవయ్యవ శతాబ్దిలో కావ్యత్వాన్ని అందుకున్న నవలలుగా కనీసం రెండింటిని సుదర్శనంగారు పేర్కొన్నారు. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘ఏకవీర’ (1929-31, ప్రచురణ 1935)ను ఆయన ‘కావ్యగౌరవం కలిగిన నవల’గా అభివర్ణించారు. ఆ నవలలో ‘చివరి మూడు అధ్యాయాలూ ఉత్తమ కవిత్వం’ అని చెప్తూ ‘ఈ స్థాయిలో వచన కవిత్వం అసలు ఇంతకంటే కవిత్వమే విశ్వనాథ తర్వాత రాయలేదంటే అతిశయోక్తి కాదేమో’ అని కూడా అన్నారు.
సంస్కృత కావ్యాలంకార శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకున్న రసజ్ఞుడూ, అపారమైన ఊహాశీలత కలిగిన భావుకుడూ కాబట్టి విశ్వనాథ ఏకవీరను కావ్యప్రమాణాల్తో రాసి ఉండటంలో ఆశ్చర్యం లేదు. మరీ ముఖ్యంగా ఆయన నవల చివరి అధ్యాయాల్లో తానే ఏకవీరగా మారిపోయాడు. కళ్ళమ్మట నీళ్ళు తెప్పించే వర్ణనలు అవి. లౌకిక, అలౌకిక సీమల మధ్య సరిహద్దులు చెరిగిపోయే తావులు అవి. కాని అంత ఉత్కృష్ట రసనిర్వహణ చేస్తూ ఉన్నవాడు కాస్తా, పోర్చుగీసు మతప్రచారకుణ్ణి ఖండిస్తూ, ఏకవీరతో ప్రసంగం చేయించడంతో పూర్తి రసభంగానికి పాల్పడ్డాడు. పైగా ఆ వాదనని, ఆమె ద్వారా, సుందరేశ్వరుడు చేయించాడని చెప్పడం మరో రసాభాస. దీనివల్ల నవలాశిల్పం శిథిలబంధమైపోయింది. మమ్మటాచార్యుడు పేర్కొన్న రసదోషాల్లో కనీసం నాలుగైదు దోషాల్ని మనమిక్కడ గుర్తుపట్టవచ్చు.
ఇక చలంగారి ‘అమీనా’ (1926-42) ను సుదర్శనంగారు నవ్యాంధ్ర సాహిత్యంలో ‘ఒక విశిష్టమైన రచన’ అని చెప్తూ ‘కావ్యమైన నవల’ అని అన్నారు. ఈ మాట ఆయన తెలుగులో మరే నవల గురించీ అనలేదు. నిజానికి చలంగారి నవలికలన్నీ కూడా కావ్యసమానాలే అని చెప్పవచ్చు. వాటన్నిటిలో తాత్త్వికంగా అమీనా సర్వోత్కృష్టమైన రచన. ఎందుకో సుదర్శనంగారు వివరంగా రాసేరు కాబట్టి నేను మళ్ళా ఆ వివరణలోకి పోవడం లేదు. కానీ, అది తాత్త్వికంగా అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, దాని శిల్పంలో కొంత గడబిడ ఉంది. అది పాఠకసన్నిహితమైన రచన కాదు. నేను మహాప్రస్థానాన్నీ, గురజాడనీ కూడా అర్థం చేసుకోగలిగిన వయస్సులో నాకు అమీనా అర్థం కాలేదు. అమీనా సంగతి వదిలిపెట్టండి, ఆ నవల పైన సుదర్శనంగారి వ్యాసం కూడా అర్థం కాలేదు. ఇన్నాళ్ళకు మళ్ళీ మరొకసారి ఆ నవలిక చదివినప్పుడు నా నేత్రాలు సజలాలైపోయాయి. అయినా కూడా, సంస్కృత అలంకారికుడి మాటల్లో, ఆ నవలని ‘కష్టకల్పన’ బాధిస్తూ ఉందనే నా ఉద్దేశ్యం. ఉదాహరణకి, నవలలో విమల ఆత్మహత్య చేసుకుందనే విషయం, సుదర్శనం గారి వ్యాసం చదివినదాకా, నా మనసుకి ఎక్కలేదు.
కానీ, చలంగారి సాహిత్యంలోనే కాదు, అసలు మొత్తం ఆధునిక తెలుగు సాహిత్యంలోనే నిజంగా కావ్యంగా చెప్పదగ్గ నవలిక ‘మార్తా’ (1961). ఆ నవలని ఆళ్ళ గురుప్రసాదరావుగారు 2000 లో ప్రచురించినదాకా చలంగారు అటువంటి నవల రాసినట్టు ఎవరికీ తెలియదు. బహుశా సుదర్శనంగారు ఆ నవల చదివి ఉంటే, దాన్నే చలం రచనల్లో సర్వోత్కృష్టమైన రచనగా ప్రస్తుతించి ఉండేవారు.
సుదర్శనంగారు చెప్పినట్టు అమీనా చలం ఆత్మకథ. నిజమే. కానీ మార్తా చలం జీవితంలో ఆ తర్వాతి కథ. అది ఆయన ఆత్మవిముక్తి కథ. అమీనాలో రెండు ప్రపంచాలుగా ఉన్న చలం, మార్తాలో కూడా మరియ, మార్తాలుగా కనిపిస్తాడు. కానీ అమీనా కాలం నాటి (1926-34) సంక్షోభం ఇప్పుడు కనిపించదు. అందుకు బదులు ప్రపంచంలో ప్రతి ఒక్క బాధ్యతని తనదిగానే మోస్తున్న మార్తాతో యేసు ‘మార్తా, మార్తా, నువ్వు చాలా వాటిగురించి ఆలోచిస్తున్నావు, ఆందోళన పడుతున్నావు. కాని నిజంగా పట్టించుకోవలసింది కొన్ని విషయాలే. ఆ మాటకొస్తే ఒకే ఒక్క విషయం మటుకే. ఏది మంచిదో దాన్నే మరియ ఎంచుకుంది, దాన్నామెనుంచి ఎవరూ తీసేసుకోలేరు’ అంటాడు. మార్తా చలంగారే, సందేహం లేదు. కానీ ఇప్పటికి, అంటే, 1961 నాటికి, మరియ కూడా తనలోని పార్శ్వమేనని ఆయన గుర్తుపట్టగలిగారు. ఎందుకంటే అప్పటికి ఆయన రవీంద్రుడి కవిత్వంతో పాటు సువార్తల్ని కూడా తెలుగుచేసి ఉన్నారు. విశ్వనాథ లాగా కావ్యాలంకారశాస్త్రాలు చదువుకోకపోయినా, రసధ్వని నిర్వహణలో ఈ నవలికను మేలిమి కావ్యంగా తీర్చిదిద్దగలిగారు. ఇది తెలుగు సాహిత్యంలోనే ఒక అంతర్జాతీయ స్థాయి నవల. నోబెల్ పురస్కారం వచ్చి ఉండవలసిన రచన.
ప్రజా హృదయాల్ని గెల్చుకోగల రచనలు చెయ్యడమంటే పాపులర్ రచయితల పద్ధతిలో రాయడమనే ఒక అపోహ ఉంది. కానీ, అత్యున్నత సాహిత్య ప్రమాణాల్ని పాటిస్తూ కావ్యాల్లాంటి నవలికలు రాసినప్పుడు అవి ఒక ఇమ్మెన్సీలాగా, ఒక ఫామిలీ హ్యాపీనెస్ లాగా, ఒక దేవదాసులాగా, ఒక మార్తా లాగా ఏకకాలంలో సాధారణ పాఠకుల్నీ, సహృదయుల్నీ కూడా మెప్పించగలవని చెప్పడం కోసమే నేను ఇమ్మెన్సీ నవలని తెలుగు చేసాను. దాంతో పాటు ఇంత సుదీర్ఘమైన పరిచయ వ్యాసం కూడా రాసాను. నా తోటి తెలుగురచయితల్లో, లేదా రేపు రాబోతున్న రచయితల్లో ఏ ఒక్కరు ఈ స్ఫూర్తిని అందుకున్నా నా ప్రయత్నం సఫలమయ్యిందని భావిస్తాను.
24-11-2026

