
ఇమ్మెన్సీ స్ఫూర్తితో వచ్చిన కొన్ని నవలలు
స్టార్మ్ ఇమ్మెన్సీ రాసాక, జర్మన్ సాహిత్యంలో కావ్యాత్మక వాస్తవికత ఒక ప్రధాన ధోరణిగా స్థిరపడి, ఆ ప్రభావం దాదాపు నలభయ్యేళ్ళపాటు జర్మన్ సాహిత్యం మీద ఉందని చెప్తారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని 19, 20 శతాబ్దాల్లో, రష్యాలో, అమెరికాలో, ఆధునిక జర్మనీలో కూడా కావ్యాల్లాంటి నవలికలు రాస్తూనే ఉన్నారు. అటువంటివి ఆరేడు నవలలు చదివాను. ఆ నవలల్లో ఆ రచయితలు మానవానుభవం తాలూకు లోతుల్నీ, అనుభూతితాలూకు ఎత్తుల్నీ చేరుకోగలిగినప్పటికీ, ఇమ్మెన్సీలో సాధ్యపడ్డ శిల్పసౌష్టవాన్ని సాధించుకోలేక పోయారనిపించింది.
ఇవాన్ తుర్గెనీవ్ (1818-83) స్టార్మ్ కి సమకాలికుడైన రష్యన్ రచయిత. వాళ్ళిద్దరూ స్నేహితులూ, ఒకరికి ఒకరు ఉత్తరాలు రాసుకున్నారు కూడా. కాబట్టి స్టార్మ్ ప్రభావానికి తుర్గెనీవ్ లోనుకావడంలో ఆశ్చర్యం లేదు. ఆయన రాసిన First Love (1860) ఇమ్మెన్సీ తరహాలో రాయాలని ప్రయత్నించిన నవలిక. అందులో కథా ప్రారంభంలో అరవయ్యేళ్ళ వయసుకలిగిన ఒక పెద్దమనిషి, రాత్రి భోజనం తరువాత చెప్పుకునే ముచ్చట్లలో భాగంగా, తన నవయవ్వన దినాలనాటి ఒక అనుభవాన్ని తన మిత్రులకి చెప్తాడు. కౌమారం నుంచి నవయవ్వనానికి అడుగుపెడుతున్న కాలంలో తన పొరుగింటిలో అద్దెకు చేరిన ఒక కుటుంబానికి చెందిన జినైదా అనే అమ్మాయిని చూసి అతడు తొలిప్రేమలో పడతాడు. కాని ఆమె తనని ప్రేమిస్తున్నదో లేదో తేల్చుకోలేకపోతాడు. చివరికి ఆమె తన తండ్రికి రహస్య ప్రియురాలిగా కొనసాగుతున్నదన్న నిష్ఠుర వాస్తవం తెలియడంతో కథ ముగుస్తుంది.

కానీ ఈ నవలిక నన్ను నిరాశపర్చిందనే చెప్పాలి. స్టార్మ్ కి సాధ్యమైన సౌకుమార్యం, అతడు తన కథనంలో పాటించిన ఔచిత్యం తుర్గెనీవ్ కథనంలో కనిపించదు. ఆ కథ మొదలవుతూనే కథకుడు, ఒక తుపాకీతో ఇంటిమేడ మీద తిరుగుతూ నిష్కారణంగా ఒక కాకిని కాలుస్తాడు. ఆ కథలో చివరలో తన తండ్రి జినైదాను కొరడాతో కొట్టడం అనే ఒక క్రూర దృశ్యానికి బహుశా తుర్గెనీవ్ ఆ సంఘటనని నాందిగా వాడుకున్నాడు. కాని సంస్కృత అలంకారికుడు దాన్ని ప్రవేశ దోషంగా పరిగణిస్తాడు. అది చదవగానే, ఇంకా కథలోకి పూర్తిగా అడుగుపెట్టకుండానే, నాకు ఒక ఏహ్యత కలిగింది. రసభంగమంటే అదే.
ఇరవయ్యవ శతాబ్దపు జర్మన్ మహారచయితా, నోబెల్ పురస్కార గ్రహీతా థామస్ మాన్ కూడా స్టార్మ్ లానే ఉత్తర సముద్ర తీరప్రాంతపు రచయిత. స్టార్మ్ తన మీద చూపించిన ప్రభావాన్ని ఆయన జీవితమంతా బిగ్గరగా చెప్పుకుంటూనే ఉన్నాడు. Buddenbrooks (1901), Magic Mountain (1924), Joseph and his Brothers (1933) వంటి ఇతిహాస సమానమైన నవలలు రాసిన మాన్ Tonio Kröger (1903) అనే నవలిక కూడా రాసాడు. దానికి కారణం ఇమ్మెన్సీ అని చెప్పుకున్నాడు. ఆ కథలో టోనియో బాల్టిక్ సముద్ర తీరంలో పుట్టాడు. చిన్నప్పుణ్ణుంచీ అంతర్ముఖుడిగా పెరిగాడు. అతడికి తన చిన్నప్పటి మిత్రుడైన హాన్స్ హాన్సెన్ లాగా, యవ్వనకాలంలో పరిచయమైన ఇంగెబోర్గ్ హోల్మ్ లాగా ఉల్లాసంగా జీవితం గడపాలని ఉంటుంది. కానీ ఒక కళాకారుడిగా జీవించాలన్న అతని తపన అతణ్ణి సదా స్వీయ అస్తిత్వం పట్ల జాగరూకుడిగా ఉంచుతుండటంతో, తను ఒక మామూలు మనిషిలాగా, మామూలు మనుషులు జీవించే రోజువారీ జీవితం జీవించలేనని గ్రహిస్తాడు.

ఈ నవలిక చదువుతున్నంతసేపూ ఇదొక గొప్ప రచన అని మనకి తెలుస్తూ ఉంటుంది. మాన్ శైలి లోని సంగీతాత్మకత, సాహిత్య ప్రస్తావనలు, చిత్రలేఖనం గురించిన చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి. కానీ సరిగ్గా ఈ intellectualism వల్లనే ఈ నవల ఇమ్మెన్సీ అందుకున్న పరిణతిని సాధించలేకపోయిందని అనిపిస్తుంది. మమ్మటాచార్యుడు ఈ నవల చదివితే, దీనిలో ‘అంగస్య అతివృష్టి’ ఉందంటాడు.
హెర్మన్ హెస్సే కూడా ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన మరొక జర్మన్ మహారచయిత. నోబెల్ పురస్కార గ్రహీత. తన ‘సిద్ధార్థ’ నవల ద్వారా తెలుగుపాఠకులకి సుపరిచితుడు. ఇమ్మెన్సీ తరహాలో ఆయన రాసిన నవలిక Peter Camenzind (1904) ఆల్ప్స్ పర్వతప్రాంతాల్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక రైతుబిడ్డ కథ. ఆ యువకుడు సాహిత్యం పట్ల తపనతో విస్తృత ప్రపంచంలోకి అడుగుపెడతాడు. తాను చూసిన నగరాల్నీ, కళాకారుల్నీ, నెరవేరని ప్రేమకథల్నీ మనతో పంచుకుంటూ ఉంటాడు. చివరికి సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసీ తరహాలో ఒక వికలాంగ యువకుడికి స్నేహితుడిగా నిలబడి తాను ఇవ్వగలిగినంత ఆదరణనీ పంచుతాడు.

స్టార్మ్ నవలలో కనిపించే త్యాగంలోని హుందాతనం మనకి ఈ నవలలో కనిపిస్తుంది. రైన్హార్డ్ లానే ఈ కథానాయకుడు కూడా నెమ్మదిగా ఒక ధీరోదాత్తుడిగా మన ముందు ఆవిష్కారమవుతాడు. కానీ, ఇందులో ఒక నవలికనుంచి స్టార్మ్ ఉద్దేశించిన తీవ్రీకృత, లేదా కేంద్రీకృత అనుభూతికి బదులు ఇది కూడా ఒక Bildungsroman లాగా, ఒక మనిషి వ్యక్తిగా తన వికాసక్రమాన్ని చెప్పుకున్న కథనంగా కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇందులో focal point మృగ్యమైంది. హెస్సే తన నవలని ఇంత విస్తరించి చెప్పే బదులు, కథకుడు తన తండ్రి వృద్ధుడయ్యాక అతడి పట్ల తిరిగి తనే ఒక తండ్రిలాగా చూపిన ఆదరణకో లేదా ఆ వికలాంగ బాలుడిపట్ల తాను చూపించిన స్నేహశీలత్వానికో తన నవలికను పరిమితం చేసి ఉండి ఉంటే ఆ కథ ఎంతో శక్తిమంతంగా ఉండి ఉండేది.
వియన్నాకి చెందిన ఆస్ట్రియన్ రచయిత స్తెఫాన్ జ్వెయిగ్ ఇరవయ్యవశతాబ్దపు మరొక మహత్తర జర్మన్ రచయిత. ఆయన రాసిన ‘విరాట్’ నవలిక ద్వారా తెలుగువాళ్ళకి సుపరిచితుడు. ఆయన మరొక సుప్రసిద్ధ రచన The World of Yesterday (1934) ని నేనెప్పుడో నలభయ్యేళ్ళ కిందట రాజమండ్రిలో ఉన్న రోజుల్లో చదివాను. ఆయన రాసిన Letter from an Unknown Woman (1922) సాంద్రభావావేశంతో కూడుకున్న నవలిక. అందులో కథానాయకుడు వియన్నాకి చెందిన ఒక నవలా రచయిత. సంపన్నుడు. అతడి 41 వ పుట్టినరోజు నాడు ఎవరు రాసారో పేరూ, చిరునామాలేని ఒక పెద్ద ఉత్తరం వస్తుంది. ఆ నవలిక మొత్తం ఆ ఉత్తరమే. అది ఒక స్త్రీ రాసింది. ఆమె తన చిన్నప్పుడు ఆ నవలారచయిత ఉంటున్న అపార్ట్ మెంటులోనే ఎదుటి ఇంట్లో ఉండేది. అప్పణ్ణుంచీ ఆమె అతణ్ణి రహస్యంగా ఆరాధిస్తూనే ఉంది. ఆమె యవ్వనంలోకి ప్రవేశించాక, ఒకసాయంకాలం, ఆమె అతణ్ణి కలుసుకుంటుంది. ఆ నవలా రచయితకి స్త్రీలతో అనుభవాలు కొత్తకాదు. ఆమెని కూడా అటువంటి స్త్రీలల్లో ఒకరిగానే అతడు భావించి మర్చిపోతాడు. కాని ఆమె అతని ద్వారా ఒక బిడ్డని కంటుంది. అతణ్ణే తన భర్తగా, సర్వస్వంగా భావిస్తుంది. కాని తన వివరాలు అతడితో ఎప్పుడూ పంచుకోదు. చివరికి కథ మొదలయ్యే సమయానికి ఆ బిడ్డ, పది పదకొండేళ్ళ పిల్లవాడు జ్వరంతో మరణించి ఉంటాడు. ఆ పిల్లవాడి మృతదేహం పక్కన కూర్చుని ఆమె ఈ ఉత్తరం రాస్తుంది.

నవలిక మొత్తం మనం వెయ్యి వోల్టుల బల్బు వెలుతురులో ఆ ఉత్తరం చదువుతున్నట్టుగా ఉంటుంది. అదొక తీవ్రమైన అనుతాపంతో కూడిన ఎలిజీలాగా వినిపిస్తూంటుంది. కానీ స్టార్మ్ తన నవలలో చూపించిన సంయమనం మాత్రం ఆ కథనంలో కొరవడిందని మనకి తెలుస్తూనే ఉంటుంది. మమ్మటాచార్యుడు పేర్కొన్న ‘పునఃపునః దీప్తి’ అనే దోషం, అంటే చెప్తున్న విషయాన్నే మరింత గాఢంగా, మరింత భారంగా చెప్తూ ఉండటం వల్ల ఈ నవలిక అంతిమంగా పాఠకుడి మీద చూపించగల ప్రభావాన్ని తగ్గించిందనే చెప్పవచ్చు.
ఉత్తర అమెరికా రచయితల్లో విల్లా కాథర్ కావ్యాత్మక వాస్తవికతకు ప్రతినిధి రచయితగా చెప్పవచ్చు. ఆమె కథాశిల్పంలోని పరిణతి మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆమె రాసిన My Mortal Enemy (1926) ఒక విశిష్టమైన నవలిక. అందులో మైరా హెన్షవే అనే ఒకామె తాను ప్రేమించినవాడికోసం తన తల్లిదండ్రుల్నీ, ఆస్తిపాస్తుల్నీ, అన్నింటికన్నా ముఖ్యంగా తన మతవిశ్వాసాల్నీ వదులుకుని వచ్చేస్తుంది. కానీ తన చివరిదినాల్లో దారిద్య్రంలో కూరుకుపోయినప్పుడు, తన మతవిశ్వాసాల చేయూత తనకి అందడం లేదనుకున్నప్పుడు ఆమె పడే వేదనని నెల్లీ బర్డ్ సై అనే ఒక యువతి దృక్కోణం నుంచి రచయిత్రి చెప్పుకొస్తుంది.

అన్నిటికన్నా ముందు ఆ కథనం, ఆ కథానిర్మాణం, దాదాపుగా ఒక నాటకాన్ని చూస్తున్నట్టుగా తోచే దృశ్యకల్పన మనల్ని అబ్బురపరుస్తాయి. ఆమె నవల ‘novel démeublé’ గా అంటే, unfurnished novel గా ఉండాలని నమ్మిందని చెప్తారు. నవలలో అనవసరమైనదేదీ లేకుండా ఆమె ఆద్యంతం జాగ్రత్తపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఒక మనిషికీ, అతని లేదా ఆమె నివసిస్తున్న స్థలానికీ మధ్య ఉండే ప్రగాఢ సంబంధాన్ని అంత నేర్పుగా ఆవిష్కరించే రచయితలు మనకి ఎక్కువగా కనిపించరు. అయినప్పటికీ, ఇమ్మెన్సీ లో కనిపించని చేదు ఈ నవల పొడుగునా మనకి నోటికి తగుల్తూనే ఉంటుంది. ఇందులో మనల్ని ఏదో అసంతృప్తికి గురిచేస్తున్నదని తెలుస్తూనే ఉంటుందిగాని, అదేమిటో ఒక పట్టాన మన అవగాహనకి అందదు. బహుశా అది అలంకారికుడు చెప్పిన ‘ప్రతికూల విభావాదిగ్రహత’, అంటే ఒక tonal clash కీచుమని చేస్తున్న చప్పుడు అయి ఉంటుంది.
ఇక రష్యన్ మహా రచయిత టాల్స్టాయ్ స్టార్మ్ ని కలుసుకున్నాడనిగానీ, ఇమ్మెన్సీ చదివాడనీ చెప్పలేముగానీ, తుర్గెనీవ్ ద్వారా స్టార్మ్ గురించి విని ఉంటాడనీ, కావ్యాత్మక వాస్తవికత గురించి తప్పనిసరిగా తెలుసుకునే ఉండి ఉంటాడనీ మనం ఊహించవచ్చు. ఇతిహాససదృశాలైన War and Peace (1869), Anna Karenina (1878) లాంటి నవలలు రాసిన టాల్స్టాయ్ Family Happiness (1859), Kreutzer Sonata (1889) లాంటి నవలికలు కూడా రాసాడు. వాటిల్లో ఫామిలీ హాపీనెస్ ఇమ్మెన్సీ తో సమానమైన రచన అనిపిస్తుంది నాకు.
నిజానికి అది ఇమ్మెన్సీకన్నా గొప్ప రచన కూడా, వస్తువుదృష్ట్యానూ, కఠోర జీవితవాస్తవాల పట్ల రచయితకి కలిగిన మెలకువ దృష్ట్యానూ మాత్రమే కాదు, అసలు ఆ శైలి, ఆ నిర్మాణం—ఒక మహాకవి మాత్రమే అటువంటి నవలిక రాయగలడు. టాల్స్టాయ్ ఎన్నడూ కవిత్వం రాయలేదుగానీ, తుర్గెనీవ్ లానే నేను కూడా ఆయన్ని కవి అనే అంటాను. కాని తనలోని ఆ కవిని గుర్తుపట్టడానికీ, ఆ కవితో ఒక కావ్యం లాంటి నవలిక రాయించడానికీ మాత్రం పొయెటిక్ రియలిజమే కారణమైందని మనం ఒప్పుకోవచ్చు.

అది మాషా అనే ఆమె తన జ్ఞాపకాల్లోంచి చెప్పుకొచ్చిన కథ. ఆమె నవయవ్వనంలో, సెర్జీ మిహైలిచ్ అనే ఒక నడి వయసు సంరక్షకుడు వాళ్ళ కుటుంబబాధ్యతలు చూస్తూ ఉంటాడు. వారిద్దరి మధ్యా ప్రేమ అంకురిస్తుంది. పల్లెటూరి సస్యక్షేత్రాల మధ్య వాళ్ళ ప్రేమ చిగురించినప్పుడు వాళ్ళు ఏదోను ఉద్యానంలో సంతోషభరితంగా గడిపిన స్త్రీపురుషుల్లానే ఉంటారు. ఆ తర్వాత పెళ్ళయ్యి వాళ్ళు సెయింట్ పీటర్స్బర్గ్ నగరానికి వెళ్ళి అక్కడ దాంపత్య జీవితం మొదలుపెట్టినప్పుడు, ఆ తొలినాళ్ళ స్వాప్నిక మనోజ్ఞ ప్రేమపారవశ్యం స్థానంలో నెమ్మదిగా ఒక పరాయీకరణ, చెప్పలేని ఒక విచారమూ ఆవరించడం మొదలుపెడతాయి. కానీ చివరికి ఆమె దాన్ని జయిస్తుంది. కానీ ఆ ప్రయాణం పొడుగునా ఆమె సహచరుడు నిశ్చలంగా, స్థిరంగా, నిజమైన సంరక్షకుడిగా ఆమె పక్కన నిలబడే ఉంటాడు.
ఇది నిజంగానే ఇమ్మెన్సీ తరహా కావ్యం. ఇందులో విలన్లు లేరు. ద్రోహాలు లేవు, నాటకీయ సంఘటనలు కనిపించవు. కాని మారుతున్న ఋతువుల మధ్య, విరబూస్తున్న లిలాక్ ల మధ్య, నైటింగేలు గానం మధ్య, తోటలో సాయంకాల నడక మధ్య, ఆ స్త్రీపురుషుల సంచలిత హృదయాల చిత్రణ మాత్రమే ఉంటుంది. శాకుంతలం కూడా ఇలానే ఒక వనంలో మొదలైన ప్రేమ కథ. కానీ అక్కడ పురుషుడి ప్రేమలో మార్పు వస్తుంది. ఇక్కడ స్త్రీ ప్రేమలో మార్పు వస్తుంది. ఇమ్మెన్సీ లో కనిపించే Entsagung ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాని ఇక్కడ ప్రేమికులు విడిపోరు. అందుకు బదులు ఆ తొలినాటి స్వప్నం కరిగిపోతుంది. దాని స్థానంలో మరింత గంభీరమైన దాంపత్యమనే కొత్త ప్రణయావస్థ ఆవిష్కారమవుతుంది. పువ్వు కాయగా మారినప్పుడు ఆ పూల పరిమళం అదృశ్యమైపోయి దాని స్థానంలో ఒక వగరు, ఒక పులుపు వచ్చి చేరతాయి. కాని నెమ్మదిగా ఆ కాయ పండుగా మారేక అప్పుడు మళ్ళా సుగంధం ప్రసవిస్తుంది. కాని ఇది ఆ తొలినాటి పూల సుగంధం కాదు, మరింత పరిణత సాఫల్య సుగంధం.
23-11-2026

