నేను తిరిగిన దారులు-20

రాళ్ళల్లో చెక్కిన కావ్యాలు

3

ఒక అలౌకిక స్వప్నం

దసరా ఉత్సవాల్లో మైసూరు వెలిగిపోతోంది. ఊరంతా విద్యుద్దీపాలు. ఆ రాత్రి మాకు అతికష్టంమీద హొటల్లో బస దొరికింది. పొద్దున్నే లేవగానే ముందు మేము చాముండేశ్వరి దేవాలయానికి వెళ్లాం. అక్కడినుంచి నేరుగా మైసూరు రాజప్రాసాదానికి వెళ్లాం. రాజప్రాసాదమంతా సందర్శకులతో కిటకిటలాడుతోంది. రాజభవనం మందిరాలూ, పై అంతస్థులూ, దర్భారుహాలూ అన్నీ కలియతిరిగాం. గోడలమీద చిత్రలేఖనాలు, నగిషీలు, అలంకరణలు. కానీ హళేబీడు చూసినతరువాత మైసూరు రాజభవనం చాలా తక్కువరకం అభిరుచికి చెందిన నిర్మాణంలాగా గోచరించింది. శిల్పనైపుణ్యం నశించిపోయింది సరే, సౌందర్యదృష్టి కూడా పూర్తిగా క్షీణించిపోయిన యుగంలో, కేవలం సంపద ప్రదర్శించుకోవడం తప్ప, మరేమీ చాతకాని కాలానికి చెందిన కళాకృతిలాగా గోచరించిందది. అడవుల్లోంచి కొల్లగొట్టుకొచ్చిన టేకు, చందనపు కలప తప్ప అక్కడ చెప్పుకోదగ్గదేమీ కనిపించలేదు.

మధ్యాహ్నం భోజనం పూర్తిచేయగానే ఊటి బాట పట్టాం. నీలగిరుల గురించి ఎన్నాళ్లుగానో  కంటున్న కల. మేము బండిపుర రిజర్వుఫారెస్టులోకి ప్రవేశించేటప్పటికి సాయంకాలమవుతోంది. శరత్కాలపు అడవుల్లో కనవచ్చే సాయంకాలపు నిశ్శబ్దం, చుట్టూ మెత్తని చేతులతో కౌగిలించుకుంటున్నట్టుగా చలి. అడవుల మీంచి పచ్చికబయళ్ల మీదుగా సాయంసంధ్యారశ్మి. ఆ అడవిలో మందలుమందలుగా లేళ్లూ, దుప్పులూ కనిపించాయి. కొన్ని పరుగులు తీస్తున్నాయి. కొన్ని నిదానంగా పచ్చిక నెమరువేస్తున్నాయి. రోడ్డుకటూ ఇటూ ఫారెస్టు ఠాణాలు. ఒకటి రెండు ఏనుగులు కూడా గొలుసులకు బంధించి కనబడ్డాయి. అక్కడ ఫారెస్టు ఉద్యోగులు వారిస్తున్నా వినకుండా ఫొటోలు తీసుకోవాలని సరదాపడ్డాం.

అక్కడనుంచి అడవి గర్భంలోకి ప్రయాణం. లోపల అక్కడక్కడా నెమళ్లు కనిపిస్తున్నాయి. బాగా పొద్దుపోయాక మేం గుడలూరు అనేచోట ఆగాం. నీలగిరులు, పడమటికనుమలతో కలిసే చోటది. అక్కడనుంచి తూర్పుకనుమలు, పశ్చిమకనుమలు కలిసిపోతూ ఉండే నీలగిరి పర్వతశ్రేణి మొదలవుతుంది. గుడలూరులో టీ తాగాం. ఆ పైన అనేక ఘాట్లు ఎక్కుతూ, ఒంపుదారుల్లోంచి నెమ్మదిగాసాగుతూ మలుపులు తిరుగుతూ మా బండి ప్రయాణించింది. జల్లులాగా పడుతున్న మంచు మధ్య యూకలిప్టస్ పరిమళాలు మమ్మల్ని చుట్టుముట్టగానే మేం నీలగిరిలో ప్రవేశించామని అర్థమైంది.

నా తాడికొండ సహాధ్యాయి, మిత్రుడు రాజేంద్రప్రసాద్ ఊటిలో సెంట్రల్ బాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఆ రాత్రి అక్కడ మాకోసం వసతి సిద్ధం చేసి ఎదురుచూస్తున్నాడు. మేం వెళ్లగానే స్నానానికి వేన్నీళ్లూ, ఆ పైన వేడివేడి ఆహారం సిద్ధం చేశాడు. మేం అన్నం తిని ఆ రాత్రే ఊటి ఎలా ఉంటుందో చూద్దామని రోడ్డుమీదకు నడచుకుంటూ వచ్చాం. ఆ రోజంతా వర్షం పడిందిట. అందుకని వీథులన్నీ బురదగా, మురిగ్గా ఉన్నాయి. రోజుల తరబడి వానల్లో తడుస్తూండే ఊళ్లు ఎలా ఉంటాయో నేను పాడేరుమన్యంలో చూశాను. ఊటి కూడా అలానే తడిసిపోయిన వస్త్రంలాగా ఉంది. తడిసిపోయి నాచుపట్టిన ఇళ్లమీంచి, సందుల్లోంచి ఒకరకమైన ముక్కవాసన. ఊటిలో ఏం చూడాలి అని మేం అడిగేలోపే నా మిత్రుడు ‘సాధారణంగా ఊటి వచ్చిన వాళ్లంతా ఇక్కడిక్కడే ఏవో ఒకటి చూస్తూ ఉంటారు. కొంతమంది తేయాకు తోటల్ని చూడ్డానికి కూనూరుదాకా వెళ్తుంటారు. కాని నేను రేపు మీకు ఒక ప్రత్యేకమైన స్థలం చూపించాలనుకుంటున్నాను. ఊటి అందం మీకు అక్కడ కనిపిస్తుంది’ అన్నాడు.

‘ఊటి చోద్యము’ ఎలా ఉంటుందో చూద్దామని కలలుగంటూ నిద్రపోయాం. పొద్దున్నే మమ్మల్ని అతడు త్వరత్వరగా తయారవ్వమన్నాడు. మాకోసం ఒక పెద్దమనిషి వస్తాడనీ, ఆయన మమ్మల్ని తీసుకువెళ్తాడనీ తను కూడా మమ్మల్ని అక్కడ కలుస్తానని చెప్పి నా మిత్రుడు బ్యాంకుకు వెళ్లిపోయాడు.

మేం తయారయ్యేటప్పటికి మాకోసం పొన్నప్ప అని ఒకాయన వచ్చి ఎదురు చూస్తూన్నాడు. ఆయన మమ్మల్ని ఊటి నుంచి మంజూరు అనే ఊరి వైపు తీసుకువెళ్లాడు. మేం వెళ్తున్న దారి పొడుగునా అప్పుడే మొలకెత్తుతున్న టీ మొక్కలతో కాబేజీ, కారటు, బీటురూటు వంటి కూరగాయల చేలతో నిండిన పచ్చని పొలాలు. కొంతదూరం ముందుకుపోగానే అక్కడ తమిళనాడు గిరిజనసంక్షేమశాఖ వాళ్ల గిరిజన పరిశోధనాకేంద్రం కనిపించింది. మేం ఆ పరిశోధనా కేంద్రంలో అడుగుపెట్టగానే నేను అత్యంత ప్రాచీన మానవులు నివసిస్తున్న అత్యంత ప్రాచీనభూమ్మీద సంచరిస్తున్నానని తెలుసుకున్నాను. నేను ఎన్నడో విన్న తోడాలు నివసించేది ఇక్కడేనని గుర్తొచ్చింది. ఆ పరిశోధనాకేంద్రంలో పనిచేస్తున్న ఉద్యోగిని ‘నేను తోడాల గ్రామం ఏదైనా చూడాలంటే ఎలాగ’ అని అడిగాను. అతడు బొటానికల్ గార్డెన్స్ దగ్గర ఒక తోడా పల్లె ఉందనీ, దాన్ని చూడవచ్చనీ’ చెప్పాడు. మా కోసం బయట పెద్దమనిషి ఎదురుచూస్తూండడంతో మేం అక్కడ అట్టే సేపు ఉండకుండా వచ్చేశాం.

అక్కడనుంచి పొన్నప్ప మమ్మల్ని సుమారు పాతిక, ముప్ఫై కిలోమీటర్ల దూరమే తీసుకువెళ్లాడు. ఆ దారి పొడుగునా మేం ప్రయాణిస్తున్నంత మేరంతా చాలా నయనమనోహరంగా ఉంది. రహదారికటూ ఇటూ రెండు నదులు. ఒకదాన్ని అవలాంచి నది అంటారనీ, రెండవదాన్ని ఎమరాల్డ్ నది అంటారనీ ఆయన చెప్పారు. ఆ నదులమధ్యనుంచి ఆ దారమ్మట ముందుకు సాగుతుంటే అటూఇటూ విస్తారంగా పరచుకున్న కొండవాలులు. ఆ కొండలమీద సిల్వర్ ఓక్  చెట్లు. అక్కడక్కడా నిద్రపోతున్నట్టున్న పల్లెలు. చుట్టూ అప్పుడప్పుడే ఎదుగుతున్న టీ తోటలు, విస్తారంగా కూరగాయల చేలు. పైన పరచుకున్న నల్లని మేఘాలు. ఆ దారి పొడుగునా అట్లా కొన్నేళ్లపాటు ప్రయాణం చేస్తూ ఉండొచ్చనిపించింది.

మమ్మల్ని ఆ పొన్నప్ప రహదారిమీంచి లోపలికి తీసుకువెళ్లి ఒకచోట ఆపాడు. అక్కడ మాకోసం ఒక ట్రక్కులాంటిది సిద్ధంగా ఉంది. అక్కడనుంచి మేం వెళ్లబోయేచోటు దాకా రోడ్డు బాగుండదనీ కాబట్టి మేం ట్రక్కుమీద వెళ్లాలని చెప్పాడాయన. సన్నని ఇరుకుదారిన అడవిమధ్యలో ఒళ్లంతా హూనమయ్యేటట్టు కొంతదూరం పోయిన తరువాత మాముందొక లోయ ప్రత్యక్షమయ్యింది. ఆ లోయలో సినిమాల్లో చూసినట్టుండే ఒక రిసార్ట్. ఆ రిసార్ట్ పేరు ‘డెస్టినీ’. లిటిల్ ఎర్త్ సొసైటి అనే యాజమాన్యం తరఫున విజయప్రభు అనే కన్నడిగుడు నిర్మించిన విహారకేంద్రమది. అక్కడి నిర్మాణాలు పూర్తిగా ఐరోపీయపద్ధతిలో ఏ స్విట్జర్లాండులోనో మాత్రమే కనవచ్చేటట్టుగా ఉన్నాయి. మేం ఆ రిసార్ట్ లో  అడుగుపెట్టగానే మరేదో దేశంలోకి అడుగుపెట్టినట్టనిపించింది.

చెక్కతో నిర్మించిన ఆ వసతిగృహాలు చాలా అందంగా, ఎంతో అభిరుచితో కూడుకుని ఉన్నాయి. గోడలమీద అందమైన చిత్రలేఖనాలున్నాయి. కిటికీల్ని సన్నని పల్చని పట్టుపరదాలు వేలాడుతున్నాయి. ఆ పరదాల రెపరెపలమీదనుంచి చూస్తే అవలాంచి నది కనిపిస్తోంది. ఆ నది చుట్టూ నీలగిరులు. ఆ నీలగిరులమీద నల్లని మబ్బులు. ఆ మబ్బులు తమనుతాము చూసుకోవడానికి నదీజలాలు అద్దంలాగా అమరినట్టున్నాయి. ఆ రిసార్ట్ లో  పాశ్చాత్యసంగీతం మంద్రంగా వినిపిస్తోంది. బల్లలమీద ఫ్లవర్ వాజుల్లో అప్పుడే అమర్చిన పూలు, పూలకొమ్మలు లేతగా, తాజాగా ఉన్నాయి. ఆ విజయప్రభు ఎవరో కానీ నిజంగానే ఆ వాతావరణాన్నంతా ఒక అలౌకికస్వప్నంలాగా తీర్చిదిద్దాడు.

మేం ఆ కొండవాలుల్లో అటూఇటూ తిరిగాం. అక్కడ బాతుల దగ్గరా, కుందేళ్ల దగ్గరా ఫొటోలు తీసుకున్నాం. ఆ రిసార్ట్లో ఒక గోశాల, గుర్రపుశాల కూడా ఉన్నాయి. ఆ గోశాల్లో పుష్టిగా, బలంగా ఉన్న ఆవులూ, గొర్రెలు. ఆ గుర్రపుశాల్లో మేలుజాతి గుర్రాలున్నాయి. పిల్లలు గుర్రాలెక్కాలని సరదా పడుతున్నారని చూసి వాళ్లతో కొద్దిసేపు గుర్రపుస్వారి కూడా చేయించారు. మధ్యాహ్నభోజనసమయానికి నా మిత్రుడు కూడా మాతో చేరాడు. మేం భోజనం చేసి మళ్లా కొద్దిసేపు ఆ చుట్టూ ఉండే అడవుల్లో తిరిగాం. అక్కడక్కడా ట్రెక్కింగ్ కోసం వచ్చిన యువతీయువకులు కనిపించారు. అడవిలో పక్షుల క్రేంకారాలు, ఉండీఉండీ అడవిగొర్రెల అరుపులు వినబడుతూఉన్నాయి. మధ్యలో ఒకటిరెండుసార్లు చిరుజల్లు కురిసిపోయింది. దారి పొడుగునా ఆకులగుబుర్లమీంచి ఆగిఆగి పడుతున్న నీటిబొట్లు, అక్కడక్కడా రాలిన పక్షిరెక్కలు. మేం త్వరత్వరగా మళ్లా ఊటి బాటపట్టాం. నా మిత్రుడి పేరుమీద ఆ రోజు అక్కడ మాకు లభించిన ఆతిథ్యం, అలౌకికమైన ఆ వాతావరణం, ఆ చల్లదనపు స్పర్శ చాలాకాలం పాటే గుర్తుండిపోతాయనిపించింది.

మేం తొందరతొందరగా బయలుదేరడానికి కారణం ఊటిలో దొడ్డబెట్ట అనే ప్రాంతం చూడాలని. అది నీలగిరుల్లోనే అన్నిటికన్నా ఎత్తైన ప్రదేశం. సముద్రమట్టానికి సుమారు ఎనిమిదివేల అడుగుల ఎత్తునున్న ఆ ప్రాంతంలో సూర్యోదయం, సూర్యాస్తమయం చూసి తీరవలసినవని నా మిత్రుడు ఒకటే చెప్తున్నాడు. మేం ఎంత తొందరతొందరగా ప్రయాణించినా దొడ్డబెట్ట వెళ్లే మలుపు తిరిగేటప్పటికి చెక్ పోస్ట్ మూసేశారు. నాకు దొడ్డబెట్ట చూడాలని ప్రత్యేకమైన కుతూహలమేమీ లేదు. పాడేరులో మోదకొండమ్మపాదాలకన్నా అందమైన ప్రాంతం ఎక్కడుంటుంది కనుక?

కాని నా మిత్రుడు మాకు ఆ ప్రాంతం చూపించాలని ఒకటే ఉవ్విళ్లూరుతున్నాడు. అతడు ఆ చెక్ పోస్ట్ ఉద్యోగుల్ని ఏంమాయ చేశాడో కాని మా బండిని లోపలికి అనుమతించారు. అంత కష్టపడి వెళ్లినందుకు ఆ పర్వతశిఖరం మమ్మల్ని నిరుత్సాహపరచలేదు. అక్కడనుంచి నిజంగానే కనుచూపుమేరంతా పొగ, మంచు, సూర్యకాంతి. ఆ పొగమంచు మధ్యలో నారింజరంగు సంధ్యకాంతి దిగంతమంతా పరచుకొంది. మేఘాలతెరల మధ్యనుంచి ఉండీ ఉండీ సూర్యకాంతి కనిపిస్తూ అదృశ్యమవుతూ ఉంది. నిజంగానే అదొక ఖేల. మనోహరవిన్యాసం. కన్నులపండుగ.


Poems Carved in Stone

3

An Unearthly Dream

Mysore was ablaze for the Dasara celebrations, the entire city bathed in electric illuminations. It was with immense difficulty that we secured a room for the night. Early the next morning, we set out first for the Chamundeshwari temple and proceeded directly from there to the Mysore Palace. The palace was teeming with visitors. We wandered through the halls, the upper chambers, and the great Durbar Hall, taking in the wall paintings, decorative flourishes, and elaborate fretwork.

Yet having just come from Halebidu, the Mysore Palace struck me as an artifact of far poorer aesthetic taste. It seemed the creation of an age when sculptural mastery had perished and authentic aesthetic discernment had thoroughly decayed—a period capable of little else than displaying raw, accumulated wealth. Beyond the plundered riches of teak and sandalwood hauled in from the surrounding forests, there was little of true enduring wonder to command the eye.

Having finished our midday meal, we took the road to Ooty. For years, I had held a dream of the Nilgiris. Evening began to settle just as we entered the Bandipur Reserve Forest. A quiet dusk settled over the autumn woods, accompanied by a biting chill that seemed to clasp us like soft hands, while the dying light of the sun slanted across clearings and meadows. Herds of deer and stags moved through the forest—some dashing across the undergrowth, others grazing at leisure. Along the way stood forest outposts, where one or two captive elephants were tethered in chains. Despite the forest officials’ warnings, we gave in to our curiosity and stopped to take photographs.

From there, our journey plunged deeper into the heart of the woods, with peacocks breaking the green cover here and there. Night had fully fallen by the time we reached Gudalur, where the Nilgiris meet the Western Ghats—the great junction where the Eastern and Western Ghat ranges converge. After tea at Gudalur, our vehicle climbed through ascending ghat roads, crawling along serpentine curves and hairpin bends. When eucalyptus scents enveloped us through the drifting mist, we knew we had crossed into the Nilgiris.

My classmate from Tadikonda, Rajendra Prasad, was serving as a branch manager at Central Bank in Ooty. He had arranged our lodging for the night and was waiting to receive us. The moment we arrived, he had hot water ready for our baths, followed by a steaming meal.

After dinner, eager to take in the town by night, we walked out into the streets. It had rained all day; the lanes were soaked in mud and grime. I had seen in the agency tracts of Paderu how settlements look when drenched by relentless days of downpour, and Ooty seemed just like that—a waterlogged garment. A damp, stale odor rose from the moss-covered stone walls and narrow alleys.

Before we could ask what there was to see in Ooty, my friend remarked:

“Visitors here usually drift through the ordinary spots in town, or go as far as Coonoor for the tea estates. But tomorrow, I want to show you somewhere singular. That is where Ooty’s true beauty reveals itself.”

We slept, dreaming of what this promised wonder might be. In the morning, my friend urged us to get ready quickly. He informed us that an elderly gentleman would come to drive us out and that he would join us later, before departing for his bank.

By the time we were ready, a gentleman named Ponnappa had arrived. He drove us out from Ooty toward Manjoor. Along the road stretched green patchwork fields of tender tea bushes interspersed with terraced patches of cabbage, carrot, and beetroot. A little further along stood the Tribal Research Centre run by the Tamil Nadu Tribal Welfare Department. Stepping inside, I was struck by the realization that I was treading upon an ancient terrain inhabited by an ancient people; the Todas, of whom I had heard so long ago, lived right here. When I asked an official at the center how I might visit an authentic Toda hamlet, he suggested seeing the settlement near the Botanical Gardens. Because our driver was waiting outside, we could not linger long.

Ponnappa then drove us some twenty-five to thirty kilometers further along a magnificent stretch of mountain road. Flanking the route ran two rivers—Avalanche and Emerald. Winding our way between them, we looked out across broad sweeping slopes dotted with silver oaks, quiet hamlets resting as though asleep, tender tea plantings, and wide vegetable beds, all sheltered under heavy dark clouds. It felt like a road one could journey along for years without tiring.

Turning off the main road, Ponnappa brought us to a halt where a rugged truck was parked. He told us the path ahead was impassable for ordinary cars and that we would have to proceed by truck. After a bone-jarring drive down a narrow forest track, a hidden valley opened before us.

Nestled within that bowl was a resort that seemed plucked from a film set: Destiny. Built by Vijayaprabhu, a Kannadiga, on behalf of the Little Earth Group, its architecture was entirely European, evoking an alpine chalet in Switzerland. Stepping inside felt like crossing into an entirely different country.

The wooden cottages were designed with refined aesthetic restraint. Elegant paintings hung upon the walls, while thin, diaphanous silk drapes fluttered beside the windows. Peering through the fluttering silks, the Avalanche River shimmered below, cradled by the Nilgiri hills under dark, gathering clouds. The waters mirrored the overcast sky like glass. Muted Western classical melodies drifted through the halls, and the vases were dressed with freshly cut, dewy blossoms. Whoever this Vijayaprabhu was, he had shaped the entire setting into an unearthly dream.

We strolled along the rolling slopes, pausing to take pictures with ducks and rabbits. The property included an active dairy farm and stables, home to well-tended cows, sheep, and fine thoroughbred horses. Seeing the children’s excitement, the staff arranged short pony rides for them.

My friend joined us in time for lunch. Afterward, we walked out into the surrounding woods, crossing paths with young trekking groups. Birdcalls echoed through the trees, punctured by the occasional bray of wild sheep. A light drizzle broke over us once or twice; water droplets fell intermittently from heavy boughs, and fallen bird feathers lay strewn along the path.

Before long, we had to turn back toward Ooty. The generous hospitality arranged in my friend’s name, the unearthly calm of that setting, and the cool mountain air remained etched in memory.

Our haste was driven by the desire to reach Doddabetta, the highest peak in the Nilgiris. Rising nearly eight thousand feet above sea level, its sunrise and sunset vistas were, as my friend insisted, an absolute must-see.

Yet despite our rush, the checkpost was already closed by the time we reached the turnoff. I had no burning curiosity to see Doddabetta—after all, what place could surpass the foot of Modakondamma in Paderu? But my friend was determined that we should not miss it. By what charm he persuaded the checkpost guards I do not know, but our car was permitted through.

For all that effort, the summit did not disappoint. As far as the eye could reach stretched an interplay of smoke, mist, and sunlight. Through the drifting fog, a deep orange twilight poured across the horizon. Beams of sunlight emerged and vanished through parting curtains of cloud—a grand, enchanting spectacle, and a true feast for the eyes.

19-9-2026

2 Replies to “నేను తిరిగిన దారులు-20”

  1. చదివినంత సేపు నేను కూడా మీతో పాటే ఉన్నాను.
    మధ్యలో నీలగిరుల మీద గురజాడ పాటేదో రాసినట్టు గుర్తుకు వచ్చింది. అలాగే మొదటి సారి స్విట్జర్లాండ్ వెళ్లినపుడు చూసిన ఇంటర్ లాకెన్ సీన్లన్నీ దొర్లుతుంటే మీరు స్విట్జర్లాండ్ మాటెత్తగానే కలిగిన అనుభూతికి మాటలు చాలవు . మీ రచనలు విజ్ఞానదాయకం, మానసికోల్లాస ప్రదాయకాలు . తెలుగు సాహిత్యయోష మీకెల్లప్పుడూ ఋణపడి ఉంటుంది . నమస్సులు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading