జీవన శిల్పి-20

ఇంటి గురించీ, ఇండ్ల నిర్మాణం గురించీ, మనిషిని సామాజికజీవిగా మార్చగల ఇంటి డిజైన్ గురించీ గురూజీ తన సంభాషణ కొనసాగిస్తున్నారు:

‘ఇంటికి ఉండవలసిన అయిదు లక్షణాల్లో ఆధ్యాత్మికతా, ప్రకృతి పట్ల ప్రేమా అనే రెండింటి గురించి కూడా చెప్పాను. ఆ రెండింటి మధ్యా కూడా సంబంధం ఉంది. ఎవరైతే ఆధ్యాత్మిక జీవి కాడో, వాడికి ప్రకృతి పట్ల ఎలాంటి ప్రేమా ఉండదు. ప్రకృతిని ప్రేమించాలంటే వాడికి ఆధ్యాత్మికమైన ఆలోచన ఉండాలి. ప్రతి ఒక్క వస్తువుతో అనుబంధం ఉండాలి. పూజారిని చూడండి. అతడు రోజంతా దేవుడి సేవలో ఉంటాడు-ఆయనకు స్నానం చేయిస్తాడు, బట్టలు మారుస్తాడు, అన్నం పెడతాడు. మరి వాడు ఆధ్యాత్మిక జీవి అయిపోయాడా? అతడు కేవలం పూజారి మాత్రమే. అతణ్ణి ఆధ్యాత్మిక జీవి అనలేం. ఆధ్యాత్మిక జీవి అంటే అన్ని వస్తువుల్నీ సమానంగా చూసేవాడు, ఒక సమదృష్టితో బతికేవాడు, లేదా అలా బతకడానికి ప్రయత్నించేవాడు.’

‘ఎవరైతే ఆధ్యాత్మిక జీవి కాడో, వాడికి ఈ వస్తువులన్నింటిపట్లా ఎలాంటి ప్రేమా ఉండదు. ఎవరికైతే ప్రకృతి పట్ల ప్రేమ లేదో వాడు ఎన్నటికీ సామాజిక జీవి కాలేడు. కాబట్టి ఇల్లు కట్టే సమయంలో, ఈ ఇంట్లో నివసించేవాడు ఆధ్యాత్మికంగా మారాలి అనే విషయం ఖచ్చితంగా చూసేవాళ్ళు. అదెలా సాధ్యమవుతుంది? మొట్టమొదటిది, ఆర్థికంగా వాడు ప్రశాంతంగా ఉండాలి. ఇల్లు ఇబ్బంది పెట్టకూడదు. ఇల్లు అలాంటి డిజైన్ కలిగి ఉండాలి. రెండవది, అది ప్రకృతితో కలిసి ఉండేలా చేయాలి. మన దగ్గర పెద్ద పెద్ద భవనాల నుండి చిన్న చిన్న గుడిసెల దాకా ఏవైతే కట్టారో అవన్నీ ఒకే వరసలో ఉండేవి. వాటి వెనక ఉన్న కొండలు, చెట్లు ఎలా ఉన్నాయో, వాటికి అనుగుణంగానే ఇండ్ల లైనింగ్ ఉండేది. ఆ ఇళ్ళు ప్రకృతిలో ఒక భాగంగా కనిపించేవి. దేవాలయాల నిర్మాణంలో ఆ పద్ధతి పాటించారు. పూర్వకాలం ఇళ్ళల్లో కూడా ఏ వస్తువులైతే చేసేవాళ్ళో- ఉదాహరణకి, చిలకకొయ్యలు తెలుసు కదా, అవి రామచిలుక ఆకారంలో ఉండేవి. అందుకే వాటిని చిలకకొయ్యలు అన్నారు, అలా చాలాచోట్ల రకరకాల పూలు, పక్షులు, ఆకుల డిజైన్లు ఉపయోగించేవాళ్ళు. ఏవైతే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయో వాటిని డిజైనులోకి తెచ్చేవాళ్ళు. దానివల్ల ఎక్కడో ఒకచోట, ప్రకృతితో బంధం ఏర్పడుతుంది కదా. మనిషి ప్రకృతితో కలిసి ఉంటేనే సామాజిక జీవి అవుతాడు.  గ్రామనిర్మాణాల గురించి మాట్లాడినప్పుడు చెప్పానుకదా, గల్లీలు ఎలా ఉండేవో. మనిషి తన ఇంటిముందు కూర్చుని మిగతా ఇళ్ళవాళ్ళతో మాట్లాడేవాడు. ఆ వాతావరణమే మనిషిని సామాజిక జీవితం వైపు నడిపిస్తుంది.’

‘వాస్తులో ఇంకా చాలా విషయాలున్నాయి. ఈ రోజు దిశలనే వాస్తుగా భావిస్తున్నారు. పూర్వం ఇల్లు కట్టేటప్పుడు అన్నింటికంటే మొదట భూమి పూజ ఎక్కడ చేసేవారో తెలుసునా? ప్రసూతి గది ఎక్కడ కట్టాలనుకుంటున్నారో అక్కడ. ఎక్కడ పిల్లల ప్రసూతి జరుగుతుందో ఆ భూమిని చాలా బాగా పరీక్షించేవాళ్ళు. అక్కడ ఎలాంటి విషవాయువులూ ఉండకూడదు. అది ధూళి లేచే భూమి అయి ఉండకూడదు, దుర్వాసన ఉండకూడదు. ఈ పరీక్షలన్నీ జరిగినతర్వాతనే అక్కడ ప్రసూతి గది నిర్మించేవాళ్ళు. పిల్లవాడు ఎక్కడపుట్టాలి, ఎక్కడ ఆడుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ వాడి గృహస్థ జీవితం సాగాలి, వాడి వృద్ధ్యాప్యం ఎక్కడ గడవాలి మొదలైనవన్నీ చూసుకునేవారు. దీన్ని చక్రవాస్తు అంటారు- పుట్టుకనుంచి తుదిదాకా. ఎందుకంటే వాడి జీవితం మొత్తం ఆ ఇంట్లోనే జరగాలి కదా. ఈ రోజు అలా లేదు. ఈ రోజు పిల్లవాడు ఇంట్లో పుట్టడం లేదు, ఇంట్లో పెళ్ళి జరగడం లేదు, ఇంట్లో చావడం లేదు (నవ్వుతూ).’

‘ప్రకృతిని ప్రేమించడం అంటే ఏమిటి? ఇప్పుడు ఇండ్లల్లో ఏం చేస్తున్నారు? పెద్ద పెద్ద కిటికీలు, తలుపులు పెడుతున్నారు. నేను చాలా సార్లు చెప్తుంటాను- పూర్వకాలపు ఇండ్లలో చిన్న తలుపులు, చిన్న కిటికీలు ఉండేవి. ఖాళీగా ఉంచేవారు. చాలా చిన్న తలుపులు, చాలా చిన్న కిటికీలు ఉండేవి. ఈ రోజుల్లో పెద్ద పెద్ద తలుపులు, కిటికీలు పెట్టడమే కాకుండా దానికి గ్లాసు వేస్తారు. లోపలినుంచి పరదా వేస్తారు. నేను చాలా సార్లు అడుగుతుంటాను: ‘మీకు వెలుతురు అక్కర్లేదు, గాలి అక్కర్లేదు, మరి ఇంత పెద్ద కిటికీ ఎందుకు పెట్టారు?’ అని (నవ్వుతూ). అవునా? ఎందుకు పెట్టారు అంత కిటికీ?’

‘ఒక ఇల్లు కడితే కనీసం 20-25 చెట్ల కలప నాశనం చేస్తున్నారు. పాత ఇండ్లలో అంత కలప నాశనమయ్యేది కాదు. చాలా చిన్న కిటికీలు, తలుపులూ ఉండేవి. మన దగ్గర ఉన్న కలప కూడా చాలా చిన్నగా ఉండేది. అదీకాక, ఈ రోజుల్లో డిజైను ఎలా ఉందంటే, ఎక్కడో రౌండుగా కట్ చేస్తారు, వంకరగా కట్ చేస్తారు, దానివల్ల పెద్ద పెద్ద కలప దిమ్మల్ని నాశనం చేస్తున్నారు. ఏదీ పద్ధతిగా కట్ చేయరు. నేను చాలాసార్లు చెప్తుంటాను-మీకు గాలి అక్కర్లేనప్పుడు, వెలుతురు అక్కర్లేనప్పుడు, కిటికీ ఎందుకు పెట్టారు? దీనికంటే ఒక పోస్టరు అంటించుకోవచ్చు కదా. అవును. కిటికీ పోస్టర్. ప్రతి ఆరునెలలకు మార్చుకోవచ్చు, చెప్పుకోవచ్చు కూడా ‘నేను కిటికీ మార్చేసాను’ అని. ఆ పోస్టర్ కంటే ఈ కిటికీ వల్ల అదనంగా ఏం ప్రయోజనముంది? దాన్నెప్పుడూ తెరవరు, మూసే ఉంచుతారు. లోపలినుండి తెరలు దించుతారు. దేనికోసం పెట్టారు ఆ కిటికీ? ఇది మూర్ఖత్వం కాక మరేమిటి? అందుకే ఈ ఆధునిక గృహాలు చాలా భయంకరమైనవి. ఇవి మనిషిను పూర్తిగా నిర్భాగ్యుణ్ణి చేస్తాయి.’

‘ఒకసారి కొంతమంది మా దగ్గరకు వచ్చారు. అప్పుడు పీటలు వేసి భోజనం పెట్టాం. వారిలో కొందరు ఫారినర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు డైరీలో రాసుకున్నారు-‘మేము ఈ రోజు భోజనం చేసాం. అందులో ప్రతి ఒక్కరికీ విడిగా డైనింగ్ టేబుల్ ఉంది.దానిమీద దీపం వెలుగుతోంది అని’ (నవ్వుతూ). వాళ్ళు ఆ పీటల్ని డైనింగ్ టేబుల్స్ అన్నారు. దీపం వెలుగుతోంది, రంగోలి వేసారు, దాన్ని చాలా మంచి పెయింటింగ్ అని కూడా రాసుకున్నారు. ఆ తర్వాత బయటికి వెళ్ళి చూసారు. ఆ పీటలన్నీ ఒకదానిపై ఒకటి మూలన పెట్టేసి ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ డైరీలో రాసుకున్నారు- ‘మేము ఆ డైనింగ్ టేబుల్స్ చూసాం. వాటిని ఒక మూలన ఒక దానిమీద ఒకటి సెట్ చేసి పెట్టారు’ అని. (నవ్వుతూ). ‘ఇవి చాలా సౌకర్యవంతమైన టేబుల్స్’ అని కూడా రాసుకున్నారు.’

‘పిల్లల గురించి చెప్తున్నాను కదా. నాగపూర్ లో అశోక్ జోషి అని ఒక పెద్ద ఆర్కిటెక్టు ఉండేవారు. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయనకు బొంబాయిలో ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆయనకు చిన్న కూతురు ఉండేది. ఆ పిల్ల మెల్లమెల్లగా ఎలా అయిపోయిందంటే- ఆటలు లేవు, మాటలు లేవు, అస్సలు కదలికనే లేకుండా అయిపోయింది ఆ పిల్లలో. అలా కూర్చుండిపోయేది. చాలామంది డాక్టర్లకు చూపించారు. మానసిక నిపుణులకు చూపించారు. కానీ ఆ పిల్ల పరిస్థితిలో మార్పు రావడం లేదు.’

‘అశోక్ జోషి గారు ఒక రోజు ఆ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు తమ కూతురి పరిస్థితి ఆయనకు చెప్పారు. ఆయన అంతా విని, ఆ బిడ్డను బాగుచేస్తాను, అయితే, నేనేం చెప్పినా మీరు చేయాలి’ అని చెప్పారు. వాళ్ళు సరేనన్నారు. ఆయన మొదట ‘ఈ డైనింగ్ టేబుల్ కాళ్ళు కట్ చేసేయండి. దీని సైజు ఇంతకి తగ్గించండి’ అన్నారు. అలాగే ప్రతి ఒక్క వస్తువును, కిందకి దించేసారు, కాళ్ళు కట్ చేయించి.’

‘కొన్ని రోజుల తర్వాత మళ్ళా వెళ్ళి చూస్తే- ఆ పిల్ల చాలా యాక్టివ్ గా తిరుగుతోంది. ఎవరైనా భోజనం చేస్తుంటే, ఆ పిల్ల వాళ్ళకి రొట్టె అందిస్తోంది, నీళ్ళు అందిస్తోంది. వాళ్ళకు చాలా ఆశ్చర్యం వేసింది. ‘మీరేం చేసారు?’ అనడిగారు ఆయన్ని. ‘నేనేమీ చేయలేదు. మీ పాత ఇంట్లో ఆ పిల్ల చేతికి ఏ వస్తువూ అందేది కాదు. అన్నీ అంతంత ఎత్తుల్లో ఉండేవి. నేను చేసిందల్లా ప్రతి ఒక్కటీ మీ అమ్మాయి చేతులకి అందేలా చేసాను, అంతే ‘ అని చెప్పారు. ‘ఎందుకంటే, చిన్నపిల్లలు ప్రతి ఒక్క వస్తువునీ తాకాలనుకుంటారు, ఆడుకోవాలనుకుంటారు, ఏదీ అందనప్పుడు ఆ పిల్ల ఖాళీగా కూర్చుండిపోయేది. ఇప్పుడు అన్నీ అందేటంత ఎత్తుకి దిగగానే ఆ బిడ్డ చాలా యాక్టివ్అయిపోయింది’ అని కూడా చెప్పారు.

‘ఇలానే జరుగుతుంది. మన పూర్వపు ఇండ్లలో అన్నీ కిందనే ఉండేవి- అమ్మ పొయ్యి దగ్గర వంట చేస్తుంది. అక్కడ గ్లాసులూ, గిన్నెలూ అన్నీ కిందనే ఉంటాయి. చిన్నపిల్లవాడు అక్కడ ఉంటాడు. వాడు ప్రతి వస్తువుకోసం చేతులూ, కాళ్ళూ ఆడిస్తాడు. లేదా వాడికి కొంచెం పిండి ఇస్తే దాంతో ఒక పిట్ట బొమ్మ తయారుచేసుకుంటాడు. ఏదో ఒకటి చేసుకుంటాడు. ప్రతి ఒక్క వస్తువు వాడి చేతికి అందేటంత ఎత్తులోనే ఉండేది మన వంటింట్లో కాబట్టి పిల్లవాడు చాలా యాక్టివ్ గా ఉండేవాడు.’

‘ఇంకో విషయమేమిటంటే, ఇండ్ల వాకిళ్ళు ఎలా ఉండేవంటే, పిల్లవాడు వాకిట్లో ఆడుకుంటూ ఉంటే తల్లికి వంటింట్లోంచి కనిపించేది. తన కొడుకు ఎక్కడున్నాడో, ఏమి ఆడుకుంటున్నాడో ఆమెకి కనిపించి, ఆమె నిశ్చింతగా ఉండేది.’

‘చిన్నప్పుడు మేం ఇళ్ళల్లో ఆడుకునేటప్పుడు ఏ ఇంట్లోకైనా దూరిపోయేవాళ్ళం. అప్పుడు పెద్దవాళ్ళు ‘అక్కడ తేలు కుడితుందిరా, ఆ మూలకి వెళ్ళకండి’ అనేవారే తప్ప ‘ఎవరు వచ్చారు, ఎందుకొచ్చారు’ లాంటి ప్రశ్నలు వేసేవారు కాదు. మేమలా చొరబడుతున్నందువల్ల వాళ్ళు ఇబ్బందిపడేవారు కాదు. ఈ రోజుల్లో పక్కింటి పిల్లవాడు రాగానే జనాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఈనాటి ఆధునిక గృహాల్లో ఉన్న సమస్యలు.’

‘ఇప్పుడు ఆర్కిటెక్చర్ కాలేజీలు వచ్చిన తరువాత దేశమంతటా ఒకే రకమైన ఇండ్ల నిర్మాణ పద్ధతులు బోధిస్తున్నారు. ఉత్తరాంచల్ లోనూ అదే ఇల్లు, తమిళనాడులోనూ అదే ఇల్లు. కానీ పూర్వం మన దగ్గర అలా కాదు. ప్రతి ఒక్క ప్రాంతానికీ ఒక వాస్తు ఉండేది. ప్రతి ఒక్క ప్రాంతానికీ ఒక డిజైన్ ఉండేది. నేను మొదట్లోనే చెప్పినట్టుగా వాస్తు సిద్ధాంతం ఒక్కటే కాని డిజైన్  ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి వేరువేరుగా ఉండేది. మనిషి ఎత్తుని బట్టి డిజైన్ మారేది. వీటి గురించి ఆలోచించాలి కదా.’

‘మన దగ్గర ఎన్నో రకాల పద్ధతులుండేవి. ఒకటి ముడిసరుకు. అదంతా పల్లెటూళ్ళోనే తయారయ్యేది. మీకు ఇల్లు కట్టాలి అంటే మీ ఇంటి కుమ్మరి పెంకులు చేసి ఇచ్చేవాడు. వడ్రంగి తలుపులూ, కిటికీలూ చేసి ఇచ్చేవాడు. ఇలా మెటీరియల్ తయారయ్యేది. మేస్త్రీలు వచ్చి ఇల్లు కట్టేసేవారు. పూర్తి నిర్మాణం వాళ్ళే చేసేవారు. దానికంతా ఒక పద్ధతి ఉండేది. అందుకే ఆ కాలంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండేది. వాళ్ళు ఏ పనిచేసినా, ఏ వృత్తిలో ఉన్నా ఎవరి సొంత ఇల్లు వారికుండేది. దానికేమీ ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే ఏ మెటీరియల్ కూడా అయిదు కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరం నుంచి వచ్చేది కాదు. ‘మన దగ్గరేముందో దాంతోనే కట్టుకుందాం’ అని అనుకునేవారు. చాలా సులభంగా అయిపోయేది.’

‘మనిషి రోజంతా ఇంటిబయటే ఉంటాడు. ఇంట్లోకి వెళ్ళడమంటే కేవలం రాత్రిపూట మాత్రమే వెళ్ళేవారు. రైతులు బయటే ఉండేవారు. కార్మికులు పనిస్థలాల్లో ఉండేవారు. అవి కూడా ఇంటిదగ్గరే ఉన్నాయనుకున్నా, ఆ పనులన్నీ ఆరుబయట ముంగిట్లో చేసుకునేలాగా ఉండేవి. ఇక ఇంట్లోకి వెళ్ళేది కేవలం రాత్రిపూట పడుకోడానికే కదా. అందుకే ఇల్లు ఎంత వరకూ ఉండాలి అని చూసుకునేవారు.’

‘ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టాడు. భార్యాభర్తలిద్దరూ బయట ఉద్యోగం చేస్తారు. కొడుకు బెంగుళూరులో ఉంటాడు. నేను వాడినడిగాను. ‘ఎందుకని ఇంత మూర్ఖత్వం చేస్తున్నావు? ఇంత ఖర్చు పెట్టి ఇల్లు కడుతున్నావు? రోజంతా మీరిద్దరూ ఇంట్లో ఉండరు. రాత్రి పడుకోడానికే కదా ఇంటికొచ్చేది. మళ్ళీ సెలవురోజుల్లో దాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి కదా’ అని. సెలవు రోజుల్లో ఇద్దరూ కలిసి ఇల్లు శుభ్రం చేయడంలోనే ఉంటారు. ‘మరి ఎందుకింత ఇబ్బంది పడుతున్నావు? మంచిగా లాడ్జిలో రెండు రూములు బుక్ చేసుకో. రోజూ లాడ్జిలో ఉండు. బెల్లు కొడితే చాయ్ వస్తుంది. బెల్లు కొడితే అన్నం వస్తుంది’ అని చెప్పాను. ‘ఆ ఇల్లు అంతకంటే ఎక్కువ పనికిరాదు. అవునా? ఆదివారం రోజు ఏ పనివాడూ రాడు. ‘మీకేమో సెలవు కావాలి, మాకు అక్కర్లేదా?’ అంటారు. అవును, ఆదివారం రోజు ఇల్లంతా క్లీన్ చేసుకోవడంలోనే ఉంటారు. వాళ్ళిద్దరూ కాక మరెవరూ ఉండేవాళ్ళు లేరు. వీళ్ళు రాత్రికి వచ్చి పడుకోవడమే. ఒక్కోసారి అన్నం బయటనుంచి తెచ్చుకుంటారు. మరి ఎందుకు అన్ని పైసలు ఖర్చుపెట్టాలి? మూర్ఖత్వం కాకపోతే ఏమిటి!’

‘మన దగ్గర పురాణాల్లో ఇలాంటి కథలున్నాయి. ఒకసారి దేవేంద్రుడు పెద్ద భవనం కట్టిస్తున్నాడు. కార్మికులకి సెలవు ఇవ్వడంలేదు. ఆయనకు చాలా తొందరగా ఉంది. మహలు కట్టిస్తున్నాడు, కార్మికులు బాధపడుతున్నారు. ఒక రోజు నారదముని అటుగా వెళ్తుంటే ఆయన్ని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు ‘ఈయన సెలవు ఇవ్వడం లేదు, మాకు పెళ్ళాం పిల్లలున్నా వెళ్ళనివ్వడం లేదు’ అని. ‘అయ్యా, మాకెలాగేనా సెలవు ఇప్పించండి. మేము ఇంటికి వెళ్తాము’ అని చెప్పుకున్నారు.’

‘నారదుడు దేవేంద్రుడి దగ్గరకి లోమశ మహర్షిని తీసుకువెళ్ళాడు. ఆ మహర్షి తన నెత్తిమీద ఒక చాప పెట్టుకున్నాడు (నవ్వుతూ), చాప. దేవేంద్రుడు ఆయన్ని స్వాగతించాడు. ఆసనం చూపించాడు. పూజ చేసాడు. అతిథి సత్కారం అయ్యాక మెల్లగా దేవేంద్రుడు అడిగాడు- ‘మహర్షీ, అంతా బాగానే ఉంది కానీ మీ తలమీద అదేమిటి?’ అని.

‘ఇది నా ఇల్లు దేవేంద్రా, రాత్రి కాగానే దీన్నిలా పరుచుకుని పడుకుంటాను’ అన్నాడు ఆ మహర్షి.

‘ఆ! అదేం ఇల్లు?’

‘నేను నా ఇల్లు తలమీదనే పెట్టుకుని తిరుగుతాను, ఏం చేస్తాం?’

‘ఎందుకు మహర్షీ అలా?’

‘ఇంత చిన్న జీవితానికి ఇల్లెందుకు కట్టుకోవాలి? ఎప్పుడైనా చనిపోవచ్చు కదా’

‘కాదు, కాదు, అయినా. ..  మీరు ఎంతకాలం. .. ఎప్పుడు చనిపోతారు? ఎంతకాలం ఉంటారు?’

అప్పుడు లోమశమహర్షి చెప్పాడు – ‘నా రొమ్ముమీద ఉన్న రోమసమూహం చూడు. ఒక కల్పం ముగిసేటప్పటికి ఈ దుబ్బులోంచి ఒక వెండ్రుక ఊడి కిందపడుతుంది. ఈ వెండ్రుకలన్నీ ఎప్పుడు ఊడిపోతాయో అప్పుడు నేను చనిపోతాను.’

దేవేంద్రుడికి అర్థమయింది. ‘కోట్ల సంవత్సరాలు బతికేవాడు చెప్తున్నాడు, ఇంత చిన్న జీవితానికి ఇల్లెందుకు కట్టాలని. నాకే గారంటీ లేదు, ఎప్పుడు లాగి తంతారో ఈ ఇంద్రపదవి నుండి. నేను చచ్చిపోతున్నాను ఇల్లు కట్టడానికి’ అని కార్మికుల్తో ‘వెళ్ళండిరా, హాయిగా మీ ఇళ్ళకి పొండి’ అని చెప్పేసాడు. ఇలాంటి కథలు మనకు పురాణాల్లో చాలా వస్తాయి’ (నవ్వుతూ).

‘ఇంకోటి, త్రిపురాసురుడికి ముగ్గురు కొడుకులుండేవారు. వాళ్ళు గాల్లో తిరుగుతుండేవారు. భూమ్మీద కాదు, వాళ్ళు గాల్లో తిరిగే పెద్ద నగరాలు కట్టుకున్నారు. మూడు పురాలు. వాళ్ళు  ఏ పురంలో ఉంటాడో ఎవడికీ తెలియదు. అవి ఆకాశంలో తిరుగుతున్నాయి, వాళ్ళని చంపాలంటే ఎప్పుడు ఏ పురంలో ఉంటారో ఎవరికీ తెలియదు. అప్పుడు దేవతలంతా కలిసి, గ్రహాలన్నీ ఒకే లైనులోకి వస్తాయి కదా, ఎప్పుడో ఒక్కప్పుడు, అలా లెక్కలేసారు- ఈ మూడు పురాలు ఎప్పుడు ఒకే సరళరేఖలోకి వస్తాయో ఆ రోజు వాణ్ణి ఖతం చెయ్యాలి అని.’

‘దానికోసం శివుణ్ణి సిద్ధం చేసారు. ఆ మూడుపురాల్ని అంతం చెయ్యడానికి. అప్పుడు శివుడు ధరించిన ఆ త్రిపురాసుర సంహారమూర్తి రూపం చాలా అందంగా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, భూమి రథం అయ్యింది, సూర్యచంద్రులు రథచక్రాలయ్యారు, ఆకాశం జెండా అయింది, సుమేరు పర్వతం విల్లు అయ్యింది. వాసుకి నారి అయ్యింది. ఆ తర్వాత నారాయణాస్త్రంగా విష్ణువు నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆ మూడు పురాలు ఒకే లైన్ లోకి వచ్చాయో ఆ రోజు వాటిని ఖతం చేసారు. మూడు నగరాల్నీ నాశనం చేసారు. అందులో త్రిపురాసురుడు చనిపోయాడు. ఇలాంటివి మనకు చాలా వినిపిస్తాయి, వాస్తు సంబంధమైన కథలు.’

‘మహాభారతంలో చాలా రకాల ఇండ్లు కనిపిస్తాయి- లాక్షాగృహం, మయసభ లాంటివున్నాయి. గోడ ఉన్నచోట దారి, దారి ఉన్నచోటగోడ కనిపించేలా ఉండేది. కోటల్లో కూడా ఇటువంటివి కనిపిస్తాయి. గోల్కొండ కోట ఉంది, అక్కడ ఒక చోట శబ్దం చేస్తే ఇంకో చోట వినిపిస్తుంది. బీజాపూరు గుమ్మటంలో కూడా. అది 250 అడుగుల గుమ్మటం. ఈ మూలన అగ్గిపెట్టె వెలిగిస్తే పక్కనే వెలిగించినట్లు వినిపిస్తుంది. ఎన్నో అత్తాకోడళ్ళ మహళ్ళున్నాయి. కోడలు తన గదిలో ఏం మాట్లాడుతుందో అత్తకు వినిపిస్తుంది. ఆమె తిట్టుకున్నా కోడలికి వినిపించదు (నవ్వుతూ). ఈమె పిలుస్తున్నా కోడలికి వినిపించదు, కానీ కోడలు మాట్లాడే ప్రతి మాటా ఆమెకి వినిపిస్తుంది. అత్తాకోడళ్ళ ఇళ్ళు, చాలా కమాన్లు అలా కట్టారు.’

‘చాణక్యుడు అర్ధరాత్రి పూట చంద్రగుప్తుడి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టాడు. అప్పుడు చంద్రగుప్తుడి స్థానంలో ఏనుగుమీద వేరే రాజును కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు- ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏదో గందరగోళం జరగొచ్చు అని. ఆ ఏనుగు వెళ్తుండగా ఏ కమాను కిందనుండి వెళ్తుందో ఆ కమాను మొత్తం కూలిపోయేలా చేసారు. ఒక రాయి తియ్యగానే మొత్తం కమాను కూలిపోయేలాగా చేసారు. ఆ కమాను పడిపోయి ఆ రాజు చనిపోయాడు. మన దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి.’

‘ఒక గ్రామం ఎలా ఉండాలో, ఒక ఇల్లు ఎలా ఉండాలో చాణక్యుడు రాసాడు. ప్రతి రెండు క్రోసులకీ ఒక గ్రామం ఉండాలి అని ఊహించాడు. రాజుగారి మహలు ఎలా ఉండాలి? ఆ కాలంలో మహళ్ళు కలపతో కట్టేవారు. ఏ చెట్టుమీద పిడుగు పడిందో ఆ చెట్టు బూడిదతో ఆ ఇంటికి లేపనం చెయ్యాలి. ఆ తర్వాత దానిమీద చిత్రకళ చెయ్యాలి. ఆ ఇంటికి అగ్ని భయం ఉండదు. గుజరాత్ లో కలప హవేలీలు ఉన్నాయి. అవి కూడా మామిడి కలపతో చేసినవి. కానీ ఆ కలపమీద చెక్కడాలు చేసి ఒక రకమైన మట్టి లేపనం చేసారు. ఒక రసాయన లేపనం చేసారు. అందువల్ల అవి  ఈ రోజుకీ సురక్షితంగా ఉన్నాయి. ఇవన్నీ మనవాళ్ళకు చాలా బాగా తెలుసు.’

‘రాముడు సముద్రతీరంలో ఒక వారం పదిహేను రోజులు కూర్చున్నాడు. ఏం చేసాడు రాముడు? సముద్రుణ్ణి దారి అడుగుతున్నాడు కదా? ఆయనేం చేసాడంటే- సముద్రం గురించి బాగా స్టడీ చేసి, అలలు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి, ఎప్పుడు సమంగా ఉంటాయి చూసి ఆ తర్వాత సముద్రం మీద వారధి కట్టే ఆలోచన చేసాడు. ఆ తర్వాత అలాంటి వారధినే అలెగ్జాండరు కట్టాడు. రెండు కిలోమీటర్ల వారధి కట్టాడు సముద్రం మీద. ఒక కోటను గెలవడం కోసం సముద్రం మీద వారధి కట్టాడు. అదెలా కట్టారంటే, కలప దిమ్మల్ని అటూ ఇటూ వేసారు. మధ్యలో బొగ్గు నింపారు. పూర్తి బొగ్గునింపి దానిమీద పొట్టువేసారు. దానిమీద మట్టి వేసారు. అప్పుడు దానిమీంచి వాళ్ళ గుర్రాలు పరుగెత్తాయి.’

‘వీటన్నిటి గురించి మన పూర్వీకులు చాలా అద్భుతంగా ఆలోచించారు. ఇవన్నీ ఎలా స్టడీ చేసి ఉంటారు? అది ఆలోచించాల్సిన విషయం కదా. ఎలాంటి వ్యవస్థ ఉండి ఉంటుంది? అందులో ఇన్ని విద్యలు, ఇన్ని కళలు ఇంత సాంకేతికత ఎలా పెరిగింది? ఆ వ్యవస్థను ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. ఎలాంటి వ్యవస్థలో ఇవన్నీ సాధ్యమవుతాయి?’

మనం కూర్చుని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ‘లేదు గురూజీ, మీరు అతీతకాలం గురించి మాట్లాడుతున్నారు’ అని అంటారు. అరే, మీరు కూడా గతం ఆధారంగానే కదా, కొత్త వ్యవస్థల్ని నిర్మించారు! ఏ కొత్త వ్యవస్థను, ఏ సాంకేతికతను అయితే ఇంత బలంగా పెంచిపోషించారో అది గతం ఆధారంగానే కదా! మన గతం ఆధారంగానే ‘మీ సంస్కృతి అంతా ఇదుగో ఇంత విచ్ఛిన్నకరమైంది’ అని నిరూపించి వారంతా నిలబడ్డారు. మన ప్రజలు దాన్ని సులభంగా అంగీకరించేసారు, తమని తాము తక్కువగా భావించుకుంటూ.

గతం ఆధారంగానే ఇది కూడా నిలబడవచ్చు. నా పని అయితే స్మృతి జాగరణ కలిగించడం. నా పని స్మృతిని మేల్కొల్పడమే. హనుమంతుడు లంకాతీరానికి వెళ్ళినప్పుడు సమస్త వానరులూ కూర్చుండిపోయారు. అప్పుడు ఆ సముద్రాన్ని ఎవదు దాటగలరు, దాటి అవతలకి ఎవరు వెళ్ళగలరు అనే ప్రశ్న వచ్చింది. అంగదుడు తాను సముద్రం దాటి వెళ్ళగలడుగానీ, తిరిగి రావడంలో సందేహం ఉందన్నాడు. జాంబవంతుడు తాను ముసలివాణ్ణి అయిపోయాయడని చెప్పాడ్డు.  అలా ప్రతి ఒక్కరూ తమ అశక్తత చెప్పుకున్నారు. హనుమంతుడు మాత్రం తనేం చెయ్యగలనని మాట్లాడకుండా కూచున్నాడు. అప్పుడు జాంబవంతుడు అతణ్ణి నువ్వెందుకు అంత ప్రశాంతంగా కూర్చున్నావు అని అతనికి అతని గుర్తు చేసాడు. నువ్వది చేసావు, నువ్విది చేసావు, నువ్వు సూర్యుణ్ణే మింగేసావు. కానీ నీకు ఋషుల శాపం తగిలింది. అందువల్ల నువ్వు నీ స్మృతిని కోల్పోయావు, నీ శక్తిని కోల్పోయావు’ అని చెప్తూ, ‘ఏ రోజైతే నీ స్మృతి జాగరణ జరుగుతుందో ఆ రోజు నీ బలం నీకు మళ్ళీ లభిస్తుంద’ని కూడా చెప్తాడు. ఆ మాటలు వింటూనే హనుమంతుడు పర్వతాకారం ధరించి ఒక్క గెంతుతో లంకలోకి ప్రవేశించాడు.

నేననుకుంటాను, మన ఈ భారతదేశ చరిత్రలో ఏదో ఒక ఋషి శాపం ఉండి తీరాలి (నవ్వుతూ) ‘వెళ్ళండి, ఇలా భ్రష్టులై నాశనమవుతారు మీ సమాజం’ అని శపించి ఉంటారు. ‘మళ్ళీ స్మృతి జాగృతి చెంది మీ ఉద్ధరణ మళ్ళీ జరుగుతుంది’ అని కూడా చెప్పి ఉంటారు. (నవ్వుతూ).

కానీ ఇదుగో నేను ఇప్పటిదాకా చెప్పానే ఈ విషయాలన్నిటి గురించీ ఆలోచించడం అవసరం. చాలా ఆలోచించాలి. ఒక గ్రామం కేవలం ఇలా తయారు కాదు. ఇప్పుడు నువ్వు ఏ గ్రామం తాలూకు కల్పన గురించి మాట్లాడుతున్నావో అందులో ఇదంతా ఉండి తీరాలి. కేవలం శ్రామికుల్నీ, కళాకారుల్నీ ఒకచోట చేర్చి కూచోబెట్టడం వల్ల ఏమీ అవ్వదు. అవునా కాదా? మీరు నన్ను రెండు రోజులుగా అడుగుతున్నారు. ఒకవేళ మాడ్రన్ విలేజి కనుక నిర్మిస్తే ఎలా ఉంటుందని? (నవ్వుతూ) కానీ అది గ్రామం అయితే అవ్వదు. ఖచ్చితంగా మ్యూజియం అవుతుంది? ఎందుకంటే అందులో ఈ పూర్తి చైతన్యాన్ని పుట్టించాలి కదా!’


మరీ ముఖ్యంగా ఈ వేసవి అంతా నాకు ఈ మాటలు గుర్తొస్తూనే ఉన్నాయి. పగటిపూట ఎండ నిప్పులు కక్కడం సరే, కానీ రాత్రుళ్ళు కూడా చల్లారని ఒక దారుణమైన కాలం ఈ వేసవిలో మనం అనుభవించాం. వేలాది ఏళ్ళుగా చెక్కుచెదరని గృహనిర్మాణ వ్యవస్థలు కలిగిన ఒక ఒక ప్రాచీన దేశాన్ని వందేళ్ళకన్నా తక్కువ కాలంలోనే, మనం,  ఒక  రీ-ఇన్ ఫోర్సెడ్ కాంక్రీట్ సిమెంటు ఎడారిగా మార్చేసుకున్నాం. ఆర్.సి.సి వ్యవస్థని comfortable అనీ, affordable అనీ, easily replicable అనీ మనల్ని ఎవరు నమ్మించారో తెలియదు. యాభై ఏళ్ళ వ్యవధిలో మనం రాక్షసాకారం  కలిగిన సిమెంటు మహానగరాల్ని సృష్టించుకుంటూ వచ్చాం. పెరుగుతున్న జనాభా గృహావసరాల్ని తీర్చగల నమూనా అదొక్కటే అని మనల్ని మనం భ్రమపెట్టుకుంటూ వచ్చాం. ఎవరైనా, గురూజీ వంటివాళ్ళు, ప్రకృతి సన్నిహితంగానూ, ఎక్కువ ఖర్చుపెట్టనవసరం లేకుండానూ, factory-intensive గా కాక, artisan-intensive గా ఉండే ముడిపదార్థాలతో ఇండ్లు కట్టవచ్చునని చెప్తూ ఉంటే, ఉదాహరణలుగా ఇళ్ళు తామే కట్టి చూపిస్తూ ఉంటే, వాళ్ళని కాలంకన్నా వెనకబడ్డ వాళ్ళుగా భావిస్తూ వచ్చాం.

నా ఉద్యోగజీవితం పొడుగునా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకి అనుకూలమైన ఒక హౌసింగ్ డిజైన్ ఉండాలని చెప్పని వాడు లేడు. ప్రతి ఏడాదీ ఆ మాట వింటూనే ఉన్నాను. కానీ ఎవ్వరూ ఎక్కడా ఒక్క నమూనా కూడా కట్టిచూపించింది లేదు. ఈ మోడ్రన్ సిమెంటు కాంక్రీటు ఇండ్ల మీద గురూజీ ఇంకా చాలా సౌమ్యమైన విమర్శ చేస్తున్నారు. కానీ చెంచుగూడేల్లో చెంచులు  ఈ ఇళ్ళని నిర్దయతో తిరస్కరించడం నేను కళ్ళారా చూస్తూనే వచ్చాను. ప్రభుత్వం ఇండ్ల కాలనీ పూర్తిచేయగానే చెంచువాడు మొదటచేసే పని తన మేకల్ని ఆ ఇంట్లో కట్టుకుని తాను పక్కనో  గుడిసె వేసుకోడం. కానీ భారతీయ నగరాల్లో పట్టణాల్లో జీవిస్తున్న అసంఖ్యాకులైన మధ్యతరగతికీ, మురికివాడల నివాసితులకీ, కార్మికులకీ ఆ పాటి స్వాతంత్ర్యం కూడా లేదు. మొన్ననెక్కడో చదివాను, రానున్న రోజుల్లో జనం భారతదేశం విడిచిపెట్టివెళ్ళిపోతే అందుకు కారణం భరించలేని వేసవితాపం నుంచి మనల్ని కాపాడగలిగే ఇళ్ళు లేకపోవడమేనని.

ఆర్.సి.సి నమూనా తాలూకు అత్యంత క్రూరమైన వ్యక్తీకరణ నాకు పాఠశాల భవనాల్లో కనిపిస్తుంది. మీరు భారతదేశం పొడుగునా ఎక్కడికేనా వెళ్ళండి. కప్పు కారిపోతూ, గచ్చు పెచ్చులూడిపోతూ, కిటికీలూ, తలుపులూ ఊడిపోతూ కనిపించని పాఠశాల భవనం మీకెక్కడైనా కనిపించకపోతే నాకు చెప్పండి.

పిల్లలకి పనికిరావు, పెద్దలకి పనికిరావు, అతిథులకి పనికిరావు, కనీసం భార్యాభర్తలిద్దరికీ కూడా పనికిరావు- అయినా ఈ ఇండ్లమీద భారతదేశంలో ప్రతి ఏటా 44 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి పెడుతున్నామంటే ఏమనుకోవాలి?

22-6-2026

4 Replies to “జీవన శిల్పి-20”

  1. ఇంటికి ఉండవలసిన అయిదు లక్షణాల్లో ఆధ్యాత్మికత, ప్రకృతి పట్ల ప్రేమ అనే రెండింటికీ ఆయన ముడిపెట్టి గురూజీ ఈ సంభాషణలో స్పృశించిన అంశాల గురించి, విశ్లేషించిన విధానం గురించి ఎంత ప్రశంసించినా తక్కువే.
    మహాభారతంలో ఉన్న రకరకాల ఇళ్ల గురించి, అరణ్య పర్వంలో వచ్చే లోమశ మహర్షి గురించి ఎక్కడో ఏదో పురాణం లో ఉన్న కథ, రామాయణం సుందరకాండలో హనుమంతుడు సముద్రం లంఘించడం, యుద్ధకాండలో రాముడు సేతు నిర్మాణం కోసం సముద్రుణ్ణి దారి ఇమ్మని అడగడం, శివుడు త్రిపురాసుర సంహారం ఎలా చేశాడో ఒక గ్రామం ఎలా ఉండాలో చాణక్యుడు ఏం చెప్పాడో ఇలా ఎన్ని విషయాలను అవలీలగా quote చేస్తూ ఎంత అద్భుతమైన విశ్లేషణాత్మక సంభాషణ చేశారో.

    “ఎవరైతే ఆధ్యాత్మిక జీవి కాడో, వాడికి ఈ వస్తువులన్నింటిపట్లా ఎలాంటి ప్రేమా ఉండదు. ఎవరికైతే ప్రకృతి పట్ల ప్రేమ లేదో వాడు ఎన్నటికీ సామాజిక జీవి కాలేడు. కాబట్టి ఇల్లు కట్టే సమయంలో, ఈ ఇంట్లో నివసించేవాడు ఆధ్యాత్మికంగా మారాలి అనే విషయం ఖచ్చితంగా చూసేవాళ్ళు” ఆధునిక ప్రపంచంలో ఇలా ఎప్పటికైనా జరగడం సాధ్యమా అనిపిస్తుంది

    గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్” అని నన్నయ గారి ఆంధ్ర మహాభారత వాక్యం. అయితే గురూజీ అన్నట్టు గతం ఆధారంగానే కదా, కొత్త వ్యవస్థల్ని నిర్మించారు! ఏ కొత్త వ్యవస్థను, ఏ సాంకేతికతను అయితే ఇంత బలంగా పెంచిపోషించారో అది గతం ఆధారంగానే కదా! మన గతం ఆధారంగానే ‘మీ సంస్కృతి అంతా ఇదుగో ఇంత విచ్ఛిన్నకరమైంది’ అని నిరూపించి వారంతా నిలబడ్డారు. మన ప్రజలు దాన్ని సులభంగా అంగీకరించేసారు, తమని తాము తక్కువగా భావించుకుంటూ”.

    ఏమో.. ఎవరికి తెలుసు.. నిజంగానే గత కాలపు స్మృతులను మేల్కొల్పి ఆనాటి వైభవం తిరిగి సాధించవచ్చేమో

    నాకు ఈ గురూజీ మాటలు చాలా నచ్చాయి. “నేననుకుంటాను, మన ఈ భారతదేశ చరిత్రలో ఏదో ఒక ఋషి శాపం ఉండి తీరాలి (నవ్వుతూ) ‘వెళ్ళండి, ఇలా భ్రష్టులై నాశనమవుతారు మీ సమాజం’ అని శపించి ఉంటారు. ‘మళ్ళీ స్మృతి జాగృతి చెంది మీ ఉద్ధరణ మళ్ళీ జరుగుతుంది’ అని కూడా చెప్పి ఉంటారు.”

    గతమే మేలని, వచ్చుకాలం అంత గొప్పగా ఉండదనీ నన్నయ్య గారన్నా, గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు అని సముద్రాల వైరాగ్యంతో అన్నా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అమ్మమ్మ.కాం టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ లో గతానికి పెద్ద పీట వేస్తూ ఇలా అన్నారు..
    “అపుడూ అపుడూ గతమే వెతుకు, సుడిలో పడితే సలహా అడుగు…
    గడిచిన రోజులు తలవడమెందుకు ఏం లాభం అనకు…
    ఏ దిక్కులు తోచని చిక్కుల దారిని దాటిన నాటి స్మృతి చూపద నీ ప్రగతి!”

    ఈ సంభాషణ ముగిస్తూ మన నగరాలన్నీ రీ-ఇన్ ఫోర్సెడ్ కాంక్రీట్ సిమెంటు ఎడారిగా మార్చేసుకున్నాం అంటూ మీరు వెలిబుచ్చిన బాధ నాది కూడా.. వీటిని ఇంకా విస్తరించడానికి
    భారత ప్రభుత్వం ప్రతి ఏటా 44 లక్షల కోట్ల మేరకు పెట్టుబడి పెడుతున్నారంటే నిజంగానే ఏమనుకోవాలి?

    1. ఎంతో సహృదయంతో సవివరంగా మీ హృదయ స్పందనను ఇలా పంచుకున్నందుకు మీకు నా హృదయపూర్వక నమస్సులు.

  2. “నా పని స్మృతిని మేల్కొల్పడమే” అన్న గురూజీ మాటను title గా పెట్టడం నిజంగా ఈ whole conversation కి సరిగ్గా సరిపోయింది.

    ఇల్లు ఆర్థికంగా భారంగా ఉండకూడదు, ప్రకృతితో విరోధంగా ఉండకూడదు, చుట్టూ ఉన్న కొండలు, చెట్లు, గాలి, వెలుతురుతో కలిసిపోయి ఉండాలి అన్న ఈ ఆలోచనే ఇప్పుడు లేదు కదా. ఉన్న చెట్లను నాశనం చేసి, ఏమాత్రం ఖాళీ స్థలం లేకుండా concrete jungles కట్టేసుకుని, we are destroying our own lives.

    ఆ విదేశీయులు పీటలను ‘individual dining tables’ గా చూశారని చదువుతుంటే మా ఊళ్ళో కూడా పీటలు, బంతి చాపలు పరుచుకుని అందరం కలిసి కూర్చుని తినేవాళ్ళమని గుర్తు వచ్చింది. భోజనం అయిపోయాక వాటిని ఒక మూలన పెట్టేసేవారు. ఇప్పుడు dining table లేని ఇల్లు దాదాపు కనిపించదు.

    లోమశ మహర్షి కథ కూడా చాలా బాగుంది. కోట్ల సంవత్సరాలు బతికేవాడు ఇంత చిన్న జీవితానికి ఇల్లెందుకు అని అడగడం వెనక, ఇల్లు కోసం జీవించాలా, జీవితం కోసం ఇల్లు ఉండాలా అని ప్రశ్న కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నిజంగా అందరమూ ఇంటికి payments కట్టడం కోసమే జీవితమంతా కష్టపడే కాలాన్ని కొని తెచ్చుకున్నాము.

    వాస్తు సంబంధమైన కథగా చెప్పిన త్రిపురాసురుని కథ కూడా భలే ఉంది.

    అన్నిటికంటే చివర్లో హనుమంతుడి ఉదాహరణతో చెప్పిన విషయం బాగా నచ్చింది. జాంబవంతుడు హనుమంతుడికి కొత్త శక్తి ఇవ్వలేదు. అతనిలో ఉన్న శక్తిని గుర్తు చేశాడు. గురూజీ కూడా ఈ సంభాషణ ద్వారా చేస్తున్నది అదే కదా.

    “మన ఈ భారతదేశ చరిత్రలో ఏదో ఒక ఋషి శాపం ఉండి తీరాలి (నవ్వుతూ) ‘వెళ్ళండి, ఇలా భ్రష్టులై నాశనమవుతారు మీ సమాజం’ అని శపించి ఉంటారు. ‘మళ్ళీ స్మృతి జాగృతి చెంది మీ ఉద్ధరణ మళ్ళీ జరుగుతుంది’ అని కూడా చెప్పి ఉంటారు. (నవ్వుతూ).”

    మనం కోల్పోయింది అంతా శాశ్వతంగా పోయిందని కాదు. స్మృతి మేల్కొంటే తిరిగి నేర్చుకోవచ్చు, తిరిగి నిర్మించుకోవచ్చు అని light at the end of the tunnel వుంటుందని చెప్పారు. 🙏🏽

    1. ఈ సంభాషణ ఇలా నిరంతరం కొనసాగుతూ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గురూజీ ఎక్కడెక్కడో ఎవరెవరితోనో మాట్లాడిన మాటల నుంచి తాను ఏర్పరుచుకున్న దృక్పథాన్ని నాకు వినిపించారు. ఇప్పుడు మీరు అది వింటున్నారు. రేపు మీ ద్వారా మరి కొంతమంది వినబోతారు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading