
ఫణిగిరి. రెండేళ్ళ కిందట స్టేట్ మ్యూజియంకి వెళ్ళినప్పుడూ, ఏడాది కిందట హెరిటేజి మ్యూజియం సందర్శించినప్పుడూ పదే పదే వినిపించిన పేరు. ఎలాగేనా వెళ్ళాలని అనుకుంటూనే ఉన్నాను. హెరిటేజి మ్యూజియంకి వెళ్ళినప్పుడు జీడిగుంట విజయసారథిగారు కూడా ఉండటంతో ఇద్దరం వెళ్ళాలనుకున్నాం. ఈ ఏడాది జనవరిలోనే వెళ్ళాలనుకున్నది, ఇప్పటికి, ఈ శనివారం నాటికి సాధ్యపడింది.
మాతో పింగళి చైతన్య కూడా రావడంతో మేం పెద్ద ప్రోగ్రామే వేసుకున్నాం. ముందు ఫణిగిరి వెళ్ళాలనీ, అక్కణ్ణుంచి కోదాడలో బంగారు రామాచారిని కలవాలనీ, ఆ తర్వాత నేలకొండపల్లి కూడా చూడాలనీ అనుకున్నాం. మేం ఎంత పొద్దున్నే లేచి ప్రయాణమైనప్పటికీ నగరం దాటేటప్పటికే తొమ్మిదైపోయింది. మధ్యలో బ్రేక్ ఫాస్ట్ చేసుకుని ఇంక ఎక్కడా ఆగకుండా ఫణిగిరి చేరుకునేటప్పటికి పన్నెండయ్యింది. పండిన వరిచేలమధ్యనుంచీ, అక్కడక్కడా కోతలు మొదలైన పొలాల మధ్యనుంచీ ప్రయాణిస్తూ ఉండగానే కనీసం శతాబ్ది కాలం వెనక్కి వెళ్ళినట్టుగా ఉంది.
ఫణిగిరి వెళ్ళాలనుకుంటున్నామని హెరిటేజి శాఖ డైరక్టరు ప్రొఫెసరు అర్జునరావుగారితో చెప్పినప్పుడు ఆయన ముందు తనని కలుసుకుని వెళ్ళమని పదే పదే చెప్పారు. తాను ఆ స్థలం గురించి కొంత పరిచయం చేసి, అక్కడేమి చూడాలో చెప్పి, కూడా ఒక పండితుణ్ణి కూడా పంపిస్తామన్నారు. కాని మాకు ఆయన్ని కలుసుకోడానికి సమయం చిక్కింది కాదు. ఫణిగిరి అనగానే బంగారు రామాచారి పది పన్నెండు పుస్తకాలు పంపించారు. కాని ఇలాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు ఏమీ తెలుసుకోకుండానే వెళ్ళడం నాకొక అలవాటు. అన్నీ చదివి, అన్నీ తెలుసుకుని వెళ్తే, ఆ చూడబోతున్న స్థలం మనకు కలిగించగల ఆశ్చర్యాల్ని మిస్సయిపోతానేమో అని నాకు భయం. వివరాలు తెలుసుకోకుండా వెళ్తే కూడా చాలా చూడలేకపోతాం, చూసినా వాటి ప్రాశస్త్యం అర్థం చేసుకోలేకపోతాం. నిజమే. కాని, అప్పుడు మళ్ళీ మరోసారి అక్కడికి పోయి చూడవచ్చుకదా అనుకుంటాను. ఆ తొలి ఆశ్చర్యాలు, అద్భుతాలు నా వరకూ నాకు చాలా విలువైనవి.
ఈ సారి ఫణిగిరిలో కూడా మేము చూడవలసినవి చాలానే చూడలేదు. అన్నిటికన్నా ముందు ఆ గుట్టమీద విహారస్థలాన్నీ, స్థూపాన్నీ చూడనేలేదు. మిట్టమధ్యాహ్నం రెండింటికి, నడి వేసవిని తలపిస్తున్న ఆ ఎండలో గుట్ట ఎక్కడం కష్టమనిపించి కాదు__ ఆ మధ్యాహ్నం ఆ తర్వాత మేము కలుసుకోవలసిన బంగారు రామాచారి కూడా అంతే ఎత్తైన శిఖరం లాంటి మనిషి అనీ, విజయసారధీ, చైతన్యా ఆయన్నిదే మొదటిసారి కలుసుకోవడం కాబట్టీ, అందుకోసం వీలైనంత సమయం మిగుల్చుకోవాలని అనుకోబట్టీను.
మేము వెళ్తూనే ఫణిగిరి గుట్టకింద ఉన్న ప్రదర్శన శాలలోనే నేరుగా అడుగుపెట్టాం. అక్కడ హెరిటేజి శాఖ ఉద్యోగులు ముగ్గురు యువకులు మా కోసం ఎదురుచూస్తున్నారు. ఆ చిన్న మ్యూజియంకి ఎదురుగా పెద్ద మర్రిచెట్టు ఉంది. దానినీడలో ఏదో కుటుంబమో, ఎవరో మిత్రులో వనభోజనాల్లాంటివేవో ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగని అక్కడ కూడా పెద్దగా మనుషులెవరూ లేరు. వంటవాళ్ళ అలికిడి మినహా మరే చప్పుడూ లేదక్కడ. ఆ నిశ్శబ్దంలో అడుగుపెట్టేటప్పటికి మాకు రెండు శతాబ్దాల కిందటి ప్రశాంతిమమ్మల్ని చేరదీసుకున్నట్టనిపించింది. అప్పుడు ఆ మ్యూజియంలో అడుగుపెట్టగానే__
2
నేను ఏ అద్భుత క్షణం కోసం, మ్యూజియం ఏంజెల్ తనంతట తనుగా, నాకోసం సిద్ధం చేసి ఉంచే ఏ అపురూప దృశ్యం కోసం, ఏ ఆశ్చర్యం కోసం ఎదురుచూస్తూ ఉన్నానో, అది నా కళ్ళముందు సాక్షాత్కరించింది.
ఆ క్షణాన మేము ముగ్గురం కూడా పద్ధెనిమిది శతాబ్దాల వెనక్కి వెళ్ళిపోయాం. సా.శ. 302-320 మధ్యకాలంలో ఇక్ష్వాకు చక్రవర్తి రుద్రపురుషదత్తుడి కాలానికి వెళ్ళిపోయాం. ఆ రోజుల్లో ఫణిగిరిలో నిర్మించిన తోరణంలో భగ్నమైపోయినవి భగ్నమైపోగా, కాలం మన చేతుల్లో పెట్టిన నాలుగైదు శకలాల (architraves) పైన చెక్కిన శిల్పాల్ని చూడగానే నా వళ్ళు గగుర్పొడిచింది. నా మిత్రులిద్దరి పరిస్థితీ కూడా అంతే. అటువంటి శిల్పాలు అక్కడున్నాయని తెలిస్తే ఒకవేళ హైదరాబాదునుంచి కాలినడకన మాత్రమే అక్కడికి వెళ్ళవలసి ఉంటే, ఆ 110 కిలోమీటర్లూ సంతోషంగా నడిచి వెళ్ళగలమనిపించింది, ఆ శిల్పాల్ని చూడగానే.

రుద్రపురుషదత్తుడి పాలనా కాలంలో, ఆయన రాజ్యానికి వచ్చిన 18 వ ఏట, అంటే, 315-320 మధ్యకాలంలో, నందిన్నక అనే అగ్రభిషజుడు ఆ విహారానికి చేసిన దానాలకి గుర్తుగా నిలబెట్టిన ఒక ధర్మచక్ర స్తంభానికి సంబంధించిన అవశేషాలు కూడా అక్కడున్నాయి. ఆ ధర్మచక్ర ప్రతిష్ఠని దమ్మసేనుడనే బౌద్ధాచార్యుడు పర్యవేక్షించినట్టుగా, ఆ వివరాలన్నీ తెలిపే నాలుగవ శతాబ్ది శాసనం కూడా అక్కడ ఉంది.
ఆ శిల్పాల్ని చూడగానే వెంటనే నాబోటి సామాన్య సందర్శకుడికి కూడా అవి అమరావతి, నాగార్జున కొండ తరహా శిల్పాలని స్ఫురిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు మటుకే మొదటిసారిగా ఆంధ్ర బౌద్ధ శిల్ప వైభవాన్ని నాకు కళ్ళారా చూసినట్టనిపించింది. ఎందుకంటే అమరావతి శిల్పాల్ని దాదాపుగా బ్రిటిష్ మ్యూజియం కొల్లగొట్టుకుపోయింది. మిగిలినవాటిలో ముఖ్యమైనవేమైనా ఉంటే అవి చెన్నై మ్యూజియంలో పడి ఉన్నాయి. కాబట్టి అమరావతి శిల్పాలుగా నాకు తెలిసినవన్నీ నేను ఫొటోల్లో చూసినవే. నాగార్జున కొండ శిల్పాల్ని ముప్ఫై ఏళ్ళ కింద నేను మొదటిసారి చూసినప్పుడు నాలో కలిగిన రసస్పందన నాలో ఇప్పటికీ తాజాగానే ఉంది. దాచేపల్లి నుంచి తెచ్చి ఆకుపచ్చ సున్నపురాళ్ళపైన చెక్కిన ఆ బౌద్ధ జాతక కథలు వాటికవే ప్రతి ఒక్కటీ ఒక ఖండకావ్యంగా గుర్తుండిపోయాయి. అయితే అవి గ్లాసు షోకేసుల్లో ప్రదర్శించి ఉన్నాయి కాబట్టి వాటి గురించిన ముద్రలు నా మనసులో అస్పష్టంగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు మటుకే మొదటిసారిగా ఆంధ్ర బౌద్ధ శిల్ప వైభవాన్ని నాకు కళ్ళారా చూసినట్టనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈ శిల్పాల్ని దగ్గరగా, చాలా దగ్గరగా, అంటే నీ స్నేహితుడికి నువ్వెంత చేరువగా కూచోగలవో అంత దగ్గరగా చూసే అవకాశం లభించింది. అందుకని ఆ శిల్పాలు నాలో రేకెత్తిస్తున్న స్పందనలేమిటో నేను మొదటిసారిగా స్పష్టంగా పోల్చుకోగలనని అనిపించింది.
ఆ శిల్పాల దగ్గరే మేము దాదపు గంటన్నర పాటు గడిపేసాం. కాని వాటిల్లో ఏ ఒక్క తోరణశకలం ముందైనా ఒక రోజంతా, ఇంకా చెప్పాలంటే ఒక వారం లేదా అతిశయోక్తి కాకపోతే, ఒక జీవితకాలం గడపగలమనిపించింది.
ఆ శిల్పాలు నాలో రేకెత్తిస్తున్న స్పందనల్ని పోల్చుకోడానికి అక్కడికక్కడే రెండు శిల్పాల్ని స్కెచింగు చేసాను. అలా స్కెచ్చిగా గీసినందువల్ల ఆ శిల్పాల వక్రత, ఆ మానవదేహాల భంగిమా విలాసం, ఆ లాలిత్యం ఎంతో కొంత నా వేళ్ళతో పసిగట్టవచ్చనిపించింది.
ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచ శిల్పవికాసం గురించి నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి నా కళ్ళముందు కనిపిస్తున్న శిల్పవికాసం వంటిది ప్రపంచంలో మరెక్కడా కనిపించేది కాదని బోధపర్చుకున్నాను. వాటికన్న పూర్వపుశిల్పకళగా చెప్పదగ్గ ఈజిప్షియన్, గ్రీకు, రోమన్ శిల్పాల్లోగాని, వాటికి కొంచెం అటూ ఇటుగా సమకాలికమని చెప్పదగ్గ గాంధార, మధుర బౌద్ధ శిల్పకళలోగాని, చివరకి వాటికి మాతృకలని చెప్పదగ్గ అమరావతి-నాగార్జున కొండ శిల్పాల్లోగాని కనిపించని విశేషమేదో ఆ శిల్పాల్లో కనిపిస్తూ ఉంది. చూడగా చూడగా ఆ శిల్పాల తనూలావణ్యంలో, రేఖావిలాసంలో, హావభావప్రకటనంలో మూడు విశేషాలు గోచరించాయి.
మొదటిది, ఆ శిల్పాల్లో స్తబ్ధత లేదు, నిశ్చలత లేదు, శిల్పి తమని తమ శిలకే అంటిపెట్టుకొమ్మని శాసించిన పరిస్థితి వాటికి లేదు. అన్నిటికన్నా ముందు అవి అత్యంత చలనశీలంగా కనిపించాయి. అవి పాడుతున్నాయి, నాట్యం చేస్తున్నాయి, గాల్లో తేలిపోతున్నాయి. తమని ఏ శిలా ప్రాకారానికి శిల్పులు అమర్చిపెట్టారో, దాదాపు రెండువేల ఏళ్ళుగా, అవి ఆ నిబద్ధతని ధిక్కరిస్తూ రెక్కలు చాచి విహాయసంలోకి ఎగిరిపోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
రెండోది, ఒక చతురస్రాకార తలమ్మీదగాని లేదా ఒక వర్తులాకార తలం మీద గాని చెక్కిన ఆ శిల్పాల spatial arrangement. పాశ్చాత్య చిత్రకళ, ముఖ్యంగా ఆధునిక చిత్రకళ, asymmetry ని కోరుకుంటుంది. వారి చిత్రకళా సూత్రాల ప్రకారం మనం చిత్రించబోతున్న విషయం మనం చిత్రిస్తున్న తలానికి మధ్యలో ఉండకూడదు. అది off-centre లో ఉండాలి. కాని బౌద్ధ చిత్రకళ, radial perspectiveని నమ్మింది. దానిమీద చెక్కిన శిల్పాలు, ఒకటిగానీ లేదా ఒక బృందంగానీ, మధ్యలో ఒక కేంద్రబిందువునుంచి పువ్వు విచ్చుకున్నట్టుగా నలువైపులా విస్తరిస్తాయి. సాధారణంగా సిద్ధార్థుడు గానీ, బుద్ధుడుగానీ__ ఆయన జీవితంలోని ఘట్టాలుగానీ ఇతివృత్తాలుగా ఉన్నప్పుడు ఈ దృక్కోణంలో శిల్పాలు చెక్కి ఉంటాయి. ఇక్కడ నేను అదనంగా గమనించిందేమంటే, శిల్పంలోని ఆకృతుల అమరికలో ఒక diagonal arrangement కి ప్రాముఖ్యతనివ్వడం. అంటే ఒక దీర్ఘచతురస్రతలమ్మీద, కింద ఎడమవైపు నుంచి పైన కుడివైపుదాకా ఒక కర్ణరేఖని మనం ఊహించుకుంటే, శిల్పి మనకు చూపించాలనుకున్న దృశ్యంలో, దానిలో అట్టడుగున కనిపించే శిల్పాలు forefront గా, మధ్యలోవి middle ground గా, కుడివైపు పైన ఉన్నవి back ground లేదా ఊర్ధ్వతలం గా కనిపిస్తున్నాయి. అంటే కింద ఎడమవైపు ఉన్న ఆకృతులు ఇంకా భూమినే అంటిపెట్టుకుని ఉండగా, మధ్యలో ఆకృతులు ఈ పరిమితినుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుండగా, కుడివైపు పైన ఉన్నవి దాదాపుగా ఈ భూకక్ష్యను దాటేసినట్టుగా మనం ఊహించుకోవచ్చు.
కాని ఈ రెండు రకాల అమరికలోనూ కూడా శిల్పంలోని వివిధ ఆకృతుల మధ్య అపారమైన వైశాల్యాన్ని మనం గమనించవచ్చు. ఆ దేహాలు ఒకదానిమీద ఒరిగి ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, వాటి మధ్య ఎంతో ఎడం, ధారాళమైన ఖాళీజాగా మనకి కనిపిస్తుంటాయి. అంటే రెండు అడుగుల ఎత్తు, మూడు అడుగుల పొడవు మించని ఒక్కొక్క దీర్ఘచతురస్ర తలం మీదా, దాదాపుగా మనుషులూ, పశుపక్ష్యాదులూ, స్తంభాలూ, పుష్పాలూ కూడా కలిపి పదహారునుంచి ఇరవై దాకా ఆకృతులు ఉంటాయనుకుంటే, ఆరు చదరపు అడుగుల వైశాల్యంలో ఒక చిన్నపాటి ప్రపంచాన్ని ఇమిడ్చిపెట్టడంలోని నైపుణ్యం ఏమిటో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.
ఇక మూడోది, ఆ చిన్న చిన్న ఆకృతుల్లోనే, అంటే ఒక్కొక్కటీ పన్నెండు అంగుళాల్ని మించని ఆ లఘుదైర్ఘ్యంలోనే వారు సాధించిన detailing. అది నన్ను నిజంగా విభ్రాంతపరిచింది. ఆ ఆకృతుల్లో ఏ ఒక్క దేహమూ కూడా అంగాంగీణ నిష్పత్తిని అతిక్రమించలేదు. అసలు శిల్పమంటేనే, appropriate proportioning అని కదా! నిర్దుష్టంగా ఉండే ఆ ఆకృతులు వాటికవే సుందరరూపాలుకాగా, తిరిగి మళ్ళా వారి అరమోడ్పు కన్నులు, చిరు మందహాసాలు, చేతివేళ్ళ కణుపులు, కంఠాభరణాల్లో, దండకడియాల్లో, వక్షస్థల హారాల్లో కనవచ్చే మణిమాణిక్యాలూ- చిన్న చిన్న వివరాలే, కానీ మళ్ళా ఏ ఒక్క ఆకృతీ కూడా ఆ వివరాల్తో కిక్కిరిసిపోకుండా, వాటి lightness of being భంగపడకుండా కనిపించడం నన్ను ఎంత సమ్మోహితుణ్ణి చేసిందో చెప్పలేను.
ఇంత సూక్ష్మచిత్రణ భారతదేశంలో మధ్యయుగాల దేవాలయ వాస్తులో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకి బేలూరు. కాని అక్కడ ఆ వివరాలు ఆ శిల్పాలకి ఒక స్థౌల్యాన్ని అపాదించి వాటిని ఆ గోడలకీ, ఆ స్తంభాలకీ కట్టిపడేసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ సూక్ష్మవిశేషాలన్నిటితో కూడా ఆ శిల్పాలు గాల్లోకి రెక్కలు చాచుకుంటూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పంచతంత్ర కథలో పావురాలు వలతో సహా ఎగిరిపోయినట్టుగా ఆ శిల్పాలు ఆ మొత్తం తోరణశిలతో సహా గాల్లోకి ఎగిరిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇది కదా శిల్పమంటే! ఇది కదా కళాసృష్టి అంటే! ఇది కదా సౌందర్య దర్శనమంటే!
విజయసారథి వారం దినాల కిందటనే చైనాలో జియాన్ నగరం శివార్లలో టెర్రకోటా యోధుల విగ్రహాలు చూసి వచ్చారు. ఆయన పోయిన నెలలో వారం పదిరోజుల పాటు చైనాలో చెప్పుకోదగ్గ ముఖ్య స్థలాలన్నీ చూసి ఉన్నారు. ఆయన అన్నదేమంటే, అక్కడ కూడా ప్రాచీన కాలపు కట్టడాలు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటివి, మహానిర్మాణాలు, అద్భుత నిర్మాణాలున్నాయిగానీ, ఇంత intricate design తో, ఇంతలా జీవం ఉట్టిపడేట్టుగా చెక్కిన శిల్పాలు, ఇంత ప్రాచీన కాలానివి తాను వెళ్ళిన చోట ఎక్కడా కనిపించలేదని.
కానీ మాకు ఆ శిల్పాల్ని చూసి ఎంత సంతోషం (సంతోషం చిన్నమాట, ఆ భావోద్విగ్నతని వర్ణించడానికి సరైన పదం స్ఫురించడం లేదు) కలిగిందో అంత దుఃఖం కూడా కలిగింది. ఎటువంటి మహత్తర సంపదకి మనం వారసులుగా ఉన్నాం! కాని ఇప్పటికే భగ్నమైపోయినవి భగ్నమైపోగా, మిగిలిన ఈ కొన్ని శకలాల పట్ల కూడా మనం ఎంత నిరాదరణ చూపిస్తున్నాం! ఈ మాట అనగానే, మామూలుగా ప్రభుత్వాలు కదా వీటిని పట్టించుకోవాలి అనడం సహజం. కానీ మనలాంటి ప్రజాస్వామిక దేశాల్లో ప్రజలు దేనికి ప్రాధాన్యతనిస్తే ప్రభుత్వాలు కూడా దానికే ప్రాధాన్యతనిస్తాయి. ప్రజలకి సినిమాలు ముఖ్యం కాబట్టి ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమకి ఎటువంటి రాయితీలు కలిపించగలనా అని ఆలోచిస్తుంది. ఒకవేళ, ఇటువంటి మహత్తర కళాసంపదని ప్రజలు ప్రేమించడం మొదలుపెడితే, ప్రభుత్వాలు కూడా వెంటనే ఇక్కడికి రెక్కలు కట్టుకుని వాల్తాయి.
చూడండి: వాన్ గో పందొమ్మిది-ఇరవై శతాబ్దాల మధ్య జీవించిన ఒక డచ్చి చిత్రకారుడు. తాను చూసినదాన్ని కాన్వాసుమీదకు తీసుకురాడానికి జీవితమంతా తపించాడు. ఈ రోజు ఆయన ప్రపంచ చిత్రకారుల్లో అగ్రశ్రేణి చిత్రకారుడని మనకి తెలుసు. అమస్టర్ డామ్ లో ఆయన చిత్రలేఖనాలు ప్రదర్శించే మ్యూజియం టిక్కెట్లు ఆరునెల్ల ముందే అమ్ముడుపోయి ఉంటాయి. లియోనార్డో డావిన్సీ రినైజాన్సు కాలపు చిత్రకారుడు. ఆయన చిత్రించిన మొనాలిసాని నిత్యం అత్యంత సురక్షితమైన భద్రత మధ్య ప్రదర్శిస్తూ ఉంటారు. మొనాలిసాని చిత్రించినప్పుడు డావిన్సీ తన అరచేతినే కుంచెగా వాడి sfumato పద్ధతిలో ఆమె శరీర లావణ్యాన్ని, ఆ మందహాసాన్ని సాధించిన తీరు ఆయన్ని ప్రపంచంలోనే అగ్రశ్రేణి చిత్రకారుడిగా నిలబెట్టింది. కాని ఆయన కన్నా కనీసం పన్నెండు వందల ఏళ్ళకు ముందే అటువంటి రూపరేఖా విలాసాల్ని సున్నపురాతిమీదకు తీసుకురాగలిగిన ఈ అజ్ఞాత, విస్మృత, ఆంధ్ర బౌద్ధ శిల్పుల గురించి ఎవరికి తెలుసు? వీరి గురించి ప్రపంచమంతా వినేలాగా మాట్లాడటానికి ఎవరికి ఆసక్తి ఉంది? అసలు ముందు ఫణిగిరి వెళ్ళడానికి ఎంతమందికి తీరిక ఉంది?
అక్కడ ఉన్న సందర్శకుల రిజిస్టరు చూస్తే మా కన్నా మూడు రోజుల ముందు ఆఫ్గనిస్తాన్ నుంచి సందర్శకులు వచ్చినట్టుగా ఉంది. వారికన్నా వారం పది రోజుల ముందు థాయ్ లాండ్ నుంచి సందర్శకులు వచ్చినట్టు తెలుస్తున్నది. కాని రెండు తెలుగు రాష్ట్రాలనుంచీ మేము తప్ప మరో సందర్శకులెవరూ కనిపించడం లేదు.
(ఇంకా ఉంది)
10-11-2026


Good morning sir, today your article about phani giri &phanigiri related things it’s very informative &useful for future generations. Sreenidhi(heritage museum employee) .
ధన్యవాదాలమ్మా!
So nice to see you and Vijay sir making this trip together, Sir! And thanks to Chaitanya garu for capturing you sketching the sculptures live in such a lovely video. The final sketch was beautiful!
As always, thoroughly enjoyed reading your account of the visit. Your insights about the beauty and intricate details of these ancient sculptures make it even more interesting. Thanks for sharing. 🙏🏽
ఆసక్తికరంగా ఉన్నది. హైదరాబాదుకు ఇన్నిసార్లు వచ్చివెళ్ళాను కానీ ఫణిగిరికి వెళ్ళలేదు. పోయినేడు, నాగార్జునసాగరుకు వెళ్ళాను, మ్యూజియం చూడాలన్న ఆశతో. అక్కడికెళ్ళాక తెలిసింది – శుక్రవారం మ్యూజియాలకు సెలవుంటుందని. ఉస్సురుమంటూ తిరిగివచ్చేసాను.
మీరు గీసిన బొమ్మలను బ్లాగులో చేరుస్తారు కదా?
మీ వంటి పెద్దలు ఇది చదివి స్పందించడం నా భాగ్యం.
ఫణిగిరిఓఅద్భుతంఅనిపించింది….మీరువివరించినతరువాత……ఆశిల్పకళఅంతఅధ్భుతంగాఅన్నిసంవత్సరాలక్రితంఎలా?అన్నదినాకుఅర్ధంకలేదు….చైనావెళ్ళిచూసివచ్చినవిజయసారథిగారుజీవంఉట్టిపడేలాచెక్కినశిల్పాలు,ఇంతప్రాచీనకాలంనాటితానువెళ్ళినచోటఎక్కడాచూడలేదనిచెప్పడం….భారతశిల్పసంపదకుఓకితాబుఅనిచెప్పవచ్చు….మీలైవ్స్కెచ్చింగునాలోరసజ్నతకలుగుచేసింది…..ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం…..ఆమ్యూజియమ్లోఇంతలావివరించేవారులేరేమోఅనిపిస్తోంది…..శుభాభినందనలు.
ధన్యవాదాలు మాష్టారూ!
A great expression sir.
Thank you sir!