ఈ కాలానికి తగ్గ దేవుడు

మొన్న అదిలాబాదు నుంచి వస్తూ ఉంటే ఓల్డ్ బోయిన్ పల్లి దగ్గర రోడ్డు పక్కన రెండు మూడు కిలోమీటర్ల పొడుగునా గణేష్ విగ్రహాలు కనిపించాయి. గణపతుల గణాలు భూమ్మీదకి దిగినట్టుగా ఉంది. అలా ఆ విగ్రహాల్ని చూస్తూ ముందుకు పోతుండగా, అక్కడొకచోట ఒకాయన కనిపించాడు. ‘ఇదేమిటి! ఇక్కడ ఈ గ్రీకు కనిపిస్తున్నాడు’ అని కళ్ళు నులుముకుని చూసాను. సందేహం లేదు, అతనే, పుస్తకాల్లో చూసిన ముఖమే.

ఎపిక్టెటస్!

బండి ఆపమని చెప్పి, దిగి, పరుగుపరుగున అతని దగ్గరకి వెళ్ళాను.

‘మీరేమిటిక్కడ?’ అనడిగాను, నా ఆశ్చర్యాన్ని అణచుకోడానికి అవస్థపడుతూనే.

అతడు నాకేసి చూసాడు. ఆ పూర్వకాలపు గ్రీకు తత్త్వవేత్తల అంగీ వదులుగా ఆ దేహాన్ని వేలాడుతూ ఉంది. ఒకప్పుడు బానిసగా బతికిన రోజుల్లో,  అతడి యజమాని ఒకసారి అతడిమీద కోపంతో అతడి కాలు విరిచేసాడు. అందుకని ఇప్పుడు ఆ కాలున్నవైపు కొద్దిగా వాలి ఉన్నాడు. కానీ మార్కస్ అరీలియస్ లాంటి చక్రవర్తికే దారి చూపించిన వాడు.  ఇప్పుడు ఆయన పేరు తలుచుకోకుండా ప్రపంచం  ఒక్కరోజు కూడా ముందుకు నడవడం లేదు.  ‘నాకింకా నమ్మశక్యం కాకుండా ఉంది ‘అన్నాను. లేకపోతే ఒకటో శతాబ్దపు రోమ్  ఎక్కడ? ఈ పాత బోయిన్ పల్లి ఎక్కడ?

‘ఎందుకని? నువ్వేకదా నన్ను తలుచుకుంటూ ఉన్నది’ అన్నాడు ఎపిక్టెటస్ నా వైపు చూపు తిప్పకుండానే. ఆయన ఆ గణేష్ మూర్తుల్నే కళ్ళప్పగించి చూస్తున్నాడు.

అప్పుడు తట్టింది, అప్పటికి రెండు మూడు రోజులుగా నేను ఆయన పుస్తకాలే చదువుతున్నానని.

‘అంటే మీరు ఎవరు తలుచుకుంటే వాళ్ళ దగ్గర ప్రత్యక్షమవుతారా?’ అనడిగాను.

‘అవును. నిన్ననే, పూణే లో  ఎవరో పర్సనాలిటీ డెవలప్ మెంట్  మీద పాఠాలు చెప్తూ నా మాటలు పదే పదే చెప్తూ ఉంటే అక్కడికి పోక తప్పింది కాదు ‘ అని అంటూ ‘ఈయనేమిటి? ఇలా ఉన్నాడు! ఏథెన్సులోనూ, రోములోనూ నేనిలాంటి శిల్పాలు ఎప్పుడూ చూడలేదు’ అని అన్నాడు ఆశ్చర్యపోతూ.

‘ఈయన వినాయకుడు, విఘ్నాధిపతి. మా వాళ్ళు చెప్పేదేమంటే ఆయన మొదట్లో రైతుల దేవుడని, ప్రకృతి దేవుడని, పర్యావరణానికి దేవుడని. ఆ చెవులు చేటలు, ఆ బొజ్జ సుభిక్షానికి గుర్తు, ఆ ఎలుక రైతుల విరోధి కదా, అందుకని లొంగదీసుకున్నాడంటారు..’ అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, ఎపిక్టెటస్ నా వైపు తిరిగి నన్ను పరిశీలనగా చూసాడు.

‘కాదు,కాదు, నువ్వు ఆ అవయవాల్ని వర్ణిస్తున్నావు. అవి అలా ఎందుకున్నాయో వివరిస్తున్నావు. నేను ఆలోచిస్తున్నది అది కాదు. నిన్న ట్రయినింగ్ క్లాసులో- అంతా పిల్లలు- వాళ్ళ మాటలే ఇంకా నా చెవుల్లో వినబడుతున్నాయి. అందులో ఒకమ్మాయి, చూడటానికి బొద్దుగా ఉంది, ఆమె ఆ ఫాకల్టీని అడుగుతోంది, నన్నంతా లావుగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటున్నారు, డైటింగ్ చెయ్యాలంటారు, యోగా చెయ్యాలంటారు, ఇంకా ఏదో చెప్తుంటారు. నాకు చాలా ఆందోళనగా ఉంది. నేనేం చెయ్యాలో చెప్పండి ‘ అని. కానీ, చూడు మిత్రమా! బాడీ షేమింగ్ ని పూర్తిగా జయించినవాడు ఇలా ఉంటాడు. ఎంత అన్ అపొలొజిటిక్ గా ఉన్నాడు! అచ్చం  మా సోక్రటీసు లాగా ఉన్నాడు! లోకం పెట్టుకునే ఏ కొలతలకీ లొంగిపోకుండా తను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉన్నాడు. తను తనుగా.  అలా ఉండాలంటే ముందు కావలసింది అటువంటి ఆత్మనిశ్చయత, అటువంటి ఆత్మనిర్భరత. ముందు నిన్ను నువ్వు అంగీకరిస్తే, అప్పుడు తక్కిన లోకమంతా నిన్ను గౌరవించి తీరుతుంది. అవునూ, ఆ దంతమెందుకు విరిగి పోయింది?’ అనడిగాడు.

‘అదా! వ్యాసుడు భారతం చెప్తూ ఉంటే ఈయన రాయడానికి కూర్చున్నాడు. మధ్యలో గంటం విరిగిపోయింది. కాని రాత ఆపకూడదని నియమం. అందుకని తన దంతం తనే విరుచుకుని దాంతో రాయడం మొదలుపెట్టాడంటారు ‘ అన్నాను.

‘ఆహా! ఆ వ్యక్తిత్వం నేనూహించినట్టే ఉంది. అలాంటి వాళ్ళు ఒక పనికి పూనుకున్నారనుకో. వెనక్కి తగ్గరు. దేనికైనా సిద్ధపడతారు. తమ ఆత్మలోంచి కొంత ధారపోసి అయినా సరే ముందుకు నడుస్తారు. మనకి చూడటానికి వాళ్ళు గాయపడ్డారనిపిస్తుంది. కాని గాయాన్ని గేయంగా మార్చుకుంటారు. అందం కాదు, ఆర్భాటం కాదు, పదిమందీ ఏమనుకుంటారన్న ఆత్రుత కాదు, అన్నిటికన్నా ముందు తాము ఒప్పుకున్న పని ఆగిపోకుండా ముందుకు నడిచిందా లేదా! అంతే. అదే వాళ్ళకి నిజమైన అలంకారం ‘ అని అన్నాడు వెలుగు చిమ్ముతున్న చూపుల్తో.

‘అలా అయితే, ఆ ఎలక సంగతేమిటి?’ అనడిగాను.

‘ఇందాకా నువ్వు ఈయన్ని రైతుల దేవుడని చెప్పావు. ఒక్క రైతులకే ఎందుకు? ఈయన మనుషులందరికీ దేవుడని ఆ ఒక్క ఎలకని బట్టి చెప్పొచ్చు. ఎలక చూడు.  ఎంత రెస్ట్ లెస్ గా ఉంటుంది! నిలకడ లేని జీవి. ఊరికే పరుగెట్టుకుంటూపోతుంది. కాని ఆయన దాన్ని వాహనంగా మార్చుకున్నాడు. అంత పెద్ద శరీరం, అంత చిన్న వాహనం.  ఎవరేనా తమ యాంగ్జయిటీని అదుపు చేసుకోగలిగితే అలానే ఉంటుంది, చిన్న ఎలకమీద ఏనుగు వూరేగినట్టు. అద్భుతం కదా!’అని అన్నాడు.

‘మరి ఆ చెవుల సంగతేమిటి?’ అనడిగాను. ఈలోపు ట్రాఫిక్ జామ్  అవుతున్నట్టుంది. ఒకటే హారన్లు. ఎపిక్టెటస్ ఆ ట్రాఫిక్ కేసి చూసాడు. ‘ఇప్పుడు కాదులే, మరోసారి మాట్లాడుకుందాం, ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటికాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్.  అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను. కానీ ఊరికే ఆందోళన పడిపోకు. నువ్వెలా బతకాలో నీ  స్క్రిప్టు నువ్వే రాసుకో. అవసరమైతే నీలో ఒక భాగాన్ని తుంచెయ్యవలసి వస్తే తుంచెయ్యి. ఒక్క భాగమేమిటి? నీకు  అప్పగించిన పనికి అవసరమైతే నిన్ను నువ్వే మూల్యంగా చెల్లించుకోడానికి సిద్ధపడు. గుర్తుపెట్టుకో నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ముందు నీకు నువ్వే ఒక పెద్ద అడ్డంకి. నిన్ను నువ్వు జయించుకున్నావా! నీకు తిరుగులేదు’  అని అంటూ వడివడిగా నడుచుకుంటూ ఆ జనసందోహంలో కలిసిపోయాడు.

(సాక్షి దినపత్రిక సౌజన్యంతో)

13-9-2026

15 Replies to “ఈ కాలానికి తగ్గ దేవుడు”

  1. ముందు నిన్ను నువ్వు అంగీకరిస్తే, అప్పుడు తక్కిన లోకమంతా నిన్ను గౌరవించి తీరుతుంది.

    ఎపిక్టెటస్ ద్వారా వినాయకుడి గుణగణాలు గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.

    వినాయకచవితి శుభాకాంక్షలు సర్!

  2. భలే! వినాయక చవితి శుభాకాంక్షలు సర్..

    కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా… ❤️

  3. భలే రాసారే ! ఎక్కడి పురాణ గణపతి? ఎక్కడి గ్రీకు ఎపిక్టేటెస్ ? బావుంది సర్…

  4. ఈ రచన నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. గణేశ విగ్రహాల మధ్య ఎపిక్టెటస్ ప్రత్యక్షమవడం అనే ఊహతో మొదలై, గ్రీకు స్టోయిక్ తత్వాన్ని భారతీయ గణేశ ప్రతీకలతో అనుసంధానించిన తీరు రచనకు ప్రత్యేకమైన ఆకర్షణను తెచ్చింది. సాధారణంగా కనిపించే గణేశుడి రూపాన్ని కూడా ఒక తాత్త్విక దృష్టితో కొత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది.

    ముఖ్యంగా గణేశుడి బొజ్జను body shamingకు వ్యతిరేకంగా, ఎలుకను మనిషిలోని ఆందోళనకు ప్రతీకగా, విరిగిన దంతాన్ని నిబద్ధతకు సంకేతంగా రచయిత అన్వయించిన తీరు బాగుంది. “చిన్న ఎలకమీద ఏనుగు ఊరేగినట్టు” అనే పోలిక చాలా చక్కగా కుదిరింది. మనలోని restlessness, anxietyలను మనమే అదుపులో పెట్టుకోగలిగితే ఎంతటి పెద్ద సమస్యనైనా అధిగమించగలమనే భావనను అది సరళంగా చెప్పగలిగింది.

    ఈ రచనలో నాకు బాగా నచ్చిన మరో అంశం గణేశుడిని నేటి కాలానికి సరిపోయే “పర్సనాలిటీ కోచ్”గా ఎపిక్టెటస్ చూడటం. “నిన్ను నువ్వు అంగీకరించు”, “నీ స్క్రిప్టు నువ్వే రాసుకో”, “ముందు నీకు నువ్వే ఒక పెద్ద అడ్డంకి” వంటి మాటలు నేటి మనిషి ఎదుర్కొంటున్న insecurity, ఇతరుల అభిప్రాయాల భయం, ఆందోళన వంటి అంశాలకు బాగా సరిపోతాయి.

    అయితే చివరి భాగంలో ఎపిక్టెటస్ చెప్పే మాటలు కొంచెం ఎక్కువగా ఉపదేశ ధోరణిలోకి వెళ్లినట్లు అనిపించింది. రచన మొదటి నుంచి సంభాషణ, చమత్కారం, ఊహ, తాత్త్వికతలతో సహజంగా సాగుతుంది. చివర్లో మాత్రం రచయిత చెప్పాలనుకున్న సందేశాన్ని మరీ స్పష్టంగా చెప్పినట్టుగా అనిపిస్తుంది. కొద్దిగా కుదిస్తే చివరి ప్రభావం మరింత బలంగా ఉండేది.

    మొత్తంగా చూస్తే ఇది గణేశుడి గురించి రాసిన సాధారణ వ్యాసం కాదు. గణేశుడి రూపంలోని ప్రతీకలను ఆధునిక మనిషి జీవితంలోని సమస్యలతో అనుసంధానిస్తూ, ఎపిక్టెటస్ స్టోయిక్ తత్వాన్ని కూడా జోడించిన ఆలోచనాత్మక రచన. ముఖ్యంగా “నిన్ను నువ్వు అంగీకరించు; నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని నీ చేతుల్లోనే ఉంచుకో” అనే అంతర్లీన సందేశం రచనంతా నడుస్తుంది.

    ఒక మంచి పేరాలో చెప్పాలంటే— ఈ రచనలో పురాణం, తత్వశాస్త్రం, ఆధునిక జీవితం, హాస్యం కలిసిపోయాయి. గణేశుడిని కొత్త కోణంలో చూడటమే కాకుండా, చివరికి పాఠకుడు తనను తాను చూసుకునేలా చేయడం దీని ప్రధాన విజయంగా నాకు అనిపించింది.

    1. శైలజ గారూ! మీరు ఈ వ్యాసాన్ని ఇంత నిశితంగా చదివి ఈ విధంగా విశ్లేషించడం నాకు చాలా సంతోషం కలిగించింది. నిజమే ఈ వ్యాసానికి సంపాదకులు 400 పదాల పరిమితి నిర్దేశించారు. అప్పటికే 600 దాకా చేరింది. కానీ చెప్పవలసింది ఇంకా చాలా ఉంది అన్న ఆలోచన వల్ల ఆ చిట్ట చివర కొద్దిగా ఎక్కువ నొక్కి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల అది కొంత ఉపదేశాత్మకంగా మారినట్టుగా అనిపించి ఉండవచ్చు. సంపాదకులు వినాయకుడిని Gen Z కి తగ్గట్టుగా చూపించమన్నందువల్ల ఈ విధంగా ఊహించవలసి వచ్చింది.

    2. మరొక అంశం కూడా ఏమిటంటే వినాయకుడు, మనకు అందిన కథల ప్రకారం, బాడీ షేమింగ్ కి గురయ్యాడు. అందుకని పార్వతీదేవి చంద్రుడిని శపించడం, ఆ శాపం నుంచి తప్పించుకోవడానికి మనం వినాయక చవితి వ్రతం మొదలుపెట్టినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఎపిక్టెటస్ శరీరం అతని యజమాని చేతుల్లో హింసకి గురై, అతడు అవిటితనం పాలయ్యాడు. కానీ అతడు తన అవిటితనాన్ని చూసి సిగ్గుపడ్డట్టుగా ఎటువంటి ఉదాహరణలు మనం వినలేదు. కాబట్టి బాడీ షేమింగ్ గురించి చెప్పటానికి అతనికి అర్హత ఉంది అని నాకు అనిపించింది.

  5. What an innovative idea, Sir!!

    Bringing Epictetus into a conversation with you and using Vinayakudu as the subject is such a fresh and unexpected approach. I loved the way you’ve used Vinayakudi image to explore issues we all deal with today. As always, it’s wonderful how you bring ancient philosophy and mythology into the context of our lives today.

    Bringing Epictetus into the conversation felt like you were talking about a common friend (with your talks on Marcus Aurelius’ Meditations still fresh in my mind).
    🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading