బసవన్న వచనాలు-2

బసవన్న తన వచనాల ద్వారా షట్-స్థల జ్ఞానం కలుగుతుందని చెప్పాడు. షట్-స్థలాలు అంటే ఆరు స్థలాలు. ఇక్కడ స్థలం అంటే ప్రదేశం అని కాదు. అది ఒక మానసిక దశ. ఆధ్యాత్మిక సాధనలో భక్తుడు నెమ్మదిగా పయనించే ఒక్కొక్క ఆవరణ. బసవన్న తర్వాత వీరశైవ సిద్ధాంతకర్తలు, ముఖ్యంగా బసవన్న మేనల్లుడూ , మరొక గొప్ప వచన కారుడూ ఐన చెన్న బసవన్న ఈ అంశం మీద మరింత విస్తారమైన చర్చ చేసాడు. వారు చెప్పే ఆరు స్థలాలు: భక్తస్థలం, మాహేశ్వర స్థలం, ప్రసాది స్థలం, ప్రాణలింగి స్థలం, శరణుశ్థలం, ఐక్య స్థలం. ఇవి సాధకుడు ప్రయాణించవలసిన మార్గాన్ని, ఆ ప్రయాణంలో అతడు చేరుకునే ఒక్కొక్క మజిలీని సూచించే పదాలు.

అన్నిటికన్నా మొదటిది భక్త స్థలం. ఒక మానవుడు తన సాధారణ ప్రాపంచిక జీవితంలో సారంలేదనీ, అది తన జీవితానికి అర్థం ఇవ్వడం లేదనీ ఒక తపన మొదలయ్యాక, దేవుడివైపు, ఆ దేవుణ్ణి కొలిచే భక్తులవైపూ, ఆ ఆరాధనా క్రమం వైపూ చూడటం మొదలుపెడతాడు. ఈ దశలో నెమ్మదిగా గురువు, లింగం, జంగముడనే మూడింటిమీదా మనసు కుదురుకోగానే అతడు భక్తస్థలంలో అడుగుపెట్టాడని చెప్పవచ్చు.

ఆ తర్వాత దశలో అతడు గురువు చెప్పిన మాటల్ని ఆచరించడం మొదలుపెడతాడు. సంపదలపట్లా, వస్తువులు పోగేసుకోడం పట్లా, సుఖాల పట్లా ఇష్టం పోడం మొదలవుతుంది. జంగముల్ని , అంటే శివుణ్ణే సర్వస్వంగా భావించే భక్తుల్ని, చూసి వారిలాగా తాను కూడా మారాలనుకుంటాడు. ఈ దశ మహేశస్థలం.

ఆ తర్వాత దశలో అతడు ఫలానాది కావాలని కోరుకోడం గాని, లేదా ఫలానా అనుభవాన్ని ద్వేషించడం గాని మానేస్తాడు. తనకి ఏది లభించినా అది దేవుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించే మనఃస్థితికి చేరుకోవడం మొదలుపెడతాడు.ఆ శివానుగ్రహం అతడికి జంగమభక్తుల ద్వారా లభిస్తుంది. తనకు లభించిన ప్రతి ఒక్క అనుభవాన్ని ఒక కానుకగా భావించి తిరిగి తన సర్వస్వం శివుడికి సమర్పించాలనే ఆత్రుత మొదలవుతుంది. ఇది ప్రసాది స్థలం.

నెమ్మదిగా అతడికి తనలోపల ఉన్న అంతర్యామి ఎరుకలోకి రావడం మొదలుపెడతాడు. ఇప్పుడు అతడి దృష్టి బాహ్యాచారాల్ని దాటి అంతరంగశుద్ధి వైపు ప్రయాణించడం మొదలుపెడుతుంది. అన్ని రకాల కార్యకలాపాలు ప్రార్థనగా మారే దశ ఇది. కాబట్టి ఇది ప్రాణలింగి స్థలం.

ఆ తర్వాత దశలో సాధకుడు తనలోని అంతర్యామితో నేరుగా సంభాషించడం మొదలుపెడతాడు. అతడి అంతరంగమంతా శివ-జ్ఞానంతో, శివతత్త్వంతో, శివసుగంధంతో నిండిపోతుంది. అతడికి ప్రతి ఒక్కటీ శివమయంగానే గోచరిస్తుంది. అటువంటి శరణులు ఉన్నందువల్లనే తనకి ఈ జన్మ దుఃఖ కారకం కాలేదని బసవన్న అంటాడు. అటువంటి స్థితికి చేరుకున్నవాళ్లని శరణులు అంటారు. ఆ శరణుల్ని చూసే తక్కినవాళ్ళు భక్తస్థలంలోకి అడుగుపెడతారు.

ఇక చివరిది, శరణుడు, శివుడితో ఏకమయ్యే స్థలం. ఐక్య స్థలం.

తిరిగి మళ్ళా ఈ స్థలాన్నిటిలోనూ అనేక అంతరస్థలాలు కూడా ఉంటాయని చెప్తారు. ఉదాహరణకి ఇక్కడ నేను వచనాల్ని అనువదిస్తున్నప్పుడు వాటిముందు సూచిస్తున్న స్థలాలు- పిండస్థలం, సంసారహేయ స్థలం, గురుకారుణ్యస్థలం, విభూతి స్థలం, పంచాక్షరి స్థలం వంటివి భక్తస్థలంలోని అంతర స్థలాలు.

ఆధ్యాత్మిక సాధనలో ఇటువంటి దశలు దాదాపుగా ప్రతి మతంలోనూ కనిపిస్తాయి. బౌద్ధం ఇలాంటి దశల్ని నాలుగింటిని గుర్తించింది. అవి సోతపన్న, సకదాగామి, అనాగామి, అర్హత దశలు. సోతపన్న అంటే ప్రవాహంలో ప్రవేశించేదశ. సకదాగామి అంటే ఒక్కసారికి మాత్రమే వెనక్కి వచ్చేవాడు, అనాగామి అంటే జ్ఞానోదయం పొందాక ఇక వెనుదిరిగి చూడని వాడు. అర్హతుడంటే పూర్తి విముక్తుడు.

అలాగే సూఫీ దర్శనంలో కూడా ఇటువంటివి నాలుగు దశలున్నాయి. అవి షరియత్, తరీకత్, హఖీకత్, మరిఫత్. షరియత్ అంటే సంఘజీవనాన్ని నిర్దేశించే సూత్రాలు. బాహ్య ప్రవర్తనని నిర్దేశించే నియమావళి. తరీకత్ అంటే గురుమార్గం. హఖీకత్ అంటే అంతరంగ శుద్ధి, అంతరంగ చింతనం. భగవంతుడితో సంభాషణ. ఇక మరీఫత్ అంటే పూర్తి విముక్తదశ. ఆధ్యాత్మిక జ్ఞానానికీ, ఆచరణకీ మధ్య సరిహద్దులు చెరిగిపోయిన దశ.

వీరశైవులు వైదిక, బౌద్ధ, జైన ధర్మాలతో విభేదించినప్పటికీ, ఆయా ధర్మాల్లోంచి తమకు నచ్చిన లక్షణాల్ని తీసుకుని తామొక ధర్మాన్ని రూపొందించుకున్నారు. వైదిక ధర్మంలోని వర్ణాశ్రమ ధర్మాల్నీ, బహుదేవతారాధననీ తిరస్కరిస్తూ, ఆ ధర్మంలోని గృహస్థ జీవితాన్ని అంగీకరించారు. బౌద్ధుల అష్టాంగ మార్గాన్ని అష్ట ఆవరణలుగా తీర్చిదిద్దుకున్నారు. అవి గురువు, లింగము, జంగముడు, విభూతి, రుద్రాక్ష, పాదోదకం, ప్రసాదం, మంత్రం. అలాగే బౌద్ధుల త్రిశరణాలు- బుద్ధుడు, ధర్మం, సంఘం అనే త్రిశరణాల్ని బట్టి పంచాచారాలు రూపొందించుకున్నారు. అవి లింగాచారం, సదాచారం, శివాచారం, భృత్యాచారం, గణాచారం. ఆ పద్ధతిలోనే వాళ్ళు జైనుల పధ్నాలుగు గుణస్థానాల నమునాలో తమ షట్-స్థలాల్ని సంభావించారని చెప్పవచ్చు.

బసవన్న వచనాల్ని ఈ ఆధ్యాత్మిక దశలప్రకారం అంటే షట్ స్థలాలుగానూ, తిరిగి అంతర స్థలాలుగానూ సంకలనం చేయడం సాంప్రదాయక పద్ధతి. ఇటీవలి కాలంలో ఈ పద్ధతికి స్వస్తి చెప్పి, వచనాల్ని అకారాది క్రమంలోనే సంకలనం చేస్తున్నారు. బసవన్న వచనాల్ని మనం చదువుతున్నప్పుడు సాంప్రదాయిక సంకలనకర్తల ప్రభావం మనమీద ఉండకూడదని ఆధునిక వ్యాఖ్యాతల ఉద్దేశ్యం కావచ్చు. కాని నా దృష్టిలో అకారాది క్రమంలో చదవడం కన్నా, సాంప్రదాయికంగా పరిచయం చేసిన క్రమంలోనే బసవన్నని చదవడం ఎక్కువ స్ఫూర్తిదాయకంగా ఉంటుందనిపిస్తుంది. అందుకని నా అనువాదాల్ని కూడా ఆ క్రమంలోనే మీతో పంచుకుంటూ ఉన్నాను. బసవన్న వచనాల్ని ఇంగ్లిషులోకి అనువదించిన ఎ.కె.రామానుజన్, కె.వి.జ్వెలెబిల్, సంస్కృతంలోకి అనువదించిన మా మాష్టారు శరభయ్యగారు కూడా ఈ పద్ధతినే పాటించారు.

బసవన్న క్రమముక్తి గురించి మాట్లాడాడనీ, అంటే ఒక సాధకుడు ఒక దశ దాటిన తరువాత రెండో దశలోకి అడుగుపెట్టకుండా దాని తర్వాత దశలోకి పోలేడని భావించాడనీ, కానీ చెన్నబసవన్న ఆ దృక్పథాన్ని సవరిస్తూ, సాధకుడు ఏ దశలోంచైనా చివరి దశకి నేరుగా చేరుకోవచ్చని చెప్పాడనీ ఒకచోట చదివాను. ఈ సూక్ష్మ సిద్ధాంత భేదాల్ని పరిశీలించగల పరిజ్ఞానం నాకు లేదు. కానీ బసవన్న రెండు రకాల దృక్పథాల్నీ సమర్థించాడనడానికి ఆయన వచనాలు సాక్ష్యమిస్తున్నాయి.

భక్తనెనిసునివెయ్యా మెల్లమెల్లనె
యుక్తనెనిసువెనయ్యా మెల్లమెల్లనె
సారి శరణనెనిసువెనయ్యా మెల్లమెల్లనె
ఎడహుగుళిగళ దాంటి బరబర లింగైక్యనెనిసువెనయ్యా
కూడల సంగమదేవా, నిమ్మిందధికనెనిసువెనయ్యా (892)

(భక్తుణ్ణి అనిపించుకుంటాను మెల్లమెల్లగా. యుక్తుణ్ణి అనిపించుకుంటాను మెల్లమెల్లగా. చేరి శరణుణ్ణి అనిపించుకుంటాను మెల్లమెల్లగా. ఎత్తుపల్లాలు దాటి క్రమక్రమంగా లింగైక్యుణ్ణి అనిపించుకుంటాను. కూడలసంగమదేవా, మీకన్నా అధికుణ్ణనిపించుకుంటాను)

ఇది స్పష్టంగా షట్ స్థలమార్గమే.

అయితే ఈ వచనం (896) కూడా చూడండి:

భక్త, మహేశ్వర, ప్రసాది, ప్రాణలింగి, శరణైక్యుణ్ణి
మెల్లమెల్లగా అవుతాననడానికి నేనేమన్నా వజ్రకాయుణ్ణా?
నేనేమైనా అమృతం తాగానా?
మరుజీవకరణి సేవించానా?
పలికిన మాటల్లో షట్ స్థలాలూ వచ్చి
నా మనసులో కుదురుకోకపోతే
తగలబెట్టేస్తానీ తనువుని కూడలసంగమదేవా!

ఈ రెండు దృక్పథాలూ బసవన్నవే. ఒక సాధకుడికి జ్ఞానోదయం ఫలానా క్రమంలోనే జరుగుతుందనిగాని, జరగాలని కాని ఎవరూ నిర్దేశించలేరు. అది ఎప్పుడైనా ఒక్క క్షణంలో కూడా కలగవచ్చు. ఒక జీవితకాలంలో కూడా కలక్కపోవచ్చు . కాని ఒక సాధకుడికి శివజ్ఞానాన్ని పరిచయం చేస్తున్నప్పుడు ఒక పాఠ్యప్రణాళిక క్రమంలో వివరించడం చక్కటి ఆచార్యుడి లక్షణం, బాధ్యత కూడా . కాబట్టి బసవన్న ఈ రెండు పద్ధతుల్నీ పాటించాడని అనుకోవచ్చు.


11

నా నడత ఒకలాగా
నా మాట మరొకలాగా

చూడయ్యా! నాలోపల స్వచ్ఛత లేదు.

నుడికి తగ్గట్టుగా నడత ఉంటేనే కదా
కూడలసంగముడు నాలో నెలవుండేది. (30)

12

తానెలా ఉన్నదో చూసుకోదు కానీ
ఎదుటివాళ్ళెలా ఉన్నారో విచారిస్తుంది
ఏం చేసేదీ మనసుని
ఎలా చూసేదీ మనసుని?

నచ్చని మెచ్చని ఈ మనసుని
చక్కదిద్దడం
కూడలసంగమదేవుని
శరణులకే సాధ్యం. (38)

13

బురదలో పడ్డ పశువులాగా
దిక్కుదిక్కులా మొరపెట్టుకుంటున్నాను

అకటకటా!
పట్టించుకునేవాళ్ళొక్కరూ లేరు

నన్ను పశువని గుర్తుపట్టి
కూడలసంగముడు
కొమ్ములు పట్టి పైకి లేపేదాకా (52)

14

అడవిలో దారితప్పిన పశువులాగా
అంబా అంబా అని పిలుస్తున్నాను
అంబా అంబా అని అరుస్తున్నాను

కూడలసంగమదేవుడు
బతుకుబతుకుమనేదాకా. (54)

15

అయ్యా అయ్యా అని పిలుస్తున్నాను
అయ్యా అయ్యా అని అరుస్తున్నాను
ఓ అనడం లేదు మీరు

అయినా మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను
మౌనమా!
కూడలసంగమదేవా! (56)

16

అటూ ఇటూ పడితిరక్కుండా నన్ను కుంటివాణ్ణి చెయ్యి
చుట్టుపక్కల చూడ్డానికి లేకుండా గుడ్డివాణ్ణి చెయ్యి
మరోమాట చెవిన వినకుండా చెవిటివాణ్ణి చెయ్యి.

ఒక్క మీ శరణుల పాదాలు కాక
కూడల సంగమదేవా!
మరే సంగతులూ నాకు పట్టకుండా చెయ్యి. (59)

17

ఇతడెవడు ఇతడెవడు ఇతడెవడు
అని అనకుండా ఉండాలి
ఇతడు మనవాడు ఇతడు మనవాడు ఇతడు మనవాడు
అనిపించేట్టుండాలి

కూడలసంగమదేవా
ఇతడు నీ కన్నకొడుకనిపించాలి. (62)

గురుకారుణ్యస్థలము

18

కుండలు చెయ్యడానికి మన్ను మూలం
నగలు చెయ్యడానికి పసిడి మూలం
శివపథం తెలియాలంటే
గురుపథం తెలియడం మూలం

కూడలసంగమదేవుణ్ణి చేరాలంటే
శరణుల సంగమమే మూలం (70)

విభూతి స్థలం

19

నీటికి కలువనే సొగసు
కడలికి అలలే సొగసు
మనిషికి గుణమే సొగసు
నింగికి జాబిల్లే సొగసు.

కూడల సంగమ శరణుల
నొసటన విభూతినే సొగసు (74)

పంచాక్షరి స్థలం

20

మావాళ్ళు ఒప్పుకుంటే శుభలగ్నమని చెప్పండి
రాశికూటం, ఋణ సంబంధం ఉన్నాయని చెప్పండి
తారాబలం చంద్రబలం సమకూరిందని చెప్పండి

కూడలసంగమదేవుని
పూజాఫలం మీదవుతుంది-

రేపటికన్నా ఇవాళే
మంచిరోజని చెప్పండి. (83)

25-11-2023

4 Replies to “బసవన్న వచనాలు-2”

  1. అద్భుతంగా ఉన్నాయి బసవన్న వచనాలు…అవి మీ మాటలతో హృదయాన్ని నేరుగా తాకుతున్నాయి…ఆ భక్త కవి చెప్పిన రెండు భక్తి మార్గాలు కూడా శరణు వేడిన భక్తులు శివైక్యం చెందటానికి వీలుగా వెలుతురు పరిచిన దారులు. వాటిలో బసవన్న చెప్పినట్లు ప్రతి దారి నుండి నేరుగా గమ్యాన్ని చేరే వేరే అంతర మార్గం ఉంటుంది. అది ఆ శరణు వేడిన భక్తుల అంతరంగంలో అగోచరంగా ఉన్న జ్వాలాముఖి గోచరత మీద ఆధారపడి ఉంటుంది.

    ఈ కార్తీక మాసం లో మీరు ఆ బసవన్న వచనాలని చెప్పటం ద్వారా దారి తప్పిన పిల్లల్ని తమ ఇంటికి చేరుకోమని అన్యాపదేశంగా హెచ్చరిన్నట్లుగా ఉంది.

    మీకు వేవేల వందనాలు.

  2. బసవన్న వచనాలు,మీ అనుసృజన వచనాలు చాలా బాగున్నాయి sir.
    16వ వచనం భక్తి పతాక స్థాయి ని తెలుపుతుంది.

    “నీ పద్యావళులాలకించెడి చెవులున్
    నిన్నాడు వాక్యంబులున్
    నీ పేరన్ పని చేయు హస్త యుగము ల్
    నీ మూర్తి పై చూపులున్
    నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్
    నీ పై బుద్ధులు నాకునిమ్ము
    కరుణన్ నీరజ పత్రేక్షణా.”

    నడక,చూపు, వినికడి మున్నగు శక్తులను అన్నింటినీ హరించివేసి “నీ ” తలపులనే శాశ్వతం
    చేయాలని కోరుకోవడం కన్నా శరణాగతి మరొకటి ఉండదు.
    సర్వస్య శరణాగతి ని కోరుకోవడం .
    మనిషి కి కావలసినది మరేమీ ఉంటుంది.
    అరుణాచల శివ.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading