UNDER A CANOPY OF PONGAMIA TREES

నేను కర్నూలు లో ఉద్యోగంలో చేరినప్పుడు, అక్కడ నాకు ఉండటానికి ఇంటి కోసం వెతుక్కుంటూ ఉండగా, మా జిల్లా కలెక్టర్ గారు నేను అడక్కుండానే నాకు ఒక గవర్నమెంట్ క్వార్టర్ ఎలాట్ చేశారు. అది సి-కాంపు సెంటర్లో మొదటి ఇల్లు. సి1 అంటారు దాన్ని. అది మరీ వీథి లోకి ఉన్నందువల్లా, ఆ క్వార్టర్ ఎదురుగుండానే బస్సులు ఆగుతూ ఉండటం వల్ల చాలా కాలం పాటు ఎవరూ ఆ క్వార్టర్లో చేరడానికి ఇష్టపడలేదట. కానీ నా మటుకు నాకు అది వరంగానే అనిపించింది.
 
నేను అందులో చేరిన తర్వాత చుట్టూ చిన్న కంచె కట్టించాను. ఎదురుగుండా గేటు దగ్గర ఒక ఎరుకలాయన నాకోసం ఒక వెదురు తడిక అల్లించి ఇచ్చాడు. దాన్ని ఒక పందిరి లాగా గేటు మీద లేపాను. దాని మీద ఒక పూలతీగ పాకించాము. ఇంటి మొదట్లో వరండా ఉండేది. ఆ వరండాకి ఒకపక్క సన్నజాజితీగ నిత్యం పూస్తూ ఉండేది. నెమ్మదిగా ఆ ఇల్లు నలుగురినీ ఆకర్షించడం మొదలుపెట్టింది. అటు ఆత్మకూరు నుంచీ, ఇటు నంద్యాల నుంచీ కర్నూల్లోకి వచ్చే బస్సులు సి-క్యాంప్ మీంచే వెళ్లవలసి ఉన్నందున నన్ను కలుసుకోవాలనుకునే గిరిజనులు నేరుగా మా ఇంటికి వచ్చేసేవారు. వారికి మా ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేకుండానే ఆ ఇల్లే మా ఆఫీస్ చిరునామాగా మారిపోయింది.
 
ఆ ఇంటి ఆవరణలో రెండు మూడు పెద్ద వేపచెట్ల తో పాటు కానుగ చెట్లు ఉండేవి. నేను చేరిన నాలుగైదు వారాల్లోనే వర్షాకాలం మొదలైంది. ఆ వానల్లో ఆ కానుగ చెట్లు నడుస్తూ తడుస్తుంటే వాటిమీద విద్యుద్దీపాల వెలుగుపడి ఒక వింత లోకం ఆవిష్కారమవుతుండేది.
 
ఆ ఇల్లు చాలా పుణ్యం చేసుకుంది. ఎందుకంటే నేను అక్కడ ఉండగా ఎందరో సాహిత్యవేత్తలు ఆ ఇంటిలో అడుగు పెట్టారు. సి.వి.కృష్ణారావు గారు, కల్లూరి భాస్కరం గారు, ఓల్గా గారు, మధురాంతకం మహేంద్ర వంటి వారు మాత్రమే కాక విజయనగరం నుండి నాగార్జున గారు వారి శ్రీమతి సుభద్ర కూడా ఆ ఇంటికి అతిధులుగా వచ్చి వెళ్లారు. కర్నూలు పట్టణంలో మా హీరాలాలు మాస్టారితో సహా ఎందరో కవులు, రచయితలు, పండితులు ఆ ఇంటి ఆవరణలో ఎన్నోసార్లు సాహిత్య చర్చలు చేశారు.
 
ఆ ఇంటిని, ఆ కానుగ చెట్లను, ఈ కవిత నాతోపాటు శాశ్వతంగా నా వెంటబెట్టుకొచ్చేసింది.
 

 

కానుగ చెట్ల గుబుర్లలో

 
కానుగ చెట్ల గుబుర్లలో తడుస్తోన్న వాన
తేమగా పరచుకున్న నీడల్లో
రాలుతున్న పూలు రహస్యమాడుతున్న
గుసగుసలు.
ఏ మృదువైన జ్ఞాపకం బాధపెడుతోంది నిన్నిపుడు?
 
ఎంత రాత్రయినా
నువ్వు నీ ఇంటికి తిరిగివస్తావని
ఈ చెట్లు నీకోసం ఎదురుచూస్తాయి.
వాటిని కావిలించుకోవాలనిపించదా?
అయినా నీ మొద్దునిద్ర నీది.
 
ఏ మహర్లోకానికో దారిచూపే నక్షత్ర దీపాల్ని ఒదిలిపెట్టి
ఆ పెదవుల చీకట్ల దగ్గరే ఆగిపోతావు
ఇంతదాకా వినబడని ప్రేమభాషనేదో వినాలని.
 
లోపలయినా
బయటయినా
నీకు నువ్వే బందీవి
ప్రతి మోహపూరిత సందేశానికీ బానిసవి.
 
నీ పెదాలు ఆ పెదాల్ని అందుకున్న ఆ ఒక్క క్షణం మటుకు
నువ్వు జీవితంలోకి స్పృహ తప్పుతావు
ఇక జీవించినంతకాలం జ్ఞప్తి చేస్తుంటాయి
చెమ్మగిలిన నీ చలితాధరాలు
ఒణుకుతూ
ఇదే మరణం ఇదే జీవితం ఇదే జీవితం ఇదే మరణమని.
 
1990
 

UNDER A CANOPY OF PONGAMIA TREES

 
Under the dark canopy of pongamia trees,
it was raining.
In the rain-soaked shadows
Fallen petals whisper secrets.
What delicate memory is troubling you
at this moment?
 
Even in the thick of night ,
The trees wait for your return
Do you not want to hug them?
But you are dead asleep.
 
Leaving aside the luminous worlds of stars
You still linger around the dusky lips.
You wish to hear a language of love you haven’t heard yet.
 
Whether inside or outside,
You are a prisoner of yourself.
A slave to every message that moves you.
 
It’s only when your lips reach her lips that
you faint into life.
Then those trembling lips
Keep reminding you all life long,
That this is death, this is life, and this is death.
 
10-8-2022

Leave a Reply

%d bloggers like this: