NOOR JEHAN

కొత్తగా కవిత్వం వస్తున్నప్పుడు దాని స్వరూప స్వభావాలు పూర్తిగా బోధపడనప్పుడు దానికేదో ఒక పేరుపెడుతుంటారు. భావకవిత్వం అనే పేరు అలా వచ్చిందే. ఆ పదానికి నిజంగా అర్థం లేదు. ఏదో ఒక భావం లేకుండా కవిత్వం ఎక్కడ ఉంటుంది? అసలు రసోత్పత్తికి భావాలే మూలద్రవ్యాలు అని నాట్యశాస్త్రం కూడా చెప్తూ ఉంది. అయినా ఆ నవ్యకవిత్వాన్ని భావకవిత్వం అనే పిలిచారు.
 
అలాగే ఎనభైల్లో వచ్చిన కొత్త తరహా కవిత్వాన్ని చాలావరకూ అనుభూతి కవిత్వం అని పిలవడం మొదలుపెట్టారు. అనుభూతి లేకుండా కవిత్వం ఎక్కడ ఉంటుంది? ‘ఆకులై ఆకునై, కొమ్మలో కొమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎట్లైన ఇచటనే ఆగిపోనా’ అని కృష్ణశాస్త్రి అంటున్నప్పుడు, ‘నా ఆకాశాలను లోకానికి చేరువగా, నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా’ అని శ్రీ శ్రీ అంటున్నప్పుడు, అది అనుభూతి ప్రకటన కాక మరేమిటి? కాని ఎనభైల్లో వచ్చిన కవిత్వాన్ని ప్రత్యేకంగా అనుభూతి కవిత్వం అని ఎందుకు పిలిచారో అర్థం కాదు.
 
బహుశా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తన కవిత్వానికి ‘అనుభూతి గీతాలు’ అని పేరుపెట్టినందువల్ల ఆ పేరు తోనే ఆ కొత్తతరహాకవిత్వాన్ని కూడా గుర్తుపట్టడం మొదలుపెట్టారనుకోవచ్చు. పందొమ్మిదో శతాబ్దిలో ఇంప్రెషనిస్టులు కొత్త తరహా చిత్రలేఖనాలు గియ్యడం మొదలుపెట్టగానే వాటిని ఏ పేరుతో పిలవాలో తెలియక, మోనె తన చిత్రానికి Impression: Sunrise (1872) అని పేరుపెట్టినందువల్ల ఆ కొత్త తరహా కళా ఉద్యమాన్ని ఇంప్రెషనిజం అని పిలిచినట్టే.
 
ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఎటుంవంటి విస్పష్టమైన రాజకీయ దృక్పథాన్నీ స్థూలంగా ప్రతిబింబించకుండా, కవి తన వ్యక్తిగత అనుభవాన్ని ఆధారం చేసుకుని ప్రకటించిన ఒక సౌందర్యానుభూతి ఆ కవిత్వానికి ప్రాణనాడి అని చెప్పవచ్చు. చుట్టూ సమాజం రాజకీయంగా కల్లోలభరితంగా ఉండగా, కవి రాజకీయాలతో నిమిత్తం లేని తావుల్ని అన్వేషించడంలో అర్థమేమిటి? అంటే కవి రాజకీయాలు మాట్లాడటం లేదుగాని, సూక్ష్మస్థాయిలో ఒక రాజకీయ ప్రకటన చేస్తూనే ఉన్నాడు. అదేమంటే, నువ్వు సిద్ధాంతాల ప్రాతిపదికన జీవితాన్ని చూడమంటున్నావు, కాని నేను నా స్వానుభవం, అది నాలో కలిగిస్తున్న అనుభూతి ఆధారంగా జీవితాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్తున్నాడు. ఈ స్వానుభవ ప్రకటన మీంచే తదనంతర కాలంలో వివిధ సమూహాలు కుల, మత, లింగ, ప్రాంత ప్రాతిపదికలన తమ అస్తిత్వానుభవాల్ని ప్రకటించడానికి దారి సుగమం అయ్యిందని ఈ రోజు నాకు అర్థం అవుతున్నది.
 
‘ఒంటరిచేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ లో కవితలు దాదాపుగా ఈ కోవలోకే వస్తాయి. అటువంటి కవితల్లో నూర్ జహాఁ కూడా ఒకటి.
 
 

నూర్ జహాఁ

 
నేను పిలుస్తానో నువ్వే వస్తావోగాని ఆ క్షణం మన చుట్టూ
వందలు వేలు అడివి పువ్వులు సురభిలిస్తాయి.
నువ్వు నీ పాటల తేరులోంచి స్మృతుల పరదా తప్పించి
కమానుతో ఉప్పెన్లానో, తుపానులానో నిలువెల్లా వూపుతావు.
 
రాత్రి గడిచిపోతూంటుంది.
చల్లని వెన్నెలల పెళ్ళి ఊరేగింపులో
ఆకాశవీథిలో తారకల కారవాఁ నిశ్శబ్దంగా సాగుతుంది.
పల్లకీలో అరమోడ్పుగా చిరునవ్వే నవవధువల్లే జాబిల్లి.
 
పాదాల్ని కుంగదీసే ఎడారి ఇసిక పొరల వలలనుంచి
చూపుల్ని వేటాడే ఎండమావుల ముక్కుతాళ్ళనుంచి
ఈ పిట్టని ఆదరించి ఎగరేస్తావు.
ఏ ఆకుపచ్చని ఒయాసిస్సు నీలి అలలో కదా నీ పాటలు.
 
నీ స్వరం
ఏ అపరిచిత గృహాల్లోంచో నా ఆత్మీయులైన స్త్రీలు పిలిచినట్టుంటుంది
పాలపైని మీగడలా నీ గానంలో పేరుకొనే ఆనందపల్లవం
దిక్కులేని ఆడవాళ్ళకి ఏ జీవనమాధుర్యమో క్రమంగా అందినట్టుంటుంది.
 
నువ్వు తలుపులు తీసి
నీ కురుల్ని సవరించుకుని
నీ పెదాల సరసిలోంచి పాటని మృదువుగా పుష్పించగానే
వెయ్యి లఖ్నవీ సారంగులు తీయని బాధతో దిగులుగా అల్లల్లాడతాయి.
మీర్ కవి చక్రవర్తి ఏ పిరదౌసు పారిజాత వనాల్లోనో స్పృహతప్పుతాడు.
ముల్లాలు, మానవగణ పాలకులు
ఒక తృటి మైమరచి ప్రచారాన్నీ, యుద్ధాన్నీ వదిలేస్తారు.
 
నువ్వు పాటలు పాడుతుంటే
మాఘఫాల్గుణాల మధ్యాహ్నాల్లో
కొండ అంచుల్లోంచి వూగే ఎండుటాకుల ఊయెలల్లో
దిగంతాల దాకా వూగిన నా పసితనం నన్నావరిస్తుంది.
 
అప్పుడు నా దేహం కరిగి, ఒలికి, చిట్లి లోకమంతటా చిందుతుంది.
ప్రతి బాధాదగ్ధ మానవుడి కపోలాలపైని నిలుస్తుంది.
 
నువ్వు శబ్దాన్ని మృదువుగా నీ స్వరపేటికలో మడిచిపెట్టగానే
చెదిరిన అనేక వేల నా ఆత్మశకలాలు ఒకటిగా చేరతాయి.
అప్పుడు లోకంలోని అన్ని బాధలూ నేనే, అన్ని ఆనందాలూ నేనే.
నీవు గోరంత దీపానివి, నూర్ జహాఁ!
నువ్వు కొండంత వెలుగువి, నూర్ జహాఁ!
 
1987
 

NOOR JEHAN

 
When you come invited or uninvited,
Wildflowers bloom all around us.
Playing me like a bow on the violin,
You lift the curtain of memories from
the palanquin of your song
Engulfing me like a storm or a surge.
 
The night moves on like a wedding procession, as
The moon smiles from the palanquin.
The caravan of stars proceeds silently.
 
You release this bird from the snares of mirages and sands.
Your songs float like the blue waves of a green oasis.
 
You beckon me like one of my dearest women
calling from a distant land
Your joy spreads upon those forlorn women like cream on milk.
 
As you open the door, adjust your hair
As a song opens on your lips,
Hundreds of sweet sarangis of Lucknow moan in unison.
In the gardens of paradise, Mir, the poet of poets, faints.
For a moment, priests and soldiers cease to preach and fight.
 
When you sing, I remember those late winter afternoons,
The sound of falling leaves in my mountain village.
 
Then, my heart melts and spills all over the place
Anointing the forehead of every suffering person.
 
As your vocal cords fold back the notes of your song,
My broken heart becomes whole again.
I will then become one with all the joys and pains of this world.
 
You’re a tiny spark, Noor Jehan, and
You’re a world of light.
 
1-8-2022
 
 
 
 
 
 

Leave a Reply

%d bloggers like this: