IN THE LONELY FIELDS, ALONE, OUR MOTHER

కర్నూలు పట్టణం పొలిమేరల్లో అమ్మవారి గుడి ఒకటి ఉంది. ఆమె రేణుకాదేవి. ఎల్లమ్మ. ప్రతి మంగళవారం, ఆదివారం అక్కడ యాత్రీకులు వస్తూంటారు. కొన్నిసార్లు ఎక్కడెక్కడినుంచి బళ్ళు కట్టుకుని వచ్చి పూజలు చేసి, వంటలు వండుకుని, అమ్మవారికి పెట్టి తాము తిని ఆ రోజంతా అక్కడ గడిపి వెళ్తుంటారు. కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడు ఎన్నో వేళల్లో, ఎన్నో ఋతువుల్లో ఆ గుడిని చూస్తూ ఉండేవాణ్ణి. నెమ్మదిగా ప్రతి మంగళవారం నేను కూడా ఆ గుడికి వెళ్ళడం మొదలుపెట్టాను.
 
ఒక్కొక్కప్పుడు శిశిరకాలంలో ఆకులన్నీ రాలిపోయి చుట్టూ ఊషరక్షేత్రంలాగ మారిపోయిన కాలంలో, వసంతకాలం రాగానే వేపచెట్లు విరబూసే కాలంలో, తొలకరి చినుకులు పడగానే చుట్టూ పొలాల్లో దుక్కి దున్నడం, నాట్లు వెయ్యడం, ఆ తర్వాత ఊడ్పుల కాలంలో, పంటలు నిండుగా పండి, పొలాల్లో కోతలు మొదలయ్యే కాలంలో, ఎప్పుడు చూడు, ఆ ఒంటరి చేల మధ్య ఆ అమ్మ ఒక్కత్తీ కనిపించేది. రాత్రుళ్ళు ఒంటరి నెలవంకనో లేదా విరజల్లిన నక్షత్రాలో తోడుగా ఉండేది.
విభాతసంధ్యల్లో ఆ ఊరి చివర పొలాల్లో ఆ గుడి ఒక్కటీ నాతో ఏదో మాటాడుతున్నట్టుగా ఉండేది. ఆ గుడిమీదా, ఆ తల్లిమీదా ఒక కవిత రాయాలని గాని, రాస్తానని గాని అనుకోలేదు. కాని ఒక రోజు ఇదిగో, ఈ కవిత పుట్టిన తరువాత, అప్పటి కవితలన్నీ పుస్తకంగా తెస్తున్నప్పుడు ఈ కవితనే పుస్తకానికి శీర్షికగా పెట్టాలనిపించింది. చాలా పెద్ద పేరు. కాని ఏం చెయ్యను? నిర్వికల్ప సంగీతం కవితలానే ఇది కూడా నేను రాయాలని రాసిన కవిత కాదు, రాయకుండా ఉండలేకపోయిన కవిత.
 
రామారావు, ఈ కవిత ని తెలుగులో రాయడమే కష్టం. ఇక ఇంగ్లిషులో ఎలా అనువదించాలో నాకు అర్థం కాలేదు. నువ్వే సరిచూడాలి దీన్ని.
 
 

ఒంటరి చేలమధ్య ఒక్కత్తే మన అమ్మ

 
నాగళ్ళు చాళ్ళు తీసినప్పుడు
గింజలు చల్లినప్పుడు
నాట్లు నాటినప్పుడు
కంకుల్లో పాలు పొంగినప్పుడు
ఆశగా, అవలంబనగా మన అమ్మ.
 
పైర్లు నిండుగా ఒంగినప్పుడు
పాటలప్పుడు, పంటల కోతలప్పుడు
పంటచేటల్తో తూర్పు కెత్తినప్పుడు
తృప్తిగా అన్నం ముద్ద కలిపినప్పుడు
దయగా, ధైర్యంగా మన అమ్మ.
 
కలలు కన్నప్పుడు
కనీళ్ళు పొంగినప్పుడు
పొద్దు పొడిచినప్పుడు
పొద్దు కుంగినప్పుడు
ఒక్కరీతినే కన్న తల్లి మన అమ్మ.
 
ఒంటరిచేల మధ్య
ఒక్కత్తే మన అమ్మ.
 
(కర్నూలు పట్టణం సరిహద్దుల్లో వెలిసిన
చల్లనితల్లి ఎల్లమ్మను స్మరిస్తూ)
 
1991
 

IN THE LONELY FIELDS, ALONE, OUR MOTHER

 
When the ploughs turn the earth
When the seeds are sown,
When we begin transplantations,
During the grain stalks ripen,
All the while, all through,
We have our mother,
Our only hope and support.
 
While the crops are in bloom,
While we sing songs during the paddy harvest,
While we winnow grain against the slating light,
While we take our first bites of food,
All the while, all through
We have our mother,
Our only source of courage and kindness.
 
Through the dreams and tears,
Through the dawns and dusks,
All the while, all through
We have our mother
Equable, equally amiable.
 
In the lonely fields, alone, our mother.
 
20-8-2022

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading