THE POEM I WRITE TODAY

Painting: Amrit Sher-Gil
1980 తర్వాత తెలుగు కవిత్వంలో ఏదో పెద్ద మార్పు వస్తోందనీ, తాము అంతకు ముందు చూసి ఉండని కొత్త కవిత్వం యువతీయువకులు రాస్తున్నారనీ భమిడిపాటి జగన్నాథ రావుగారు పదేపదే అంటూ ఉండేవారు. ఆ మార్పు కేవలం తెలుగు కవిత్వానికో, లేదా అసలు సాహిత్యానికో మాత్రమే పరిమితం కాదనీ, అది ప్రపంచవ్యాప్తంగా ఆలోచనావిధానంలో వచ్చిన మార్పు అనీ 90 ల చివరికిగానీ స్పష్టత రాలేదు. కానీ తెలుగు కవిత్వానికి సంబంధించినంతవరకూ ఈ మార్పుకి అజంతా ‘కంప్యూటర్ చిత్రాలు’ (1980) నాందిపలికింది. రేవతీదేవి ‘శిలాలోలిత’ (1981) పూర్తిగా తలుపులు తెరిచింది. ఒక విధంగా చెప్పాలంటే, ఎనభైల్లో గొంతువిప్పిన కవులు దాదాపుగా రేవతీదేవి సంతానమే.
 
తెలుగు కవిత్వంలో ఆ మార్పుకి పట్టం కట్టినవాళ్ళల్లో మొదట త్రిపురనేని శ్రీనివాస్ నీ, ఆ తర్వాత చేరానీ పేర్కొనాలి. అప్పట్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ‘ఈ వారం కవిత’ అని ఒక శీర్షిక మొదలయ్యింది. దాని ద్వారా ఎందరో కవులు తెలుగు నేలకి కొత్తగా పరిచయమయ్యారు. 70 ల్లో ఆంధ్రజ్యోతిలో ‘కొత్తకలాలు’ అనే శీర్షిక ఉండేది. ఆ దారిలోనే ‘ఈ వారం కవిత’ కూడా ఎందరో కొత్త యువతీయువకుల్ని తెలుగు పాఠకులకి పరిచయం చేసింది. నేను పార్వతీపురంలో ఉండగా త్రిపురనేని నాకు ఉత్తరాలు రాసేడు. నా కవితలు కూడా ఆ శీర్షిక కింద ప్రచురించడానికి పంపమని అడిగాడు. అంతకు ముందు ఎప్పుడో సుబ్రహ్మణ్య శర్మగారు నా కవితల్ని చిన్న పరిచయంతో ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. కాని అది బాలకవి తరహా పరిచయం. చెప్పుకోదగ్గ నా మొదటి కవిత పత్రికల్లో వచ్చింది ‘ఇప్పుడు రాస్తున్న కవిత ‘ నే. ఆ కవితకు గొప్ప ప్రతిస్పందన లభించింది.
 
అప్పటికే ‘నిర్వికల్ప సంగీతం’ సాహిత్యసమాజంలో నాకొక విజిటింగ్ కార్డుగా మారిపోయి ఉంది. కాని ఆ పుస్తకం వల్ల నాకు పెద్దవాళ్ళ పరిచయం లభించింది. ఈ కవిత వల్ల నా ఈడువాళ్ళు మిత్రులుగా మారేరు. ఉదాహరణకి, అఫ్సర్. ఈ కవిత వచ్చిన తరువాత, నేను ఒక సాయంకాలం అఫ్సర్ ను విజయవాడలో కలుసుకోవడం, ఆ రాత్రంతా మేము విజయవాడ వీథుల్లో ఏదో మాట్లాడుకుంటూ తిరగడం నాకింకా గుర్తుంది.
 
టాగోర్ The Gardener లో ఓ కవిత ఉంది, చివరి కవిత.
 
~
నూరు సంవత్సరాల అనంతరం నా గీతాలు చదివే నువ్వు ఎవరు? చదువరీ?
 
ఈ వసంతోత్సవ ఐశ్వర్యం నించి ఒక్క పువ్వుని కూడా నేను నీకు పంపలేను. అల్లంతదూరాన కనబడే మబ్బులనుంచి ఒక్క బంగారు చారనైనా పంపలేను.
 
తలుపులు తెరిచి చుట్టూ చూడు.
 
పుష్పించే నీ తోటనించి నూరేళ్ళకి పూర్వం మాయమైన పువ్వులు పరిమళించిన స్మృతుల్ని పోగుచేసుకో.
 
నూరేళ్ళలోంచి తన హర్షమయ కంఠస్వరాన్ని పంపుతూ ఓ ఆమని హృదయాన పాడిన ఆనందాన్ని మీ హృదయానందంతో కలిపి అనుభవించు. (చలం, వనమాలి, 85)
 
~
 
తన కవితను రేపు చదవబోయే పాఠకుణ్ణి ఉద్దేశించి టాగోర్ రాసిన కవిత స్ఫూర్తిగా నేను కూడా నా పాఠకుణ్ణి ఉద్దేశించి ఒక కవితరాయాలనుకున్నాను. కాని ఇది కొత్త డిక్షన్. టాగోర్ కి అనుకరణా కాదు, అనుసృజనా కాదు. నాదైన దర్శనం, నా సొంత గొంతు. నా కవిత్వంలో ఇంగ్లిషులోకి అనువాదానికి నోచుకున్న మొదటి కవిత కూడా ఇదే. దీనికి కనీసం మూడు అనువాదాలు వచ్చాయని నాకు గుర్తు.
 
 

ఇప్పుడు రాస్తున్న కవిత

 
నేను ఇప్పుడు రాస్తున్న కవిత
ఒకనాడు నీ కిటికీ పక్కగా ప్రవహిస్తూ ఒచ్చి ఆగుతుంది.
 
నువ్వు దాని పక్కగా కుర్చీ జరుపుకుని కూచుంటావు.
 
నీకేమీకాని నా వ్యక్తిత్వ ఛాయ
నాచులాగా పరుచుకుంటుంది.
ఏదో మిలమిలమని అంచుల్లో మెరుస్తుంది.
 
నువ్వు దయతోనో అర్థంకాని ఆసక్తితోనో
దుస్తుల్ని విప్పకుండానే ఆ నీళ్ళలోకి దిగుతావు.
మెత్తని నీ పాదాల్ని ఒక వెర్రిచేపపిల్ల చుట్టుకుంటుంది.
 
‘అబ్బ ఎంత దుర్గంధం’ అంటూనే
ముందుకి వంగుతావు,
నీ కాళ్ళని ఒణికిస్తున్న ఆ సజీవస్పర్శని నీ చేతుల్తో అందుకోవాలని.
 
తడిసిన నీ వేళ్ళ చుట్టూ, మోచేతుల చుట్టూ
మిలమిలలు అల్లుకుంటాయి.
నీకు తెలీకుండానే నువ్వు లోతుల్లోకి జారిపోతావు.
 
చేపపిల్ల తప్పుకుపోతుంది.
నువ్వు కూడదీసుకుని లేచేటప్పటికి
నీ ఒళ్ళంతా నా అక్షరాల వాసనా, నాచూనూ.
 
1987
 

THE POEM I WRITE TODAY

 
One day, this poem will flow to your window.
As you pull your chair near, you would
See my moist words as strange and slushy.
 
Yet, deep down, something sparkles brightly.
You step in with a trembling heart and
A tiny fish tickles your feet.
 
‘What a stench,’ you would mutter.
Bending down, you would feel it with your hands.
In the shimmering waters,
You get wet first through your fingers,
Then up to your sleeve.
 
Unaware, you sink into unknown depths.
The young fish slips fast, and when you rise,
Your body reeks of my poetry.
 
20-7-2022

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading