
సుప్రసిద్ధ ఫ్రెంచి ఇంప్రెషనిస్టు చిత్రకారుడు ఎడ్వర్డ్ డేగాతో ఒకసారి ఒకాయన ‘ఎలాగైతేనేం నేను నా శైలిని కనుక్కోగలిగాను’ అన్నాడట. డేగా అతని వంక చూసి ‘అలాగా! నాకైతే నా శైలి ఏమిటో నాకింకా తెలియలేదు. అదీకాక, నా శైలి ఏమిటో నాకు తెలిసిపోతే చచ్చేంత విసుగ్గా ఉంటుంది’ అన్నాడట.
ఒక కవికి తన శైలి తెలిసిపోతే, ఇంక ఆ కవి రాస్తాడో మనకు ముందే తెలిసిపోతుంది. Predictablity అన్ని కావ్యదోషాల్నీ మించిన దోషం. నిజమైన కవి జీవితాంతం ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. తన శైలితో, తన ఛందస్సుతో, తన భాషతో, తన లయతో- ఎందుకంటే, కవిత్వం అన్నిటికన్నా ముందు నవత్వం. ‘దినములు పరస్పర ప్రతిధ్వనులుగా’ గడిచే ఈ ప్రపంచంలో కవులు పుట్టేదే,
ఎప్పటికప్పుడు, కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉండటానికి. అందుకని, కవిత ఒకసారి శబ్దానుకరణ, ఒకసారి రూపకాలంకారం, ఒకసారి వట్టి వర్ణన, ఒకసారి ఇవన్నీ కలిసిన స్వప్నలిపి.
ఈ ‘ఊడ్పులు’ కవితలో నేను ప్రయత్నించింది, ప్రతి ఏటా చూస్తున్న దృశ్యమే అయిన
ప్పటికీ, ఆ దృశ్యాన్ని ఎంత కొత్తగా చూడగలనా, చూసిన దాన్ని ఎంత కొత్తగా చిత్రించగలనా అన్నది. తక్కిన ఆలోచనల్నీ, బుద్ధి ప్రభావాన్నీ పక్కన పెట్టి కళ్ళతో చూసింది చూసినట్టు వర్ణించగలనా అనుకున్నాను. అందుకనేమందేశ్వరరావుగారు ఈ కవిత ని descriptive poetry at its best అన్నప్పుడు నాకు సంతోషమనిపించింది.
ఊడ్పులు
దూరదిగంత వీథుల్లోంచి, కొండల ఎగుడు దిగుళ్ళమీంచి
తొలిస్తన్యధారల్ని కురిపిస్తూ మేఘధేనువులు కదలివస్తున్నాయి.
పసికాళ్ళతో, చేతుల్తో, కళ్ళతో లేగదూడలు ఎగిసిపడుతున్నాయి.
అగ్నివాయువులు వీచిన మహాగ్రీష్మాలు ఆ ఎండలేవి?
నింగి ఆ కొసనుండి ఈ కొసదాకా నీలిమేల్ముసుగుతో
నిలిచి చూస్తున్న ఈ కన్య ఎవరు?
వంగి బారులు తీరి తదేకదీక్షతో ఈ స్త్రీలు
తమ చేతుల్తో రచిస్తున్నదేమిటి?
ముద్దలుగా కరుగుతున్న మట్టిలో మంత్రాక్షర పంక్తులు.
కురిపించు నీ కండల స్వేదాన్ని
అమృత జలధారల్లో వివశత్వంతో కరిగిపోతున్న విరాట్ శరీరాన్ని.
చాళ్ళు తీసినవి నాగలి కొర్రులు
గునపాలు, పారలు, మట్టి తట్టలు, వందలు వేలు చేతులు
వేళ్ళ సందుల్లోంచి చల్లిన బంగారు విత్తనాలు.
ఈ భూమి ఎవరిది? ఈ గింజల్ని విత్తి పండిస్తున్నది ఎవరికోసం?
ఇప్పుడు దస్తావేజులు లేవు, భూమి హక్కులు లేవు, రెవెన్యూ కోర్టులు లేవు
ఉన్నవి సన్నగా వణికించే చిరుజల్లులు, హాయిగా తూగాడే గడ్డిపోచలు.
ఈ లేతకంకుల్లో పాలుపొంగినప్పుడు కదా
ట్రాక్టర్లు, మార్కెట్ యార్డులు, గిడ్డంగులు గుర్తుకొచ్చేది.
ఇప్పుడే ప్రశ్నలూ లేవు, భయాలు లేవు, బాధలు లేవు
ఈ రోజంతా ఆనందమధురమైన శ్రమ, రాత్రికి విశ్రాంతి.
శ్రమిస్తున్న స్త్రీల పాదాల చుట్టూ వెన్నలాంటి మట్టి.
మెత్తగా బురదలో దిగబడుతున్న ఆ అడుగుల్లో అడుగుల్ని కలుపు.
నేల నిన్ను నీటివలతో బంధిస్తుంది.
ఐక్యం కోసం, ప్రేమ కోసం, ఆదరణ కోసం ఎవరి చేతులూ ఖాళీగా ఉండవు.
అందరితో పాటు ఆశల్ని నాటు,
కష్టిస్తున్న చేతులకు తోడుగా నీ చెయ్యి వెయ్యి.
ప్రేమ జలజలమని కురుస్తుంది, ఆదరణ గలగల ప్రవహిస్తుంది.
మట్టి మధురాతిమధుర ఫలంగా వికసించి మనుషుల్ని ఒక్కటి చేస్తుంది.
1988
PLANTING PADDY
Across the mountain slopes, like cows with udders taut with milk,
Clouds are advancing on the distant horizon.
Calves frolic, their tiny feet and hooves revealing a tender look.
What happened to those bright days of fiery gales?
Who is this maiden behind a blue veil gazing at us?
What are the women carving so attentively in a row?
A magical script on a mud tablet.
Muscles are sweating.
Across the vast landmass, ploughs carved furrows.
As the nectar rains down from heaven.
Crowbars, spades, trays in thousands.
Transplanting seedlings of gold going on.
Who owns this land? Whose seedlings are they? For whose harvest?
For a moment, forget all the claims and contests.
It’s just a quivering shower and swaying grass right now.
Only when the stalks of paddy
Bend under their own weight do we think about
Threshers and tractors; stores and sales.
As of now, there are no worries and fears to upset us.
An exhausting day calls for a restful night.
As the women toil, the mud covers their feet like butter.
Join their company and follow their steps.
Mud and water ensnare you.
To express love and affection, no hands are free.
Transplant your hopes with hands that work.
Then love pours, and affection flows.
Everyone comes together as the land ripens.
28-7-2022