IN DANDAKARANYA FOR TWO WEEKS

పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షల్లో సెలక్టయ్యాక నాకు జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా ఉద్యోగం వచ్చింది. విజయనగరంజిల్లా అలాట్ చేసారు. ఆ జిల్లాలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పార్వతీపురంలో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి రిపోర్టు చేసాను. నేను పార్వతీపురం చూడటం అదే మొదటిసారి. నేను వెళ్ళీ వెళ్ళగానే ఒక ఆశ్రమపాఠశాలలో రెండువారాలు ట్రయినింగు కోసం గుమ్మలక్ష్మీపురం అడవుల్లో, ఒక మారుమూల కొండమీది గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. తక్కిన ప్రపంచంతో సంబంధం లేని ఆ కొండమీద పల్లెలో రెండువారాలు గడిపాను.
 
అక్కడికివెళ్ళాక అది దండకారణ్యం అని అర్థమయింది. ఆ ఊళ్ళో ఉన్న గిరిజనులు కోదుతెగకి చెందినవారు. అప్పటికే గోపీనాథ మొహంతి రాసిన ‘అమృత సంతానం’ చదివి ఉన్నాను కాబట్టి ఆ ఊరినీ, ఆ మనుషుల్నీ, వారి మానసిక ప్రపంచాన్నీ సులువుగా పోల్చుకోగలిగేను. కాని నా గురించే నాకు ఏమీ అర్థం కాలేదు. ఆ కొండమీద పాఠశాల పూరిపాకలో రాత్రుళ్ళు పడుకునేటప్పుడు, ఆ రాత్రంతా పుష్కలావర్తాలు ఆ కొండలమీదా, అడవులమీద కుంభవృష్టి కురిపిస్తోంటే నా ఆలోచనలు ఒకపట్టాన తెగేవి కావు.
 
అడవిలో పుట్టినవాణ్ణి, మళ్ళీ అడవికి చేరుకున్నాను. కాని మా ఊళ్ళో అడవికీ, ఆ అడవికీ పోలికనే లేదు. అది మహారణ్యం. ఆ అడవిలో ఆ ప్రజల్ని చూస్తూ ఉంటే నాలో ఒక కన్ ఫ్యూసియన్ మేల్కోవడం మొదలుపెట్టాడు. వారికోసం ఏదన్నా చెయ్యాలనే ఒక తలపు రూపుదిద్దుకునేది. కాని మరొకవేపు నాలోని కవి ఒక డావోయిస్టుగా ఇదంతా ఏమిటి, నాకీ కొండల్లో ఈ ఉద్యోగం అవసరమా, నేనేమి కోరుకున్నాను, ఏదన్నా చదువుకుంటూ, కవిత్వం రాసుకుంటూ గడపాలని కదా, ఇదంతా ఏమిటి అనిపించేది. ఆ రోజు మొదలవుతున్న ఉద్యోగ జీవితం ఎంతకాలం నడుస్తుందో, నేను కోరుకుంటున్న జీవితానికి దూరంగా జరుగుతున్నానో, దగ్గరగా జరుగుతున్నానో నాకు తెలియలేదు.
 
అప్పటికి మా కుటుంబ పరిస్థితులవల్ల నాకు టెలిఫోన్స్ ఉద్యోగం కన్నా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం అవసరమయినందువల్ల మాత్రమే ఆ ఉద్యోగంలో చేరాననీ, డబ్బు అవసరం లేకపోయుంటే గోదావరి ఒడ్డునే తిరుగుతూ, గౌతమీ గ్రంథాలయంలో చదువుకుంటూ గడిపేవాణ్ణి కదా అన్న ఆలోచన కలుగుతుండేది.
 
మా తాతగారు మొదటిసారి రాజవొమ్మంగి వచ్చినప్పుడు, వందేళ్ళ కిందట, ఆ అడవిలో పనిచేయడం కష్టమనుకుని వెనక్కి వెళ్ళిపోయేరు. కాని మా నాన్నగారు తప్పని సరి పరిస్థితుల్లో మళ్ళా రాజవొమ్మంగి రాక తప్పలేదు. ఆయన చివరిదాకా అక్కడే గడిపారు. ఆ ఊరినీ, ఆ నేలనీ, ఆ గాలినీ గాఢంగా ప్రేమించేరు. కాని అడవి అందాన్ని చూసే అవకాశం ఆయనకు జీవితం ఇవ్వలేదు.
 
అక్కడ బతికినంతకాలం పోరాటం చేస్తోనే గడిపారు. రాముడు కూడా అడవికి ప్రవాసిగానే వెళ్ళాడుగాని పోరాటం వెనక పోరాటంలో కూరుకుపోతూనే వచ్చాడు. నా తండ్రి జీవించింది రాముడిలానే గాని, ఆయనకి రాముడంటే ఇష్టముండేదికాదు, కృష్ణుడంటే ఇష్టపడేవారు. ఎందుకో, ఆ రెండు వారాల్లో నాకు అక్కడ అర్థమయింది.
 
 

దండకారణ్యంలో రెండు వారాలు

 
అంధకాముకుని రాక్షస కాయం పైని
ఎవరో దయగా వర్షించిన అశ్రువులై నక్షత్రాలు.
ఈ అందమైన ఆకుపచ్చనితనం లోతుల్లో
శమించని కాంక్షలు, పూలల్లో క్రూరమైన మధువులు.
 
ఆయన ఇక్కడ కాంచనమృగం వెంటపడ్డాడు.
రాక్షసమైన ప్రతిదాన్నీ సంహరించాలని అశపడ్డాడు.
 
నేనూ రాక్షసమైన దాన్నల్లా ద్వేషించాను.
కాని ఆ ద్వేషం ఎంత రాక్షసం.
కాంచనమృగమే నన్ను వేటాడుతోంది.
 
వృక్షాలు, పరిమళాలు, నక్షత్రాలు, ఆకాశం
కనిపిస్తున్నది ప్రతీదీ నన్ను వేధిస్తోంది, వినిపిస్తున్నది నన్ను వేధిస్తోంది.
 
నానుంచి విడుదల కావాలనుకుంటే
నన్ను కోల్పోడమే మిగిలింది.
 
పధ్నాలుగు దినాల ఏళ్ళ మన్వంతరాల ప్రవాసంలోంచి
నన్ను నేను చేరాలనుకుంటున్నాను.
ఏది యుద్ధం? ఏవి ధనుర్బాణాలు, ఏరి ఖరదూషణులు? రావణులు?
 
దిగువ లోయల్లో గొల్లపిల్లవాడు పిల్లంగోవి వూదుతాడు.
తిరిగిరాని మార్గమేదో చూపి పంపుతాడు.
 
ఈ ప్రవాసం సాగకుండా, జీవనజలధికి సేతువు కట్టకుండా
సంగ్రామం, అగ్నిపరీక్ష లేకుండా
నేను కోల్పోయింది నేను పొందితే ఎంత బాగుణ్ణు.
 
1987
 

IN DANDAKARANYA FOR TWO WEEKS

 
Like tears shed on the body of a blind beast,
The stars shine down over the forest.
Deep in the beautiful greenery of savage desires,
Bitter honey abounds in flowers.
 
Once, he chased the golden deer here,
Hunting after everything demonic.
 
I, too, hated all things demonic, and
The hatred itself is demonic.
It’s the golden deer that’s after me.
 
The trees, the scents, the stars, and the sky
Everything I see and hear haunts me.
 
I lost myself instead of liberating myself.
 
After an exile of fourteen days, years, or ages,
I hope to find myself.
Where are my bows and arrows for the battle?
The fourteen thousand demons that ravage the forest?
 
In the valley, the cowherd boy plays the flute
Making the way through a path that doesn’t look back.
 
I wish I could regain what I lost
Without the exile, the bridge across the sea,
The fight and the ordeal by the fire.
 
17-7-2022

Leave a Reply

%d bloggers like this: