FOR MY FRIEND, THREE POEMS

మనిషి తాను పనిచేసిన ప్రతిచోటా తన ఆత్మని కొంత వదిలిపెట్టి వెళతాడు అన్నాడు జిబ్రాన్. నేనేమంటానంటే, కొందరు మనుషులుంటారు, కొన్ని స్నేహాలుంటాయి.వాళ్ళ ఆ తర్వాత మన జీవితంలో దూరంగా జరగవచ్చు లేదా అదృశ్యమైపోవచ్చు, కానీ వాళ్ళూ మనమూ కలిసి జీవించిన తర్వాత వాళ్ళు తమ ఆత్మని కొంత మనదగ్గర వదిలిపెడతారు. వాళ్ళ ఉచ్ఛ్వాసనిశ్వాసాలు మన రక్తంలో భాగమైపోతాయి. మనం వాళ్ళని కలిసిన తర్వాత అంతకు ముందు లాగా ఎంత మాత్రం ఉండలేం. మన ఆలోచనల్లోనూ, జీవితాన్ని మన సమీపించే పద్ధతిలోనూ, మన అనుభవాన్ని అనుభూతిగా స్వీకరించే క్రమంలోనూ వాళ్ళ ముద్ర మన జీవితంలో మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది.
 
నా జీవితానికి సంబంధించినంతవరకూ కవులూరి గోపీచంద్ అటువంటి వాడు.
గోపీచంద్ నాకన్నా బహుశా ఏడెనిమిదేళ్ళు పెద్ద. నేను రాజమండ్రి వెళ్లిన తొలిరోజుల్లో సాహితీవేదిక మిత్రబృందంలో ఆయన కూడా పరిచయమయ్యాడు. 1982 లో డిసెంబరులో వేదిక మిత్రులు ఒక కథాసంకలనం వెలువరించారు. ఆ ప్రింటింగు పనుల్లో మేమంతా కలుసుకునేటప్పుడు, ఒక సాయంకాలం నన్నొక కవిత వినిపించని అడిగాడు. నేను వినిపించినంత సేపు కళ్ళుమూసుకుని శ్రద్ధగా విన్నాడు. నేను రాసిన ఒక కవిత వినిపించమని అడిగి, అంత శ్రద్ధగా విన్నవారెవరూ అప్పటిదాకా నాకు కనిపించలేదు. ఆ రాత్రే అతడు నా హృదయాన్ని జయించాడు.
 
ఆ తర్వాత సాహితీవేదిక కి అతడు కార్యదర్శిగానూ, నేను సమావేశకర్తగానూ పనిచేసాం. అతడు పెళ్ళయి తన నివాసం పేపరుమిల్లు క్వార్టర్సు దగ్గరికి మార్చాక, అప్పటిదాకా అతడుంటూ వచ్చిన రూము నేను అద్దెకి తీసుకున్నాను. ఆ ఇంటి ఓనరు గోపీచంద్ కి బంధువు. ఆ కుటుంబాన్ని కలవడం కోసం అప్పుడూ అప్పుడూ ఆ ఇంటికి వస్తూ నా రూముకి కూడా వచ్చి కూచునేవాడు. ఆ తర్వాత ప్రతిరోజూ కలుసుకోవడం మొదలుపెట్టేడు. అతడు రాజమండ్రి పేపరుమిల్లులో సీనియర్ కెమిస్టుగా పనిచేసేవాడు. సాయంకాలం నాలుగింటికి మిల్లు నుంచి బయటకి రాగానే ఇంటికి వెళ్ళి ఆరింటికల్లా నా దగ్గరికి వచ్చేసేవాడు. మేమిద్దరం మా సైకిళ్ళు వేసుకుని సమాచారానికో, సుదర్శనంగారిదగ్గరికో, శరభయ్యగారిదగ్గరికో, గౌతమీ గ్రంథాలయానికో ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోయే వాళ్లం. పదింటికో, పదకొండింటికో మళ్ళా ఇంటిబాట పట్టేవాళ్ళం. అట్లా మేమిద్దరం ‘ఆ ఊరిని ఉద్యానం చెయ్యాలని చూసాం’.
 
గోపీచంద్ తండ్రి కవులూరి వెంకటేశ్వరరావుగారు కమ్యూనిస్టు. అందువల్ల గోపీచంద్ అప్పటికే మార్క్స్ నీ, ఎంగెల్స్ నీ,లెనిన్ నీ, గోర్కీనీ చదివిఉన్నాడు. పూర్తి నిరీశ్వరవాది. కొద్దిగా ఎం.ఎన్.రాయి ప్రస్తావన కూడా చేస్తూ ఉండేవాడు.రాజమండ్రిలో సుదర్శనంగారి ప్రభావం వల్ల అస్తిత్వవాద సాహిత్యం చదవడం మొదలుపెట్టాడు. సాహితీవేదిక సమావేశాల్లో, సమాలోచనలో ఎంతో నిశితంగా చర్చల్లో పాల్గొనే వాడు. అతడి మాటల్లో, ప్రవర్తనలో, అసలు ఆలోచించే విధానంలోనే, ఒక మర్యాద, ఒక డిగ్నిటీ కనిపిస్తుండేవి. అందుకని సాహితీవేదిక మిత్రబృందం అతడిపట్ల గొప్ప గౌరవం చూపిస్తూ ఉండేవారు.
 
అట్లాంటి రోజుల్లో, బహుశా 1985 లో అనుకుంటాను అతడికి కాఫ్కా రాసిన తీర్పు అనే కథ ఇచ్చాను చదవమని. పాలగుమ్మి పద్మరాజు, కొడవటిగంటి కుటుంబరావు అనువాదం చేసిన జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం పుస్తకంలో ఉన్న కథ. ఆ కథ అతడి జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత అతడి దగ్గర, The Castle, Amerika , The Trial, Metamorphosis and other stories, Letters to Felice ఇలా ఒక్కొక్క పుస్తకమే కనబడటం మొదలయ్యింది.
 
ఇంతలో నేను రాజమండ్రి వదిలిపెట్టేసాను. నా ట్రయినింగు కోసం పార్వతీపురం వెళ్ళిపోయాను. అక్కడ ఉండగా, గోపీచంద్ కి రాయగడ లో ఉన్న జె.కె.పేపర్ మిల్లులో ఉద్యోగం వచ్చింది. అతడు తన కుటుంబంతో పాటు రాయగడ వచ్చేసాడు. పార్వతీపురం నుంచి రాయగడ గంటన్నర ప్రయాణం. మళ్ళా మేం కలుసుకోవడం మొదలయ్యింది. నేను రాయగడ వెళ్ళిన మొదటిసారే అతడు ‘నీకో చోటు చూపించాలి, రా ‘ అని ఊరు బయట ఒక గుడికి తీసుకువెళ్ళాడు. అది రాయగడలో సుప్రసిద్ధమైన మజ్జిగౌరమ్మ దేవళం. అక్కడ ఆ అమ్మవారు ఛిన్నమస్తగా దర్శనమిచ్చింది. అతడు నాతో పాటు గుడిలో అడుగుపెట్టాడు. నమస్కరించలేదు, మౌనంగా నిల్చొన్నాడు. బయటికి వచ్చాక ‘నీకో సంగతి చెప్పనా, నాకు రాయగడ వచ్చేదాకా ఇక్కడ ఈ గుడి ఉందని తెలియదు. కాని నేను రాజమండ్రినుంచి వచ్చేటప్పుడు ఆ చివరిరోజుల్లో, ఈమె చాలా సార్లు నాకు కలలోకి వచ్చింది. ఇలానే, అచ్చం, ఇదే రూపంలో ‘ అన్నాడు. ఆ దేవాలయం, అక్కడి రావిచెట్టూ, ఆ సంధ్యవేళ, అతడి మాటలు- ఇవి నా మనసులోంచి చెరగడం కష్టం.
 
నేను పార్వతీపురం నుంచి కర్నూలు వెళ్ళిపోయేను. ఆ తర్వాత మరోచోటకి, మరోచోటకి. గోపీచంద్ తో ఉత్తరప్రత్యుత్తరాలు తెగిపోయేయి. మొబైల్ ఫోన్ల కాలం కాదు, ఈ-మెయిళ్ళు లేని రోజులు. అటువంటిది, ఒకరోజు హటాత్తుగా రాజమండ్రినుంచి ఎవరో నాకు ఫోన్ చేసారు, బహుశా సుబ్రహ్మణ్యం కావచ్చు, ‘గోపీచంద్ నీ దగ్గరికి వచ్చాడా?’. ‘లేదే ‘ అన్నాను. ‘అయినా నా దగ్గరికి రావడం ఏమిటి?’ అనడిగాను.
 
ఒకరోజు రైల్లో తనూ, తన భార్య ఉష, తన కొడుకు రాహుల్ తో ప్రయాణిస్తున్నవాడు, బహుశా విజయవాడలో కావొచ్చు, ఇప్పుడే వస్తాను, అని రైలు దిగివెళ్ళిపోయాడనీ, అప్పణ్ణుంచీ కనబడటం లేదనీ చెప్పారు. అతడేమయ్యాడో ఇప్పటికీ తెలీదు.
 
నాకేమి చెయ్యాలో తెలీలేదు. ఇప్పటికీ తెలీదు. నేను చెయ్యగలిగిందల్లా నా ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ పుస్తకం అతడికి అంకితమివ్వడమే.
 
 

గోపీచంద్రుడికి మూడు పద్యాలు

 
1
 
ఎన్ని రాత్రులో నా గదిలో ఇద్దరం
ఇష్టంతో, కష్టంతో
ఒక వర్ణచిత్రాన్ని రచిస్తూ వచ్చేం.
అతనావేపునుంచీ నేనీవేపునుంచీ దారాలు అల్లుకొచ్చేం
 
ఇప్పుడా ముఖచిత్రంలో కనిపించింది
అతనికి అతని పోలికలూ, నాకు నా పోలికలూ.
 
ఇందులో వింతేముంది?
దాన్నట్లా లోకం ముందు పెడితే
ప్రతి ఒక్క మనిషికీ అందులో తన అసలు ముఖం తగులుతుంది.
 
2
 
ఈ వూళ్ళో ఉన్నన్నాళ్ళూ ప్రతి సంధ్యా
నేనతన్ని తల్లికోసం పిల్లవాడిలా ప్రతీక్షించేను
 
అతను రాగానే
నన్ను ఖండఖండాలుగా తరుక్కుని అతనిముందు పోగుపడేవాణ్ణి.
 
అప్పుడాతను తన కళ్ళనుంచీ, వాక్కునుంచీ స్రవించే అంజనమేదో
నా ఖండితాంగాలకు పూసి తాను నడిచే దారిపొడుగునా నాటేవాడు.
నా ఆత్మలో మోగే రంపపు చప్పుళ్ళు విని ‘ఇక, పుష్పించు’ అనేవాడు.
 
అట్లా మేమిద్దరం
ఈ వూర్ని వుద్యానం చేయాలని చూసేం.
 
3
 
ఇద్దరం చూడాలనుకున్న రాజఘాట్
తను ఒక్కడే చూసాడు.
 
అక్కడొక వృద్ధుడు రాట్నం పైని ఒడికిన నూలుపోగుని
నాకు కాన్కగా తెచ్చాడు.
 
అతనేం చేసినా ఇలాగే ఉంటుంది.
అతనేమీ చెయ్యకపోయినా ఇలాగే ఉంటుంది.
 
1987

 

FOR MY FRIEND, THREE POEMS

 
Together, we have been painting
In my room for several nights now.
He started from one side and I from the other.
 
Drawing contours, joining colours,
The finished painting showed a portrait
In which he could see his and I could see mine.
 
If we put this in front of the world, no wonder,
Everyone would see their face in it.
 
2
 
In this town, I waited for him every evening
The way a child waits for his mother.
 
As soon as he arrived,
I would rip myself apart and throw the pieces at his feet.
He would then anoint the pieces
With an ointment that oozes from his looks and
Plant them along the path.
As the buzzing saw bled my heart.
He would say, “Come on, start blooming!”
 
This is how we tried to turn this town into a garden.
 
3
 
We both wanted to see Rajghat together,
But only he could make it.
 
As a gift, he brought a piece of yarn
Spun on a charkha.
 
This is how he does things.
This is how he doesn’t do things.
 
15-7-2022

Leave a Reply

%d bloggers like this: