BELOVED CITY, FAREWELL

ఏ కవికైనా మొదటి కవితాసంపుటి జన్మ అనుకుంటే, రెండవ కవితాసంపుటిని పునర్జన్మ అనాలి. ఎందుకంటే చాలామంది కవులు మొదటి కవితాసంపుటి దగ్గరే ఆగిపోతారు. రెండవ కవితాసంపుటి దాకా ప్రయాణించరు. ఒకవేళ వేసినా అది వెంటనే వెయ్యడం కూడా అరుదు.
 
నేను నిర్వికల్ప సంగీతం 1986 లో వెలువరించిన తర్వాత, ఒక దీర్ఘ కవిత రాయాలి అనుకున్నాను. ఈ లోగా ఆ మరుసటి ఏడాదే అంటే 1987 లో గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగం దొరకడంతో రాజమండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోయాను. గిరిజన సంక్షేమశాఖలో చేరిన తర్వాత మొదటి ఎనిమిదేళ్ళు నాలుగు జిల్లాల్లో పనిచేసాను. ఆ ఉద్యోగ జీవితం నన్ను పూర్తిగా ఆవహించింది. దాంతో దీర్ఘకావ్యం ఆలోచన పక్కకు పోయింది. కాని ఆ రోజులన్నిటా అప్పుడూ అప్పుడూ ఏవో కొన్ని కవితలు రాస్తూనే వచ్చాను. వాటన్నిటినీ, 1995 లో ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ అనే సంపుటిగా వెలువరించాను. దానికి సి.వి.కృష్ణారావుగారు ముందుమాట రాసారు.
 
నేను 1995 లో పాడేరు వదిలిపెట్టి, హైదరాబాదు వస్తూండగా, ఆ పుస్తకాన్ని వెలువరించాను. ఆ కాపీలు నాకు తెలిసిన మిత్రులకి పంచిపెట్టాను. ఎక్కడా ఏ పుస్తకవిక్రయకేంద్రాల్లోనూ పెట్టలేదు. పత్రికలకి సమీక్షకోసం పంపమంటే కొన్ని పంపించానుగాని, ఏ పత్రికలోనూ ఎవరూ సమీక్షించినట్టు నాకు గుర్తు లేదు.
 
ఆ పుస్తకం ఎవరికీ తెలియకుండా అనామకంగానే మిగిలిపోయిందనే చాలా కాలం అనుకున్నాను. కాని 2000 సంవత్సరంలో బెంగుళూరు వెళ్ళినప్పుడు తంగిరాల సుబ్బారావుగారిని కలవడానికి వెళ్తే అక్కడ న్యాయపతి శ్రీనివాస రావు కనిపించాడు. అతడు నన్ను చూడగానే అమాంతం రెండుచేతుల్తో పైకెత్తేసాడు. ‘మీ ఒంటరి చేలమధ్య ఒక్కత్తే మన అమ్మ’ పుస్తకం లాంటిది తెలుగు కవిత్వంలో ఈ మధ్యకాలంలో రానేలేదు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఎవరికీ తెలియకుండా అదృశ్యమైపోయిందనుకున్న ఆ పుస్తకం ఒక సహృదయుడి హృదయంలో అంత బలంగా తిష్టవేసుకు కూచుంటుందని నేను ఊహించలేదు.
 
ఆ పుస్తకం నుంచి కూడా కొన్ని కవితలు మిత్రులకి పరిచయం చేద్దామనుకుంటున్నాను. వాటితో పాటు వాటి ఇంగ్లిషు అనువాదాలు కూడా.
 
మొదటగా, రాజమండ్రి వదిలివచ్చేస్తున్నప్పుడు రాసిన కవిత ‘సెలవు రాజమండ్రీ సెలవు ‘. ఈ కవితని మునిపల్లె రాజు గారు ఎంతో ఇష్టపడ్డారు. తెలుగువాళ్ళకి భావోద్వేగాన్ని దాచుకోవడం, అదుపు చేసుకోవడం ఇష్టం ఉండదనుకుంటాను. అందుకనే ఈ కవిత ఆయనకు అంతలా నచ్చిందనుకుంటాను.
 
 

సెలవు రాజమండ్రీ సెలవు

 
సెలవు నా ప్రియనగరమా, సెలవు
సెలవు నా వారణాసికి, నా వియన్నాకి, నా డబ్లిన్ కి, సెలవు నా ఏథెన్సుకు
తన సహస్ర ప్రజానీకపు చేతుల్తో అందించిన జీవఫలపు చేదివిషపానానికి.
 
సెలవు గౌతమికి, గౌతమీ గ్రంథాలయానికి
సెలవు రాజవీథికి, కందకానికి, కోటగుమ్మానికి, కోటిలింగాలకి
సెలవు ఉరికంబాల చెరువుకి
సెలవు విక్రమహాలుకి, పురమందిరానికి
సాహసోజ్జ్వల చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్య మైదానానికీ
స్మగుల్డు సరుకులమ్ముకునే నల్లమందు సందుకి.
 
సెలవు కళాకేంద్రానికి, కళాసమితికి, కళాదర్బార్ కి, కళాకారులకి, కళావంతులకి
సెలవు నీ విశిష్ట సమావేశాలకి, వక్తలకి, నీ సంస్కర్తలకి.
 
సెలవు నీవు కలిపి పెట్టిన అన్నం ముద్దలకి
సెలవు నీవు రుచి చూపిన ఆకలిరాత్రులకి
సెలవు నీ ఆగ్రహానికి, అనుగ్రహానికి, నీ ఔదార్యాలకి, నీ దగాలకి
నీ విశాల బాహువులకి, సంకుచిత మనస్కులకి, నీ అర్థరాత్రులకి, నీ వ్యర్థ రాత్రులకి.
 
సెలవు నీ చిరుజల్లులకి, వెన్నెల తునకలకి
డిసెంబరు చలిలో సురభిళించే చామంతులకి, క్రిస్మస్ కాంతులకి.
 
సెలవు నీ ప్రోపగాండాకి, నీ ప్రదర్శనలకి
నువ్వు పైకి చెప్పుకోలేని నీ సనాతన వ్రణాలకి, నీ పురాతన ఋణాలకి
సెలవు నీ నీడన గడిచిన నా కాలానికి, నీవు వినిపించిన కవితలకి,
నా కోసం తెరచిన తలుపులకి, ఆదరణకి
సెలవు నీ మనుష్యులు చేసిన అవమానాలకి, ద్రోహాలకి
సెలవు నీవు వర్షించిన సంగీతాలకి, రగిలించిన వేదనలకి
నీ నృత్యాలకి, నీ దగ్గరే తప్ప మరెక్కడా చెల్లని నీ సత్యాలకి.
 
సెలవు నీ కానుకలకి, ఆశీస్సులకి, అభిశంసలకి
సెలవు నీ సంరంభానికి, నీ శూన్యానికి
సెలవు నా ప్రియనగరమా, ఇక ఎన్నటికీ సెలవు.
 
1987
 
BELOVED CITY, FAREWELL
 
My beloved city, farewell.
Farewell to my Benares, my Vienna, my Dublin, and farewell to my Athens.
Farewell to the bitter hemlock that its people brought me.
 
Farewell to the river and the library,
Farewell to the square, to the moat, to the fort gate, and to the gallows.
Farewell to its cemetery.
Farewell to the meeting hall, farewell to the town hall, and
Farewell to the ground that was soaked in the blood of martyrs.
Farewell to the black market and to the opium street.
 
Farewell to art halls, art leagues, artists, and art girls.
Farewell to your grand meetings, your spokesmen and to your statesmen.
 
Thank you for the morsels of kindness and goodwill.
You fed me starvation, and I bid you farewell.
Farewell to your anger, your affection, your benevolence, and your treachery
Farewell to your large-hearted embrace, your narrow-minded people, and
Farewell to your midnights and your glib nights.
 
Farewell to your showers and sprinkles,
Farewell to your chrysanthemums and your Christmas stars.
 
Farewell to your pomp and pomposity,
Farewell to your ageless maladies and your age-old ailments.
Farewell to the time that I spent with you and the poems you read.
Farewell to the doors you opened, and the comfort you provided, and
Farewell to your betrayals and humiliations.
Farewell to the songs you sang and the sorrows you sparked,
Farewell to your jubilation and your truths that don’t hold up elsewhere.
 
Thank you for all your gifts, blessings, and curses.
Leaving your resentments and excitements behind,
My beloved city, I bid you farewell forever.
 
12-7-2022

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading