A GREEN LIGHT FULL OF LIFE

Reading Time: 3 minutes
సమకాలిక తెలుగు కవిత ప్రధానంగా భావోద్వేగాలమీదా లేకపోతే కొని సామాజిక-ఆర్థిక-రాజకీయ అభిప్రాయాల మీదా ఆధారపడి ఉంటుంది. కవికి తాను చెప్పదలుచుకున్నది నేరుగా చెప్పడం మీదనే ఎక్కువ ఆసక్తి. తెలుగు కవిత రసప్రధానం అని అనుకుంటే, ఆ రసోత్పత్తి, కవి తన భావోద్వేగాల్ని నేరుగా, సూటిగా, తాను ఉద్రిక్తుడవుతూ మనల్ని ఉద్రిక్తుణ్ణి చేయడంలోంచే సంభవిస్తుంది. అసలు తెలుగు జాతి స్వభావంలోనే ఏది చెప్పుకున్నా బాహాటంగా, బిగ్గరగా, విస్తారంగా చెప్పుకోవడం ఉంది. కాబట్టి ఒక కవిత చెప్తున్నపుడు అది ధ్వనిప్రధానంగా ఉండటంగాని, పైకి ఒక వాచ్యార్థం ఉంటూనే దాన్ని మరింత మరింత మననం చేస్తే కలిగే రసప్రతీతి ధ్వనించడంగాని తెలుగు కవిత్వంలో చాలా తక్కువ.
 
‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ సంపుటంలో చాలా కవితలు ధ్వనిప్రధానంగా రాయడానికి ప్రయత్నించినవే. ఇందుకు ప్రధానమైన స్ఫూర్తి ఇస్మాయిల్ గారు. ఆయన కవిత్వంలో నిశ్శబ్దం గురించి మాట్లాడినప్పుడు, కవిత్వం తన వక్తృత్వ లక్షణం నుండి దూరంగా జరగాలని ఆశించారు. కవికీ, వక్త కీ మధ్య తేడా ఉంది. వక్త తాను మాట్లాడుతూనే ప్రజల్ని స్పందింపచెయ్యగలడు. కాని కవిత్వం ఆలోచనామృతం. శ్రోత వెంటనే స్పందించడానికి పూర్వకాలంలో ఛందస్సు, శబ్దాలంకారాలు ఉపకరించేవి. కాని ఆధునిక కవిత శబ్దప్రధానం కాకుండా అర్థప్రధానంగా ఉండాలను కున్నప్పుడు, అది ధ్వనిప్రధానంగా ఉంటేనే దానికొక లోతు సిద్ధిస్తుంది.
 
కాని దానివల్ల కలిగే నష్టం కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే తెలుగు పాఠకుడు అటువంటి కవితల దగ్గర ఆగడు. అందులో అతడి శ్రవణేంద్రియాన్ని స్పందింపచేసేది ఏమంత ఉండదు కాబట్టి దాన్ని పూర్తిగా చదవను కూడా చదవడు. ఇక అందులో ఉన్న అంతరార్థాన్ని మననం చేస్తాడని ఎలా ఆశించగలం?
 
ఉదాహరణకి ‘ఆకుపచ్చని జీవకాంతి ‘ అన్న ఈ కవిత చూడండి. ఇది వసంతం మీద రాసిన కవిత. కాని ఇందులో వసంతం అనే మాట ఎక్కడా వాడలేదు. చైత్రం అనే పదం కూడా వాడకుండా, ఏప్రిల్ అనే పదాన్ని మాత్రమే వాడాను. ఏప్రిల్ అనగానే April is the cruellest month అనే వాక్యం స్ఫురించకుండా ఉండదు. వసంతకాలంలో వచ్చే వసంతవాన వైపుగా ఈ కవిత నడుస్తుంది.
వసంతం వచ్చినప్పటికీ ఇంకా శిశిరహేమంతాల ఎండుటాకులు పూర్తిగా తొలగిపోలేదు. వసంతమూ, ఎండుటాకులు అనే రెండు దృగ్విషయాలు మృచ్ఛకటికంలోని వసంతసేననీ, ఆమెని చంపమని శకారుడు తన సేవకులకి చెప్తే వారు ఆమెని ఎండుటాకుల్తో కప్పెయ్యడమూ గుర్తుకు తెస్తాయి. కాని అవి పాఠకుడికి నేరుగా గుర్తొస్తాయని చెప్పలేం. అలా గుర్తురావడం కోసం ‘ఏమో బహుశా వీటికింద ఆ స్త్రీ దేహం దాగిఉందేమో ‘ అనే వాక్యం ఒక గుర్తుగా వదిలిపెట్టాను. మృచ్ఛకటికంలో ఆ వసంతసేన శరీరం మీద వానపడుతుంది, ఆ ఎండుటాకులు పక్కకి తప్పుకుని ఆమె బయటపడుతుంది.
ఎండుటాకుల్లో జీవితం తాలూకు decay మాత్రమే కాదు, ఒక క్రూర విషాదం కూడా ఉంది. మరీ ముఖ్యంగా, ఒక ప్రేమానుభూతి చుట్టూ ఆవరించే సామాజిక ఆంక్షలు, అనుమానాలు, పుకార్లు అన్నీను. మృచ్ఛకటికంలో ఒక విలన్ ఉన్నాడు, కనబడతాడు. కాని చాలాసార్లు సున్నితమైన మన అనుభూతి దేహం మీద దాడిచేసే విలన్ కంటికి కనబడడు. అటువంటి ఉక్కపోతలో ఒక ఈదురుగాలి రావాలనీ, వానపడాలనీ అనిపించడం సహజం. వాన, అందులోనూ వసంతవాన చాలా సున్నితమైన రసానందాన్ని సూచించే అనుభూతి. ‘వాన పడనీ ‘అనే ఆకాంక్షతో కవిత పూర్తవడం, ఏ రసజ్ఞుడైనా ఉన్మత్తుణ్ణి చేయగల వాక్యమనే ఈ కవిత రాసినప్పుడు అనుకున్నాను.
 
ఇదొక ప్రయత్నం. కాని ఇటువంటి కవితలు తెలుగు స్వభావానికి, పఠనసంప్రదాయానికి అనుకూలించే కవితలు కావు. కాబట్టే, రాసి ముప్పై ఏళ్ళు గడిచిపోయినా, ఇప్పటిదాకా ఎవరూ ఈ కవిత గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
 

ఆకుపచ్చని జీవకాంతి

 
ఆకుపచ్చని జీవకాంతి ఆకాశానికి అడ్డంగా వేయి చేతులు చాచి
నా కోసం ఒక గూడు నిర్మించింది.
నిప్పులు చిమ్ముతో సాగుతున్న సూర్యరథం ధూళి, లోకం పైన.
అకళంకమైన ఆనందపు నీడ ఇక్కడ, ఈ కిందన.
 
పండిన ఫలాల వెచ్చని హెచ్చరికల సౌరభంతో
బరువయిన తీపిగాలులు మృదువుగా స్పృశించి అలరిస్తున్నాయి
కాని కిందన పోగుపడ్డ యీ ఎండుటాకులు నన్ను కలవరపెడుతూనే వున్నాయి.
ఏమో బహుశా వీటికింద ఆ స్త్రీ దేహం దాగివుందేమో.
 
తాకి చూద్దునా టపటపలాడుతూ స్కాండల్స్
ఆ చప్పుడు మధ్యనుంచే నిశ్శబ్దంగా పక్కకి ఒత్తిగిలిన
నిండు వక్షోజాల ఏప్రిల్ అందాలు
నిద్రపోతూనే ఈ కన్య ఒక చేత్తో నన్ను బలంగా దగ్గరకు లాక్కుంది.
 
ఒక ఈదురుగాలి రానీ
ధూళి లేపుతో అనుమానపు కళ్ళని పొడుస్తో ఈ ఆకులు పక్షులై ఎగరనీ
చేతులు చాపి రక్షించుకొంటోన్న జీవితాగ్రం నుంచి
తొడిమ ఒడలి మహానంద సాఫల్యంతో ఆ ఫలం నేలరాలనీ
సాహసవంతమైన ఆ పిరుదుల ఒత్తిడిలో నా కళ్ళు మూసుకుపోనీ
వాన పడనీ.
 
1990
 
A GREEN LIGHT FULL OF LIFE
 
A green light filled with life spread across the sky.
The sun’s fiery chariot threw dust above.
And unstained joy here below.
 
With a sweet breeze, the scent of ripe cashew-nut fruit engulfs me.
Yet, late autumn leaves still disturb me,
Perhaps hiding her underneath.
 
Amid the clatter of scandals,
The moment I removed the leaves from the heap,
April turned her full breasts tightly towards me.
And pulled me closer to her as she slept.
 
Let the wind howl,
As birds peck at suspicious eyes, let these leaves fly back,
Let the ripe fruit fall from the bough,
Let the warmth of her embrace make me forget myself,
And let the spring rain fall gently.
 
22-7-2022

Leave a Reply

%d bloggers like this: