నీ సంగీతం నీదే

హేమంత కాలం. ఇప్పుడెక్కడుండాలి నేను? పంటలు కోస్తున్న పొలాల మధ్యనో, కోసిన పంటల్ని తూర్పారబడుతున్న పంటకళ్ళాలదగ్గరో, లేదా నూర్చిన గింజల్ని బస్తాలకెత్తి ఇండ్లకు తోలుతున్న ఎడ్లబళ్ళ మీదనో.

ఈ హేమంతం నన్ను మరింత దిగులుతో నింపుతున్నది. నా ఉద్యోగం వల్ల నేను నగరంలో కైదు కాబడ్డాను. పనికి దూరంగా ఉండటమంటే ఋతువులకు దూరంగా ఉండటమన్నాడు జిబ్రాన్. కాని ఈ వాక్యాన్ని తిరిగి రాయాలి. పనిలో కూరుకుపోవడమంటే ఋతువులకు దూరం కావడం. ఈ ఉద్యోగమే లేకపోయుంటే ఊళ్ళమ్మట తిరుగుతూ హేమంత కనకప్రభని కళ్ళప్పగించి చూస్తూ ఉండేవాణ్ణి కదా.

ఇట్లాంటి మూడ్ లో చిక్కుకుపోయిన నన్ను కీట్స్ కవిత Ode To Autumn సేదతీర్చింది. గత నాలుగైదురోజులుగా ఈ కవితతో ఎంత ప్రేమలో పడ్డానంటే, రోజంతా ఎప్పుడు సాయంకాలమవుతుందా ఎప్పుడు ఇంటికి పోయి ఈ కవితని మళ్ళా మళ్ళా చదువుకుంటానా అని ఒకటే ఆతృత.

ఇంగ్లీషులో సర్వోత్కృష్టమైన మొదటి అయిదు కవితల్లొ ఒకటిగా ఎంచబడుతున్న ఈ కవితని వణుకుతున్న వేళ్ళతో తెలుగుచెయ్యాలని చూసాను. కవిత చదువుతున్నంతసేపూ మా ఊరూ, మా ఊరినుంచి లోపలకు వెళ్తే చింతతోపులమధ్య మెరిసిపోయే వణకరాయి గ్రామమూ, కొండచరియలమీంచి ఇంటికి మళ్ళే మేకలమందలూ, ఆకాశంతా ఆవరించే బంగారు ధూళి కళ్ళముందు కదులుతున్నాయి.

వాటితో పాటు వాన్ గో చిత్రించిన పంటలకోతల చిత్రం కూడా.

హేమంత గీతి

జాన్ కీట్స్

పొగమంచుల ఋతువు, పండ్లు పరిపక్వమయ్యే కాలం
పరిణతమవుతున్న సూర్యుడి ప్రాణస్నేహితురాలు
కలిసి సమాలోచన చేస్తుంటారు:
పూరిళ్ళ మీద అల్లుకున్న తీగల్ని మరిన్ని పండ్లగుత్తుల్తో
మరింత అనుగ్రహించడమెలా అని.
పంచవటిలో చెట్లన్నిటినీ ఫలభారనమ్రమెట్లా చెయ్యడమని.
పండుతున్న ప్రతి పండునీ
సారాంశంలోంచీ మధుభరితమ్మెట్లా చెయ్యడమని.
గుమ్మడిపండ్లలో గుజ్జు, గింజల్లో సారం
మరింత మరింత నింపాలని ఆరాటం.
ఎంతంటే రేపు తేనెటీగలకోసం పూలు పూసినప్పుడు
వసంతదినాలెప్పటికీ ముగిసిపోవనిపించేటంతగా,
తేనెవాకలెప్పటికీ పొంగిపొర్లుతూనే ఉండేటట్టు
కణకణానా వేసవి మధువు నింపిందనిపించేటంతగా.

నీ ధాన్యపు రాశుల నడుమ తరచూ నిన్నెందరు చూడలేదు?
ఊరిపొలిమేరల్లో నిన్ను వెతకాలనుకునేవాళ్ళకి
నువ్వేపంటకళ్ళంలోనో పరాకుగా కనిపిస్తావు.
పంట తూర్పారపడుతున్న గాలికి
నీ ముంగురులు మృదువుగా కదుల్తుంటాయి.
అప్పటిదాకా పంట కోసి కోసి
మరొక వెన్ను మడిచి కోసేలోపు నీ కొడవలి పక్కన పెట్టి
పూలతావికి మత్తెక్కి
సంగం కోసిన పంటచేలోనే ఆదమరిచి నిద్రపోతుంటావు.
ఫలభారంతో వంగిన నీ శిరసు నిటారుగా చాచుకుంటూ
ఏటినీళ్ళల్లోంచి నడిచిపోతున్నప్పుడు
పొలంలో పరిగె ఏరుకునేవాళ్లలాగా కనిపిస్తావు.
చెరకుగానుగ దగ్గర ఊరుతున్న రసాల్ని
చూస్తూ గంటలతరబడి ఓపిగ్గా నిలిచిపోతావు.

ఇప్పుడు వసంత గీతాలెక్కడున్నాయి? అవును, ఎక్కడున్నాయి?
వాటి గురించి ఆలోచించకు, నీ సంగీతం నీదే-
కోతకోసిన పంటదుబ్బులమీద దినాంతమృదువేళ
ఆకాశమేఘమాలికలు గులాబిరంగు అద్దుతున్నవేళ
పీలతెమ్మెర ఒకటి తలెత్తినప్పుడో, అణగిపోయినప్పుడో
గాల్లో తేలుతూనో, మునుగుతూనో
ఏటిచెలమలదగ్గర చిమ్మెటలు శోకాకుల బృందగానానికి
గొంతు కలుపుతుంటాయి.
కొండచరియలమీంచి ఇంటికి మళ్ళుతున్న
మేకలమందలు కూతపెడుతుంటాయి.
కీచురాళ్ళు పాడుతుంటాయి, ఏ పెరటి తోటలోంచో
కెంపుకంఠం పిట్ట కూజితమొకటి వినవస్తూంటుంది.
గూళ్ళకి మళ్ళుతున్న పక్షుల కలకలంతో
ఆకాశమంతా నిండిపోతుంది.

10-12-2014

Painting: Vincent Van Gogh

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%