బైరాగి 90వ పుట్టినరోజు

Reading Time: 2 minutes

135

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు బైరాగి కవిత్వాన్ని ఇష్టపడతారనీ, బైరాగినీ, ముక్తిబోధ్ ని పోలుస్తూ పరిశోధన చేసారనీ తెలుసు నాకు. కాని బైరాగి కవిత్వాన్ని ప్రాణాధికంగా ప్రేమిస్తారని మొన్నే తెలిసింది నాకు.

బైరాగి 90వ పుట్టినరోజుని ఆయన ఆదివారం విశాఖపట్నంలో ఒక మహోత్సవంలాగా నిర్వహించారు. ఆంధ్రా యూనివెర్సిటీ అసెంబ్లీ హాల్లో తెలుగు, హిందీ విభాగాలూ, లోక్ నాయక్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఆ సభకి విశ్వవిద్యాలయం విద్యార్థులు సుమారు 500 మందిదాకా హాజరై ఆద్యంతం ఎంతో శ్రద్ధగా విన్నారు.

అట్లాంటి సభ ఇప్పటిదాకా ఎవరూ బైరాగి మీద ఎక్కడా నిర్వహించలేదు.

ఆ సమావేశంలో నన్ను నిలువెల్లా పులకింపచేసిన విషయాలెన్నో ఉన్నాయి. మొదటిది, లక్ష్మీప్రసాద్ గారు అనర్గళంగా బైరాగి కవిత్వాన్ని పంక్తులకు పంక్తులు ధారణలోంచి చదువుతుండటం. అంతగా బైరాగి ఆయనకి హృదయస్థమైపోయాడని నేను ఊహించలేదు. ఆయనట్లా కవితలు వినిపిస్తుంటే నాకు చాలా సిగ్గనిపించింది. ఎట్లా ఉండేవాణ్ణి నేనొకప్పుడు! రాస్కల్నికావ్ మొత్తం నాకు కంఠోపాఠంగా ఉండేది. నా సున్నితపార్శ్వాల మీద నా ఉద్యోగ జీవితం యాసిడ్ పోసిందని అర్థమయింది. కాని ఆయన తననెట్లా కాపాడుకోగలిగాడు! బైరాగి ఆయన్ని పూర్తిగా అనుగ్రహించాడనిపించింది.

కాని కనీసం రెండుమూడు సార్లేనా నిండుసభలో లక్ష్మీ ప్రసాద్ తనకి ఆ సభ నిర్వహించడానికి స్పూర్తి నేనే అని చెప్తుంటే నామనసొకవైపు ఎంతో విస్మయభరితంగానూ, మరొకవైపు నేనా వాక్యానికి తగుదునా అన్న సందేహంతోనూ నలిగిపోయింది.

‘బైరాగి జీవితం-సాహిత్యం’ అన్న పేరిట లక్ష్మీప్రసాద్ రాసిన ఒక పుస్తకం, ఎమెస్కో ప్రచురణ, ఆచార్య కాట్రగడ్డ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.

పొత్తూరి వెంకటేశ్వరరావు, గుమ్మాసాంబశివరావు, ఆచార్య వెలమల సిమ్మన్న, ఆచార్య చందుసుబ్బారావు, ఎ.కృష్ణారావు, కాట్రగడ్డ మురారి, తనికెళ్ళ భరణి, కె.ఎస్.చలం, తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్ లతో పాటు కొర్రపాటి ఆదిత్య, నేనూ కూడా బైరాగి మీద మాట్లాడేం.

జీవితకాలంపాటు బైరాగి కవిత్వం మీద అపురూపమైన కృషి చేసిన, చేస్తూ ఉన్న ఆచార్య ఆదేశ్వర రావుగారికి లక్ష్మీప్రసాద్ సన్మానం చేసారు. ఆదేశ్వరరావు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో హిందీ విభాగాధిపతిగా పనిచేసారు. బైరాగికి ఆయన కుటుంబసభ్యులకన్నా ఆదేశ్వరరావుగారే ఎక్కువ సన్నిహితులని చెప్తారు. లక్ష్మీప్రసాద్ ఆదేశ్వరరావుగారి విద్యార్థి. ఆ విధంగా ఆయన బైరాగికి ప్రశిష్యుడు. బైరాగి చివరిదినాల్లో ఆదేశ్వరరావుగారూ, లక్ష్మీ ప్రసాద్ గారూ బైరాగిపక్కనే ఉన్నారు.

బైరాగి కవిత్వంనుంచి ఎంపిక చేసిన కొన్ని కవితల్ని ఆదేశ్వర రావుగారు గతంలో Voices from the Deep Well, The Broken Mirror పేరిట ఇంగ్లీషులోకి అనువదించారు. ఇప్పుడు ఎనభైయేళ్ళ వయసులో బైరాగి రాసిన ప్రేమకవిత్వాన్ని’ప్రేమకవితలు’ పేరిట సంకలనం చేసి అందులో కొన్నికవితలకు తన ఇంగ్లీషు అనువాదం కూడా పొందుపరిచారు.

బైరాగి కవిత్వాన్ని ప్రేమించడమంటే అది. అది కేవలం అభిమానం కాదు, ఉపాసన. ఆదేశ్వర రావుగారిని ముఫ్ఫై ఏళ్ళ కిందట రాజమండ్రిలో సాహితీవేదికలో విన్నాను, మళ్ళా ఇన్నాళ్ళకు మరొకసారి చూసాను,విన్నాను. ఆయన మాట్లాడిన ప్రతిఒక్క మాట ఆశ్చర్యకారకమే. హిందీసాహిత్యాన్ని ఆపోశనం పట్టిన ఆ ఆచార్యుడు జయశంకర ప్రసాద్ కన్నా బైరాగికే హిందీ ఇడియం ఎక్కువ పట్టుబడిందని చెప్తూ ఉంటే అక్కడున్నవాళ్ళందరికీ గగుర్పాటు కలిగింది.

చాలా కాలం తర్వాత, నా మనసంతా మృదులమైపోయింది, నాకు తృప్తిగా అనిపించింది. ఆ ముందురోజూ, ఆ రోజూ, మళ్ళా ఆ రాత్రంతా ఆదిత్యకీ, నాకూ మధ్య బైరాగినే.

నేనెళ్ళాగానో సంకల్పిస్తున్న రచన ‘ఆధునిక తెలుగు కవిత్రయం: గురజాడ, శ్రీశ్రీ, బైరాగి’ వీలైనంత త్వరగా రాసి తీరాలనిపించింది.

29-9-2015

Leave a Reply

%d bloggers like this: