21 వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు

విద్య గురించిన ఆలోచనలు నన్ను గాఢంగా ఉత్తేజితుణ్ణి చేస్తుంటాయి, సాహిత్యంలానే. కానీ, ఒక తేడా ఉంది. సాహిత్యం చదవడం, చదివినపుస్తకాల గురించి మాట్లాడుకోవడం, ఒక కవితనో కథనో రాయడం ఎప్పటికీ ఉత్తేజకారకాలేగాని, విద్య అట్లా కాదు. విద్యామీమాంస నన్ను ఎంత ఉత్తేజితుణ్ణి చేస్తుందో, అంత చింతాక్రాంతుణ్ణి కూడా చేస్తుంది. 

ఇన్నొవేషన్ అసాధ్యం కాదు

గ్లోబలైజేషన్ యుగం మొదలయ్యాక అభివృద్ధికి రెండు వనరులు ప్రధానమని ప్రపంచమంతా గుర్తిస్తున్నారు. ఒకటి information, రెండోది, innovation. ఇన్నొవేషన్ అంటే కొత్త పుంతలు తొక్కడం. కానీ ఇన్నొవేషన్ ప్రైవేటు రంగంలోనూ, వాణిజ్యరంగంలోనూ తలెత్తినంతగా ప్రభుత్వరంగంలో ఇంకా ప్రస్ఫుటం కావడంలేదు. అందుకు చాలా కారణాలున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు సహజంగానే గతానుగతికంగానూ, కరడుగట్టిన ఆచారాలతోనూ కూడుకుని పనిచేయడం, ఇన్నొవేషన్ నువెన్నంటే రిస్క్ కూడా ఉన్నందువల్ల, ఆ రిస్క్ ని తలదాల్చడానికి ఎవరూ సిద్ధపడకపోవడం కొంత కారణం.