నివృత్తినాథుడి గుహ ఎదుట రాతిగోడకు ఆనుకుని నేను ఆ ముగ్గురు అన్నదమ్ముల్నీ, వాళ్ల చెల్లెల్నీ తలచుకున్నాను. పిల్లల్ని వదలిపెట్టి ఆత్మత్యాగం చేసిన ఆ తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకున్నాను. లోకానికి ఇంత వెలుగు పంచిపెట్టిన ఆ కుటుంబం ఎంత విషాదాన్ని అనుభవించిందో ఊహించడానికి ప్రయత్నించాను.
అవధూతగీత-1
ఇన్నేళ్ళు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో అంతర్వాహినులుగా ఉండి నన్ను నడిపిస్తున్న ప్రభావాలు మూడు కనబడ్డాయి. నేను పుట్టిన ఆ తాటాకు ఇంట్లో మా బామ్మగారు నాకు చిన్నప్పుడే వినిపించి కంఠస్థం చేయించిన పోతన భాగవత పద్యాలు. మా నాన్నగారు ఎంతో అపురూపంగా చూసుకునే మహాభక్తవిజయం పుస్తకం, మూడోది, ఆ ఇంట్లో ఈశాన్యమూలన మా అమ్మ ప్రాణప్రదంగా చూసుకునే దేవుడిగది.
