పిల్లల్ని ఒక్కరు ప్రేమించినా సరే, ఆ నైతికసంస్కారం మొత్తం ఒక సంస్థకీ, ఒక ప్రాంగణానికీ, ఒక పట్టణానికీ విస్తరిస్తుందనడంలో సందేహం లేదు. అది నెమ్మదిగా ఒక నైతికోద్యమంగా మారగలుగుతుందనే నా నమ్మకం తేజ విద్యాలయాన్ని చూసేక మరింత బలపడింది.
ప్రతి ఒక్కరిదీ ఒక జయగాథ
నిన్న ఆ సభకి హాజరై తమ అనుభవాల్ని పంచుకున్న ప్రతి ఒక్కరూ వింటున్నవాళ్ళల్లో ఉత్తేజాన్ని ప్రవహింపచేసారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరిదీ ఒక జయగాథ. తెల్లవారిలేస్తే ద్వేషంతోనూ, ట్రోలింగుతోనూ కుతకుతలాడిపోతుండే మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కనిపించని కథలు, వినిపించని విజయాలు.
సంగీత విద్య
ఆ పాఠశాల ఎన్ని అరకొర సౌకర్యాలతోనైనా ఉండనివ్వు, అక్కడ ఎన్ని సమస్యలైనా నడుస్తుండనివ్వు, అక్కడ కనీసం ఒక్క ఉపాధ్యాయుడేనా, పొద్దుటిపూటనో, సాయంకాలమో పిల్లలతో ఒక గీతం ఆలపిస్తే, అది నా దృష్టిలో సర్వోన్నత పాఠశాల.
