
ఏడవ అధ్యాయం
ఇమ్మెన్సీ
మళ్ళా కొన్నేళ్ళు గడిచిపోయాయి. ఒక వేసవి కాలపు వెచ్చని అపరాహ్ణాన ఒక యువకుడు ఆ అడవిగుండా పచ్చని చెట్లనీడల బాటన లోయవైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆరోగ్యవంతంగా ఉన్న అతని ముఖవర్ఛస్సు ఎండకి కొంత కమిలినట్టుగా కనిపిస్తున్నది.
అతడి సాంద్రగంభీర నేత్రాలు దూరంలోకీ నిశితంగా పరికిస్తున్నాయి. విసుగుపుట్టించే ఆ బాట ఏ క్షణాన్నైనా మలుపు తిరుగుతుందేమో అన్నట్టుగా అతడి చూపులు ఏదో మార్పుని ఆకాంక్షిస్తున్నాయి. కానీ ఎదురుచూస్తున్న ఆ క్షణం అంత తొందరగా వచ్చేలా కనిపించడం లేదు. అలా చాలాసేపు నడిచాక అతడికి దూరంగా ఎక్కడో దిగువనుంచి ఒక ఎడ్లబండి నెమ్మదిగా రావడం కనిపించింది.
ఆ బండి పక్కనే నడుస్తున్న రైతుని ఆ బాటసారి ‘ఓయ్ మిత్రమా’ అని పిలిచాడు. ‘ఇమ్మెన్సీకి వెళ్ళే దారి ఇటేనా?’ అనడిగాడు.
‘అవును, తిన్నగా వెళ్ళండి’ అని ఆ రైతు తన టోపీ సరిచేసుకుంటూ జవాబిచ్చాడు.
‘ఇంకా చాలా దూరమా?’
‘దగ్గర్లోనే ఉంది బాబూ. చుట్ట సగం కాల్చేటంతసేపట్లో మీరు ఆ చెరువు గట్టుకి చేరుకుంటారు. అక్కడే దగ్గర్లోనే పెద్ద మేడ కూడా ఉంది.’
అలా చెప్తూ ఆ రైతు ముందుకు సాగిపోయాడు. ఆ యువకుడు తన నడక వేగం పెంచాడు. అలా ఓ పావుగంట పాటు నడిచాక అతడికి అంతదాకా బాటమ్మట తనకి తోడువస్తున్న చెట్లనీడ అక్కడితో ఆఖరయ్యింది. అక్కణ్ణుంచి ఆ దారి నిటారైన ఒక కొండవాలమ్మట కిందకి సాగింది. ఆ కింద లోయలో పెరిగిన పురాతన ఓక్ వృక్షాల శాఖలు ఆ ఎత్తుల్ని అందుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి.
ఆ చెట్ల కొన కొమ్మల మీంచి చూస్తే ధారాళంగా సూర్యకాంతి వర్షిస్తున్న ఒక విశాల ప్రకృతి దృశ్యం కనువిందుచేస్తున్నది. అక్కణ్ణుంచి చాలా కిందన ఒక ప్రశాంత సరోవరం ముదురునీలిరంగులో కనిపిస్తున్నది. సూర్యరశ్మిలో తళతళ్ళాడుతున్న అడవులు దాని చుట్టూ పరుచుకుని ఉన్నాయి. అవి మధ్యలో ఒకచోట మాత్రం విడివడి ఉన్నాయి. అక్కణ్ణుంచి మళ్ళా అవి ఆ దూరనీల పర్వతశ్రేణిలో ముగిసిపొయ్యేదాకా సువిస్తారంగా పరుచుకుని ఉన్నాయి.
సరిగ్గా ఎదురుగా, ఆ దట్టమైన ఆకుపచ్చని అడవి మధ్య ఒక తెల్లటి చోటు, రాత్రంతా కురిసిన మంచుపొరలాగా కనిపించింది. అదంతా అసంఖ్యాకమైన ఫలవృక్షాలు పూతపట్టిన దృశ్యం. వాటిమధ్యలోంచి, దూరంగా సరోవర తీరంలో ఎర్రటి పెంకుల్తో కప్పు పరిచిన పెద్ద మేడ ఒకటి కనివచ్చింది. దాని గోడలు తెల్లగా మెరుస్తున్నాయి. ఆ భవంతి పొగగొట్టం మీంచి ఒక కొంగ పైకి ఎగిరి నీళ్ళమీద వలయాలు వలయాలుగా చుట్టు తిరిగింది.
‘ఇమ్మెన్సీ!’ అని అరిచాడు ఆ బాటసారి ఆశ్చర్యంతో.
అతనికి తన యాత్రాంతం చేరువైనట్టే అనిపించింది. అతడు కొంతసేపు నిశ్చలంగా నిలబడిపోయాడు. తన పాదాల కింద లోయలో కనిపిస్తున్న చెట్ల కొనకొమ్మలమీంచి సుదూరతీరం వైపు చూస్తూ నిలబడ్డాడు. దూరంగా కనిపిస్తున్న ఆ భవన ప్రతిబింబం ఆ సరోవర తలమ్మీద మృదువుగా తేలియాడుతూ కనిపించింది. అతడు మళ్ళా తన నడక కొనసాగించాడు.
ఇప్పుడు అతడు పయనించవలసిన దారి ఆ కొండవాలమ్మట దాదాపుగా కిందకి దిగి ఉంది. దాంతో ఇంతకుముందుదాకా తన పాదాలకింద ఉన్నట్టుగా కనిపించిన వృక్షాలు ఇప్పుడు తనకి నీడనిచ్చేవిగా ముందుకొచ్చాయి. అదే సమయంలో అవి ఆ సరోవరదృశ్యానికి అడ్డంగా నిలబడుతున్నాయి కూడా. అప్పుడూ అప్పుడూ వాటి కొమ్మల మధ్యనుంచి మాత్రమే ఆ నీటిమిలమిల కనబడుతూ ఉంది.
ఇంతలోనే మళ్ళా ఆ దారి నెమ్మదిగా పైకి సాగింది. అటూ ఇటూ అడవులు మాయమై, వాటి స్థానంలో ద్రాక్షతీగల్తో నిండిపోయిన కొండలు దారిపొడుగునా కనిపిస్తున్నాయి. బాటకి ఇరుపక్కలా నిండుగా పూతపట్టిన పండ్లచెట్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఆ పుష్పవికాసంలో తేనెకోసం ముసురుకుంటున్న తేనెటీగల ఝుంకారం ఆ పరిసరాలంతటా ప్రతిధ్వనిస్తోంది. గోధుమ రంగు కోటు ధరించిన ఒక పొడవాటి మనిషి ఆ బాటసారిని స్వాగతించడానికి ఎదురేగి వస్తున్నాడు. అతడు దగ్గరగా రాగానే తన టోపీ గాల్లో ఊపుతూ ‘సోదరా, రైన్హార్డ్, స్వాగతం, మా ఇమ్మెన్సీ క్షేత్రానికి సాదర స్వాగతం’ అని గట్టిగా అరిచాడు.
‘నీకు శుభం కలుగుగాక, ఎరిక్; నీ స్వాగతానికి కృతజ్ఞతలు’ బదులిచ్చాడు రైన్హార్డ్.
ఈపాటికి వారు ఒకరికొకరు చేరువై, చేతులు కలిపారు.
తన మిత్రుడు బాగా చేరువగా వచ్చాక అతడి గంభీర వదనాన్ని చూస్తూ ‘నువ్వేనా? నిజంగా నువ్వేనా?’ అని అన్నాడు ఎరిక్.
‘నిస్సందేహంగా నేనే ఎరిక్’ అని అన్నాడు రైన్హార్డ్. ‘నిన్ను కూడా నేను గుర్తుపట్టాను. కాకపోతే నువ్వు ఇంతకుముందెన్నడూ కనిపించనంత ఉల్లాసంగా కనిపిస్తున్నావు’ అని కూడా అన్నాడు.
ఆ మాటలు వినగానే చాలా సాదాసీదాగా ఉండే ఎరిక్ ముఖకవళికలు మరింత ఉల్లాసభరితంగా విప్పారి అతడి వదనం పైన సంతోషభరిత మందహాసం వెల్లివిరిసింది.
‘అవును, సోదరా, రైన్హార్డ్’ అంటూ అతడు మరొక్కసారి తన చేయి ముందుకు చాచాడు. ‘నీకు తెలుసుకదా, నా జీవితంలో నాకో గొప్ప బహుమతి లభించినప్పణ్ణుంచీ ఇలా ఉన్నాను. నీకు తెలిసిన విషయమే కదా’ అని అన్నాడు.
అప్పుడు తన చేతులు రుద్దుకుంటూ ‘ఇదో పెద్ద అద్భుతం. ఆశ్చర్యం. ఆమె నిన్ను చూస్తానని ఎంతమాత్రం ఊహించి ఉండదు’ అని అన్నాడు. ఆ స్వరంలో ఉల్లాసం వినిపిస్తున్నది.
‘ఆశ్చర్యమా? ఎవరు మిత్రమా నన్ను చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు?’ అనడిగాడు రైన్హార్డ్.
‘ఇంకెవ్వరు? ఎలిసబెత్!’
‘ఎలిసబెత్కా? నేనొస్తున్నట్టు నువ్వు ఆమెకి చెప్పలేదా?’
‘ఒక్కమాట కూడా చెప్పలేదు సోదరా! నువ్వొస్తావని ఆమెగానీ, వాళ్ళమ్మగారుగానీ ఊహించను కూడా ఊహించి ఉండరు. నిన్ను చూడగానే వాళ్ళ ఆనందం రెట్టింపు అవ్వాలనే ఎవరికీ తెలియకుండా నిన్నిక్కడికి ఆహ్వానించాను. అప్పుడప్పుడూ నేనిలాంటి కొంటెపనులు చేస్తుంటానని నీకు తెలుసు కదా.’
రైన్హార్డ్ ఆలోచనలో పడ్డాడు. ఆ ఇంటికి చేరువవుతున్నకొద్దీ అతడు మరింత భారంగా శ్వాసతీసుకుంటున్నట్టు కనిపించాడు.
బాటకి ఎడమపక్క ద్రాక్షతోటలు ముగిసిపోయాయి. అక్కణ్ణుంచీ విస్తారమైన కూరగాయల తోట మొదలయ్యింది. అది దాదాపు చెరువు అంచుదాకా విస్తరించింది. ఇందాకటిదాకా ఆకాశంలో గిరికీలు కొడుతున్న కొంగ ఇప్పుడు నేలకి దిగి ఆ కూరగాయల మళ్ళ మధ్య గంభీరంగా పచార్లు చేస్తోంది.
‘అయ్యో’ అంటూ ఎరిక్ చప్పట్లు చరిచాడు. ‘ఆ పొడుగు కాళ్ళ ఈజిప్షియన్ కొంగ నా బఠాణీ కాయలు నొల్లేద్దామని చూస్తోంది’ అని అరిచాడు.
ఆ పక్షి నెమ్మదిగా పైకి లేచి ఎగుర్తూ కూరగాయల తోట చివర ఉన్న ఒక కొత్త మేడ పైకప్పు మీదకు చేరింది. నారింజ, కమలాఫలాల కొమ్మలు ఆ భవనం గోడలమీద వాలి ఉన్నాయి.
‘అది మద్యం బట్టీ’ అన్నాడు ఎరిక్. ‘రెండేళ్ళ కిందటే దాన్ని కట్టించాను. మా నాన్నగారు తోటలో అవసరమైన కట్టడాలు తిరిగి కట్టించారు. మేముంటున్న ఇల్లయితే మా తాతగారి కాలంలోనే కట్టించారు. కాబట్టి మేం కొద్దికొద్దిగా ముందుకుపోతున్నామని చెప్పొచ్చు’ అని కూడా వివరించాడు.
వాళ్లు అలా మాట్లాడుకుంటూ విశాలమైన ఒక ఖాళీ ప్రాంగణంలోకి చేరుకున్నారు. దానికి రెండుపక్కలా తోటా, తోటకి అవసరమైన కట్టడాలూ, వెనక వైపు ప్రధానభవనమూ ఉన్నాయి. ఆ మేడకి రెండు వైపులా తోటగోడ ఎత్తుగా ఆనుకుని ఉంది. ఆ గోడ వెనక దట్టంగా గోరింటచెట్ల కంచె ఉంది. అక్కడక్కడా వేప చెట్లు పుష్పిత శాఖాగ్రాలతో ఆ ప్రాంగణంలోకి వాలి కనిపిస్తున్నాయి.
ఎండకి కమిలిపోయిన ముఖాల్తో, చెమటలు కక్కుతూ పనిచేస్తున్న మనుషులు ఆ ప్రాంగణంలో తిరుగుతున్నారు. వారు ఆ మిత్రులిద్దరికీ అభివాదం చేసారు. ఎరిక్ వాళ్ళల్లో ఒకరిద్దరిని పిలిచి వాళ్ళా రోజుకి చెయ్యాల్సిన పనుల గురించి ఆరా తీసాడు.
అప్పటికి వాళ్ళు ప్రధానభవనం దగ్గరికి చేరుకుని ఎత్తుగానూ, చల్లగానూ ఉన్న నడవాలో అడుగుపెట్టారు. దానికి మరీ కొసన ఎడమపక్కన ఒకింత చీకటిగా ఉన్న వసారాలోకి నడిచారు.
అక్కడ ఎరిక్ ఒక తలుపు తెరిచి తన మిత్రుణ్ణి తీసుకుని విశాలంగా ఉన్న ఒక గదిలో అడుగుపెట్టాడు. ఆ గది తోటవైపు తెరుచుకుని ఉంది. ఆ గదికి అవతలి వైపు కిటికీల్ని దట్టమైన శాఖోపశాఖలు కప్పేసినందువల్ల ఆ గదిలో ఆకుపచ్చని కాంతి మసగ్గా ఆవరించి ఉంది. ఆ కిటికీలకి మధ్యగోడకి ఉన్న రెండు పెద్ద గుమ్మాల తలుపులు తెరిచి ఉండటంతో వసంతకాలపు సూర్యకాంతి వెలుతురు ధారాళంగా గదిలోకి ప్రసరిస్తున్నది. గదికి అవతలవైపు అల్లుకున్న పచ్చదనం వల్ల తోట అందంగా కనిపిస్తున్నది. అందులో గుండ్రంగా తీర్చిదిద్దిన పూలపాదులూ, ఎత్తైన కంచెలూ కనిపిస్తున్నాయి. ఆ తోటని విడగొడుతూ విశాలంగా పరుచుకుని ఉన్న ఒక తిన్ననిబాట వెంబడి చూపరుల దృష్టి పయనించి ఆ సరసుపైన తేలియాడుతూ, అక్కణ్ణుంచి అవతలి ఒడ్డున ఉన్న అడవుల్లోకి సాగిపోతున్నది.
మిత్రులిద్దరూ లోపలికి అడుగుపెట్టగానే, ఒక మందపవనం వాళ్ళమీంచి వీచి పరిమళ ప్రవాహంలో వాళ్ళని ముంచెత్తింది.
తోటవైపు తెరిచిఉన్న ద్వారం దగ్గర అరుగుమీద శ్వేతవస్త్రాలు ధరించిన ఒక స్త్రీమూర్తి కూచుని ఉంది. ఆమె వాళ్ళని చూసి లేచి స్వాగతించడానికి ముందుకు వచ్చింది. కానీ నాలుగడుగులు కూడా వెయ్యకుండానే అక్కడే నేలకి అతుక్కుపోయినట్టుగా నిశ్చేష్టురాలై ఆ ఆగంతకుణ్ణే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. అతడొక చిరుమందహాసంతో ఆమె వైపు తన చేయి చాపాడు.
‘రైన్హార్డ్!’ ఆమె ఒక్కసారిగా అరిచింది. ‘రైన్హార్డ్! నువ్వేనా? ఎంతకాలమైపోయింది మనం ఒకళ్ళనొకరం ఇలా చూసుకుని’ అని అనగలిగింది.
‘అవును, చాలా కాలమైంది’ అన్నాడతడు. అంతకుమించి ఒక్క మాట కూడా పలకలేకపోయాడు. ఆమె స్వరం వినగానే ఏదో చెప్పలేనంత శారీరికవేదన అతడి హృదయాన్ని మెలిపెట్టేసినట్టుగా అనిపించింది. అతడు తలెత్తి చూసేసరికి, ఏళ్ళ కిందట తన స్వగ్రామంలో తాను వీడ్కోలు పలికిన అదే సుకుమార, లావణ్యమూర్తి ఇప్పుడు తన కళ్ళ ముందు మళ్ళా ప్రత్యక్షమైనట్టుగా ఉంది.
ఎరిక్ తలుపు పక్కనే నిలబడి ఉన్నాడు, అతడి కళ్లల్లో సంతోషం తాండవిస్తోంది.
‘చూశావా ఎలిసబెత్, ఈ ప్రపంచంలో నువ్వు ఎప్పటికీ చూస్తావని అనుకోని మనిషి ఇతడే కదా’ అన్నాడతడు.
ఎలిసబెత్ అతణ్ణి ఒక సోదరి చూసినట్లుగా చూసింది. ‘నువ్వెంత మంచివాడివి ఎరిక్’ అంది.
అతడు ఆమె కోమల హస్తాన్ని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ‘ఇప్పుడు అతడు మన దగ్గరకే వచ్చేసాడు కదా, మనమింక అతణ్ణి ఇప్పుడిప్పుడే వెళ్ళిపోనివ్వద్దు. అతడింతకాలం దేశం కాని దేశంలో గడిపాడు. ఇప్పుడే మళ్ళా తన సొంత ఇంటికి చేరుకున్నాడనుకుందాం. చూడు అతనెంత కొత్తగా కనిపిస్తున్నాడో. విదేశీయుడిలాగా మారిపొయ్యాడు కదా!’ అన్నాడు.
ఎలిసబెత్ రైన్హార్డ్ ముఖాన్ని బిడియంగానే పరికించింది. ‘మనం ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్న కాలం చాలు అతణ్ణలా మార్చేయడానికి’ అంది.
సరిగ్గా అదే సమయానికి వాళ్ళమ్మగారు కూడా ఆ గదిలో అడుగుపెట్టారు. ఆమె చేతిలో తాళాల గుత్తి ఉంది. రైన్హార్డ్ మీద ఆమె దృష్టి పడగానే ‘ఓ వెర్నర్ గారా!’ అని గట్టిగా అరిచింది. ‘మీరిక్కడికి రావడం నేనస్సలు ఊహించనేలేదు, మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ స్వాగతించింది.
ఆ తర్వాత సంభాషణ కుశలప్రశ్నల్తో, జవాబుల్తో సాఫీగా నడిచింది. ఆ స్త్రీలిద్దరూ తమ పనుల్లో మునిగిపోయారు. తన కోసం సిద్ధం చేసిన ఫలహారాన్ని రైన్హార్డ్ ఆస్వాదిస్తుండగా ఎరిక్ తన పైపు వెలిగించి పొగతాగుతూ అతని పక్కనే కూచుని కబుర్లు చెప్పాడు. సముద్రపు నురగలాంటి తెల్లటి తేలికపాటి ఖనిజంతో తయారుచేసిన పైపు అది.
ఆ మర్నాడు రైన్హార్డ్ అతడితో కలిసి పొలాలూ, ద్రాక్షతోటలూ, పానీయాలు తయారుచెయ్యడానికి ఉపయోగించే పూల తోటలు, బట్టీలు కలయతిరిగాడు. అవన్నీ క్రమపద్ధతిలో నడుస్తున్నాయి. అక్కడ పొలాల్లోనూ, బట్టీల్లోనూ పనిచేస్తున్న కూలీలంతా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. వాళ్ళ ముఖాల్లో సంతృప్తి పొడసూపుతున్నది.
రాత్రిభోజనాలకి వాళ్ళు ఆ తోటపక్క గదిలోనే కూర్చునే వారు. ఆతిథ్యమిస్తున్న దంపతుల తీరికనిబట్టి రోజంతా దాదాపుగా వారి సమక్షంలోనే గడిచిపొయ్యేది. పొద్దుటిపూటా, రాత్రిభోజనానికి ముందు సాయంకాలం పూటా రైన్హార్డ్ కొంతసేపు తన గదిలోనే పనిచేసుకుంటూ ఉండిపోయేవాడు.
గత కొన్నేళ్లుగా, ప్రజాజీవితంలో భాగమైపోయిన జానపద గీతాల్నీ, గేయాల్నీ ఎక్కడ వినిపించినా వాటిని సేకరించడమే అతడు పనిగా పెట్టుకున్నాడు. అలా సేకరించినవాటిని ఇప్పుడు క్రమపద్ధతిలో తిరిగి రాసుకుంటున్నాడు. అదీ కాక, ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలనుంచి కూడా మరికొన్ని గీతాలు కొత్తగా సేకరించడం మొదలుపెట్టాడు.
ఎలిసబెత్ అతడిపట్ల ఎల్లప్పుడూ ఎంతో మృదువుగా, ఎంతో దయగా మెలిగేది. ఎరిక్ తన పట్ల నిత్యం చూపించే శ్రద్ధాసక్తుల్ని ఆమె ఎంతో వినయంగానూ, కృతజ్ఞతతోనూ స్వీకరించేది. ఒకప్పుడు ఎంతో చలాకీగా, ఉల్లాసభరితురాలిగా కనిపించిన ఆ యువతి కాలక్రమంలో ఇలా ఒక శాంతగంభీరమూర్తిగా మారగలదని తానెన్నడూ ఊహించలేదని రైన్హార్డ్కు అప్పుడప్పుడు అనిపించేది.
అక్కడికి వచ్చిన మర్నాటినుంచే అతనికి సాయంకాల వేళల్లో ఆ సరసు ఒడ్డున నడుస్తుండటం అలవాటైంది. ఆ బాట దాదాపుగా తోటలోకి సాగేది. ఆ తోట చివర, ముందుకు పొడుచుకువచ్చినట్టుగా ఒక చిన్న దిబ్బ ఉండేది. దానిమీద గంగరావి చెట్లనీడన కూర్చోడానికి ఒక బల్ల ఉండేది. ఎలిసబెత్ వాళ్ళమ్మగారు దానికి ఈవెనింగ్ బెంచి అని పేరుపెట్టారు. ఎందుకంటే ఆ చోటు పడమటిదిక్కుగా చూస్తుండేది. అందుకని సాయంకాలాల్లో ఆ బల్లమీద కూచుని సూర్యాస్తమయ దృశ్యం తిలకిస్తూ ఉండేవారు.
ఒక సాయంత్రం రైన్హార్డ్ ఆ బాటమ్మట తన సాయంకాలం నడక ముగించుకుని వస్తూండగా వాన కురవడం మొదలయ్యింది. దాంతో అతడు ఆ చెరువుగట్టున పెరుగుతున్న లిండెన్ చెట్ల నీడన తలదాచుకోబోయాడు. కానీ వాన మరీ పెద్దదై ఆకుల సందుల్లోంచి పెద్ద పెద్ద చినుకులు అతడిమీద రాలడం మొదలవడంతో అతడు చేసేదేమీలేక పూర్తిగా తడిసిపోతూనే ఇంటిబాట పడ్డాడు.
దాదాపుగా చీకటి పడింది; వర్షం మరింత గట్టిగా కురుస్తోంది. అతడు ఆ సాయంకాలం బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి, వానవెలుగులో మెరిసిపోతున్న ఆ గంగరావి చెట్ల మధ్య శ్వేతవస్త్రధారి అయిన ఒక స్త్రీమూర్తి నిలబడి ఉన్నట్టుగా అనిపించింది. ఆమె నిశ్చలంగా ఉంది. కానీ అతడి అడుగులు ఆమెకి దగ్గరగా వస్తున్న కొద్దీ పరికించి చూస్తే ఆమె ముఖం అతడి వైపే చూస్తున్నది, కానీ ఆ చూపులు మాత్రం ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్టుగా ఉన్నాయి.
ఆమెని అతడు ఎలిసబెత్ అనే అనుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళి, ఇద్దరూ కలిసి తోటలోంచి ఇంట్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో అతడు తన అడుగుల వేగం పెంచేసరికి ఆమె నెమ్మదిగా వెనుదిరిగి, ఆ చీకటిలో పక్కదారుల్లోంచి మాయమైపోయింది.
అదేమిటో అతనికి అర్థం కాలేదు. అతనికి ఎలిసబెత్ మీద కోపం కూడా వచ్చింది. కానీ నిజంగా అక్కడికొచ్చి నిలబడ్డది ఆమెనేనా అని సందేహం కూడా కలిగింది. అయితే ఆ విషయం ఆమెని అడిగి తేల్చుకోడానికి సిగ్గుపడ్డాడు. అంతేకాదు, ఇంట్లో అడుగుపెట్టాక, ఆమె తోటలోంచి ఇంట్లోకి రావడం తనకి కనబడుతుందేమోన్న సంకోచంతో ఆ గదివైపు తొంగిచూడటానికి కూడా సాహసించలేదు.
(ఇంకా ఉంది)
2-11-2026


ప్రక్రుతిఅందాలుఎంతోఉల్లాసాన్నిచ్చింది…ఆనలుగురూ….కలిసారు….చివరమళ్ళీసస్పెన్సులోఉంచారు….ఎలిసబత్….అవునో కాదో తెలీదు…ఎరిక్,ఎలిసబత్….అర్ధంకాలేదు….. ప్రస్తుతం మాపరిస్ స్ధితికూడారైన్హార్డులానేఉంది.డిటెక్టివ్నవలులుచదివేటప్పటిఉత్సుకతకన్నా….ఎదురుగా,మనఎదురుగాఅంతాకనిపిస్తున్నా…..ఊహించలేనిస్ధితి…..