
హైకూ జపనీస్ కవిత్వంలో ఒక ప్రక్రియ. పదిహేడు మాత్రల్తో రాసే ఒక కవితావాక్యం. దాన్ని 5-7-5 మాత్రలుగా మూడు పాదాలుగా నిర్మిస్తారు. మన పద్యాల్లో యతిస్థానంలో పద్యపాదం విరిగినట్టే, ఆ వాక్యంలో కూడా మధ్యలో ఒక విరామస్థానం ఉంటుంది. మూడుపాదాల్లోనూ మొదట్లోగాని, చివరలోగాని ఎటువంటి ప్రాసా పాటించరు. మొదటి రోజుల్లో ప్రకృతిని వర్ణించడానికి ఆ ఛందస్సు ఉపయోగించేవారు కాబట్టి, ఆ కవితావాక్యంలో అప్పటి ఋతువును సంకేతించే ఏదో ఒక పదం కూడా తప్పనిసరిగా ఉండాలనే నియమం కూడా ఉండేది.
జపనీయ కవిత్వంలో అయిదుపాదాల తంకా అనే సుప్రసిద్ధ ఛందస్సులో మొదటి మూడు పాదాల్నీ ప్రత్యేక ఛందస్సుగా ఉపయోగించడం మొదలయ్యాక, మొదటిరోజుల్లో దాన్ని హొక్కు అని పిలిచేవారు. పదిహేడో శతాబ్దంలో బషో అనే సుప్రసిద్ధ జెన్ సాధువు, మహాకవి దాన్ని హైకూగా మార్చి ఆ ప్రక్రియకు విశేషమైన ప్రాచుర్యం కలిగించాడు. అందువల్ల చాలాకాలం పాటు, ఇంకా చెప్పాలంటే, ఇప్పటికీ కూడా హైకూని జెన్ బౌద్ధంతో కలిపి చూసే ఒక సంప్రదాయం కూడా ఉంది.
పందొమ్మిదో శతాబ్ది రెండో భాగంలో, బయటి ప్రపంచానికి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్తో వ్యాపారానికి జపాన్ తలుపులు తెరిచాక, హైకూ కూడా ప్రపంచభాషా సాహిత్యాల్లోకి ప్రవేశించింది. ఇరవయ్యవ శతాబ్దంలో ఎంతోమంది సుప్రసిద్ధ యూరపియన్ కవులు హైకూలు రాసారు. అలానే భారతదేశంలో రవీంద్రుడు తన జపాన్ పర్యటన తర్వాత హైకూలాంటి ఒక ప్రక్రియలో కొంత కవిత్వం రాసాడు. ప్రాకృత గాథాసప్తశతికి తెలుగులో రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు చేసిన అనువాదానికి ముందుమాట రాస్తూ కట్టమంచి రామలింగారెడ్డిగారు మొదటిసారి హైకూని తెలుగు వారికి పరిచయం చేసారు. ఈ రోజు అమెరికాతో సహా ఎన్నో దేశాల్లో హైకూ సంఘాలున్నాయి. భాషలకీ, దేశాలకీ అతీతంగా ఈ రోజు హైకూ ఒక అంతర్జాతీయ కవితాప్రక్రియగా మారిపోయింది.
కాబట్టి హైకూ రాయడానికి, ఒకప్పుడు జపాన్లో పాటించిన నియమాలేవీ కూడా, ఈ రోజు ఇతరభాషా కవులు పాటించడం లేదు. పదిహేడు మాత్రలూ, మూడు పాదాలూ, విరామస్థానమూ, ఋతుసంకేతమూ, జెన్ బౌద్ధమూ- వీటినన్నిటినీ గానీ లేదా వీటిలో ఒకటో, రెండో వదిలిపెట్టేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజు దేన్ని హైకూ అనాలి అనేది పెద్ద ప్రశ్న.
ఏది హైకూనో చెప్పడంకన్నా, ఏది హైకూ కాదో చెప్పడం సులభం. ఆ వాక్యం ఎంత రమణీయంగా ఉన్నా, శబ్దాలంకారంతో కూడుకున్నదిగానీ, అర్థాలంకారంతో కూడుకున్నదిగానీ హైకూ కాదు. సుభాషితం హైకూ కాదు. చమత్కారం హైకూ కాదు. జీవితానుభవాల్లో ఒక క్షణం తనకీ, ప్రపంచానికీ మధ్య ఉన్న అడ్డుగోడ కూలి పోయే ఒక విముక్తక్షణాన్ని పట్టుకోవడమే హైకూ పరమావధి అని డి.టి. సుజుకి అన్నాడు. ఆయన చెప్పినమాట, ఆ ‘సత్యత’ లేదా ఆ ‘తథత’, దాన్ని పట్టుకోవడమే హైకూ.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా హైకూ కవులు చేస్తున్న ప్రయోగాల్ని పరిశీలించి చూసినప్పుడు, క్లుప్తత, గాఢత, నవ్యత హైకూ లక్షణాలని చెప్పవచ్చు.
ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ‘హిమాలయాలు: సహానుభూతి హైకూలు’ లో ఉన్న నూరు హైకూలూ కూడా ఈ మూడు లక్షణాలకీ తగ్గట్టుగానే ఉన్నాయని చెప్పవచ్చు. స్వామి రామా రాసిన ‘హిమాలయ పరమగురువులతో జీవనము’ సుప్రసిద్ధ గ్రంథం. అది చదివినప్పుడు ‘చం’ గారు లోనైన ఒక విముక్త మానసిక అవస్థలోంచి వచ్చిన అభివ్యక్తి ఇది. అంటే ఒక sublime మనోభూమిక మీంచి ఆయన ఈ కవితలు పలికారు. అందువల్ల ఎత్తైన కొండశిఖరాల్ని తాకుతూ కదిలిపోయే మబ్బుపింజల్ని చూసిన అనుభూతి కలుగుతుంది వీటిని చదువుతుంటే. ఇలా ఒక పుస్తకం చదివి, ఆ పుస్తకం తనలో రేకెత్తించిన విశుద్ధానుభూతిని ఇలా హైకూలుగా మార్చిన ప్రయోగం నాకు తెలిసి ఇదే మొదటిది.
కవి తన అనుభూతిని నిజాయితీగా మనముందుంచుతున్నాడు అనడానికి ఇందులో చాలానే సాక్ష్యాలున్నాయి. ఒకటి రెండు చూడండి:
దేవతాజీవులున్నారు
ఉనికి ఉన్నచోట
ఉనికి లేనిచోట
ఇది తపోవాక్యం. ఇక్కడ ఉన్న ఉనికీ, లేని ఉనికీ- అనే రెండు చోట్లా కూడా కవి ‘ఉనికి’ అంటున్నది జెన్ బౌద్ధులు మాట్లాడిన ‘సత్యత’ నే. దానికి ఎటువంటి ఉపాధులు లేవు కాబట్టి, అది శూన్యత కూడా. అటువంటి చోట దేవతాజీవులుంటారు అనడం ఆ దేవతల్ని కూడా విముక్తపరిచే మాట.
అలానే కవి హిమాలయాల ఔన్నత్యంలో విహరిస్తూండగా అదొక అహింసాత్మక అనుభూతిని తనలో మేల్కొల్పడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ కవిత చూడండి:
సరళహృదయాలు
అనురాగ పూరితాలు
వార్ధా గాలులు
హిమాలయాల యోగుల గురించి చదువుతున్నప్పుడు వార్ధా గుర్తు రావాలంటే ఆ మనిషి హృదయంలో ఆ యోగులతో పాటు కర్మయోగులు కూడా సహజీవనం చేస్తుండాలి. వార్ధా కూడా హిమాలయసదృశమనే ధ్వనితో పాటు ప్రతి ఒక్క సరళ హృదయమూ హిమాలయసమానమే అనే విశ్వాసం కూడా ఇందులో.
సరళ హృదయం సరే, అనురాగపూరితం అనే మాట ఎందుకొచ్చింది? హిమాలయాలూ, వార్ధా కూడా కవి మనసులో అనురాగమనే మాటని ఎందుకు మేల్కొల్పాయి? ‘అనురాగం’ అంటే మనసు ఈ ప్రపంచం పట్ల మోహం కలిగి ఉండటం అని చెప్పుకుంటాంగాని, ధాతుపరంగా అర్థం చూసుకుంటే ‘ఎరుపెక్కడం.’ ఎరుపెక్కడం ఒక సౌకుమార్యతా లక్షణం. సున్నితమైన దేహాలూ, మనస్సులూ మాత్రమే ఎరుపెక్కుతాయి. అంటే ఈ ప్రపంచంలోని ప్రతి చిన్న అవస్థకీ కూడా మనసు కంది పోవడమన్నమాట. గొప్ప యోగులు ఈ ప్రపంచం నుంచి విడిపోవాలని కోరుకోరు. ఈ ప్రపంచంలో ఒక భాగం కాకుండానే ఇక్కడే జీవించాలనీ, ఇక్కడి మనుషుల సుఖదుఃఖాల్లో తాము కూడా పాలుపంచుకోవాలనీ అనుకుంటారు. స్వయంగా ఒక యోగి మనఃస్థితి పొందికూడా గాంధీ మహాత్ముడు చివరిదాకా ఈ దేశాన్ని అంటి పెట్టుకుని ఉండటానికి కారణం అదే. అంటే హిమాలయాలు మనిషిని మానసికంగా విముక్తుణ్ణి చేస్తూనే, అతని హృదయాన్ని సరళతరం చేసి, ఆ తర్వాత అనురాగపూరితం చేస్తాయనే సూచన ఉందిందిలో. మామూలు మనుషుల అనురాగం బంధిస్తుంది. యోగుల అనురాగం మనుషుల్ని విడిపిస్తుంది.
అలానే ఈ వాక్యం కూడా.
ఏ ఆయుధం లేదు
రెండు చేతులు
తప్పక రక్షిస్తాయి
ఈ కవిత చదవగానే ‘యోగక్షేమం వహామ్యహం’ అంటూ రెండు చేతులు మనల్ని కాచి రక్షిస్తున్న చిత్రమొకటి కళ్ళముందు కదుల్తున్నది.
ఇలా ఎన్నో ఎంచి చూపవచ్చు. కానీ ఇవి ఎవరికివారు తమ మనోనేత్రాలు తెరిచి చదువుకోవలసిన కవితలు. ఒక్కమాటలో చెప్పాలంటే కొండని అద్దంలో చూపించిన కవితలు.
Featured image photography courtesy by Atulya Mahajan via pexels.com
31-5-2026


చం గారంటే ఎవరు? వారు వివరాలు చెప్తే బావుండేది
‘చం’- అంటే వి చంద్రశేఖర శాస్త్రి. అనంతపురానికి చెందిన కవి. ఇది అనంతపురం నుంచి వచ్చిన మొదటి హైకూ కవితా సంపుటి.