
ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ సంపుటిలో చివరి కవిత 1992 లో రాసింది. ఆ తర్వాత నేను కర్నూలు నుంచి ఉట్నూరు, అక్కణ్ణుంచి పాడేరు వెళ్ళాను. తిరిగి 2004 లో పునర్యానం కావ్యం వెలువరించేదాకా నేను రాసిన కవితలు వేళ్ళమీద లెక్కపెట్టగలిగినవి మాత్రమే. ఉట్నూరులో ఉండగా ఒక్క కవిత కూడా రాయలేదు. పాడేరులో ఉండగా, ఇస్మాయిల్ గారి మీద ఒక కవిత రాసాను. దాన్ని లక్ష్మిగారు ఆహ్వానంలో 1995 లో ప్రచురించారు. ఏళ్ళ తరువాత, ఆ కవితని కోకిల ప్రవేశించే కాలం సంపుటిలో చేర్చాలనుకుని ఆ కవిత దొరుకుతుందా అని కాళీపట్నం రామారావు మాష్టారికి రాస్తే, ఆయన ఆ కవితని తన స్వహస్తాల్తో కార్డు మీద రాసిపంపారు. అదొక అపురూపమైన జ్ఞాపికగా నా దగ్గర దాచుకున్నాను. జీవితకాలం దాచుకుంటాను.
ఇస్మాయిల్ గారు
పురాతన చిత్రకారుడెవరో
సన్నని గీతల్లో ఆకుపచ్చనీ
లేత పసుపునీ అద్ది చిత్రించిన వెదురు పొద.
మాఘమాసపు గుర్రాలు పరుగెత్తిన నేలమీద
పచ్చగా పరుచుకున్న మామిడిపువ్వు.
సంధ్యవాలుతున్న వేళల్లో
ఆకాశానికి హారం వేసిన కొంగలబారు.
పూర్ణ కళశ పవిత్ర నిశ్శబ్దం.
సముద్రతరంగాలు ఎగిసిపడుతూనే ఉంటాయి.
ఆయన తన చిన్ని టీపాయ్ చెంత
రహస్యమృదులాచ్ఛాదనని కప్పుకుంటున్న
టీవెచ్చదనాన్ని ఆప్యాయంగా అనుభవిస్తోంటాడు.
అప్పుడు మనం
మన గొప్ప కష్టాలన్నిటిమధ్యా
ఓపిక తెచ్చుకుని
ఆయన చూస్తున్న దిక్కుకేసి తలెత్తి చూస్తాం.
అక్కడేముంటుంది?
ఒక పిచుక, ఒక పువ్వు, ఒక హైకూ.
1995
ISMAIL, THE POET
A Chinese scroll depicting a bamboo stalk
Painted in lemon yellow and deep green.
Mango blossoms fill a February landscape.
In the slanting twilight, cranes form a garland.
It’s a sacred silence that surrounds a pitcher full of water.
A short distance from his home,
The waves break on the shore continually.
In his drawing room,
He savours the warmth of his evening tea.
We raise our heads, summoning all our courage,
Look at what he is gazing at:
What does one find there?
Perhaps a sparrow, a flower, a haiku.
26-8-2022
lovely, sir.
Thank you