DREAMS DORMANT

Reading Time: 3 minutes
83 నాటికి నాకు ఇరవయ్యేళ్ళు. డిగ్రీ చదువు మధ్యలో ఆపేసి ఉద్యోగంలో చేరిపోవటంతో చదువు సంగతి మర్చిపోయేను. ఒకరోజు మా అన్నయ్య వచ్చి కనీసం డిగ్రీ కూడా లేకపోతే ఎలా అని పరీక్షలు రాయడం కోసం ప్రైవేటు అభ్యర్థిగా ఫీజు కట్టించాడు. దాంతో మూడేళ్ళ పరీక్షలూ ఒక్కసారి రాసేసాను. ఒక్కరోజు కూడా పుస్తకం తెరిచింది లేదు. ఇంటర్మీడియేటులో ఏమి చదువుకున్నానో అదే. బి ఏ లో ఫస్టు క్లాసు వచ్చిందంటే అది గురుకుల విద్యాసంస్థల మహిమ.
 
కాని ఆ తర్వాత మరేమీ చెయ్యాలని అనిపించలేదు. సివిల్ సర్వీసు పరీక్షలు రాయాలని అంతకు ముందు ఉండేది. కాని రాజమండ్రి నా అన్ని యాంబిషన్లని మరపించేసింది.
 
ఆ రోజుల్లో నెల జీతం దాదాపు అయిదువందలు వచ్చేది. మా పెద్ద చెల్లెళ్ళు ఇద్దరినీ రాజమండ్రిలో సదనంలో చేర్పించాను. వాళ్ళ చదువులకి కొంత కట్టేవాణ్ణి. కొంత ఇంటికి పంపేవాణ్ణి. నేనుంటున్న ఇంటి అద్దె యాభై రూపాయలు, హోటల్లో నెలవారీ మీల్సు టికెట్లు పోను రెండో తారీక్కి చేతిలో పది పన్నెండు రూపాయలు మిగిలేవి. తిరగడానికి ఒక సైకిలు ఉండేది. ఆ వయసులో యువకులు ప్రేమలోనో, పరీక్షల్లోనో, పోరాటాల్లోనో కూరుకుపోయి ఉండగా నేను పాటల్లోనూ, పద్యాల్లోనూ మునిగితేలేవాణ్ణి.
 
కొవ్వూరు లాంచీల రేవు దగ్గరే సమాచారం పత్రికాఫీసు. శరభయ్యగారు చాలాకాలం ఆ మేడమీద ఉండేవారు. నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు మొదట్లో వారం పదిరోజులు, నాకంటూ ఒక ఇల్లు దొరికేదాకా, వాళ్ళింట్లోనే ఉన్నాను. పొద్దున్నే వాళ్ళ పెద్దమ్మాయి వీణ వాయించుకునేది. ఆ తెలవారుజామున గోదావరి గాలులూ, ఆ వీణస్వరాలూ మిళితమయిపోయేవి. మాష్టారు సాయంకాలం కాలేజి నుంచి వచ్చాక, ఎవరో ఒకరు కలవడానికి వచ్చేవారు. కావ్యగోష్ఠి నడిచేది. కిందన నాళం భీమరాజు వీథి పూర్తి విపణివీథి. ఎప్పుడూ ఏవో బళ్ళల్లో సరుకు దిగుతుండేది, ఎత్తుతుండేవారు. పనివాళ్ళ అరుపులు వినబడుతుండేవి. కాని పైన మేడమీద అదేమీ పట్టని అపురూపమైన ఒక కావ్యలోకం:
 
‘పాండుచ్ఛాయో పవనవృతయః కేతకీ సూచిభిన్నైః నీడారంభైః గృహబలిభుజాం ఆకుల గ్రామ చైత్యాః..’
 
‘వాడి మయూఖముల్ కలుగువాడు అపరాంబుధి గ్రుంకె, ధేనువుల్ నేడిట వచ్చె నేకతమ..’
 
‘మా గోదావరియే, తదీయతటియే, ఆమ్నాయాంత సంవేద్యుడౌ మా గౌరీశుడె, మా వేణుగోపాలుడే..’
 
ఆ కిందన గోదావరి ఒడ్డున మిత్రులు పోగయ్యేవారు. సిగరెట్లు మండుతుండేవి. దేశదేశాల కవులూ మా మాటల్లో వచ్చిపోతుండేవారు. వాళ్ళతో కలిసి కొత్త కవితలు, కొత్త పాటలు.
 
ఇంకోవైపు-
 
‘హరీన చటో గిరాం మూర్తీ ఇటీవల మా ఇన్ స్పిరేషన్ ‘ అని రాసుకున్నాడు శ్రీ శ్రీ ఒకసారి. చెరబండరాజూ, గద్దరూ మా ఇన్ స్పిరేషన్ గా ఉండే రోజులవి. ఒకసారి కాకినాడ సూర్యకళామందిరంలో, 1981 లో అనుకుంటాను, గద్దర్ బృందం పాటలు, నాట్యం చూసాను.
 
‘కొండలు పగలేసినం, బండలను పిండినం
మా నెత్తురె కంకరగా ప్రాజెక్టులు కట్టినం
శ్రమ ఎవడిదిరో, సిరి ఎవడిదిరా?’
 
‘గాంగోళ్ళమండిమేం బాబు, గరీబోళ్ళమండి మేం బాబు ..’
 
ఆ రోజుల్లోనే టి.జె.రామనాథం గోగ్రహణం వీథినాటకం, అందులో రాంభట్ల కృష్ణమూర్తి గేయం:
 
‘అదే అదే పతాక జైత్ర యాత్ర సాగుతోందిరా
పదే పదే రణానికై నగార మ్రోగుతోందిరా
అహర్నిశల్ వనాలలొ, పొలాలు ఫాక్టరీలలో
శ్రమించు కూలిరైతులార, రండిరా, పదండిరా..’
 
ప్రతి వారాంతమూ కాకినాడ వెళ్ళిపోయేవాణ్ణి. అక్కడ అక్క దగ్గర ఒక స్వాప్నిక ప్రపంచం. ఆ పాటలే వేరు, ఆ పరిమళాలే వేరు.
 
‘ఆ తోటలో ఒకటి ఆరాధనాలయమూ, ఆలయము లోని అందగాడెవరే..’
 
‘సాయంకాలం సముద్రపొడ్డున నిలిచిందీ ఒక నావ, ఆ నావలోన నవసుందరొక్కతె..’
 
‘సిగలో, అవి విరులో, అగరుపొగలో, అత్తరులో, మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో..’
 
‘సజన్ రే ఝూట్ మత్ బోలో, ఖుదాకే పాస్ జానా హై, వహా పైదల్ హీ జానా హై..’
 
‘ ఎవియో మురిపాలెటకో పయనాలూ దైవాల నీమాలింతే
పసితనపూ మనోరథము వెన్నెల నీడయిపోయేనులే..’
 
కాకినాడ వెళ్ళినప్పుడు సి.ఎస్ నీ, సీతారామశాస్త్రినీ కలిస్తే అది మళ్ళా వేరే ప్రపంచం. సీతారామశాస్త్రి పాటలు ఈ లోకానివి కావని తెలుస్తూనే ఉండేది.
 
‘గాలి పల్లకిలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె..’
 
‘ఏమి లీల నీ వినోదము, మాయామతివి నీవు, తెలియరాదు నీ విలాసము..’
 
‘శూన్యంగా నీలాకాశం సుదూరంగా వినీల సాగరం కలిసిన రేఖది ఏమిటీ శూన్యంగాక మరేమిటీ..’
 
వీటన్నిటిమధ్యా మా ఊరు, ఆ అడవి, ఆ సూర్యోదయాస్తమయాలు, ఆ ఏరు, ఆ చాపరాయి, ఆ గంగాలమ్మ పండగ.
 
అప్పటికి నా వంట్లో రక్తం బదులు శ్రీ శ్రీనే ప్రవహిస్తూ ఉండేవాడు. భావకవులు, బైరాగి, శేషేంద్ర, ఇస్మాయిల్ ఎలానూ. బైరాగి ఆగమగీతి ఇంకా చేతికి అందని కాలం. ఋష్యాశ్రమం లాంటి గురజాడ కావ్యలోకం ఇంకా దూరంగానే ఉంది. కృష్ణశాస్త్రి కొంత అందీ, అందకుండా. కాని ఆ గీతాలే తిండీ, నిద్రగా బతికేను:
 
‘ప్రళయకాల మహోగ్రదగ్ర భయదజీమూతోరు గళఘోర గంభీర పెళపెళార్భటులలో మెరపేలా..’
 
‘ప్రదీప్త కీలా ప్రవాళ మాలా ప్రపంచవేలా ప్రసారములలో మిహిర వాజితతి, మఖవ ధనుర్ద్యుతి..’
 
‘స్రవత్సంతత తిమిర ఝుర ఋతయుత స్వాంత గభీర ఖనిలో వెలుగులెక్కడ సోనియా..’
 
అప్పుడు రాసిన కవిత ఇది. 83 చివర్లో మా సాహితీవేదిక వారు సంకలనం చేసిన ‘కవితావేదిక ‘లో ఈ కవిత కూడా చేర్చారు. ఆ పుస్తకం ఆవిష్కరణకు వచ్చిన శేషేంద్ర ఈ కవిత చదివి ‘ ఈ కవిని వసంత శాఖ మీద కోకిలగా ప్రతిష్టిస్తున్నాను ‘ అని అన్నాడు. ఆ మాటల్ని మర్నాడు సుబ్బూ సమాచారంలో బాక్సు కట్టి మరీ ప్రచురించాడు.
 
ఎట్లాంటి కాలం అది! అటువంటి కవిత ఇప్పుడు రాయగలనా? శ్రీ శ్రీ అనుకున్నట్టుగా ‘ఇరవయ్యో ఏడు నాకు మళ్ళా ఎలా వస్తుంది చెప్పు?’
 
 

నిద్రిస్తున్న స్వప్నం

 
ఒకప్పుడు రుధిరం తాగిన
చాళుక్య యుగపు కత్తి
మ్యూజియం షోకేసులో నిర్నిమిత్తంగా నిద్రిస్తో-
 
ఇరవయ్యేళ్ళ వసంతలక్ష్మి
ఇంకా దాగుడుమూతలాడుతోంది నాతో-
 
విప్లవవీరులు
అడపాతడపా కలుస్తోనే వున్నారు
ఏవేవో చెయ్యాలంటో-
 
విశ్రాంతి దినాలు పనిదినాలుగానూ
పనిదినాలు ఇబ్బందికరంగానూ
జీవితమే అసౌకర్యంగా-
 
నీ కోపావేశాలు అప్పటిలానే వున్నాయా
చిన్నప్పటిలా
అని ఉత్తరాలు రాస్తో పాతమిత్రులు.
 
నేను చచ్చిపోయాననుకునేవాణ్ణి
కాదు
నేను పురావస్తువునైపోయి
నిశ్చింతగా నిద్రిస్తున్నాను.
 
రోజూ నా సైకిల్ మీద
ఒక అపురూప స్వప్నం
ఊగుతో; తూగుతో; జోగుతో.
 
8-5-1983
 
DREAMS DORMANT
 
A Chalukyan sword, blood-stained,
Sleeping inside the museum case.
 
Damsel spring is playing hide and seek
With me for the twentieth time.
 
Now and then the rebellious youth knocks on my door
With plans to change the world.
 
Vacations became working days and
Work days become grind days.
 
Do you still have the same rage and fire?
Old friends keep writing letters to me.
 
I thought I was dead,
I became an antique instead.
 
On my bike, a singular dream rides every day
Swaying, swinging, and snoozing.
 
5-7-2022

Leave a Reply

%d bloggers like this: