జామినీ రాయ్

j

నిప్పులు చెరుగుతున్న మధ్యాహ్నపు ఎండలో జామినీ రాయ్ చిత్రలేఖనాల అరుదైన ప్రదర్శన చూడటం కోసం సాలార్ జంగ్ మూజియానికి వెళ్ళాను. వారం రోజులనుంచీ అనుకుంటున్నది ఇవ్వాళ్టికిసాధ్యపడింది.

అకాశానికీ భూమికీ మధ్య నగరమొక వేణ్ణీళ్ళ బానలాగా మరుగుతూండగా, కార్లు, ఆటోలు,బస్సులు వదులుతున్న వేడి పొగ నిట్టూర్పుల మధ్య నేనొక్కణ్ణీ మూజియానికి వెళుతూండగా నన్ను చూసి నాకే నవ్వొచ్చింది.

నడివేసవి దినాల్లో మూజియంలో ఉండవలసినంత రద్దీ ఉంది. కానీ ఎప్పట్లానే మొదటి అంతస్తుమీద పడమటి బ్లాకులో పై అంతస్తు లో అ చిత్రకళా ప్రదర్శనలో చాలాసేపటిదాకా నేనొక్కణ్ణే తచ్చాడుతూ గడిపేసాను. హాల్లో కాపలాకి కూచున్న మూజియం ఉద్యోగికి ఆ బొమ్మల్తోగానీ, ఆ చిత్రకారుడితోగానీ ఏమీ పని లేదు. నేను ఫొటోలు తీసుకొవచ్చునా అని అడిగితే, టికెట్టు ఉందా లేదా అని మాత్రమే అడిగి మళ్ళా మౌనంలోకి జారుకున్నాడు.

జామినీ రాయ్ (1887-1972) చిత్రలేఖనాల్ని నేనింతదాకా చిత్రకళాగ్రంథాల్లోనూ, ఓషియన్స్ కేటలాగుల్లోనూ మాత్రమే చూసాను. ఆ బొమ్మల అసలు ప్రతుల్ని చూడటమిదే మొదటిసారి. హైదరాబాదుకి కూడా ఇదే మొదటిసారి అని ప్రదర్శన సమాచారంలో రాసిఉంది.

ఒక చిత్రకారుడు గీసిన చిత్రాల అసలు ప్రతుల్ని చూడటంలో ఒక వింతైన అనుభవం ఉంటుంది. అది మనం చాలాకాలంగా చదువుతుండే రచయితను మొదటిసారి చూసినప్పుడు కలిగేలాంటి అనుభవం. నేనొకప్పుడు రాజమండ్రిలో ప్రింటోఫైన్ ప్రెస్సులో రావిశాస్త్రిగారిని చూసినప్పుడు అదేమిటో స్పష్టంగా వివరించలేని భావాలకు లోనయ్యాను. ఆయన రాసినకథలకూ, నవలలకూ ఎంత మాత్రం పొంతనలేని మనిషినొకర్ని అక్కడ చూసినట్టనిపించింది. ‘మీరేనా రావిశాస్త్రి’ అని మళ్ళీ అడగాలనిపించింది. ఇప్పుడు జామినీ రాయ్ బొమ్మల్ని చూసినప్పుడు కూడా నాకెందుకో ఒక సాధారణమైన పల్లెటూరి వడ్రంగినో, కమ్మరినో, కంసాలినో చూసిన భావం కలిగింది.

51

చిత్రకారుడిగా జామినీ రాయ్ జీవితసాఫల్యం కూడా అదే. ఆయన చిత్రలేఖనం సాధన మొదలుపెట్టినప్పుడు ఐరోపీయ చిత్రకారుల్నీ, బెంగాల్ చిత్రకళారీతినీ కొంత అనుసరించే ప్రయత్నం చేసాడు. పోస్ట్ ఇంప్రెషనిష్టు తరహా చిత్రాలు గీసాడు. అక్కడ ప్రదర్శనలో కూడా ఒక పికాసో తరహా అనుసరణ లేకపోలేదు. కాని ఆయన అక్కడితో ఆగిపోకుండా తన అన్వేషణ కొనసాగించేడు. తన సొంతగొంతుకోసం వెతుక్కున్నాడు. ఒకరోజు తన పిల్లవాడు అమియా రాయ్ సుద్దముక్కతో నేలమీద బొమ్మ గియ్యడం చూసాడు. అంతే, ఆయన అన్నాళ్ళుగా వెతుక్కుంటున్నదేదో ఆయనకి ఒక్కసారిగా దర్శనమిచ్చింది. ఆ తర్వాత జామినీ రాయ్ గీసిందంతా భారతీయ చిత్రకళలో ఒక విలువైన అధ్యాయంగా మనం చదువుకుంటున్నాం.

బెంగాల్లో ఇప్పటికీ కనిపించే కాళిఘాట్ చిత్రకారులు పడువాల్లాగా జామినీ రాయ్ కూడా తానొక పడువా కావాలనుకున్నాడు. కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవదృశ్యాన్ని సబ్జెక్టివ్ గా దర్శించడానికి ప్రయత్నించడంలోంచే ఆధునిక ఐరొపీయ చిత్రకళా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. కంటికి కనిపిస్తున్న దృశ్యాన్ని రియలిస్టు పంథాలో చిత్రించడానికి ఇష్టపడని భారతీయ చిత్రకారులు కూడా రకరకాల ప్రయోగాలు చేసారు. కాని ఆ ప్రయోగాలకు కూడా చాలావరకు ఐరోపీయ ఉద్యమాలే మాతృక గా ఉంటూ వచ్చాయి. కాని మొదటిసారి జామినీ రాయ్ తన మనోఫలకం మీద కనబడుతున్న చిత్రాల్ని కాగితం మీద పెట్టడానికి తూర్పుకీ పశ్చిమానికీ చూడకుండా తన చుట్టూతా ఉండే పల్లెల వైపూ, పల్లెమనుషుల వైపూ చూసాడు. ఒక పడువా చిత్రకారుడు తన కొడుకుతో కలిసి కుటుంబవృత్తిలాగా బొమ్మలు గీసినట్టే జామినీ రాయ్ కూడా తన కొడుకు అమియారాయ్ తోనూ, తన ప్రియశిష్యుడు మణీంద్రనాథ ఛటర్జీతోనూ కలిసి ఈ కొత్త తరహా బొమ్మలు గియ్యడం మొదలుపెట్టాడు.

సిప్రా చక్రవర్తి మాటల్లో

‘(జామినీ రాయ్) ఎంచుకున్న విషయాలు ఎంతో సుసంపన్నమైనవీ, తరుగులేనివీను. ఆయన తన మొదటిదశలో ఐరోపీయ విషయాల్నీ, ప్రకృతిదృశ్యాల్నీ, ముఖచిత్రాల్నీ చిత్రించారు. తర్వాత ఆయన ఇతివృత్తం పూర్తిగా మారిపోయింది. తనకు కావలసిన ఇతివృత్తాల్ని ఆయన తన చుట్టూ ఉండే మనుషులనుంచే తీసుకోవడం మొదలుపెట్టారు. రామాయణం. కృష్ణలీల, దేవీదేవతల వంటి పౌరాణిక ఇతివృత్తాలతోపాటు ఆయన ఎంచుకున్న దృశ్యాల్లో గ్రామీణ రైతులు, వడ్రంగులు, కమ్మరులు, సంతాల్ స్త్రీపురుషులు, బావుల్ సాధువులు, ఫకీర్లు, హరిదాసులు ప్రత్యక్షంకావడం మొదలుపెట్టారు.’

జాన్ ఇర్విన్, విష్ణుదే జామినీ రాయ్ గురించి రాస్తూ ‘సుదీర్ఘకాలం పాటు చేసిన ఈ రూపసాధన తరువాత ఆయన కృతుల్లో ఒక లయ, ఒక సమతౌల్యం కనబడటం మొదలయ్యింది’ అని రాస్తూ ఆచార్య సుహ్రవర్దీ రాసిన ఈ వాక్యాల్ని ఉదహరించారు:

‘(జామినీ రాయ్) చిత్రాల్లో ఎక్కుచెదరని రేఖానైపుణ్యమే కాకుండా వర్ణ సంయోజన కూడా ఆయన లక్ష్యానికి తగ్గట్టుగానే సమకూరింది. మానవాకృతికి సంబంధించినంతవరకూ అవి మన మధ్యయుగాల, జానపదకళారీతుల సంగ్రహప్రకటనలు. ఆ కృతులన్నిటా గొప్ప త్రాణ కనిపిస్తుంది కాబట్టి ఆయన్ని కేవలం ఒక అలంకరణ చిత్రకారుడిగా చూడటం పొరపాటు. అటువంటి సుప్రతిష్టిత వల్ల ఆ చిత్రాలు కొన్నిసార్లు అలంకారయోగ్యంగా అనిపించవచ్చు, కానీ అవి నిజానికి గొప్ప బాధ్యతతో ఒక కళాదృక్పథానికి అనుగుణంగా సాధించుకున్న నిష్కళంక సౌందర్య సాక్షాత్కారాలని చెప్పవలసిఉంటుంది.’

నేనా బొమ్మల్నీ, అరుదైన ఆయన ఫోటోల్నీ, ఆయన రాసిన ఉత్తరాల్నీ(ఆ బెంగాలీ చేతిరాత కూడా రేఖాచిత్రణలాగే ఉంది), మళ్ళా మళ్ళా చూస్తూండగా, ఆ హాల్లో కి సందర్శకుల గుంపొకటి తోసుకుంటూ వచ్చింది. టిక్కెట్టు కొనుక్కున్నందుకు మూజియంలో ఉన్న ప్రతిహాల్లోనూ ఒకసారి తొంగిచూడాలని తప్ప మరే ఉద్దేశ్యం లేనివాళ్ళు. కాని ఆ గుంపులో పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ కేకలు కేరింతలు కొంతసేపు ఆ బొమ్మల చుట్టూ ఒక సజీవమానవ సాన్నిధ్యాన్ని సృష్టించాయి. కాని కొన్ని క్షణాలపాటే. మళ్ళా వాళ్ళంతా వెళ్ళిపోయేరు. నేనూ, ఆ కాపలాదారూమాత్రమే మిగిలాం.

ఎలాగూ మూజియానికి వచ్చాను కదా అని నేను కూడా పాశ్చాత్య చిత్రకళ గాలరీలోకీ, చీనా జపాన్ గాలరీలోకీ తొంగిచూసాను. ఇంతకుముందు చూసినవే. ఇంతకుముందు అనుకున్నట్టే, మళ్ళా మరొకసారి, చిత్రకళకు సంబంధించినంతవరకూ సాలార్ జంగ్ ది చాలా తక్కువ రకం అభిరుచి అని అనుకోకుండా ఉండలేకపోయాను. జామినీ రాయ్ బొమ్మలు చూసినతరువాత అక్కడ మరేదీ చూడాలనిపించలేదు.

అక్కడ జామినీ రాయ్ మీద రాసిన వివరణ చివర్లో స్టెల్లా క్రామ్రిష్ రాసిన ఈ వాక్యాన్ని ఉదాహరించారు. ఆమె ఇలా రాసింది:

‘దుమ్మురేగుతున్న బెంగాల్ మీద ఒక మెరుపు మెరిసింది. నిస్తబ్దంగా పడిఉన్న ఆకాశంలో ఒక నూతన సందేశం వినవచ్చింది. ఋతుపవనం దగ్గర్లోనే ఉందన్న వార్త. ఎండిబీటలు వారిన నేలమీద మళ్ళా ఆకుపచ్చదనం మోసులెత్తుతుందనీ, గాలి తేటపడుతుందనీ సందేశమది. ఆధునిక భారతీయ చిత్రకళలో జామినీ రాయ్ చిత్రకళ కూడా అటువంటి శుభశకునం.’

భీకరంగా బయట ఎండ నిప్పులు కక్కుతున్నా ఈ సారి నాకేమంత కష్టమనిపించలేదు. ఈ ఏడాది ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకకముందే నా హృదయాకాశాన్ని తాకినట్టనిపించింది.

23-5-2015

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading