జామినీ రాయ్

నిప్పులు చెరుగుతున్న మధ్యాహ్నపు ఎండలో జామినీ రాయ్ చిత్రలేఖనాల అరుదైన ప్రదర్శన చూడటం కోసం సాలార్ జంగ్ మూజియానికి వెళ్ళాను. వారం రోజులనుంచీ అనుకుంటున్నది ఇవ్వాళ్టికిసాధ్యపడింది.  అకాశానికీ భూమికీ మధ్య నగరమొక వేణ్ణీళ్ళ బానలాగా మరుగుతూండగా, కార్లు, ఆటోలు,బస్సులు వదులుతున్న వేడి పొగ నిట్టూర్పుల మధ్య నేనొక్కణ్ణీ మూజియానికి వెళుతూండగా నన్ను చూసి నాకే నవ్వొచ్చింది.