ఒకప్పుడు ఉజ్జయినిలో ఉదయన పండితులుండేవారని కాళిదాసు గుర్తుచేసుకుంటాడు. సన్నిధానం అటువంటి రాజమండ్రి పండితుడు. దాదాపు వందా, నూట యాభయ్యేళ్ళ రాజమండ్రి సాహిత్య, సాంస్కృతిక చరిత్ర అతడికి కంఠోపాఠం. ఆ ముచ్చట్లు ఆయన చెప్తుంటేనే వినాలి. ఒకప్పటి రాజమండ్రిగురించి మాట్లాడటం మొదలుపెడితే ఆయన మొత్తం దేహంతో మాట్లాడతాడు. మాటమాటకీ గుండె గొంతులోకి ఉబికి వచ్చేస్తుంది.
కృష్ణలీలాస్మరణ
నా జీవితంలో కవిత్వం ప్రవేశించింది నా పసితనంలో. అయిదారేళ్ళ శైశవంలో మా ఊళ్ళో వేసవిరాత్రుల్లో ఆరుబయట నక్షత్రఖచిత ఆకాశం కింద మా బామ్మగారు భాగవత పద్యాలు చదువుతూండగా వినడం, గజేంద్రమోక్ష్జణం, రుక్మిణీకల్యాణం ఆమె నాతో కంఠస్థం చేయించడం నన్నొక అలౌకిక లోకానికి పరిచయం చేసాయి.