సంస్కార కర్పూరకరండం

మొన్న ఆదివారం అక్క విజయవాడ వచ్చినప్పుడు సన్నిధానం నరసింహ శర్మ రాసిన ‘మధు స్మృతి’ పుస్తకం చేతుల్లో పెట్టింది. ఆంధ్రపురాణ కర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారిని తలుచుకుంటూ శర్మ గారు రాసిన వ్యాసాలవి. నూటయాభై పేజీల ఆ పుస్తకం చదవడానికి గంట కూడా పట్టలేదు. కాని చదవడం పూర్తయ్యాక మనసంతా చాలా దిగులూ ఆవహించింది. బెంగగా కూడా అనిపించింది. అటువంటి కాలాన్నీ, అటువంటి మనుషుల్నీ మళ్ళా చూడలేము కదా అనిపించింది. మూడున్నర దశాబ్దాల కిందటి నా రాజమండ్రి జీవితం, ఆ సాహిత్యానుభవం ఎప్పటివో పరిమళాల జ్ఞాపకాలుగా నా మనసంతా నిండిపోయాయి.

సన్నిధానం నరసింహ శర్మ అంటే నడిచే రాజమండ్రి. పాంటూ చొక్కా తొడుక్కున్న గోదావరి పాయ. మాట్లాడే గౌతమీ గ్రంథాలయం.

ఒకప్పుడు ఉజ్జయినిలో ఉదయన పండితులుండేవారని కాళిదాసు గుర్తుచేసుకుంటాడు. సన్నిధానం అటువంటి రాజమండ్రి పండితుడు. దాదాపు వందా, నూట యాభయ్యేళ్ళ రాజమండ్రి సాహిత్య, సాంస్కృతిక చరిత్ర అతడికి కంఠోపాఠం. ఆ ముచ్చట్లు ఆయన చెప్తుంటేనే వినాలి. ఒకప్పటి రాజమండ్రిగురించి మాట్లాడటం మొదలుపెడితే ఆయన మొత్తం దేహంతో మాట్లాడతాడు. మాటమాటకీ గుండె గొంతులోకి ఉబికి వచ్చేస్తుంది.

వావిలాల వాసుదేవశాస్త్రినుంచి కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ దాకా రాజమండ్రిలో జీవించిన ప్రతి ఒక్క సాహిత్యవేత్తా శర్మగారికి ప్రీతిపాత్రుడేగాని, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారు మరీప్రీతిపాత్రుడు. గురువు. నెచ్చెలి. భావావేశరథసారధి. నాకు చాలా సార్లు అనిపించేది, శాస్త్రి గారి పట్ల ఇంత భక్తీ, ఇంత ఆవేశం లేకపోయుంటే శర్మ గారు తనంతట తానొక మహాకావ్యం రాయగలిగి ఉండేవారేమో అని. కాని, శర్మగారు ఒక రసభృంగం. పువ్వునుంచి పువ్వుకి పరాగాన్ని అందిస్తూ, రసానంద ఫలదీకరణం చేసే బాధ్యత సరస్వతీదేవి ఆయనకు అప్పగించింది. ఆ పువ్వులన్నింటిలోనూ మధునాపంతుల ఒక సహస్రదళ పద్మం శర్మగారికి.

‘మధుస్మృతి’ (2019) మధునాపంతులవారితో శర్మగారి సాంగత్యం, సాన్నిహిత్యపు తలపోతనే కాని, అంత మాత్రమే కాదు. అదొక అపురూపమైన సాహిత్యసమాజం తాలూకు వర్ణన కూడా. సాహిత్యం తప్ప మరేమీ తెలియని, మరేమీ పట్టని కొందరు రసజ్ఞుల రోజువారీ జీవితాల కొన్ని స్నాప్ షాట్స్. ఇప్పుడా జీవితం మనకి మరెక్కడా కనబడదు, చివరికి రాజమండ్రిలో కూడా.

వెయ్యేళ్ళుగా రాజమండ్రి తెలుగువాళ్ళ సాహిత్య రాజధాని. మరీ ముఖ్యంగా 1850 నుంచి 1950 దాకా శతాబ్ద కాలం పాటు రాజమండ్రి తెలుగువాళ్ళ సాహిత్య, సాంస్కృతిక పునరుజ్జీవనంలో పెద్ద పాత్ర వహించింది. ఆ చైతన్యం 60లు 70 ల దాకా కూడా ఎంతో కొంత సజీవంగానే ఉండేది. ఎనభైలనాటికి సన్నగిల్లడం మొదలుపెట్టింది. ఆ ప్రాభవం చివరిరోజుల్లో నేనక్కడున్నాను. దీపం ఘనమయ్యే ముందు కనిపించే ఆ చివరి వెలుగుని నేను కళ్ళారా చూసాను. కాని శర్మగారు ఆ ఉజ్జ్వల సాహిత్యసరంభాన్ని చాలా దగ్గరగా, కొన్ని సార్లు అందులో ఒక పాత్రగా, కొన్ని సార్లు ప్రేక్షకుడిగా, తదేకంగా, తాదాత్మ్యంతో చూసారు, అందులో పాలుపంచుకున్నారు. మధుస్మృతి ఆ తాదాత్మ్య వివరణ. అందుకే ఆ పుస్తకాన్ని అంతలాగా ఆవురావురుమంటూ చదివేసాను. అందుకే ఆ పుస్తకం చదవగానే అంతలానూ దిగులుపడ్డాను.

సాహిత్యమంటే ఆ మనుషులకి వట్టి పుస్తకాలూ, పద్యాలూ కాదు. ప్రసంగాలూ, ప్రశంసలూ కాదు. సాహిత్యమంటే వాళ్ళకొక సంస్కృతి, ఒక సంస్కారం, కావ్యవాక్కు ఆధారంగా మనుషులు ఒకరి అంతర్లోకాల్లోకి మరొకరు చేసే ప్రయాణం.

సాహిత్యమంటే వాళ్ళ దృష్టిలో మనిషి ఆర్థిక, సాంఘిక ఉపాధుల్ని గౌరవించడం కాదు. తోటి మనిషి రసానంద సామర్థ్యాన్ని గౌరవించడం. అదొక సున్నితమైన సాహచర్యం. పూర్వమహాకవుల్తో సాగే ఒక నిత్యసంభాషణ.

తన పుస్తకాన్ని ‘మధునాపంతుల శారదావరణ స్ఫురణలు’ అని కూడా చెప్పుకున్నారు శర్మగారు. మధుస్మృతిలోని 53 వ్యాసాలూ కూడా ప్రతి ఒక్కటీ ఒక సాహిత్యస్వర్ణయుగానికి చెందిన ఆనవాలు. పుస్తకం మొదలుపెడుతూనే మా మాష్టారు శరభయ్యగారు రాసిన మాటలు కనిపిస్తాయి. మాష్టారు ఇలా రాస్తున్నారు:

‘ ఇప్పటి నా నలభై ఏళ్ళ నా జీవితంలోని మొదటి ఆప్తులు మహీధరా, మధునాపంతులా మొదలైనవారంతా సన్నిధానంలో సన్నిధి చేసినట్లే నాకనిపిస్తుంది..గోదావరి తగిలినప్పుడు నీటిగాలి స్పర్శ వలె ఇతని సన్నిధానం ఎప్పటికీ నాకు ఆప్యాయంగా ఉండేది..’

తన జ్ఞాపకాలు మొదలుపెడుతూ శర్మగారు రాజమహేంద్రవరం సాహితీనేపథ్యాన్ని ముందు ప్రస్తావించారు. అందులో ఒక మాటన్నారు:

‘కలియుగంలో నామస్మరణ ధన్యోపాయమన్నారు. అచ్చమైన సాహిత్యపుటాకలియుగంలో నాటి కవి రచయితల నామస్మరణలూ ధన్యుల్ని చేస్తాయి, మనల్ని, చేయవా మరి? ‘అని.

వీరేశలింగం, చిలకమర్తి, గిడుగు, చెళ్ళపిళ్ళ, శ్రీపాద, చలం, కవికొండల, జాషువా వంటి దిగ్గజాలు తిరుగాడిన పట్టణం అని మనకి గుర్తుచేస్తూ తన ముచ్చట్లు మొదలుపెడతాడు.
ఆ బంగారు తలపులన్నీ మళ్ళా ఇక్కడ ఎత్తి రాయలేను గానీ, రెండు మూడు ఎంచిచూపకుండా ఉండలేను.

మొదటగా గుర్తొచ్చేది మధునాపంతులవారికీ, మల్లంపల్లి శరభయ్యగారికీ ఉండే స్నేహం గురించిన జ్ఞాపకం. శరభయ్యగారు మధునాపంతులని ‘సంధ్యాసఖా’ అని పిలిచారు. కలకండల్లాంటి అయిదు పద్యాలు రాసారు. అపురూపమైన ఆ పద్యాల్ని మనకందివ్వడమే కాక, ఆ పద్యాలకు మళ్ళా తనమాటల్లో తాత్పర్యం కూడా రాయకుండా ఉండలేకపోయారు శర్మ గారు. రెండుమూడు పద్యాలు ఆ తాత్పర్యంతో చిత్తగించండి:

అజ్ఞకృత ప్రశంసలు సహస్రములైనను నిల్వబోవు, త
త్త్వజ్ఞుల సూక్తియొకండను భవప్రమితంబు నివాతదీపమై
విజ్ఞ హృదబ్జ వీధికల వెల్గును సంసృతి కల్గుదాక, సా
రజ్ఞులు నిన్ను బోలికలరా! యధునాంధ్ర వచోవసుంధరన్!

(తెలియనివారు చేసే మెచ్చుకోళ్ళు వేవేలైనా ఉండవు. తత్త్వజ్ఞుల మంచిమాటే-అనుభవంతో వచ్చి నివాతదీపంలా వెల్గుతుంది. (నివాత దీపమంటే గాలి చెదిరించలేని దీపం). సారం తెలుసుకోవడంలో మీ వంటి వారున్నారా ఆంధ్రదేశంలో?)

వాసితమైన యే భవము వాసనయో! యిటనాకు, నీదు సా
వాసము, మల్లికా ప్రసవవాసము, నిత్యనవీన సౌహృదో
ల్లాసము, విస్మృతక్షణ విలాసము, గౌతమి యొడ్డులందు సం
ధ్యాసఖ, సంస్కృతాంధ్ర కవితా వనితా హృదయాధివాసముల్

(శాస్త్రిగారూ, మీ సహవాసం ఏ జన్మల సువాసనాఫలమో! మల్లెపూల పరిమళాల సఖ్యం మీది. ఎప్పుడూ కొత్తగా అనిపించే స్నేహ ఉల్లాసం మీది. గోదారి ఒడ్డుపై సంజెవేళల్లో మనం సంస్కృతం, ఆంధ్ర కవితల వనితల హృదయాల్లో నివసించాం. కాలాన్ని మర్చిపోయేవాళ్ళం. సంధ్యాసఖులం మనం)

ఏ రాజ్యమ్ములు సాగనీ, మరియు దామే రాజులే ఏలనీ
చేరన నాటికి నేటికిన్ గవులు నిన్ శ్రీ గౌతమాపత్య వాః
పూరంపున సయిదోడుగా సుకవితాభోగంబవిచ్ఛిన్న ధా
రారమ్యంబగు రాణ్మహేంద్రనగరీ! రాజద్యశోవైఖరీ!

(ఓ రాజమహేంద్ర నగరి రాజద్యశో వైఖరీ! ఏ రాజ్యాలు సాగనీ! ఏ రాజులు ఏలనీ! గౌతమి నది స్నేహితురాలుగా అక్కడ ప్రవహిస్తోంది. ఇక్కడ నీలో సుకవితాభోగం అవిచ్ఛిన్న ధారగా ప్రవహిస్తోంది. అడ్డు ఆపుల్లేని కవితాధారలతో ఎప్పుడూ అందంగానే ఉంటావు.)

1975 లో మధునాపంతుల వారికి చేసిన సమ్మాన సంచిక ‘మధుకోశం’ కి ప్రధాన సంపాదకులుగా శరభయ్యగారు ‘ఉడుగర’ అని తన సంపాదకీయవ్యాసం రాసారు. (ఉడుగర అంటే కానుక అని అర్థం). అందులోని వాక్యాలు శర్మగారు మళ్ళా మనకి గుర్తు చేస్తున్నారు. కొన్ని వాక్యాలు చూడండి:

‘ఇది సహృదయ భృంగములు మధుమయ కావ్యపుష్పవన వీధులలో తిరిగి తిరిగి బిందువు బిందువుగా సేకరించి నింపుకున్న మధుకోశము. రాశీకృతమైన మధువ్యవసాయ ఫలము! ఇందు నింపిన మధువంతయు నేటిది కాదు. ఈ భృంగములన్నియు ఒక్కనాటివి కావు. కొన్ని పురాణములు. నడిమికాలము నాటివి కొన్ని. మరికొన్ని నవీనములు. అన్నింటికి కృతజ్ఞతా మధువు కాక ఏమి పంచి తయారు చేయగలము!…ఆంధ్ర రసజ్ఞపుష్పంధయము లన్నిటికి ఇది ఆమెత. ఈ మధూత్సవ సమయములో ఇట్టి నిర్మక్షిక నిస్సపత్నమైన మధుకోశమును ‘పురాణ కవిభృంగము’ కదా అన్న విశ్వాసముతో శ్రీ సత్యనారాయణ శాస్త్రిగారి సన్నిధిలో సభక్తికముగా సమర్పించుకొనుచున్నాము.’

ఈ వాక్యాలు చదవగానే నా గుండె ఆగిపోయినట్టనిపించింది. తన సమకాలికుడైన ఒక కవికి మరొక రసజ్ఞుడు ఇటువంటి వాక్యాలతో నీరాజనం పట్టడం నేటి సాహిత్యప్రపంచం లో మనం ఊహించగలమా?

ఈ పుస్తకంలో సాహిత్య చర్చలున్నాయి, అరుదైన విశేషాలున్నాయి,అందమైన పద్యాలెన్నో ఉన్నాయి. ఉదాహరణకి పోతన పైన శాస్త్రి గారి ఈ పద్యం చూడండి:

గోపాల శిశుమౌళి కుటిల కుంతల పాళి
వక్రోక్తిలీల రాబట్టినాడు
వ్రజబాలు సుషిరరావమున నవిచ్ఛిన్న
వాజ్మహస్సులు గిలుబాడినాడు
వెన్నుని తలనెమ్మిపించమ్ముల్లో వర్ణ
విన్యాసరుచి గొల్లబెట్టినాడు
నవనీతదస్యు వెన్నడి సమాసపు వెన్న
పూసలు కొసరి కాజేసినాడు

లేదుపో! తనకెక్కడి పేదతనము!
భాగవతరూప జాతరూపమ్ము ధనము
నతడు రాశులు వోసె సర్వాంధ్ర జాతి
కారగింపుగ రసమయం బైన యాస్తి.

కొన్ని అందమైన ఛలోక్తులున్నాయి. ఉదాహరణకి, ఇది చూడండి:

‘ఉక్తి చమతృతికి పెట్టింది పేరు మధునాపంతులవారు. ‘వెలుతురు పిట్టల కవి’ కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ శాస్త్రిగారికి తన కవితాసంపుటిని సవినయంగా అందచేస్తూ, అట్ట తరువాత వుండే తెల్లకాగితంపై ‘మధునాపంతుల సత్యన్నారాయణ శాస్త్రి గారికి’ అని రాసారు. ఆ పొరపాటును గమనించి సున్నితంగా శాస్త్రిగారు ‘నా వత్తు నాకొద్దు..మీరే అట్టేపెట్టుకోండి’ అన్నారు. సత్యనారాయణ శాస్త్రిలో నా ఒత్తు ఉండదు. శ్రీమన్నారాయణ లో నా ఒత్తు ఉంటుంది.’

కాని సాహిత్యపరమప్రయోజనం సంస్కారంగా మారడం. మధునాపంతుల సంస్కారమెటువంటిదో చెప్పే ఈ ముచ్చట చూడండి:

‘ఓ మారు ధవళేశ్వరం నుండి ఎవరో ఒకరిద్దరు వచ్చి వారి తాలూకు పెద్దలు కీర్తిశేషులవగా వారి గురించి మంచి మాటలతో రాసిన ఒక సంతాప పత్రికా ప్రకటన చూపించారు.

మాష్టారు విచారవదనాలతోనున్న వారితో సానునయంగా మాట్లాడుతున్నారు. ఆ మృతుల మంచిచెడ్డలు తెలుసుకుంటున్నారు.

ఇంతలో నేను అక్కడివారు తెచ్చిన సంతాప ప్రకటన చూసాను, అందులో శీర్షిక పెద్ద పెద్ద అక్షరాలతో ‘భాష్పాంజలి’ అని వుంది. ‘మాస్టారూ, చూడండి, ఇలాగే భాషను ఖూనీ చేస్తుంటారు’ అనేసాను. అలా కటువుగా నేనడం ఆయన ఎదురుగా అనడం ఆయనకి నచ్చలేదు.

వెంటనే మాస్టారు ‘భాష్పాంజలే ప్రస్తుతానికి కరెక్టు. ‘భా ‘కి గూటం వుండటమే కరెక్టు. ‘బా ‘ అక్షరానికి కింద ఒత్తు ఉండటం వల్ల కిందకి కన్నీటి చుక్క పడుతున్నట్టు లేదూ? బాష్పాంజలిలో కన్నీటి చుక్క లేదు గమనించావా ‘ అన్నారు కొంచెం మందలింపుగానే.

ఆ ఇద్దరూ వెళ్ళిపోయాక, ‘నరసింహశర్మా, మనం ఎదుటివారికి తెలియదు, తెలియచేస్తున్నాం అన్నట్లు గర్వరేఖతో చెప్పకూడదు. జ్ఞానాన్ని పంచుకుందాం అన్నట్లు చెప్పాలి. ఎత్తుపీటపై మనముండి ప్రబోధిస్తున్నామనే ధోరణిలో చెప్పకూడదు. సాహిత్యజ్ఞానాంశాలనుగాని, వేనినిగాని, పరస్పరం పంచుకుంటున్నాం అన్నట్లు చెప్పాలి’ అన్నారు.

ఇటువంటి ఒక సంస్కార కర్పూరకరండాన్ని మనకందించిన నరసింహశర్మ కి బెంగటిల్లిన గుండెతో ఒక ఆత్మీయకరచాలనం అందించడమే నేను చేయగలింది.

24-7-2019

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading