మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-6

10

గాంధీతో వాదన

శైలబాలా దాస్

1927 శీతాకాలంలో నేను పాట్నా నుండి కటక్ వచ్చాను. దివంగతులైన మా నాన్నగారు మధుసూదన్ దాస్ గారి ఇల్లు వేలంపాటకు రావలసి ఉంది. ఆయన చేపట్టిన రకరకాల పారిశ్రామిక ప్రయత్నాల వల్ల పూర్తిగా దెబ్బతినిపోయారు. తనకు సహాయం చేసేవారెవరూ లేకపోవడంతో అప్పులపాలయ్యారు; పర్లాకిమిడి మహారాజా గారికి బాకీలు తీర్చడం కోసమే ఆ ఇళ్ళు  వేలం వేయాల్సిన పరిస్థితి వచ్చింది.

సరిగ్గా అదే సమయంలో మహాత్మా గాంధీకీ ఆయన సిబ్బందికీ మా ఇంట్లోనే బస కల్పించాల్సిందిగా కోరుతూ స్థానిక కాంగ్రెస్ నాయకులు మా నాన్నగారి దగ్గరకు వచ్చారు. మా నాన్నగారి ఆర్థిక ఇబ్బందుల గురించి వారికి తెలిసినప్పటికీ, ఆయన భుజాలమీద ఒక కొత్త బాధ్యత మోపడానికి వారేమాత్రం సంకోచించలేదు. దేశం కోసం తనను తాను సమర్పించుకుంటూ, తన చివరి పైసా కూడా పరోపకారానికే  ఖర్చు చేసే స్వభావం మా నాన్నగారిది. కానీ ఆయన చేసిన ఆ సేవల్ని గుర్తించడానికి కాంగ్రెసు నాయకులు ఎప్పుడూ ఏమీ చేసింది లేదు. అయినా సరే, గాంధీజీకి అతిథి మర్యాదలు చేయడానికి మా నాన్నగారు సంతోషంగా ఒప్పుకున్నారు.

తన పారిశ్రామికాభివృద్ధికి సహాయం కోరడం కోసం మా నాన్నగారు 1924లో అహ్మదాబాద్ వెళ్లి మహాత్మాజీని కలిశారు. ఆయనకేదో చేస్తానని మహాత్మాజీ మాటిచ్చారు గానీ, ఏమీ చేయలేకపోయారు. ఆయన గనుక అప్పుడే మా నాన్నగారికి సాయపడి ఉంటే మా నాన్నగారు అలాంటి నిస్సహాయ స్థితికి  చేరుకుని ఉండేవారు కాదు. గాంధీజీ మా ఇంట్లో అతిథిగా ఉన్నప్పుడు, ఆయనకు చేదోడువాదోడుగా ఉంటూ అన్ని చోట్లకూ ఆయన వెంట వెళ్ల వలసిందిగా  మా నాన్నగారు నన్ను పురమాయించారు. నేను కూడా సంతోషంగానే వెళ్లాను. పట్టణంలోని మహిళల్ని  ఉద్దేశించి గాంధీజీ ప్రసంగించేలా ఏర్పాట్లు చేశారు. కటక్ టౌన్ హాల్లో జరిగిన ఆ సభకు ఆయనతో కలిసి నేను కూడా వెళ్లాను. ఆ రోజుల్లో కటక్‌లో కాంగ్రెస్ భావాలున్న మహిళలు పెద్దగా లేరు; ప్రస్తుత జాతీయ ప్రభుత్వ హయాంలో ఉన్నట్టుగా వారు ఆర్థికంగా బలంగా ఉన్నవారూ కారు. చాలా తక్కువ మంది స్త్రీలే ఆ సభకు వచ్చారు. గాంధీజీ ఒక బల్లమీద కూర్చుని సుమారు పదిహేను నిమిషాల పాటు వారితో మాట్లాడారు. దర్శనం కోసం వచ్చిన ఆ మహిళలు ఆయన ముందు నమస్కారాలు సమర్పించారు. మొత్తం చందా అరవై రూపాయల దాకా పోగయ్యింది. కటక్ మహిళలు ఇచ్చిన ఆ స్వల్ప మొత్తాన్ని చూసి ఆయన నిరాశ చెందారు. అక్కడ ఉన్న స్త్రీలలో ఎక్కువమంది పేదలేననీ, తమ స్తోమతకు తగ్గట్టు వాళ్లు చేయగలిగినదంతా చేశారనీ తెలిసినప్పటికీ, ఆయనకి ఆ సంగతి చెప్పబోయి నన్ను నేను నిగ్రహించుకున్నాను.

ఆ రాత్రి మా నాన్నగారూ, మహాత్మాజీ, ఆయన కార్యదర్శి, మరికొందరూ మా డ్రాయింగ్ రూములో తివాసీ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నేనూ అక్కడే ఉన్నాను. మహాత్మాజీ నా వైపు తిరిగి, ‘నేను ప్రత్యేకంగా మీ ఇంట్లోనే అతిథిగా ఉండటానికి కటక్ వచ్చింది నీ దగ్గర ఒక సహాయం కోరడానికే’ అన్నారు. మేమంతా ఆశ్చర్యపోయాం. అప్పుడు నేను, ‘నా వల్ల అయ్యేదైతే మీరు కోరిన పని తప్పకుండా చేస్తాను’ అన్నాను. దానికి ఆయన, ‘పాట్నాలోనూ, కలకత్తాలోనూ, చివరకు ఇక్కడి కటక్‌లోనూ నిన్ను ఎరిగిన వాళ్లంతా నాకు సహాయం చేయగల సమర్థురాలివి నువ్వేనని చెప్పారు; అందుకే నీ సహాయం కోరుతున్నాను’ అన్నారు. నేను బదులిస్తూ, ‘నా సామర్థ్యంమీద మీకున్న నమ్మకం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను; కానీ ఆ పని స్వభావం ఏమిటో, దాన్ని చేసే శక్తి నాకుందో లేదో తెలుసుకోకుండా మీకు మాటివ్వలేకపోతున్నందుకు నన్ను క్షమించండి’ అన్నాను. కానీ ఆయన పట్టువదలక, ‘నా కోసం ఆ పని నువ్వు తప్పక చేయగలవన్న నమ్మకం నాకుంద’ని అన్నారు. ‘నువ్వు చరఖా చేతబట్టి, ఒరిస్సా మహిళలందరికీ దాన్ని పరిచయం చేయాలని నేను కోరుకుంటున్నాను’ అన్నారాయన. నేను దాన్ని విజయవంతం చేయలేననీ, కాబట్టి నన్ను క్షమించమనీ చేతులు జోడించి వేడుకున్నాను. ‘అందరూ నువ్వు చేయగలవని చెబుతుంటే, నువ్వెందుకు విజయవంతం చేయలేవు?’ అని ఆయన అడిగారు. దానికి నేను, ‘నా నిండు మనసునూ ఆత్మనూ పెట్టి పనిచేస్తే తప్ప నేను ఏ పనీ విజయవంతం చేయలేను’ అని సమాధానమిచ్చాను. ‘నీకు చరఖామీద నమ్మకం లేదా?’ అని ఆయన అడిగారు. ‘లేదు, చరఖా ఏనాడూ భారతదేశానికి విముక్తి కలిగించలేదు, ఇక్కడి ఆర్థిక సమస్యల్ని పరిష్కరించనూ లేదు. కానీ అది వ్యవసాయదారులకు మేలు చేస్తుంది. వాళ్లు తమ పొలాల్లో పత్తి  పండించుకుని, తమకు కావలసిన ధోవతులూ, చీరలూ, తువ్వాళ్లూ తామే నేసుకుంటారు. కానీ మధ్యతరగతివాళ్ళూ, ధనిక వర్గాలూ దీన్ని ఎప్పటికీ చేపట్టవు’ అన్నాను. అప్పుడు ఆయన నన్ను మళ్లీ ప్రశ్నిస్తూ, ‘నీకు చరఖామీద నమ్మకమే లేనప్పుడు, నువ్వెందుకు ఖద్దరు చీర కట్టుకున్నావు?’ అన్నారు. దానికి నేను, ‘మీరు మా గౌరవనీయులైన అతిథి. మీ కళ్లకు నచ్చని, మీకు ఏహ్యభావం కలిగించే ఏ చీరనూ కట్టుకుని మీ ఎదుట నిలబడటం నాకు ఇష్టం లేదు’ అని బదులిచ్చాను. ‘అంటే నేను మీ ఇల్లు విడిచి వెళ్లగానే నువ్వు ఖద్దరు వదిలేస్తావని అనుకోవచ్చా?’ అని ఆయన అడిగారు. ‘అవును’ అన్నాను. ఆయన ఒకటి రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయారు. నా ధైర్యాన్ని చూసి అక్కడున్న వారంతా విస్తుపోయారు.

అప్పుడు గాంధీజీ మళ్లీ, ‘సరే, ఇప్పుడు నేను నిన్ను ఇంకో ఉపకారం అడుగుతాను, చేస్తావా?’ అన్నారు. దానికి నేను, ‘అదేమిటో తెలుసుకోకుండా చేస్తానో లేదో చెప్పడం కష్టం. అసలు చేయాలన్న ఉద్దేశమే లేని పని చేస్తానని చెప్పి మిమ్మల్ని నేను మోసం చేయలేను’ అన్నాను. అప్పుడు ఆయన చేతులు చాచి, ‘నీ చీరలన్నీ నాకిచ్చెయ్యి’ అన్నారు. నేను, ‘నన్ను క్షమించండి, మిమ్మల్ని మళ్లీ కాదంటున్నందుకు చింతిస్తున్నాను. ఎందుకంటే మీరు నా చీరలన్నీ తగలబెడతారని నాకు తెలుసు. నా చీరలతో హోలీ పండగ చేయడం  నాకెంతమాత్రం ఇష్టం లేదు. ఆ చీరలేమీ నన్ను బాధపెట్టడం లేదు. అదీకాక, దుబారా చేయకపోతే లేమి ఉండదన్నదే  నా జీవిత విధానం’ అన్నాను. దానికి ఆయన, ‘నేను బతికి ఉన్నంత కాలం ప్రతి ఏటా నీకు డజను మేలైన బెజవాడ చీరలు పంపిస్తాను’ అన్నారు. ‘నన్ను క్షమించండి, మీ ప్రతిపాదన నన్ను ప్రలోభ పరచడం లేదు. విదేశీ వస్తువులు వాడకూడదని మీరంత పట్టుదలగా ఉన్నప్పుడు మోటారు కార్లూ, మందులూ, చేతి గడియారాలూ ఎందుకు వాడుతున్నారు? మీరు కూడా వాటిని  వదిలిపెట్టాలి కదా; కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం అలా చేయలేం’ అన్నాను.

నా సమాధానాలు గాంధీజీకి నచ్చలేదు. ‘ప్రాచీన భారతదేశంలో అతిథికి ఆతిథ్యమిచ్చే యజమానులూ, ఇల్లాలూ ఏదైనా ఇచ్చేవారు; నువ్వు మాత్రం నాకు నీ చీరలు ఇవ్వలేకపోతున్నావు’ అన్నారాయన. దానికి నేను, ‘మనం ప్రాచీన భారతదేశంలో లేము, బ్రిటిష్ పాలన కింద మన ఆలోచనలు మారాయి, వాటికి తగినట్టే మనం అలవాటుపడ్డాం. ఎన్నో వస్తువులకి అలవాటుపడిపోయాం కాబట్టి వాటిని వదులుకోవడం కష్టం. ఇకముందు కొత్తగా విదేశీ వస్తువులేవీ కొనవద్దని మీరు కోరితే మాత్రం తప్పకుండా మాట ఇస్తాను’ అన్నాను. నా వ్యాఖ్యలను గాంధీజీ మెచ్చుకోలేదు. ఆయన మా నాన్నగారి వైపు తిరిగి, ‘మీ అమ్మాయి నాతో ఎలా మాట్లాడిందో విన్నారా?’ అన్నారు. ఆ తర్వాత నా వైపు చూసి, ‘నువ్వు కాంగ్రెస్‌లో సభ్యురాలివి కావాలని నేను కోరుకుంటున్నాను’ అన్నారు. ‘కాంగ్రెస్ నాయకులమీదా, కాంగ్రెస్ విధానాలమీదా నాకు ఎప్పుడు నమ్మకం కుదురుతుందో అప్పుడు సంతోషంగా కాంగ్రెస్ మహిళగా మారతాను. ఆ సంగతి మీకు తెలియజేసి సబర్మతిలో మీ ఆశ్రమానికే నేరుగా వస్తాను’ అన్నాను. నా నిర్మొహమాటపు మాటలకు నన్ను క్షమించమని వేడుకున్నాను. నేనెప్పుడు వచ్చినా తన ఆశ్రమం తలుపులు తెరిచే ఉంటాయని చెప్తూ మర్నాటి సాయంత్రం ఆయన మా ఇంటి నుంచి బయలుదేరారు; కానీ కానీ ఆయన ఆశ్రమంలో ఆయనకు అతిథిగా ఉండే భాగ్యమూ గౌరవమూ నాకెప్పటికీ దక్కలేదు.

(శైలబాలా దాస్ (1875-1968) ఒరిస్సాలో స్త్రీ విద్య వ్యాప్తికి విశేష కృషి చేశారు.)


11

గాంధీకి నారింజ పండ్లు

వాంఛానిధి పట్నాయక్

1927 చివరి రోజుల్లో మహాత్మా గాంధీ ఖద్దరు ప్రచారం కోసం ఒరిస్సా వచ్చారు. అప్పటి ఒరిస్సా ఖాదీ బోర్డు ఛైర్మన్ నిరంజన్ పట్నాయక్ ఆయన్ను ఆహ్వానించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆయనే స్వయంగా చూసుకున్నారు. ఒరిస్సాలో ‘గాంధీ సమాచార్’ పేరిట మొట్టమొదటి దినపత్రికని కూడా ఆయనే నడిపేవారు. మా ఊరు గోబరాలో గాంధీజీని సత్కరించాలని నేననుకున్నాను. నేనేమో ప్రభుత్వ ఉద్యోగిని. కాబట్టి స్వయంగా ఏ పనీ చేయలేని పరిస్థితి. నా సహాధ్యాయీ, గంగాపూర్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ కాశీనాథ్ పాల్‌ను పట్టుకున్నాను. కొందరు సభ్యులతో ఒక కమిటీ వేసి, దానికి ‘అభ్యర్థనా సమితి’ అని పేరు పెట్టాం. కాశీనాథ్ బాబు దానికి అధ్యక్షుడయ్యారు. మేమిద్దరం విరాళాల సేకరణ కోసం పల్లెటూళ్లు తిరగడం మొదలుపెట్టాం. మా సొంత రాట్నాలమీద వడికిన నూలుతో చిన్న చిన్న వస్త్రాలూ , మహాత్మా గాంధీకి బహూకరించడానికి ఒక శాలువా నేయించాం.

1927 డిసెంబర్ 6న గాంధీజీ అస్కా, రసూల్‌కొండలు సందర్శించవలసి ఉంది. దారిలో గోబరా దగ్గర ఆగడం ఆయన పర్యటన ప్రణాళికలో లేదు. కానీ మేం అంతకుముందే ఒక భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లూ చేసేశాం. కాళీయంబా నదీ తీరానీకీ, బడికీ మధ్యనున్న స్థలంతో పాటు , అటు బాసుదేవ్‌పూర్, ఇటు గోబరా గ్రామాల పొలిమేరలు కూడా జనంతో కిక్కిరిసిపోయాయి. నాలుగు రోడ్ల కూడలిమీద ఒక వేదిక నిర్మించాం. ఆ ప్రయోజనం కోసమే ప్రత్యేకంగా కేటాయించిన చోట కొందరు పల్లెటూరి మహిళలు నూలు వడకడంలో మునిగిపోయారు. ‘మీరు గాంధీజీకి ఎంత మొత్తం సమర్పించగలరు?’ అని నిరంజన్ బాబు మమ్మల్ని ఎప్పుడూ అడుగుతుండేవారు. చివరి నిమిషం దాకా మేం చందాలు వసూలు చేస్తూనే ఉండటంతో, ఎంత మొత్తం సమర్పించగలమో ఖచ్చితంగా ఆయనకు చెప్పలేకపోయాం.

గోబరాలో ఆగడం గాంధీజీ ప్రణాళికలో లేదు. గాంధీజీ కారు రాకముందే ఒకటి రెండు కార్లు మా ఊరి మీదుగా వెళ్లిపోయాయి. గాంధీజీ ఆ కారుల్లో గాని ఉన్నారేమోనన్న భ్రమతో జనం నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. తీరా గాంధీజీ కారు వచ్చేసరికి, జనం తమ ఉత్సాహాన్ని కోల్పోయారు. అంతకుముందు వెళ్లిన కార్లలాగే ఇదీ వెళ్లిపోతుందేమోననుకుని ఎవరూ జయజయధ్వానాలు చేయలేదు. పైగా అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. గాంధీజీ కారు వచ్చి ఆగగానే, మేమంతా పూలమాల వేయడానికి ఆయన దగ్గరకు వెళ్లాం. ‘గోబరానా? ఇక్కడ ఆగడం నా పర్యటనలో లేదే?’ అంటూ ఆయన ఆశ్చర్యపోయారు. ఆయన ప్రశ్నకు అభ్యర్థనా సమితి అధ్యక్షులు శ్రీ కాశీనాథ్ పాల్ విన్నవించుకుంటూ, ‘లేదు బాబూ, మీరు ఇక్కడ తప్పక దిగాలి. ఇది పల్లె ప్రజల సభ; పట్టణాల్లో ఇలాంటి సభికులు మీకు దొరకరు’ అన్నారు. ‘ఓహో, నన్ను బలవంతంగా ఆపుతున్నారన్నమాట’ అంటూ గాంధీజీ కారు దిగి నడుచుకుంటూ వేదిక మీదికి వచ్చారు. ఆయనకు పూలమాల వేసి, కొన్ని నూలు వస్త్రాలూ, మూడు వందల రూపాయల నగదూ సమర్పించారు. నేను అంతకుముందే అచ్చువేయించిన సన్మానపత్రాన్ని తర్వాత వేలం వేశారు. ఆయనకు సమర్పించిన కానుకల్లో కొన్ని నారింజ పండ్లు కూడా ఉన్నాయి. గాంధీజీ వాటిని చేతుల్లోకి తీసుకుని, ‘చిన్న పిల్లలకి, చిన్న పిల్లలకి ఇవ్వండి’ అన్నారు. అప్పుడు అయిదారు నిమిషాల పాటు సభనుద్దేశించి మాట్లాడారు.

సాధారణంగా ప్రతి సభలోనూ గాంధీజీ ప్రసంగాన్ని రాజకృష్ణ బోస్ అనువదించేవారు. కానీ ఆయన కారు రావడం కాస్త ఆలస్యమైంది. దాంతో నిరంజన్ బాబు గాంధీజీ ఉపన్యాసాన్ని అనువదించడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయానికి రాజకృష్ణ బాబు వచ్చారు. ఆయన్ను చూడగానే గాంధీజీ, ‘ఓహో! నా అనువాదకుడు వచ్చేశాడు’ అన్నారు. వెంటనే రాజకృష్ణ బాబు మిగిలిన ప్రసంగం అనువదించడం మొదలుపెట్టారు. బ్రిటన్‌కు చెందిన మిస్ స్లేడ్ అనే మహిళ ఒకామె గాంధీజీ ఆశ్రమంలో ఉంటుండేవారు. గాంధీజీ ఆమె పేరు ‘మీరా’ అని మార్చారు. కాంగ్రెస్ నాయకులు ఆమెను ‘మీరా బెహెన్’ అని పిలిచేవారు. ఆమె కూడా గాంధీజీ వెంటే ఉన్నారు. ఆమెను ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతోనూ, ఆరాధనాభావంతోనూ చూశారు.

ప్రజల నుండి విరాళాలు సేకరించే క్రమంలో మేం మందర గ్రామానికి చెందిన శ్రీ నారాయణ్ పండా దగ్గరకు వెళ్లాం. ఆయన కాశీనాథ్ పాల్‌కు స్వయానా తాతగారు. ‘ఏరా! గాంధీ పండ్లు తింటాడనుకుంటా కదా? మా తోటలో కాసిన తాజా పండ్లు ఆయనకిస్తాను’ అన్నారు. ఆయన లేచి వెళ్లి ఒక కాశీమద్ది పండు తెచ్చి, మాకో ముక్క తినడానికిచ్చారు. ‘ఇంత రుచికరమైన కాశీమద్ది పండు గాంధీ తన జీవితంలో ఎప్పుడైనా తినుంటాడా?’ అన్నారు. ఆ పండ్లు నిజంగానే చాలా రుచిగా ఉన్నాయి. ఆయన విరాళమేమీ ఇవ్వలేదు. ఆయన దగ్గరనుంచి కేవలం ఐదారు కాశీమద్ది పండ్లతోటే మేం సరిపెట్టుకోవలసి వచ్చింది.

గాంధీజీ రావడానికి ఇంకాస్త సమయం ఉంది. ఏయే దాతలు ఎంతెంత ఇచ్చారో, మొత్తం ఎంత డబ్బు పోగయిందో సభలో అందరికీ వెల్లడించమనీ, చివరగా మందర గ్రామానికి చెందిన నారాయణ్ పండా మాత్రం ఏమీ ఇవ్వలేదన్న విషయం కూడా చెప్పమనీ కాశీనాథ్‌తో అన్నాం. నేను ఆ మాట అన్న వెంటనే పండా ఐదు రూపాయలు తీసి విరాళంగా ఇచ్చారు. గాంధీజీ మా దగ్గర వీడ్కోలు తీసుకున్నాక, ఆయన్ను సాగనంపడానికి రోడ్డు దాకా వెళ్లాం. ఆ సమయంలో పండా జనం మధ్యలోంచి గబుక్కున ముందుకు దూకి, ఆ నారింజ పండ్లు జేబుల్లో కుక్కుకుని వేగంగా జారుకోబోయారు. ఆయన చేస్తున్న పని గమనించి మేం అడ్డుకున్నాం. వీటిని చిన్న పిల్లలకే ఇవ్వాలని గాంధీజీ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశాం. అప్పుడాయన దగ్గరున్న నారింజ పండ్లు బలవంతంగా గుంజుకుని పిల్లలకి పంచిపెట్టాం.

(వాంఛానిధి పట్నాయక్ (1901-1988): కవి, సంఘసేవకుడు. ఆయన రాసుకున్న ఆత్మకథ ‘మో కథ’ 1988లో భువనేశ్వర్‌లోని పూజ్యపూజా ఒరిస్సా వారు ప్రచురించారు. ఈ వ్యాసాన్ని ఇంగ్లిషులోకి అనువదించిన ప్రజ్ఞా పారమితా పాణిగ్రాహి భువనేశ్వర్‌లోని ఉత్కళ విశ్వవిద్యాలయం, దూరవిద్య విభాగంలో అధ్యాపకురాలు.)

2-10-2026

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading